దేవదాసు కూడా ఈ విధంగానే ఆలోచిస్తూ వుండేవాడు. మధ్య మధ్యలో ఆమెను చూడాలనీ, ఆమెతో మాట్లాడాలనీ అభిలాష కలుగుతూ వుండేది. కాని యిది సభ్యతగా వుంటుందా అనే విషయం గుర్తుకు వచ్చేది.
ఇక్కడ కలకత్తాలోని ఆ కోలాహలం లేదు. ఆ ఆనందం లేదు. ఆ ఉల్లాసం లేదు. ఆ ధియేటర్లూ, ఆ గానా బజానాలు లేవు. అంచేత అతడికి కేవలం ఆ బాల్యకాలపు విషయాలు జ్ఞప్తికి వస్తున్నాయి. ఈ పార్వతి ఆ పార్వతేనా అనే ప్రశ్న అతడి మనసులో బయలుదేరుతుంది. ఈ దేవదాసు ఆ దేవదాసేనా అని పార్వతి తన మనసులో ఆలోచిస్తుంది. దేవదాసు ఇప్పుడు తరచుగా చక్రవర్తి ఇంటివైపుకు వెళ్ళడం లేదు. ఎప్పుడయినా ఒకసారి వరండాలో నిలబడి "పిన్నీ ఏం చేస్తున్నావు?" అని అడిగేవాడు.
ఇక్కడకు వచ్చి కూర్చో నాయనా!" అనేది పిన్ని.
"ఇప్పుడు కాదులే పిన్నీ, నేను కొంచెం షికారుకు వెళ్తున్నాను" అని దేవదాసు అనేవాడు.
పార్వతి ఒకప్పుడు పైన వుండేది. ఒకప్పుడు దేవదాసుకు ఎదురుపడేది. అతడు పిన్నితో మాట్లాడుతూ వుంటే ఆమె నెమ్మదిగా అక్కడ నుంచి జారుకునేది. సాయంకాలం తరువాత దేవదాసు ఇంట్లో దీపం వెలుగుతూ వుండేది. గ్రీష్మఋతువులో తెరచివున్న కిటికీలో గుండా పార్వతి చాలా సేపటి వరకు ఆ వైపే చూస్తూ వుండేది. కాని ఆ దీపం వెలుగు తప్ప మరేమీ చూడగలిగేది కాదు. పార్వతి మొదటి నుంచీ ఆత్మాభిమానం గలది. ఆమె ఇప్పుడు పడుతున్న యాతనలో లేశ మాత్రం కూడా ఎవరికీ తెలియనీయకుండా వుంచడానికి ప్రయత్నిస్తూ వుండేది. ఎవరితోనైనా చెప్పుకున్నందు వలన ప్రయోజనం ఏముందీ? సానుభూతిని ఆమె సహించలేదు. తిరస్కారాన్నీ, కళంకాన్ని సహించేకన్నా మరణించడమే మేలు. గత సంవత్సరం మనోరమ వివాహ మయ్యింది. ఆమె యింకా అత్తవారింటికి వెళ్ళలేదు. అంచేత మధ్య మధ్యలో ఆమె పార్వతిని కలుసుకొనడానికి వస్తూ వుండేది. మొదట్లో ఇద్దరి సంభాషణలో ఈ విషయాలన్నీ వస్తూ వుండేవి. కాని యిప్పుడు పార్వతి ఆమెకు ఆ విషయం ముచ్చటించడానికే అవకాశమిచ్చేది కాదు. అటువంటి విషయం వచ్చిన సందర్భంలో ఆమె మౌనంగా ఉండేది. లేకపోతే ఆ విషయాన్ని దాట వేస్తూ వుండేది.
