Previous Page Next Page 
కౌసల్య పేజి 7

 

    హాల్లోకి తను వెళ్ళేటప్పటికీ, అన్నయ్యా సూర్యనారాయణ లతో పాటు , వాళ్ళ చుట్టాలూ తన చుట్టాలూ అంతా కూర్చుని ఉన్నారు.కౌసల్య దూరంగా తివాచీ మీద, వీణ ముందు పెట్టుకుని కూర్చుని ఉంది.
    "ఇంక మొదలెట్టమ్మా" అన్నారు పెరుమాళ్లయ్యగారు. తన వేపోమారు సాభిప్రాయంగా చూసి వీణ తీసి వాయించ సాగింది కౌసల్య. 'వినాయకుని వలెను, బ్రోవవే, నువు వినా వేల్పు లేవరమ్మా' అనే ప్రార్ధనతో ఆరంభించిన వీణా వాదన సుమారు పదిహేను నిమిషాలు రస జగత్తు లో విహరింప చేసి ఆగింది. కౌసల్య అంత అద్భుతంగా వాయిస్తుందని తను కలలో కూడా ఊహించలేదు. ఆ పాటెం విన్నావు? ఇది విను అన్నట్లు ఆనంద భైరవి రాగం ఆలాపన చెయ్యడం ఆరంభించింది.
    ఇంతలో ఇంటి ముందొక కారు ఆగింది. అంతా అటు వేపు చూశారు. అందులోంచి తనకు ఎంతో ఆప్తులయిన సుబ్రహ్మణ్యం , జనార్దనం దిగారు. వెంటనే లేచి ఎదురు వెళ్ళి "ఏమిటి? కాకినాడ నుంచేనా రావడం?' అన్నాడు తను.
    "ఆ! అసలు నిన్న మధ్యాహ్నం సుబ్బారావు ను పుల్లేటి కుర్రు పంపాము. వాడు ఇవాళ పొద్దున్న తిరిగి వచ్చి "మీరంతా రామచంద్ర పురం వెళ్ళారు. సంగతి ఇది' అని చెప్పాడు. అందువల్ల నీకు కబురు పెడదామా, మానుదామా అని తటపటాయించాము. కాని, చివరకు సాంబమూర్తి గారే నిర్ణయించారు: 'అనక నాకు కబురు చెప్పలేదేం, అని నిష్టూరం వెయ్యగలడు. మీరు వెళ్లి, సంగతి సందర్భాలు చెప్పండి. ఇష్టం అయితే వస్తాడు , లేకపోతె లేదు.' అని." ఒక్క గుక్కలో పూర్తీ చేశాడు జనార్దనం.
    అసలింతకూ విషయం ఏమిటో తనకు అర్ధం కాలేదు. హల్లో కూచున్న చుట్టాలూ, అన్నయ్యా, మామగారూ , కౌసల్యా అంతా తెల్లబోయి చూస్తున్నారు. "మీరు పాట వింటూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను" అంటూ జనార్దనం , సుబ్రహ్మణ్యం లతో వీధి గదిలోకి నడిచాడు తను.
    నాయకుల పిలుపు విని దేశం అంతటా వ్యష్టి సత్యాగ్రహం మొదలు పెడుతున్నారు. కాకినాడ లో సాంబమూర్తి గారి ఆధ్వర్యాన అమర్నాడు పొద్దుటే యుద్ద వ్యతిరేక సత్యాగ్రహం ఆరంభం అవుతుంది. అందు పాల్గొనే సత్యాగ్రహులు ఆ రాత్రికే కాంగ్రేసు శిబిరం చేరుకొని తమ తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. ఇదీ జానార్ధనం చెప్పిన దాని సారాంశం.
