నీళ్ళు నిండిన కళ్ళతో అతని కళ్ళలోకి చూసింది మధుమతి.
"నాన్నగారంగీకరిస్తారు కదూ?" ఆమె కన్నీళ్ళు వత్తుతూ అన్నాడు ప్రసాదరావు.
"నాన్నగారికి కేనాడో మీరంటే ఇష్టం." సిగ్గుగా తల వాల్చింది మధుమతి.
నర్సమ్మ గారు మూలిగి వత్తి గిలడం తొ ఇద్దరూ ఆమె మంచం దగ్గిరి కొచ్చారు.
"అమ్మామ్మా! , ఏం కావాలి?' ఆమె పక్కలో కూర్చుంటూ రుద్ద కంఠం తో అన్నాడు ప్రసాదరావు.
"ఛీ, ఛీ , కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నావా , నేను పోతానని? ఈవేళ ఆయాస మెక్కువగా ఉంది.... రాలిపోతానేమో? నిన్నో ఇంటి వాణ్ణి చేద్దామనుకున్నాను. పడనిచ్చావు కాదు" అని, "అమ్మా , మధూ, నాన్నగారిని ఓసారి పిలు? అయ్యో, నువ్వూ ఏడుస్తున్నావు?" అంటూ గట్టిగా కళ్ళు మూసుకుని బాధగా మూలుగుతున్న నర్సమ్మ గారి భుజాలు పట్టి కుదుపుతూ 'అమ్మమ్మా! ఏమిటలా అయిపోతున్నావు?' అని బావురుమన్నాడు ప్రసాదరావు.
రెండు క్షణాలలో కళ్ళు తెరిచిన నర్సమ్మ గారు "భార్యతో నీ కాపురం చూసి పోవాలనుకున్నాను. కాని, మాయదారి మృత్యువు వచ్చేస్తుంది.' అని, ఆయాసంతో అతి కష్టం మీద అంటున్న ఆమె కణతల మీంచి కన్నీళ్ళు జారిపోతున్నాయి.
"వద్దు....అలా బాధపడకమ్మా....ఇదిగో, చూడు మధుని పెళ్ళి చేసుకుంటాను. ఈమె నా భార్య. ఆశీర్వదించు, అమ్మమ్మా!" దుఃఖావేశంతో అన్నాడు ప్రసాదరావు, మధుమతి చేతులు తన చేతులతో నొక్కి పోట్టుకుంటూ.
"అలా ఎప్పుడనుకున్నారు? తహసీల్దార్ గారి అల్లుడివా నువ్వు? సంతోషం!" ఆమె ముడతలు పడ్డ మోహంలో లోతుకు పోయిన కళ్ళు వెలిగాయి తృప్తిగా!
.jpg)
ఆయాస మెక్కువై బరువుగా కళ్ళు మూసింది నర్సమ్మ గారు.
కంగారుగా వెంకట్రామయ్య గారిని పిలుచు కొచ్చింది మధుమతి.
డాక్టర్ని పిలుచు కొచ్చాడు ప్రసాదరావు.
ఆయాసంతో నర్సమ్మ గారి గుండె ఎగసి ఎగసి పడుతుంది.
కళ్ళు విప్పిన నర్సమ్మ ఓసారి చుట్టూ వారిని కలయ జూచి, ప్రసాదరావు చెయ్యి వెంకట్రామయ్య గారి చేతిలో ఉంచింది. ఏమో చెప్పబోతున్నట్టు ఆమె పెదవులు కదిలాయి. కాని ఆమె వాగింద్రియం అప్పటికే మూసుకుంది.
నిశ్చేతనంగా ఉన్న నర్సమ్మను చూస్తూ, జలజలా కన్నీరు కార్చాడు ప్రసాదరావు. అతని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని అతని కన్నీళ్లు తుడుస్తూ, "ఇలా బేలవై పోతావేమిటి? ఛీ, ఛీ! ఎవరైనా నవ్వగలరు! నీకోసం తొంబై ఏళ్ళు జీవించారామే. ఊరుకో. జరగవలసిన పనులు చూడు. " అని మృదువుగా ముందలించి, ధైర్యం చెప్పారు. వెంకట్రామయ్యగారు.
ఆమె కర్మకాండ ముగిసిన వెంటనే తన ఇంట్లోకి తీసుకు వచ్చేశారు వెంకట్రామయ్య గారు ప్రసాదరావు ని.
మా అల్లు"డంటూ తెలిసిన వారందరికీ చెప్పారు కూడా.
* * * *
అతని వినయాన్ని కాబోయే అత్తవారు ,మెచ్చుకుంటుంటే , వారి ఆదరభిమానాలకి కాబోయే అల్లుడు పొంగి పోతున్నాడు.
జీతాలందిన రోజు. ఇంట్లో భోజనానికి డబ్బిస్తే ఏమనుకుంటారో, ఇవ్వకపోతే ఏమనుకుంటారో? ఇబ్బందిగా ఉంది ఏమి చెయ్యడానికి ప్రసాదరావు కి.
ఇంటికి వస్తూనే "బాబూ, ప్రసాద రావ్!" అని పిలిచారు వెంకట్రామయ్య.
"సార్ పిలిచారా?' చేతులు కట్టుకుని అతని ఎదురుగా నిలుచున్నాడు ప్రసాదరావు.
"బాగుందోయ్! రేడియో లో చెప్పార్లె ఆ మధ్య.... సార్, గీర్ అనకు. ఇంటి దగ్గర గుమస్తా లా కాక అల్లుడు లా తిరుగు...చూడూ! ఆ ఇంటి వాళ్ళ కెంత యిందో ఆ అద్దె పారేసి, సామాన్లు మనింటికి తెచ్చేసుకో. రోజూ అక్కడికి పోయి పడుకుంటావ్ -- నీ చాదస్తం నువ్వునూ. రోజూ చెప్పాలనే అనుకుంటున్నాను. కాని ఏవో సామాన్లు ఉన్నాయని ఊరుకున్నాను. ఈవేళ మంచిది. పూర్తిగా మనింటి కొచ్చేయ్." అన్నారు నవ్వుతూ.
"అబ్బే, ఎందుకండీ ? ఏదో నెల్లాళ్ళు మీ ఇంట్లో భోజనం చేశాను. మరి ఈ వేళ నుంచి హోటల్లో భోజనం చేసి, ఆ ఇంట్లోనే ఉంటాను. తరవాత ఎలా వీలైతే అలా. మీరేది మంచిదంటే అలానే చేస్తాను." అన్నాడు ప్రసాదరావు మొహమాటంగా.
"అబ్బే, హోటలు భోజనం, మరో ఇంట్లో కాపరం ఇవేమీ పనికి రావూ సుమా! ఏమనుకుంటూన్నావో నువ్వు కాని-- రాజూ, గోపీ చిన్న కొడుకులు, నువ్వు పెద్ద కొడుకువి నాకు" అన్నారు వెంకట్రామయ్య గారు, గుంభనంగా నవ్వుకుంటూ.
"ఎస్ సర్!" అంటూ వెనుతిరిగి ఇంట్లోకి నడిచాడు ప్రసాదరావు.
"ఏమండీ, సామాన్లు అన్నీ తెచ్సుసుకోమన్నారు తహసీల్దారు గారు. ఎక్కడ ఉంచాలి?' అన్నాడు మొహమాట పడుతూ నెమ్మదిగా వంట ఇంటి వైపు వచ్చిన ప్రసాదరావు.
'అత్తయ్యగారూ, మామయ్యగారూ అని పిలు. ఏమండీ, గీమండీ అనక. దేవుడు చల్లగా చూస్తె ఒక్క నెలలో మూడు ముళ్ళూ పడతాయి. మధూ! సామాన్లు తెస్తాదట. సర్ధించు ఇంట్లో" అంది జానికమ్మ.
"అద్దె ఇచ్చేసి ఇంటామేకి చెప్పి రండి. నేనా సామాన్లు తెచ్చేస్తాను. నాన్నగారు ఫ్యూన్ ని పంపిస్తారు" అంది మధుమతి.