పార్వతి తండ్రి నిన్న రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇటీవల అనేక రోజుల నుంచి ఆయన వరుణ్ని వెతకడానికి వెళ్ళాడు. ఇప్పుడు వివాహం విషయం అంతా స్థిరపరచుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. పాతికా ముప్పయ్ కోసుల దూరంలో బర్ద్ వాన్ జిల్లా హాథీపోతా గ్రామం జమీందారుతో పార్వతి వివాహం స్థిరపరచుకొని వచ్చాడు. ఆయన ఆర్ధిక పరిస్థితి బాగున్నది. వయసు నలుబది సంవత్సరాల కన్న కొంచెం తక్కువే వుంటుంది. గత సంవత్సరం మొదటి భార్య స్వర్గస్తురాలయింది. అంచేత రెండో వివాహం చేసుకొంటున్నాడు. ఈ వార్తతో కుటుంబంలో యెవ్వరికీ ఆనందం కలగలేదు. పైగా దుఃఖమే కలిగింది. అయినప్పటికీ భువన్ మోహన్ చౌధరీ నుంచి అంతా కలుపుకొని రెండు మూడు వేల రూపాయలు అభ్యమవుతున్నాయి. అందువల్ల ఆడవాళ్ళందరూ మౌనం వహించారు.
ఒక రోజు మధ్యాహ్నం దేవదాసు వంటింట్లో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు తల్లి దగ్గర కూర్చొని "పత్తో పెళ్ళి" అన్నది.
దేవదాసు తలపైకెత్తి "ఎప్పుడూ?" అని అడిగాడు.
"ఈ నెలలోనే. నిన్న వరుడు స్వయంగా వచ్చి కన్యను చూసి వెళ్ళాడు."
దేవదాసు కొంచెం విస్మితుడై "నాకు ఏమీ తెలియలేదే అమ్మా!" అన్నాడు.
"నీకెలా తెలుస్తుంది? వరుడు రెండో పెళ్ళివాడు. వయసు కొంచెం ఎక్కువగా వుంటుంది. కాని శ్రీమంతుడు. పత్తోకు తిండికీ, బట్టకూ లోటేమీ వుండదు. సుఖంగానే వుండగలదు."
దేవదాసు తల వంచుకొని భోజనం చేస్తూ వున్నాడు. అతడి తల్లి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది__"పార్వతిని మొదట మనింట్లో ఇవ్వాలని అనుకున్నారు."
దేవదాసు తల పైకెత్తి "మరి?" అన్నాడు.
"ఛీ! ఈ విధంగా ఏనాటికయినా సాధ్యమవుతుందా? ఒకటేమో వాళ్ళు కన్యను అమ్ముకొని, కన్యను కొనడం లాంటి పనులు చేసే వాళ్ళు! అటువంటి చిన్న వంశంలో! ఛీ! ఛీ!" ఇలా తల్లి పెదవి విరిచింది. దేవదాసు కూడా ఇది గమనించాడు.
కొంచెం సేపు మౌనంగా వున్న తరువాత తల్లి మళ్ళీ "నేను మీ నాన్నగారితో కూడా చెప్పాను" అన్నది.
"నాన్నగారు ఏమన్నారు?" అన్నాడు దేవదాసు.
"ఇంకేమంటారూ? ఇంత గొప్ప వంశానికి తలవంపులు తెద్దామా?" అన్నాడు.
దేవదాసు తరువాత ఏ విషయమూ అడగలేదు. అదే రోజు మధ్యాహ్నం మనోరమకు, పార్వతికి సంభాషణ జరిగింది. పార్వతి కళ్ళల్లో నీళ్ళు చూసి మనోరమ కళ్ళు కూడా అశ్రుపూరితాలయ్యాయి. ఆమె కన్నీళ్ళు తుడుచుకొని "మరి ఇంకే ఉపాయం వుంది చెల్లీ?" అన్నది.
పార్వతి కూడా కళ్ళు తుడుచుకొని "నీవు వరుణ్ని ఇష్టపడే చేసుకున్నావా?" అన్నది.
"నా విషయం వేరు. నాకు ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు. అందుకే నాకేమీ కష్టం కూడా లేదు. కాని నీ కాళ్ళను నీవే గొడ్డలితో నరుక్కుంటున్నావు చెల్లీ!"
పార్వతి ఏమీ జవాబివ్వలేదు. ఆమె మనస్సులోనే ఏదో ఆలోచిస్తూ వున్నది.
మనోరమ కూడా ఏదో ఆలోచిస్తూ నవ్వింది. తరువాత "పత్తో! వరుడి వయస్సు ఎంత?" అని అడిగింది.
"ఎవరి వరుడిదీ?"
"నీ....!"
పార్వతి నవ్వి "పంతొమ్మిది సంవత్సరాలు వుండవచ్చు" అన్నది.
మనోరమ ఆశ్చర్యపోయి "నలభై అని నేను విన్నాను" అన్నది.
