Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 9

    అంతే...అబ్బారావు ఠింగున మాయమై తన ఫ్రెండు వీరాస్వామి దగ్గర ప్రత్యక్షమయ్యాడు.
    "ఏంటిలా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యావ్?" అడిగాడు నీరాస్వామి అబ్బారావుని.
    అబ్బారావు వీరాస్వామిని కౌగిలించుకుని ఘొల్లుమన్నాడు.
    "ఏంటి... ఏమైంది??..."కంగారుగా అడిగాడు వీరాస్వామి.
    "ఏంలేదు... నీకు చాలా ఇన్ ప్లుయెన్స్ ఉంది కదా... దాన్నుపయోగించి నాకు గవర్నమెంట్ అవార్డు సంపాదించి పెట్టాలి!... లేకపోతే నా చిప్ప లేచిపోతుందంతే..." అన్నాడు బాధగా మొహం పెట్టి.
    "గవర్నమెంట్ అవార్డు సంపాదించడం కాస్త కష్టమైన పనే..." అన్నాడు వీరాస్వామి కళ్లు తేలేసినట్టు ఇంటికప్పు వంక చూస్తూ.
    "హమ్మమ్మ... అంత మాటనమాకు... ఇదీ పీక్కాదు... నీ కాళ్లు!" అంటూ వీరాస్వామి పీకుచ్చుకున్నాడు.
    వీరాస్వామి అతని చేతుల్ని విదిలించి కొట్టాడు.
    "ఛస్... నువ్విలా ఊపిరాడకుండా నా పీకట్టుకుంటే నేన్నీపని చేసి పెట్టనంతే..." అన్నాడు కోపంగా.
    అబ్బారావు నాలుక కర్చుకుని లెంపలేస్కున్నాడు.
    "సారీరా... ఇంకెప్పుడూ అలా చెయ్యను... నాకు గవర్నమెంట్ అవార్డు సంపాయించి పెట్టు..." అన్నాడు.
    "సరే... అట్టాగయితే మనిద్దరం ఇక్కడ మాయమై పుల్లారావు దగ్గర ప్రత్యక్షమవుదాం..."
    "పుల్లారావా... వాడెవడు??..."
    "నీకు పుల్లారావె తెలీదా?... సెంటర్ లో వాడికి తెలీని మినిస్టరూ, వాడితో సంబంధ బాంధవ్యాలు లేని రాజకీయ నాయకుడూ లేనేలేడు. ఓసారి వాదు చెప్పులు కూడా తుడిచాడు తెల్సా?... వాడి వల్ల నీ పని ఇట్టే అయిపోతుంది..."
    "అబ్బా... అయితే మనం వెంటనే మాయం అయిపోవాలి!" అంటూ అబ్బారావు ఠింగ్ మని మాయం అయిపోయాడు.
    "ఏయ్.. ఏయ్... అగు... నన్ను కూడా రానివ్వు" అంటూ వీరాస్వామి కూడ ఠింగున్నర ఠింగుమని మాయం అయ్యాడు.
    ఇద్దరూ పుల్లారావు ముందు ప్రత్యక్షం అయ్యారు.
    వెంటనే అబ్బారావు పుల్లారావు కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. పుల్లారావు కంగారుగా కేకలు పెట్టడం మొదలెట్టాడు.
    "హెయ్... హెయ్... ఎవడీడు నాకాళ్లు పట్టుకుని లాగేసి పడెయ్యాలని చూస్తున్నాడు..."
    వీరాస్వామి ఫకాల్మని నవ్వాడు.
    "కాళ్లు లాగిపడెయ్యాలని కాదు... నీతో పనుండి నీ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు..." అని తాము వచ్చిన పనేంటో చెప్పాడు.
    "ఊహూ... అయితే గవర్నమెంట్ అవార్డు కావాలన్నమాట!... మరైతే సాహిత్యంలో బాగా సేవ చేశావా?..."కళ్లెగరేస్తూ అబ్బారావుని అడిగాడు పుల్లారావు.
    "ఓ... బోల్డన్ని కవితలు రాశానండీ... సినిమా పాటలు కూడా బోల్డన్ని రాశా... నా కలం పేరు అబ్బశ్రీ అన్నమాట!.." చెప్పాడు అబ్బారావు.
    "ఓహోహో... అబ్బశ్రీవన్నమాట! మరి చెప్పావుకావేం?... ఏదీ నువ్ రాసిన సినిమా పాటల్లో ఒక పాట వినిపించు... చూద్దాం..."
    అబ్బశ్రీ పాట అందుకున్నాడు.
    "ఓ పిల్లా... నీ సెంటర్లో పొడిచేస్తా... అటూ పోటూ తేల్చేస్తా... లపక లపక... జపక జపక..."
    "ఓక్..." వాంతి చేస్కున్నాడు పుల్లారావు.
    కాస్త తేరుకున్నాక అన్నాడు పుల్లరావ్.
    "నీకు పెద్ద మచ్చ ఉందయ్యా..."
    "హర్రె!... నా పిర్రమీద మచ్చుందని మీకెట్టా తెల్సండి... మా ఆవిడకి తప్ప ఎవరికీ తెలీదనుకున్నానే!!" ఆశ్చర్యంగా అన్నాడు అబ్బారావు.
    "అబ్బా.... నేననేది ఆ మచ్చ గురించి కాదయ్యా... నువ్వేమో బూతు పాటలు రాస్తావ్...ఇంత మచ్చని పెట్టుకున్న నీకు గవర్నెంట్ అవార్డు ఎలా సంపాయించి పెట్టాలి?..."
    "అమ్మమ్మ... అలా అనకండి... మీరేమైనా సాధించగల్రు..."అన్నాడు అబ్బారావు.
    "సర్లె... సర్లె... ఓసారిలా దగ్గరికిలా..."
    అబ్బారావు దగ్గరగా జరిగాడు. పుల్లారావు అబ్బారావు చెవిలో "గుసగుస" అన్నాడు.
    "అమ్మో... అంత ఖర్చే..." గుండెలు బాదుకున్నాడు.
    "సరే నీ యిష్టం... అక్కర్లేదంటే ఫో...."
    అబ్బారావు లెంపలేస్కుని జేబులోంచి నోట్ల కట్ట తీసి పుల్లారావు చేతిలో పెట్టాడు."ప్రస్తుతానికి ఇది ఉంచండి..."
    పుల్లారావు చెవుల్దాకా నవ్వాడు.
    ఆ తర్వాత పుల్లారావు ఢిల్లీ వెళ్లి వాళ్లనీ వీళ్లనీ పట్టుకుని అబ్బారావుకి గవర్నమెంట్ అవార్డు సంపాదించి పెట్టాడు.
    అబ్బారావుకి అవార్డు వచ్చిన సందర్భంగా టి.వి.లో అతని ఇంటర్వ్యూ వేశారు.
    అందులో అబ్బారావు "ఇంతత్తుత్తమమైనా సాహితీ పురస్కారం నాకు వస్తుందని నేనూహించనే లేదు... ఇది నా అదృష్టం!..." అన్నాడు చిర్నవ్వుతో.
                                                                                   *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS