Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 7

   
    అప్పుడే వచ్చిన నాయర్ డైనింగ్ టేబులుమీద భోజన పదార్ధాలను __ నిశ్శబ్దంగా అమర్చసాగాడు.

    కొంతసేపటికి నలుగురూ భోజనం చేయడం ప్రారంభించారు.

    "ప్రతిభగల వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పి ఇక నా పని అయిపోయిందని నిద్రపోవడం కూడా నాకిష్టం ఉండదు. రాజారామ్ మన సంస్థ నుంచి వొచ్చే అన్ని ఎడిషన్లనీ నేను రోజూ చదువుతాను. మిగతా దినపత్రికల్తో పోల్చి చూస్తాను. ఒక్క విషయం ఏమంటే__లోకల్ న్యూస్ కవరేజిలో మనమే బెస్ట్. హైదరాబాదులాంటి సిటీలో సిటీ ఎడిషన్ కి లోకల్ కవరేజ్ ప్రాణం లాంటిది. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు రాజారామ్" అంటూ ఉత్సాహంగా అతనివేపు చూశాడు చైర్మన్.

    "అయాం వెరీ ప్లీజ్ టు హియరిట్ సర్"

    "అయితే నన్నొక్కటే చాలా కాలంగా వేధిస్తోంది. 'ఆంధ్ర టైమ్స్' ఇంకా నెంబరు వన్ కాలేదు." అంటూ గ్లాసులోని మంచి నీళ్ళు గడగడా తాగాడు.

    "ఆఁ.... విరించీ ఏమిటి తింటున్నావ్?"

    విరించి ఏదో గొణిగాడు.

    "ఇదిగో చూడూ... కాకరకాయకూర ఫాస్టుగా ఉంది. రెండు ముక్కలు వేసుకో!'

    ఇష్టం లేని పని చేస్తునట్టు విరించి కాకరకాయ కూర వడ్డించుకున్నాడు.

    చైర్మన్ కి కాకరకాయ కూరంటే ఇష్టం!

    విరించికి అది పడదు.

    తనని కాకరకాయ కూర తినమని అడగనందుకు రాజారామ్ సంతోషించాడు. సొంత మేనకోడలు భర్త అయినా విరించి అంటే చైర్మన్ కి సదభిప్రాయం అంతగాలేదన్న అనుమానం కూడా అతనికి వచ్చింది.

    "రాజారామ్, నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా! ఇవాళ కాకపోతే రేపయినా నువ్వు మంచి ఎడిటర్ కాగలవు. నా సంస్థలో నువ్వు హేపీగా ఉండాలని నా కోరిక."

    "నేను చాలా హేపీగా ఉన్నాను సర్"

    "న్యూస్ పేపర్ సక్సెస్ కి మూల కారణం ఏమిటో తెలుసా? టీం వర్క్! సంతృప్తితో మీలాంటి వాళ్ళందరూ చేసే సమిష్టికృషి పత్రిక విజయానికి దారి తీస్తుంది. అలాంటి టీం వర్క్ మనం సాధించగలిగితే పత్రిక సర్క్యులేషన్ దానంతట అదే పెరుగుతుంది. ఎడ్వర్టయిజర్లు మన కాళ్ళ మీద పడ్తారు. ఏమంటావ్ అప్పారావ్?" అంటూ అటు చూశాడు చైర్మన్.

    "చర్చావేదిక ఫీచర్ ప్రారంభించాలని మీరు అనుకుంటున్నట్టు విరించిగారు చెప్పారు సర్. ఇట్ ఈజ్ ఏ గుడ్ ఐడియా. దాంతో సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది సర్" అంటూ అప్పారావు తైరు నవ్వు నవ్వాడు.

    "నిజమే సర్క్యులేషన్ పెరుగుతుంది. కాని దాన్ని నిలబెట్టే బాధ్యత నీదేనయ్యా!"

    "నేను చేయగలిగిందల్లా చేస్తాను సర్" అన్నాడు అప్పారావు మరోసారి తైరు నవ్వు నవ్వుతూ.

    "అన్నట్టు రాజా, మీరిద్దరూ విజయవాడలో కలిసి పని చేశారని విన్నాను. మీ ఇద్దరికీ సరిపడ్తుంది కదా!"

    అర్ధం కానట్టు చూశాడు రాజారామ్.

    "ఏమిటలా చూస్తావ్? విరించి నీకేం చెప్పలేదా?"

