మరునాడు మధ్యాహ్నం భోజనం కానిస్తూనే చిరిచాప తలగడ తీసుకొని పైకి వెళ్ళింది. దేవదాసి ముందు బావ దినచర్య ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది. అతని డైరీలన్నీ తీసి చాపమీద పెట్టుకొని కూర్చొంది. చదవడానికి ఒకరి డైరీలు చాటుగా చదువుతున్నానన్న భయంలేదు ఆమెకు. తనిలా చదువుతున్న విషయం రహస్యంగా ఉంచాలన్న ఆలోచనలేదు. రేపు బావ వస్తే "నేను నీ డైరీలు చదివాను, బావా!" అని చెప్పేయగలదు. అందుకే భార్గవరామ్ డైరీలు చదవడానికి సంకోచించలేదు దేవదాసి.
ఏ పేజీ తిప్పినా అతడి ఆలోచనలు, అనుభూతులు తప్ప దినచర్య అంటూ ఏం లేదు.
"అందంగా అల్లిన అంచు, మధ్య చక్కని చుక్కలు ఆకర్షవంతమైన రంగు సృష్టి కర్త తన నైపుణ్యాన్నంతా ఒలకబోసి ఆ సీతాకోకచిలుక రెక్కల్లో అపూర్వమైన సౌందర్యాన్ని దిద్దాడు. మంద మందగా వీచేగాలిలో తేలికగా రెక్కలు అల్లాడిస్తూ పువ్వు మీదికి ఎగిరిపోతున్నది శీతాకోకచిలుక.
రేకులు విచ్చుకొని, సౌందర్యంలో నాకుపోటీ ఎంవరన్నట్లు కొమ్మచివర ధీమాగా తల ఎగురవేసే ఆ గులాబీ సుందరి?
ఓహ్! సృష్టికర్తా నీ కళాపిపాస. నీ సౌందర్య సృష్టి ఎంతటి అపూర్వం?
"ఈరోజు గులాబీ మొక్క చెంత కనిపించిన దృశ్యం ఎంతటి విషాదకరమైనది? నిన్న నిండు పరువం ఒలక బోసిన పుష్పసుందరి నేడు రేకులు రాలి కళావిహీనమైపోయింది. ఈ నిముషమో, మరునిమిషమో ఆ మిగిలిన రెండు రెక్కలు కూడా రాలిపోయిన సంపూర్ణ పతనం పొందుతుంది. అది అంతటి సౌందర్యం వెనుక ఈ పతనం ఎందుకు నియమించినట్లు భగవంతుడు?
అక్కడే కనిపించింది మట్టిలో శిధిలావస్థలో వున్న సీతాకోక చిలుక రెక్క ఒకటి నిన్న నేను చూచిన దానిది కాకపోవచ్చు. కానీ దానికి రేపు జీవితం స్తంభించి ఈ గతిప్రాప్తించదని ఎక్కడుంది? ఈ సర్వచైతన్యం వెనుక ఈ స్తంభనం ఎందుకు ఏర్పరచినట్లు భగవంతుడు?
పువ్వును సీతాకోక చిలుక ప్రేమించింది. నేను సీతాకోక చిలుకను ప్రేమించాను. రెండూ నా కళ్ళముందే పతనమైపోయాయి నా పతనమూ రేపు జరుగుతుంది.
ఈరోజు ఉండి రేపు లేకపోయే ఈ మిధ్యా జగత్తులో రాగ భావం ఇంతటి బలీయమైనదిగా ఎందుకు పెట్టాడు భగవంతుడు?
రాగబంధం విషాదాంతానికి నాంధీ పలికేదే అయితే ఆ బంధనం నుండి విముక్తి పొందడమే సుఖం."
"ఆహా! ఉదయ సంధ్యల శోభ ఎంత అపూర్వం? మనసు యిహాన్ని మరిచ చూస్తూ కూర్చొంటుంది, ఎవరి అదృశ్యరూపుడైన గారడీ వాడు ఇంతసేపూ తన ఆటచూపించి ముగ్ధులగావిస్తూ, మెల్లమెల్లగా ఆటచాలించినట్లు అందాలన్నీ అదృశ్యమైపోయి మరో రూపం దాలుస్తుంది ప్రకృతి. ఆ అందాలు స్థిరాలు కావు తెలుసు అయినా మన మైకంలోపడి కొట్టుకొంటూంది. ఆ ఆకర్షణ ఎందుకింత బలీయం? ఈ మనసెందుకింత చంచలం?
"జింకపిల్లను సాకాలని ఉందిరా - అన్నాడు నాన్న బోయనర్శిగాడితో, వాడు చెప్పిందేమిటి? పచ్చగడ్డి కాలంలో జింకలు ఈనుతాయట. ఈనిన పిల్ల మీది తడి ఆరకముందే పట్టి తెచ్చేయాలట!
తల్లినుండి వేరుచేసి ఆ పిల్లను సాకాలని నాన్నకెందుకు ఆపేక్ష?
"ఉదయసూర్యుని కిరణ పరిష్వంగంలో తుహిన బిందువులు మత్తుగా సోలిపోతూంటే మెత్తగా పచ్చికతో అడుగులు వేస్తున్నాను.
పూజకు పూలకోసం అమ్మ తోటలోకి వచ్చింది.
పూలుకోస్తూ, కోస్తూనే ఆగి పిలిచింది అమ్మ. బాబూ
"ఏం, అమ్మా?"
"అటు చూడు!"
ఇంకా ముక్కుపచ్చలారని ఊర పిచ్చుక గూటినుండి వచ్చి పచ్చికలో రెక్కలు అల్లాడిస్తూ, తల్లి ఆహారం నోట పెడుతూంటే నోరు తెరిచి కిచకిచలాడుతూన్న దృశ్యం చూశాను.
ఇంచుక ఉద్వేగం మిళితమైన ఆర్ధ్రస్వరంతో అన్నది అమ్మ: "నిన్నూ నేనెలాగ పెంచువుంటాను కదూ?"
"సందేహం లేదు"
"మరి, అమ్మ అంటే నీకెందుకు ఆపేక్ష లేదు, తండ్రీ?" అమ్మ కళ్ళు తడిసి గొంతు గాద్గదికమైంది.
క్షణభంగురమైన ఈ మిధ్యా ప్రపంచంలో మనుష్యులేమిటో, మమతలేమిటో నాకు అర్ధం కావడం లేదమ్మా!"
"మానవజాతి మమతానుబంధంలో కనీసం మనిషికీ" మనిషికీ మధ్య ఉండవలసిన అనుబంధాన్ని కూడా తుడిచిపెట్ట చూస్తున్నావెందుకు? నోరులేని పశుపక్షిజాలంలో కూడా తల్లీ బిడ్డల మధ్య అపూర్వమైన మమతాబంధం పెనవేసుకు ఉంటుందే? నన్ను ఆ అదృష్టానికి ఎందుకు దూరం చేశావు. రామా? నేనేం పాపం చేశాను? దుఃఖావేశంతో త్వర త్వరగా వెళ్ళిపోయింది అమ్మ.