* * * *
సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన ప్రసాదరావు కి చిరునవ్వుతో కాఫీ తెచ్చింది మధుమతి.
"సామాన్లన్నీ జాగ్రత్తగా తెచ్చేశావు కదూ?" అన్నాడు కాఫీ సిప్ చేస్తూ ప్రసాదరావు.
"అన్నీ జాగ్రత్తగానే వచ్చాయి. కాని రాధాకృష్ణుల విగ్రహం..." అంటూ అతని వైపు జంకుగా చూసింది మధుమతి.
"ఆ రాధాకృష్ణుల విగ్రహం పగిలి పోయిందా?' అడిగాడు కలవర పాటుగా.
"ఆహా, లేదులెండి. పగులు చూపింది. " అంది నొచ్చుకుంటూ.
"ఏం? చెయ్యి జారిందా?"
"అవును. జాగ్రత్త గానే తీసుకు వచ్చాను. కానీ, చెయ్యి జారింది. చూడండి, చివర అంటే తలలు బాగానే ఉన్నాయి కలిసి. కాని....' అంటూ అతని వైపు భయంగా చూసింది మధుమతి.
ఇద్దరికీ మధ్య సన్నని పగులు. "పోనీలే , ఏం చేస్తాం? మరేం బాధపడకు." అన్నాడు ప్రసాదరావు ఆ బొమ్మ వైపు పరిశీలనగా చూస్తూ.
మౌనంగా నిలుచున్న ఆమె చేతి కా బొమ్మను ఇస్తూ "చూడు, నాకని ఏదన్నా గది ఇస్తున్నారా? లేక నీ గదిలోనే గడిపెయ్యమంటున్నారా మీ నాన్న!' అన్నాడు నవ్వే పెదవులు ముడుచుకుంటూ.
'అబ్బ, పొండి ." ఆమె బుగ్గల్లోకి సిగ్గు వచ్చేసింది.
"పోతానంటే పోనివ్వరుగా? మన గదిలో టేబిలు మీదుంచు" అన్నాడు ప్రసాదరావు అల్లారిగా నవ్వుతూ.
వెళ్ళబోతున్న ఆమె వైపు అదే నవ్వుతో చూస్తూ "ఏయ్ మధూ! నా బట్టలేక్కడ?' అని అడిగాడు.
"హాస్యాలు చెయ్యకుండా ఉంటేనే మీతో మాట్లాడేది నేను. వెనుదిరిగి నిలుచుని అతని వైపు చూసి నవ్వాపుకొంది మధుమతి.
"నవ్వావంటే ఏం చెస్తానో తెలుసా?' చూపుడు వేలు ఊపాడు ప్రసాదరావు.
"ఏం చేస్తారేం! రండి, పైన మీ గది " అంటూ ముందు నడిచిందామే.
ఆమె ననుసరించాడతను.
గదంతా కలయజూచిన అతను, "చూడు , మధూ! ఈ ట్రంకు పెట్టె మీ విలువైన సామాన్లేక్కడ భద్రపరుస్తారో అక్కడ పెట్టించు" అన్నాడు.
'అంత విలువైన వస్తువు అందులో ఏమున్నాఏమిటి?" కుతూహలంగా ప్రశ్నించింది మధుమతి.
పెట్టె తెరిచి, "మా అమ్మ తాలుకూ బంగారం. ఇవి ముప్పై తులాలట. ఇవేవో వెండి సామానులు. కంచం గిన్నె వగైరా. ఇవేవో పాతకాలపు పట్టు చీరలు. నా భార్య కట్టాలని అమ్మమ్మ వాంచ" అన్నాడు.
కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, గుండె పై చెయ్యి వేసుకుని, "అమ్మ! ఇంత బంగార,ముందా మీ ఇంట్లో!" అంది మధుమతి.
"ఊ.... అంతా నీదేమరి." అంటూ తాళాల నామె చేతిలో పెట్టాడు ప్రసాదరావు.
"తాళం చెవులు మీ దగ్గరే ఉంచుకుంటే?"
"ఎక్కడన్నా పారేస్తాను. అందుకని....ఊ....కూర్చో. నీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు ప్రసాదరావు బట్టలు మార్చుకుంటూ.
కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిన తరవాత , "ఏమిటండీ ఏం మట్లాడరూ? ఎందుకని కూర్చోమన్నది?' అని విసుగ్గా అంది మధుమతి.
"బాగుంది. కాబోయే భార్యతో కొన్ని ముఖ్య విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడామాత్రం ఆలోచించాలిగా? రెండు నిమిషాలాగు" అని నవ్వుతూ , ఆమె సమీపం లో తనో కుర్చీలో కూర్చుంటూ , "చూడు ఇది వరకైతే నా జీతం అందగానే అమ్మమ్మ కిచ్చేవాణ్ణి. ఖర్చు వెచ్చా లామె చూచుకునేది. ఇప్పుడు మీ ఇంట్లో నా ఖర్చంతా భరిస్తున్నారు. నాకేం తెలియదు. మొహమాటంగా ఉంది, మధూ! డబ్బు భోజనాని కనీ ఇస్తే ఏమనుకుంటారో మీ వాళ్ళు. ఇవ్వకుండా ఎలా తినెయ్యడం? నాకు బాగుండలేదు. అందుకని ఈ డబ్బు నీకెలా తోస్తే అలా చెయ్యి" అంటూ బలవంతంగా ఆమె చేతిలో పెట్టాడు. కొన్ని పది రూపాయల నోట్లు ప్రసాదరావు.
"నాకేం తెలియదు. ఇందుకా మీరుండమన్నది?" ఆ నోట్ల తన పక్కన పెట్టి వెళ్ళబోతున్న ఆమె చెయ్యి పట్టుకున్నాడు ప్రసాదరావు. "మధూ! ప్లీజ్... తీసుకోవాలి" అంటూ.
"అబ్బా, వద్దండీ!" విడిపించుకొబోయింది. అతనింకా ఆమెకు దగ్గరయ్యాడు. అతని చేతిలో తన చెయ్యి. ఆస్పర్శలో ఏదో తీయ్యని అనుభూతి. బరువుగా కనురెప్పలు వాలిపోయాయి మధుమతి కి.
"తెలియందంటే వీల్లేదు." ఆమె గడ్డం క్రింద చెయ్యి ఉంచి, ఆమె వాలిపోతున్న కళ్ళలోకి మత్తుగా చూస్తూ, "తెలియదని తప్పించుకోకు. ఇలా చనువు తీసుకుంటున్నానని మరోలా అనుకోకు. తప్పకుండా ఖర్చు చెయ్యి." అని ఆమె చేతిలో డబ్బుంచి ఆ చెయ్యి మూసి నొక్కి వదిలేశాడు.
"మీరేం ఖర్చులకి దగ్గర ఉంచుకోరూ?' బిడియంగా, నెమ్మదిగా అంది మధుమతి.
"నాకేం ఖర్చులున్నాయ్! మధ్యాహ్నం లంచ్ టైం లో కప్పు కాఫీ , ఆ డబ్బు నెల కోసారే ఇస్తాను."
"సిగరెట్, కిళ్ళీ, సినిమా -- ఇలాంటి అలవాట్లేమీ లేవా?" అనంతమైన సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అవుతూ, రెప్ప వాల్చకుండా అతని వైపు నమ్మలేనట్లు చూస్తూ అంది మధుమతి.
"ప్చ్! నాకెందు కలాటి అలవాట్లు? పేదవాణ్ణి ." నవ్వేశాడు ప్రసాదరావు.
"పదే పదిసార్లు పేదవాణ్ణి అంటే సహించేది లేదు అలవాట్ల కి పెదా గొప్ప అని ఏముంది?"
"పోనీ , అంతగా అవసరమైతే నిన్ను అడిగి తీసుకుంటానుగా! మరి సెలవు, అలా పోయి వస్తాను-- కాస్త మొహం కడుక్కుని" అంటూ కిందికి నడిచాడు.
సబ్బూ, టవలూ బాత్ రూమ్ కి తెచ్చింది మధుమతి.
* * * *