ఈ సారి కూడా పార్వతి నవ్వి "మనో అక్కా, ఎంత మంది వయసు నలభై సంవత్సరాలో నేను అందరి వయసుల లెక్క వుంచుతున్నాననుకున్నావా? నా వరుడి వయస్సు పంతొమ్మిదీ- ఇరవై సంవత్సరాలు వుంటుంది__ఇది నాకు తెలుసు."
ఆమె ముఖం వైపు చూసి మనోరమ మళ్ళీ "పేరేమిటీ?" అన్నది.
"నీకు తెలిసిందే!"
"నాకు ఎలా తెలుస్తుంది?"
"నీకు తెలియదా? సరే వుండు చెప్పేస్తాను" అని కొంచెం నవ్వి గాంభీర్యంగా తన నోటిని ఆమె చెవి దగ్గరకి తీసికునిపోయి "నీకు తెలియదా? శ్రీ దేవదాసు" అన్నది.
మనోరమ మొదట స్తబ్ధురాలై పోయింది. ఆమెను కొంచెం అవతలకు నెట్టి "ఈ పరిహాసంతో పని కాదు. పేరేమిటో సరీగా చెప్పు. ఒకవేళ చెప్పలేకపోతే...." అన్నది.
"అదే నేను చెప్పాను గదా!"
"ఒకవేళ పేరు దేవదాసే అయితే ఇంతగా ఏడుస్తావెందుకు?" అని అడిగింది మనోరమ కోపంగా.
హఠాత్తుగా పార్వతి ముఖంలో రంగు మారిపోయింది. కొంచెం ఆలోచించిన తరువాత "ఇది నిజమే! ఇప్పుడు నేనిక ఏడవను" అన్నది.
"పత్తో!"
"ఏమిటీ?"
"అన్ని విషయాలూ బాగా ఆలోచించుకొని చెప్పు చెల్లీ! నాకు ఏమీ అర్ధం కావటం లేదు."
"నేను చెప్పవలసినదంతా చెప్పేశాను" అన్నది పార్వతి.
"కాని నాకు ఏమీ అర్ధం కావడంలేదు."
"అర్ధం కాకపోవచ్చు." అని పార్వతి మరోవైపు చూస్తూ వుంది.
'పార్వతి మాట దాస్తున్నది. ఆమెకు చెప్పాలనే అభిలాష లేదు' అనుకొన్నది మనోరమ. అందువల్ల ఆమెకు చాలా కోపం కూడా వచ్చింది. విచారపడుతూ ఆమె అన్నది__"పత్తో" నీకు బాధ కలిగించే విషయం నాకూ బాధ కలిగిస్తుంది. నీవు సుఖంగా వుండాలనే నేను నా అంతరంగంలో ప్రార్ధిస్తూ వుంటాను. ఒకవేళ నీవు ఏ విషయమైనా ఎవరితోనైనా చెప్పదలచుకొనకపోతే చెప్పకుండా వుండు. కాని యీ విధంగా పరిహసించడం బాగుండదు."
పార్వతి విచారపడుతూ "పరిహసించడం లేదు అక్కా. నాక తెలిసినంతవరకు నేను నీకు చెప్పేశాను. నాకు ఇదే తెలుసు. నా భర్త పేరు శ్రీ దేవదాసు, వయసు పంతొమ్మిదీ, ఇరవై సంవత్సరాలు. ఈ విషయమే నీతో కూడా చెప్పేశాను" అన్నది.
"కాని నీ సంబంధం మరొకరితో స్థిర పడిందని నేను విన్నాను."
"ఇంకేం స్థిరపడుతుంది? దాదా పెళ్ళి ఇంకెవరితోనూ జరగదు. జరిగితే నాతోనేగదా? నేను నీవు విన్నటువంటి వార్త ఏదీ వినలేదు."
మనోరమ విన్న విషయాన్ని చెపుతూ వుంది. పార్వతి "ఇదంతా నేను కూడా విన్నాను" అన్నది.
"అప్పుడు దేవదాసు నిన్ను...."
"ఏమిటీ నన్నూ?"
మనోరమ నవ్వును అణచుకుంటూ "అయితే స్వయంవరం జరిగినట్లు కన్పిస్తున్నది! చాటు చాటుగానే జరిగిపోయి స్థిరపడిపోయిందన్న మాట!