    "చెప్దామనుకున్నానండి. ఫోన్ లో చెప్దామని ట్రయ్ చేశాను. కాని నెంబరు కలవలేదు."

    "అయ్ డోన్ట్ లైక్ దిస్ విరించీ!" చైర్మన్ గట్టిగా అలా అనే సరికి రాజారామ్ ఆశ్చర్యపోయాడు. అంతలో విరించి గొంతు సవరించుకుని "అన్నట్టు రాజారామ్....మన అప్పారావు ఇవేల్టి నుంచి 'ఆంధ్రా టైమ్స్' ఎడిటర్ ఆ సందర్భంగానే మనం చైర్మన్ గారితో లంచ్ లో జాయినయ్యాం." అన్నాడు.

    రాజారామ్ లో ఆశ్చర్యానికి బదులు నిరాశ నిండింది. కాని దాన్ని బయటికి కనబర్చకుండా అప్పారావు వేపు తిరిగాడు.

    "కంగ్రాచ్యులేషన్స్ అప్పారావ్" అన్నాడు ముక్తసరిగా.

    "థాంక్యూ"

    "ఇది మనకి ఎమర్జెన్సీ సిట్యుయేషన్. మనం ఇప్పుడు నెంబరు త్రీ పొజిషన్ లో ఉన్నాం. ఆరు నెలల్లో మనం నెంబర్ వన్ కావాలి. దానికి మీ రిద్దరూ కృషి చెయ్యాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. అయ్ వాంట్ రిజల్ట్స్ దట్సాల్ అంటూ అన్నంలో పెరుగు పోసుకున్నాడు చైర్మన్.

    అంతలో తలఎత్తి "రాజారామ్ నీ పనిని నేనో కంట కనిబెడ్తునే ఉంటాను. నీ ప్రతిభ పత్రికకి ఎలా ఉపయోగపడ్తూందో కూడా నేను గమనిస్తూనే ఉంటాను. ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నాను. గుర్రాన్ని గాడిదల్ని నేనో చోట కట్టను."

    "అలాగే సర్" అని మాత్రం అన్నాడు రాజారామ్.

    భోజనాలు పూర్తయ్యాయి. చైర్మన్ చేతులు కడుక్కుని "వెల్ జెంటిల్మెన్. లేటజ్ కాలిట్ ఎ డే!" అన్నాడు. అన్నాక తలుపు తీసి తన చాంబర్సులోకి వెళ్ళి పోయాడు.

    విరించి అప్పారావు వేపు చూసి - "ఏం మిత్రమా, ఛార్జి తీసుకుంటావా?" అన్నాడు.

    విరించి ముందు నడవగా, ఇద్దరూ అతన్ని అనుసరించారు. కింద ఫ్లోరులోని ఎడిటోరియల్ ఆఫీసుల వేపు నడిచారు. అప్పారావు ఎడిటరైన విషయం తనకి ముందే చెప్పి ఉంటే బాగుండేదని అనుకున్నాడు రాజారామ్.

    అంతలో ఒక ఆఫీస్ బాయ్ రాజారామ్ కి నమస్కరించి ...." మీ కోసం ఒక లేడీ చాలా సేపట్నుంచి వెయిట్ చేస్తున్నాదండీ. కింద రిసెప్షన్ రూంలో ఉన్నారు. పేరు సుమిత్ర" అన్నాడు.

    "సరే. ఆమెని నా గదిలోకి తీసుకురా" అన్నాడు రాజారామ్.

    అప్పారావు తన కొత్త గదిలోకి వెళ్ళాడు. నిన్నటి వరకూ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇవాళ్టి నుంచి ఎడిటర్! ఆ గదిలో విష్ణుమూర్తి కాగితాలు సర్దుతూ కన్పించాడు రాజారామ్ కి. తల కిందికి దించుకుని ఉన్నాడు. మొహం కంద గడ్డలా జేవురించి ఉంది.

    రాజారామ్ తన సీటు వేపు వెళ్ళాడు. అంతా తమ తమ పనుల్లో లీనమై ఉన్నారు. ఏదో పని మీద అటు వచ్చిన షిఫ్ట్ ఇన్చార్జ్ జనార్ధన్ మాత్రం "న్యాయానికి ఎక్కడా స్థానంలేదు" అని మెల్లగా గొణుక్కున్నాడు. అది విని రాజారామ్ ఏం మాట్లాడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS