అబ్బారావుకి అవార్డొచ్చింది!
"సర్ ర్... సర్ ర్ ...సర్ ర్... సర్ ర్..."
ఏదో రాస్తున్న శబ్దంలో ఇల్లు మారుమోగిపోతూంది.
"ఒరేయ్ చంటాడా... ఏంట్రా ఆ శబ్దం... వీపు చిట్లగొడ్తానంతే..." వంట గదిలోంచి ఒక్క అరుపు అరిచింది వెంకటరమణి.
కిసుక్కున నవ్వాడు చంటాడు.
"నన్నడుగుతావేం... నువ్వే వచ్చిచూడు... హి...హిహి..." హాల్లోంచి అరిచాడు.
వెంకటరమణి పరుగున హాల్లోకి వెళ్లింది. అక్కడి దృశ్యం చూసి "హా..." అని గాఠిగా అంది.
అక్కడ ఆమె భర్త అయిన అబ్బారావు ఒంటి మీద డ్రాయరు తప్ప ఏమీ లేకుండా స్థంభానికి వీపునేసి సరసరా రుద్దుతున్నాడు... అందుకే ఇందాకట్నుండి సర్ ర్... సర్ ర్ ... అంటూ శబ్దం వస్తూంది.
"వామ్మోయ్...వాయ్యోవ్... ఎందుకండీ నిక్షేపంలాగున్న స్తంభాన్ని అట్టా పాడుచేస్తారు?... ఆపండి... ఆపండంటే..." గుండెలు బాదుకుంది వెంకట రమణి.
"ఆపను... ఆపనంటే ఆపను... ఆపితే నా దురదెట్టా తీరేది..హమ్మా..." అన్నాడు అబ్బారావు.ఇప్పుడు వీపుని మరింత స్పీడుగా స్థంభానికేసి రుద్దుతూ.
"అసలు మీకంత దురదెందుకేస్తుంది...వీపుమీద పురుగేమైనా ప్రాకిందా?..."
"మరేమో... ఇహి... ఇహి..."మెలికలు తిరిగాడు అబ్బారావు.
"ముందు బట్టలేస్కుని తర్వాత చెప్పి తగలడండి... అవతారాన్ని చూడలేక చస్తున్నా..."
అబ్బారావు బట్టలేస్కుని కళ్లెగరేస్తూ భార్యని అడిగాడు.
"నేనెవర్ని...ఆ... చెప్పు... ఇహి?"
"బాగానే ఉంది... మీరెవరేంటి... మీరు నా భర్త...."
అబ్బారావు తలకొట్టుకున్నాడు.
"నీకు నేను భర్తనే... అద్సరేగానీ... నేననేది మిగతా వాళ్లకి నేనేం అవుతాను?... అంటే ఫరెగ్జాంపుల్...పక్కింటాళ్లకి నేనేమోతాను?... ఆ?... చెప్పుకోవాలి మరి...ఇహి...ఇహి..." మళ్లీ మెలికలు తిరిగాడు.
"అంటే పక్కింటి పార్వతికి ఏమవుతారనా మీరడుగుతుంది?..." వెంకట రమణి అబ్బారావు చొక్కా పట్టుకుని ముందుకూ వెనక్కూ ఊపుతూ అడిగింది...!!"
"అఅ అబ్బా ఆఅ... నే ఏఏ ను అయ్ ఉమ్ ఉమ్ టున్నది ఇఇఇ... అఆ అది కా ఆఆ అదే ఏఏ..."
"ఏంటా భాష?... సరిగా మాట్లాడ్లేరూ?... ఆ?...
"మ ఉఉఉవ్వు... న అఅన్ను... ఊఊ పేఏఏస్తున్నా ఆఆవుగా ఆఆఆ..." వెంకటరమణి అతన్ని ఊపడం ఆపింది.
"చెప్పండి... నాకు మొగుడైతే దానికి కూడా మొగుదవుతారనే కదా?... అదేగా మీరంటున్నది... ఎన్నాళ్లనుండి సాగుతుందీ నాటకం."
"హవ్వ... హవ్వ... హవ్వ...హవ్వ..." నోటీమీద చేత్తో గబగబా కొట్టుకున్నాడు అబ్బారావు.
"భలేదానివే... నా మీనింగ్ అదికాదు... నీకు నేను భర్తని కదా... కానీ బయటివాళ్లకి అబ్బాశ్రీని!... పేరున్న కవిని అన్నమాట!... అదీ నా భావం... ఎవరికైనా రంకు మొగుడ్నైతే రంకు శ్రీ అనే పేరుతోనే కవిత్వం రాసి ఉండేవాడిని కదా?..." సంజాయిషీ ఇచ్చుకున్నాడు అబ్బారావు.
"హమ్మా...నాన్న మొహం చూడవే..."అంటూ ఘొల్లున నవ్వాడు చంటాడు.
అబ్బారావు మొహం చూసి వెంకటరమణి కూడా గిల గిల గిల నవ్వింది.
"అదేంటి?... ఎందుకట్ట నవ్వుతారూ?... నా మొహంలో కోతులేమైనా అడ్తున్నాయా?" మొహం చిట్లించి అడిగాడు అబ్బారావు.