    అరగంట సేపు తీవ్రంగా ఆలోచించాడు తను. ఎంత ఆలోచించినా తనకు అప్పట్లో వెళ్ళడమే ఉత్తమంగా కనిపించసాగింది . ఎప్పుడు వెళ్లి సత్యాగ్రహం లో పాల్గొందామా అని మనస్సు ఒకటే ఉరకలు వేస్తుంది. దేశసేవ చేసే ఇటువంటి మహత్తర అవకాశం మళ్ళీ మళ్లీ వస్తుందా? ఏమైనా సరే వెళ్లి తీరాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
    అరగంట లో ఇంటిల్లి పాదీకి తెలిసిపోయింది. అన్నయ్య కళ్ళ నీళ్లు పెట్టుకొని "ఎందుకు చెప్పు బాబూ, మనకీ సత్యాగ్రహాలు సమరాంగణాలూనూ?' అన్నాడు.
    "నాకెంత మాత్రమూ నచ్చలేదు మీ నిర్ణయం. ఈ సమయంలో మీరిలా వెళ్ళిపోవడం , ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అని నాకు భయంగా ఉంది" అన్నాడు సూర్యనారాయణ.
    మామగారు పెల్లుబికి వస్తున్న కోపాన్ని వెటకారం వెనకాల దాచి పెడుతూ , "నీకీ కాంగ్రేసు భక్తీ ఎప్పటి నుంచి? అయినా కాకపోయినా, దేశ సేవలో పాల్గొనడానీకో సమయం, సందర్భం అంటూ ఉండద్దూ?' అన్నాడు.
    'అక్కర్లేదు. గర్భాదానపు పెళ్లి కొడుకు కూడా భార్యనూ, బంధువులనూ వదులుకొని దేశ సేవ, దేశసేవ అంటూ సత్యాగ్రహం చేసి లాఠీ దెబ్బలు తిని, జైల్లో అఘోరించవచ్చు. ఈ హోతబోధ చెయ్యడాని కెనా, వీళ్ళిద్దరూ పనిగట్టుకుని కాకినాడ నుంచి వచ్చింది?"
    "మామగారూ! ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నవాడిని నేను. వాళ్ళనేమీ అనవలసిన పనిలేదు. ఒక నిర్ణయం అంటూ తీసుకున్నాక హరి బ్రహ్మాదులు వచ్చినా, నేను వెనక్కు తిరగను. ఆ సంగతి మీకు తెలియదేమో!" అంటూ, తను విసవిస నడిచి, వెళ్ళిపోయాడు పక్క గదిలోకి.
    అక్కడ పందిరి మంచం కొయ్య నానుకొని, కన్నీళ్లు కారుస్తూ నిలబడి ఉంది కౌసల్య. ఆ స్థితిలో , ఆమెను చూడగానే తను గతుక్కు మన్నాడు. మూర్తీభవించిన శోకదేవత లా ఉన్న ఆమెను వదిలి వెళ్ళడం ఎలా? ఏమని అనునయించి వెళ్ళాలి? తనకేం తోచలేదు. నెమ్మదిగా సమీపించి "కౌసల్యా!" అన్నాడు డగ్గు త్తికతో. కొంచెం సేపు ఊరుకుని, మళ్లీ పలకరించాడు. ముఖం ఎత్తి బాధగా తనకేసి చూసింది కళ్ళ నిండా నీళ్లు!
    దగ్గరగా వెళ్లి కోన గోళ్ళతో కన్నీళ్లు తుడుస్తూ "ఏం పని ఇది?" అన్నాడు. వెంటనే తన భుజం మీద తలపెట్టుకుని, వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమెను సముదాయించడానికి ముందు, తనను తాను సంభాలించుకోవలసి వచ్చింది. కొంచెం సేపటికి సర్దుకొని "తప్పు. ఏడవకు. తొందర లో వచ్చేస్తాగా?' అన్నాడు తను.
    "వెళ్ళడం తప్పదా?' అంది.
    "అలా అడ్డు చెప్పకు, కౌసల్యా!"
    "సరే, వెళ్ళండి. నేను బతికుంటే , మీరు తిరిగి వచ్చేటప్పటికి...." పైట చెంగు నోట్లో కుక్కుకుంది ఏడుస్తూ.
    "ఛ....మరీ అంత బేల అయితే ఎలాగ? పోనీ వెళ్ళద్దంటావా? చెప్పు. వెళ్ళద్దంటే......"
    కౌసల్య కొంచెం సేపు తనకేసి చూసి, గుండె పదిలం చేసుకుని, కన్నీళ్లు తుడుచుకుని అతి కష్టం మీద "వెళ్ళండి" అంది. ముంగురులు సర్ది ముద్దు పెట్టుకొని కారెక్కాడు తను.

                                         4
    స్మృతి పధం లో స్పుటంగా ముద్ర వేసుకున్న జీవితపు పుటలను తిరగవేస్తూ వెంకట్రామయ్య బరువుగా నిట్టూర్చాడు. లేచి పెరటి లోకి వెళ్లాడు ఆకాశం అంతా నల్లగా ఉంది. వాన వచ్చే సూచనలు కనిపించ సాగాయి.
    'కొంప తీసి వాన వస్తుందేమిటి చెప్మా? ఒక్క రోజు ఆగితే కట్టేతా, బల్ల కొట్టూ అయిపోయి గింజలింటికి వచ్చును. వాన వస్తే చేలో ఉన్న పనలన్నీ నీటిలో తేలిపోయి గింజ లన్నీ రాలిపోయి....' ఆ పైన ఆలోచించ లేకపోయాడు , బాగా పండిందనుకున్న సిద్దాన్నం ఇలా చెయ్యి జారిపోతుందనే సంగతి ఆలోచించిన కొద్దీ ఆందోళన ఎక్కువైంది వెంకట్రామయ్యకు.
    అతను భయపడినట్లే అయింది. మొదట గబగబా జల్లుగా వచ్చినట్లే వచ్చి, ఆ తర్వాత హోరు మంటూ పెద్ద శబ్దంతో , మధ్య మధ్య ఉరుములు మెరుపులతో తడివాన కురవడం మొదలు పెట్టింది.
    హల్లో ఏమీ తోచక ఇటూ అటూ పచార్లు చేస్తూన్న వెంకట్రామయ్య ను సమీపించి విశాలాక్షి "ఈ వాన మనకు బాగా నష్టం అంటావేమిటి బాబయ్యా?' అంది.

                         
    "బాగా అంటా వేమిటమ్మా? పూర్తిగా నష్టం. ఇంకా ఈ ఏడు ధాన్యం అమ్మి ఆనందాన్ని ఆనర్సు లో చేరుద్దాం అనీ, జానకికి పెళ్ళి చేద్దాం అనీ అనుకున్నా." ఇలా అటుండగా ఆనందం అక్కడికి చేరాడు. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు.
    ఇంతలో ముకుందం తన గది లోంచి వస్తూ, "బయట ఇలా హాయిగా వాన కురుస్తుండగా చింత చిగురు పప్పు వేసుకుని వేడి వేడి అన్నం తింటే...." అంటూ మధ్యలో ఆగిపోయి,అంతా నిశ్శబ్దం గా ఉండడం చూసి తెల్లబోయి , మళ్లీ తేరుకొని తక్కిన మాటలు తనలో తనే నమిలేశాడు. "ఆహా అని అన్నాడు కృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యద లో."
    ఆనందం ముకుందం కేసి తీక్షణం గా చూశాడు. ముకుందం ఆ చూపులను నిర్లక్ష్యం చేసి విశాలాక్షి కేసి తిరిగి "ఏమిటి?" అన్నట్లు బుర్ర ఊపాడు.
    "ఈ వాన వల్ల మన ధాన్యం అంతా నష్టం " అంది ఆమె.
    "అవదు మరీ. బుధవారమే మాసూలు చేస్తే, వదిలిపోనా? పైగా ఇది ఖర్చు సమయం. నాకే ఐదు వందలు కావాలి" ముకుందం కేసి ప్రశ్నార్ధకంగా చూశాడు వెంకట్రామయ్య.
    "నీకిప్పుడు ఐదు వందలేందుకురా?" అన్నాడు ఆనందం.
    "రేపు సంక్రాంతి కి పూరీ లో అఖిల భారత కవి సమ్మేళనం జరుగుతోంది."
    "అయితే నువ్వెందుకు? నువ్వేం కావ్యాలు వ్రాశావా, గ్రంధాలు రచించావా?"
    "అదంతా నీ కనవసరం-- నే వెళ్ళాలి. అంతే. అందుకు నాకు అయిదు వందలు కావాలి. ఆ సంగతి నేను బాబయ్య కు చెబుతున్నాను . నీకు కాదు" అని విసురుగా వెళ్ళిపోయాడు ముకుందం. ఆనందం  ఏమీ జవాబు చెప్పలేదు. విశాలాక్షి తెల్లబోయి  , ముకుందం వెళ్లిన వేపే చూస్తూ ఉండిపోయింది. వెంకట్రామయ్య నేలకేసి చూస్తూ గట్టిగా నిట్టూర్చాడు.
    ఇవేవీ తనకు పట్టనట్లు జానకీ పరికిణీ కుచ్చిళ్ళు పైకి తీసుకుని అరుగు మీద నించుని రోడ్డు మీదనుంచి పొర్లి ప్రవహిస్తున్న వాన నీటిలో కాగితపు పడవలు వదులుతుంది. పడవ ఏ విఘాతం లేకుండా చాలా దూరం కనక ప్రయాణం చేస్తే, సంతోషంతో కేరింతాలు కొట్టి చప్పట్లు చరుస్తుంది.
    "ఏమిటే ఆ పని? నువ్వేం చంటి పిల్లవా? స్కూలు ఫైనలు చదువుతున్నావు. నీళ్లలో నానుతూ ఏమిటా ఆటలు?" అని విశాలాక్షి కసురుకోంది. జానకీ ఆ మాటలెం పట్టించుకోకుండా, చూరు నీళ్ల వల్ల ములిగి పోబోతున్న పడవలను ఒక పుల్లతో పక్కకు నెట్టి, రక్షిస్తుంది.
    "అయితే మనకీ ఏడు చాలా గడ్డు సంవత్సరం అన్నమాట!" అంది విశాలాక్షి.
    "ఈ ఏడే కాదు, వచ్చే ఒకటి రెండేళ్ళు కూడా అంతే ఇంత వాన కురిశాక ఇంక ధాన్యం ఆశలేదు. గింజ అంతా చేలో రాలిపోతుంది. మిగిలిన ధాన్యం అయినా, మట్టి గోట్టుకు పోయి నల్లగా ఉంటుంది. అందులో వీరి గాడికి సత్తెయ్య కూ జీతాలు కొలవాలి. ఇంకా మిగిలితే అమ్మి, కూలి వాళ్లకు ఇవ్వాలి. పెట్టుబడి కూడా రాదు." వెంకట్రామయ్య విచారంగా చెప్పాడు.
    "మరి ఈ ఏడాదంతా సంసారపు ఖర్చు?"
    "కొబ్బరి కాయ ఉందిగా? అది అమ్మితే కొంత ఎత్తుకు పోతుంది. పొతే , ఓ వెయ్యి రూపాయలులోపు అప్పు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ముకుందానికి ఐదు వందలివ్వడం ఎలాగ?"
    "వాడి గొడవ పడలెం, బాబయ్యా. ఎల్లాగో అల్లాగ వాడికా అయిదు వందలూ ఇచ్చెయ్యి. తక్కిన దాన్లో నే సద్దుకుందాం." అంది విశాలాక్షి.
    "కుర్ర మొహం. వాడిని ఆనర్సు లో చేరుస్తానని ఆశ పెట్టాను. తన తప్పు లేకుండా ఫస్టు క్లాసు  తెచ్చుకున్నాడు." వెంకట్రామయ్య అన్న ఈ మాటతో ఆనందానికి కళ్ళ నీళ్లు తిరిగాయి.
    "మరేం చేస్తాం" విశాలాక్షి ఆనందం కేసి జాలిగా చూస్తూ అంది.
    "మరీ అంత లేనివాళ్ళం కాదు కదా? ఆ చేసే అప్పు మరికొంచెం చేస్తే, వాడి చదువూ ఎత్తుకు పోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా తీర్చుకోవచ్చు అప్పు."
    "వద్దు. బాబయ్యా. అప్పు చేసి నేను చదువుకోను. అప్పు చేసి జానకి కి కూడా ఈ ఏడు పెళ్లి చెయ్యద్దు."
    "మరి ఏం చేద్దాం?' అన్నాడు వెంకట్రామయ్య.
    "నేను ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తా."
    ఆ మాటలు వెంకట్రామయ్య కు చాలా బాధ కలిగించాయి. "అత్తెసరు మార్కులతో పాస్ అయినవాడు కూడా ఎలాగో అలాగ తంటాలు పడి అనర్సూ , ఇంజనీరింగూ , మెడిసినూ చదువు తుంటే, ఫస్టు క్లాసు లో పాస్ అయినవాడివి నువ్వు, చదువు మానేసి ఉద్యోగం చేస్తావా?"
    "అలా బాధపడకు, బాబయ్యా, నాకు మాత్రం నువ్వేం చదువు చెప్పించనన్నావు కనకనా? కాలం కలిసి రాలేదు. ఏం చేస్తాం?" ఈ మాట అంటుంటే ఆనందరావు గొంతు బొంగురు పోయింది.
    "దీని కంతకీ తప్పు నాది. ఆ కట్టేతా , అదీ బుధవారమే చేయిస్తే వదిలిపోనా? శుక్రవారానికి మార్చా."
    "నువ్వు మాత్రం కలగన్నా వేమిటి? అంది విశాలాక్షి.
    కొంతసేపు నిశ్శబ్దం .
    "అయితే జానకి సంగతేమిటి చేద్దాం? చదువూ లేకుండా పెళ్ళీ లేకుండా ఈడేరిన పిల్లని ఇంట్లో ఉంచడం మంచిది కాదు" అన్నాడు వెంకట్రామయ్య.
    "పి.ఆర్ కాలేజీ లో పి.యు.సి లో చేర్పిద్దాం. మన అమలాపురం లోనే చేర్పించవచ్చు కాని, ఇక్కడ ఆడపిల్లలకు హాస్టల్ సౌకర్యాలు లేవు. పైగా సి.ఆర్. కాలేజీ మనం అంతా చదువుకున్న కాలేజీ . చాలా ఏళ్ళ నుంచి ఉందేమో , మంచి సంప్రదాయాలు....." అంటున్న ఆనందంతో "దానికేం లే. కాలేజీ ల వయస్సు కూ, సంప్రదాయాలకూ ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు మొత్తం భారతదేశం లోనే, కాలేజీ చదువుల పద్ధతంతా మారిపోయింది" అన్నాడు వెంకట్రామయ్య.
    "అవుననుకో."
    "అసలింతకూ దాన్ని కాలేజీ లో చేర్పించడానికి మాత్రం డబ్బు కావద్దూ? అదే ఉంటె నిన్నే ఆనర్సు లో చేర్పించవచ్చుగా?"
    "నా చదువు కీ, దాని చదువుకీ తేడా లేదూ? అయిదారువందల తో దాని చదువెత్తుకు పోతుంది. పైగా అక్కడ స్థానికంగా స్కాలర్ షిప్పు లిచ్చే సంస్థ ఒకటి ఉంది. నా స్నేహితుడి తండ్రి దానికో ట్రస్టీ. నెమ్మదిగా దానికి ప్రయత్నం చెయ్యచ్చు" అన్నాడు ఆనందం.
    'సరే కానియ్యి. ఏం, విశాలాక్షి అలా చేద్దామా?"
    "నాకేం తెలుసు , బాబయ్యా . మీకెలా మంచిదని తోస్తే అలా చెయ్యండి. కాని, మళ్లీ ఈ ఏడు కూడా ఆభూమి బాగు చేయించడం వెనక బడింది."
    "దేని మాట?"
    "అదే -- ప్రభుత్వం నీకు సర్పవరం లో ఇచ్చిన అయిదెకరాల బంజరు."
    వెంకట్రామయ్య నీరసంగా ఓ నవ్వు నవ్వి "ఓ! అదా? దానికేం తొందరోచ్చింది? అయినా ఈ భూమి కోసం నేను జైలు కెళ్ళానా?" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS