బూతుల్రావు
బూతుల్రావు అంటే బూతులు ఏమాత్రం రావని కాదు అర్ధం.
బూతుల్రావు అంటే అదో వ్యక్తిపేరు. బూతుల రావన్నమాట!
బుతులరావని ఏ అమ్మా బాబైనా తమ పిల్లాడికి పేరు పెట్టుకుంటారా ఎక్కడైనా అని అడిగితే అలాంటి పేరు పెట్టారనే చెప్పాలి!
మరి ఇతనికెందుకబ్బా అలాంటి పేరు పెట్టారని నోరు తెర్చుకొని ఆశ్చర్యపోతున్నారా?
ఇతనిక్కూడా అది వాళ్ల అమ్మా బాబూ పెట్టిన పేరు కాదు! వాళ్ల అమ్మా బాబూ అతనికి పెట్టిన పేరు శోభనా చలపతి.
ఈ పేర్లో కూడా మీరు కాస్త బూతు కనిపిస్తుందంటే నేనేం మాట్లాడను.
సరే... అసలు విషయానికొద్దాం.
మరి అతని అమ్మా బాబూ పెట్టిన పేరు శోభనా చలపతైతే బూతుల్రావని అంటావేం అని నా మీదెగుర్తున్నారా?
అలా అని నేనేం అనడం లేదండీ బాబూ.జనం అంటారు...బూతుల్రావుగా అతను జనంలో పావులర్ అయిపోయాడు. జనం అతని అసలు పేరుని మర్చిపోయేంత ఇదిగా బూతుల్రావుగా పాపులర్ అయ్యాడు.
అతనలా ఎందుకు పాపులర్ అయ్యాడంటే దానికో చరిత్ర ఉంది.
ఏంటా చరిత్ర...? ఏమా కథ??
చెప్తాగానీ అంతా విన్నాక నా చెవులు గళ్లుపడేలా కెవ్వుమని అరవకండేం?... అట్టాగేనా?
చిన్నప్పుడు బూతుల్రావు తన ప్రతిభా పాటవాల్ని ఎంతో నైపుణ్యంగా ప్రదర్శించాడు.
ఎనిమిది నెలలు నిండుతున్నాయనగా చంటి పిల్లలు చిన్న చిన్న మాటలు అంటుంటారు.
మన బూతుల్రావు కూడా ఆ వయసులోనే చిన్న చిన్న మాటలు అనడం ప్రారంభించాడు.
సాధారణంగా చిన్న పిల్లలు మొట్టమొదట అనే మాట 'అమ్మ'... తర్వాత అత్త... అక్క... తాత... పాప... ఇలా చిన్న చిన్న మాటలు అంటారు.
మరి మన బూతుల్రావో ?... మీరే చూడండి.
బూతుల్రావుని ఎత్తుకుని ముద్దుచేస్తూ అతని తల్లి అంది"చిచ్చీ..కుచ్చీ.. అమ్మా అనమ్మా... ఏది...అనాలి... అమ్మ!"
"ఆ...ఊ...అ...."అన్నాడు పసిబూతుల్రావు.
"అ...అ...అ...అను...అమ్మ..."బూతుల్రావు మొహం మీద మొహంపెట్టి అంది ఆమె.
"నీయమ్మ!..."
ముద్దు ముద్దుగా అన్నాడు చిన్నారి బూతుల్రావు.
అదిరిపడింది బూతుల్రావు తల్లి!
కాస్పేపైన తర్వాత తేరుకుని మళ్లీ ప్రయత్నించింది.
"నీయమ్మ కాదమ్మా... అమ్మ అనాలి!...అనమ్మా బంగారు తండ్రీ.. అమ్మ అను!...అ...మ్మ!"
"నీ... యమ్మ!" చిరునవ్వులు నవ్వుతూ ముద్దు ముద్దుగా అన్నాడు బూతుల్రావు.
ఆమె బిక్కచచ్చిపోయింది! కాస్సేపు స్ఠాణువులా నిలుచుండిపోయింది.
ఆ తర్వాత గట్టిగా కేకేసి భర్తని పిలిచి సంగతి చెప్పింది.
అతను ఆశ్చర్యంగా కొడుకువంక కొద్ది క్షణాలు చూసి "ఉండు...నేను ప్రయత్నిస్తాను...." అని కుర్రవాడిని భార్య చేతుల్లోంచి తన చేతుల్లోకి తీస్కున్నాడు.
"చిచ్చీ...తాతా... హిహి... ఏదీ అనమ్మ...'అమ్మ'అను..."
బాబు బోసినోటితో నవ్వాడు.
"అన్రా నాన్న... నాబంగారు కదూ?.... గెడ్డం క్రింద కొనగోటితో మీటుతూ అన్నాడు.
"నీయమ్మ!"
మళ్లీ అలానే అన్నాడు.
కొడుకుని భార్య చేతికి అందించి ధనేల్ మని నేలమీద పడిపోయాడు. అతను.
"ఏమైండండీ... ఎందుకలా పడిపోయారు?" కంగారుగా అడిగింది ఆమె.
అతను క్రిందనుండి లేచాడు.
"ఏం లేదే... వీడి ముద్దు ముద్దు మాటలకి కాస్త బుర్ర తిరిగింది... అంతే... సరేగానీ నాకో అనుమానం కలిగింది!"
"ఏంటండి అదీ?..."
"వీడు అమ్మ అనే పదాన్ని అలా అంటున్నాడేమో!... వేరే మాటలు బాగానే అంటాడేమో..."
"అయితే ప్రయత్నిస్తానుండండి..."
ఆమె బాబు మొహంలో మొహం పెట్టి హుషారు తెచ్చిపెట్టుకుంటూ అంది.
"బాబూ...బుచ్చిబుచ్చీ...కుచ్చికుచ్చీ... ఏదీ అనమ్మా... 'అక్క'...అను."
"నీ...య...క్క" ప్రయత్నిస్తూ అన్నాడు నెలలు బాబు బూతుల్రావు.
వాళ్లిద్దరూ ఢామ్మని క్రిందపడిపోకుండా నిలదొక్కుకున్నారు.
తర్వాత నోరు తెర్చుకుని ఆశ్చర్యంగా వాడివంక చూశారు.
వాడు చిన్న చిన్న పాలపళ్లు కనిపించేలా నవ్వాడు. తర్వాత"వ... వా...వ్వ..." అన్నాడు హుషారుగా చేతులు ఎగరేస్తూ.
వాళ్లిద్దరిలో చలనం కలిగింది.
ఇద్దరూ మొహమొహాలు చూస్కున్నారు.
"వీడు అవ్వ అంటున్నట్టున్నాడే!" అన్నాడు అతను.
"అవునండీ...ఏదీ...మీరు అనండి మళ్లీ అంటాడేమో చూద్దాం!..." అంది ఆమె.
"బాబూ... అవ్వ అనమ్మా..." అన్నాడు అతను.
"వ... వా... వా..."కాళ్లు తన్నుకుంటూ హుషారుగా అన్నాడు చిన్నారి బూతుల్రావు.
"వా వా కాదమ్మా...అవ్వ... అను! అవ్వ... అనాలి మరి... చిచ్చీ..."
"నీ యవ్వ!..."
ఈసారి మాత్రం ఇద్దరూ ఢామ్మని కిందపడిపోయారు. చిన్నారి బూతుల్రావుకి మాత్రం కాస్త దెబ్బతగిలి కేర్ ర్... మన్నాడు.
కాస్త పెద్దయ్యాక బూతుల్రావుని స్కూల్లో వేశారు.
అంతే... క్లాసు క్లాసంతా ఛండాలం అయిపోయింది. క్లాసులో పిల్లలందరూ వీడి స్నేహం చేసి బూతులు మాట్లాడడం మొదలుబెట్టారు.
పిల్లల తల్లిదండ్రులు చాలామంది హెడ్ మాస్టర్ కి (ఇప్పుడు బోడి గొప్పతో ప్రిన్స్ పాల్ అంటున్నారు) కంప్లయింట్ చేశారు. ఆ స్కూల్లో చేర్చింతర్వత తమ పిల్లలు పచ్చిన్నర పచ్చిబూతులు మాట్లాడుతున్నారనీ!
హెడ్ మాస్టర్ ఎంక్వయిరీ చెయ్యగా దానికి కారణం మన చిన్నారి పొన్నారి బూతుల్రావుని తేలింది.
అంతే... ఆ రోజునుండి వాడిని క్లాసులో అందరికీ దూరంగా... ఓ మూల కుర్చీవేసి కూర్చోబెట్టారు.
ఓ రోజు తెలుగు మాస్టారు"ఒరేయ్ శోభనం!... నీకొచ్చిన పద్యం ఏదైనా పప్పజెప్రా..." అన్నాడు బూతుల్రావుతో.
బూతుల్రావు మెల్లగా లేచి నిలబడి, చేతులు రెండూ వినయంగా కట్టుకుని గొంతిప్పాడు.
"ఉప్పుకప్పురంబు...
నీయక్క పోలికనుండు..
చూడ చూడ రుచులు
నీయమ్మలాగుండు..."
ఆ రోజు తెలుగు మాస్టారి చేతుల్లో బూతుల్రావు చావు దెబ్బలు తిన్నాడనుకోండి... అది వేరే విషయం!
ఇరుగు పొరుగువాళ్లు కూడా వీళ్ళని వెలివేశారు. వాళ్ల పిల్లలను వీళ్లింటి ఛాయలకు కూడా రానిచ్చేవాళ్లు కాదు... బూతుల్రావు గాలి సోకితే వాళ్లపిల్లలు చెడిపోతారని.
ఒక్కోసారి ఆ కాలనీలోని వాళ్లు వీళ్ల ఇంటిమీదికి దెబ్బలాటకు వచ్చేవారు..."ఎన్నడూ లేంది మా అబ్బాయి ఈ వేళ బూతులు మాట్లాడాడు... అవి మీ వాడే నేర్పించి ఉంటాడు" అని.
బూతుల్రావు తల్లిదండ్రులకు బూతుల్రావు పెద్ద సనస్యగా తయారయ్యాడు.
ఇలా లాభం లేదని కొడుకుని ఓ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీస్కెళ్లారు.
"మరేం ప్రాబ్లెం లేదు... సైకోథెరపీతో మీవాడిని వారం పదిరోజుల్లో మామూలుగా మార్చేస్తా... మరేం ప్రోబ్లెంలేదు... మీరు మీవాడిని ఇక్కడ వదిలివెళ్ళండి..." అన్నాడు సైకియాట్రిస్ట్ పిచ్చయ్య.
భార్యభర్తలిద్దరూ కుర్రవాడిని సైక్రియాట్రిస్ట్ దగ్గర వదిలిపెట్టి మళ్లీ పదిరోజుల తర్వాత అతని దగ్గరకు వెళ్లారు.
వాళ్లని సైకియాట్రిస్ట్ పిచ్చయ్య సాదరంగా ఆహ్వానించాడు.
"రండి రండి... నీయమ్మ?...కూర్చోండి... మీ వాడిని మార్చడం కుదర్దేమో ననిపిస్తుంది నీయక్క... అంతేకాదు... ఈ వారం రోజులనుండీ మీవాడితో మాట్లాడ్డం వల్ల నాలో ఏదో మార్పు వచ్చినట్టనిపిస్తుంది నీ యవ్వ.... అసలూ...."
ఇంక ఆ తర్వాత అతనేం మాట్లాడాడో నేనీ పేపర్ మీద పెట్టలేను... ఛీ... యాక్...
సైకియాట్రిస్ట్ దగ్గరకెళ్లినా సమస్య సమస్యగానే ఉండిపోయింది.
కాని సైకియాట్రిస్ట్ పిచ్చయ్య ఇంట్లో కొత్త సమస్యలు మొదలయ్యాయి.
రోజులు గడుస్తున్న కొద్దీ బూతుల్రావు బూతుల్లో జోరు ఎక్కువకాసాగింది.
తల్లిద్రండులు ఇద్దరూ ఇంట్లో చెవుల్లో దూదులు పెట్టుకుని తిరగసాగారు.
బూతుల్రావుని వాళ్లు ఎంతోమంది డాక్టర్లకి చూపించారు. చివరికి ఫారిన్ రిటర్న్ డ్ డాక్టర్ విదేశావర్మ బాలుడ్ని పరిశీలించి ఇలా తేల్చాడు.
"ఇది జెనెటిక్ డిసార్డర్ అండీ... దీన్ని సరిచెయ్యడం కుదర్దు... మీ వంశంలో ఎవరినుంచో ఇది ఈ అబ్బాయికి సంక్రమించింది"...
ఇంటికెళ్లిన తర్వాత ఇద్దరూ చాలాసేపు ఆలోచించారు... ఎవరూ... ఎవరూ?అని. కానీ అటు ఆవిడ తరుపు వాళ్లలోగానీ ఇటు ఈయన తరుపువాళ్ల లోగానీ ఇలా బూతులు మాట్లాడే వాళ్లు ఎవరూలేరు!
హఠాత్తుగా ఆమె కెవ్వుమని కేకపెట్టింది!
"ఏంటి...ఎందుకలా అర్చావ్?" అడిగాడు అతను.
"వీడికి లక్షణాలు ఎవరి నుండి సంక్రమించాయో నాకు తెలిసిపోయింది. మీ అన్నయ్య నుండే!!..."
అతని అన్నయ్య ప్రఖ్యాత రచయిత బూతులింగం.
"అదేంటి?... అలా ఎందుకనుకుంటున్నావ్?" ఆశ్చర్యంగా అడిగాడు అతను.
"ఎందుకేమిటి...మీ అన్నయ్య సినిమాలకి పచ్చిబూతు డైలాగులూ,పాటలూ రాస్తారుగా మరి?"
"ఆ!.."అతను నోరు తెరిచాడు.
ఇది బూతుల్రావు బాల్య చరిత్ర.
ప్రస్తుతం బూతుల్రావు కూడా ప్రసిద్ధ సినీ సంభాషణల రచయిత".... పాటల రచయిత!!!...
* * *