"ఏవాడ్తున్నాయో ....హి...మీరే అద్దంలో చూస్కోండి హిహి..."
అబ్బారావ్ అద్దంలోకి చూస్కుని తర్వాత చంటాడు వైపు తిరిగి పళ్లు కరకరా నూరి "ఏరా వెథవాయ్... అద్దం మీద ఇలా స్టిక్కర్ల పిచ్చి బాగా ఎక్కిందిలే... ఎక్కడ బడితే అక్కడ స్టిక్కర్లు అంటించేస్తున్నావ్..."అన్నాడు కోపంగా.
"అద్దం మీద స్టిక్కరా?! నేనేక్కడంటించానూ... ఓహో... భలేగా అంటున్నారు... ఆహా..." అన్నాడు చంటాడు సీరియస్ గా మొహం పెట్టి.
"నువ్వు కాకపోతే ఈ కోతిబొమ్మ స్టిక్కర్ ని ఇక్కడెవరంటిస్తారు?..." రెట్టించి అడిగాడు అబ్బారావు.
ఆ మాట వింటూనే చంటాడూ, వెంకటరమణి నేలమీద పడి పొర్లి పొర్లి నవ్వారు.
ఓ నిముషం తర్వాత ఇద్దరూ ఆయాసపడ్తూ లేచి నిలబడ్డారు.
"మీ పాసిగూల... అద్దం మీద స్టిక్కర్ ఎవరూ అంటించలేదు.... అది మీ మొహమే... సరిగ్గా చూస్కోండి..." ముసిముసిగా నవ్వుతూ అది వెంకటరమణి.
అబ్బారావు కంగారుగా అద్దంలో తన మొహం చూస్కున్నాడు."హా...ఇదేంటి నామొహం అచ్చు కోతిమోహంలా ఉంది!!?... నా మూతి ఇంత ఎత్తుగా ఎలా అయ్యింది?..." గుండెలు బాదుకున్నాడు.
"మూతి ఎత్తుగా అయ్యిందంటే ఎందుకవదు మరీ.. ఇందాక హవ్వ.... హవ్వ అంటూ నోటి మీద అన్నిసార్లు కొట్టుకున్నరుగా!..."
"హవ్వ..."
మళ్లీ మూతిమీద కొట్టుకోబోయి ఒక్కక్షణం ఆగి నెత్తిన కొట్టుకున్నాడు.
సరేగానీ... స్థంభానికేసి వీపునెందుకట్టా రుద్దుతున్నారు... ఆ విషయం చెప్పారు కాదేం?..." అడిగింది వెంకటరమణి.
"మరి నేను కవిని కదా... అందుకనన్నమాట!" చెప్పాడు అబ్బారావు.
"కవైతే మాత్రం దురద పుట్టాలా?"
"కవులకే దురద పుడ్తుంది... బిరుదులు అవార్దులూ కావాలనే దురద... హిహి..."
వెంకటరమణి ఆశ్చర్యంగా అతని వంక చూసింది.
"మీకు దురదెందుకు పుడ్తుందీ?... బిరుదులూ అవార్దులూ బోల్డన్ని వచ్చాయ్ గా??..."
"ఎక్కడొచ్చాయ్ నా బొంద!"
"అదేంటండీ... అలా అంటారు?... మన కాలనీవాళ్ల మిమ్మల్ని బ్రహ్మాండంగా సన్మానించి"బూతుశ్రీ" అని బిరుదిచ్చారు... మన ప్రక్క కాలనీ వాళ్లు"కవి కాని కవి" అనే బిరుదు నిచ్చారు... అప్పుడు మీరు వాళ్ల అసోసియేషన్ కి వెయ్యి నూటపదహార్లు డొనేషన్ ఇచ్చినట్టున్నారు కదా... ఇంకా చిలిబిలి అసోసియేషన్ వాళ్లు ఫంక్షన్ కయ్యే ఖర్చులన్నీ మీరు భరిస్తే "కవిదేభ్యం" బిరుదునిచ్చి సత్కరించారు... ఇంకా..." లిస్టు చదవసాగింది వెంకటరమణి.
"స్టాప్... స్టాప్... అవన్నీ చిల్లర మల్లర అవార్డులు... సంపాదిస్తే గవర్నమెంట్ అవార్డు సంపాదించాలి!..."
"గవర్నమెంట్ అవార్డా?... అదేం అవార్డు?"
"అది సాహిత్యంలో విశేషమైన కృషికి అందుకునే అత్యుత్తమ పురస్కారం... లక్షరూపాయలు క్యాష్ కూడా ఇస్తారు..." కళ్లెగరేశాడు అబ్బారావు.
"అలాగేం... మీగ్గనక ఆ అవార్డొచ్చి లక్ష రూపాయలొస్తే నాకు వడ్డాణం చేయించాలి!... లేకపోతే చిప్ప లేచిపోతుంది..." అంది వెంకటరమణి.
"అలాగే... అలాగలాగేలే..." బుర్రకాయ్ తడుముకుంటూ అన్నాడు అబ్బారావు.
"ఊర్కే అలా దేభ్యశ్రీలా బుర్రకాయ్ ఊపుతూ కూర్చుంటారేం... వెంటనే వెళ్లి ఆ అవార్డేదో సంపాదించుకుని రండి..."
