Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 7

 

    "ఏమిట్రా వెధవా--"
    "ఆహా. ఏమీ లేదు. ఇవ్వాళ బంగారం లాంటి బ్యాటు విరిగిపోయింది. ఎవరి ముఖం చూశానో అని"
    "నీ ముఖమే చూసుకొని వుంటావు అద్దంలో నిద్రలేచి నున్నగా తల దువ్వుకొందే గదిలోంచి ఊడి పడవుగా" అన్నది పంతులమ్మ.
    "డామిట్ , కధ అడ్డం తిరిగింది" గిరీశం ఫక్కీలో వాపోయాడు ప్రకాశం.
    వనజ పైకి ఎంత భోళగా నిర్విచారంగా కనిపిస్తుందో మనసులో అంత లోతుగా ఆలోచిస్తూ ఉంటుంది. వంట గదిలో కాఫీ కలుపుతున్న లోలోపల ఆలోచనలు సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. "అక్కయ్య ఒట్టి అమాయకురాలు. అల్ప సంతోషి. జీవితంలో ఉన్నతమైన ఆశలూ లక్ష్యాలూ లేవు. ఈ ఆనందరావు ను చేసుకొని నేనేం సుఖపడాలి. ధనవంతుడు కాదు. పెద్ద ఉద్యోగమూ లేదు. అతణ్ణి చేసుకొంటే తమ కుటుంబం లో తరతరాలుగా వస్తున్న పేదరికాన్ని పునరావృత్తం చేసుకోవటం తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు."
    ఆమె కాఫీ కప్పుల్తో తిరిగి వచ్చేసరికి ఆనంద రావూ, రాజూ చిరకాల పరిచయస్తుల్లా కులాసాగా కబుర్లు చెప్పు కొంటున్నారు. ప్రకాశం గడప మీద కూర్చుని విరిగిపోయిన బ్యాటు కి కట్లు కట్టి రిపేరు చేసుకొంటున్నాడు. వనజ కాఫీ కప్పులు బల్ల మీద పెడుతూ "ఇవ్వాళ కాఫీతో చిన్న ఎక్స్ పెరిమెంటు చేశాను. రిజల్టు ఇంకా తెలియదు. కాబట్టి మీ అందరికీ ముందుగానే చెప్తున్నాను. ఇది కాఫీ, అలా అనుకునే మీరంతా దీన్ని తాగాలి" అన్నది నవ్వుతూ.
    రాజు ఆమె సరస వచనాలకు ముగ్ధుడై పోయాడు. కాని పైకి కనిపించే ఆ సరళ ప్రవవర్తనకీ, ముగ్ధ రూపానికి వెనుక ఎంతటి సునిశితమైన మేధ ఉన్నదో. మాట్లాడే ప్రతిమాటా చేసే ప్రతి చేతా  లాభనష్టాలను ఎప్పటి కప్పుడు లెక్క వేస్తూ బాలన్సు చేస్తూ ఉంటుందో. రాజు ఇప్పుడే కాదు, ఎప్పటికీ తెలుసుకోలేక పోయాడు.
    అందరూ కాఫీలు తీసుకున్నారు.
    ప్రకాశం కాఫీ కప్పు అందుకొని "ఓ దేవా మానవుల్లో ఉన్న మంచితనం మీద పెద్దక్క కు వున్నట్లే నాకూ నమ్మకముంది. ఆ నమ్మకం తోనే దీన్ని తాగుతున్నాను. నా ప్రాణాలకేమీ ముప్పు రాకుండా కాపాడు తండ్రీ." అంటూ కాఫీ నోట్లో పోసుకున్నాడు.
    ప్రకాశం అనాలోచితంగా పంతులమ్మ ను అనుకరిస్తూ అన్న ఆ మాటలకూ పంతులమ్మ తో సహా అందరూ నవ్వేశాడు.
    "వెధవ, ఇప్పుడైతే కవిత్వం మాట్లాడుతాడు  గాని మెట్రిక్ రెండు సార్లు ఎందుకు తప్పాడో అడగండి." అన్నది వనజ.
    "దానికేముంది సిస్టర్. నువ్వు పి.యు.సి తప్పావ్. నేను మెట్రిక్ తప్పాను. బొత్ ఆర్ ఇన్ ది సేమ్ బొట్" అన్నాడు ప్రకాశం.
    "సంతోషించాం గాని ఇక అపు. ఆ నేవీ పిల్లలతో స్నేహం చేసి ఈ వెధవ ఇంగ్లీషోకటి నేర్చుకొని వచ్చాడు. బట్లర్ ఇంగ్లీషు! అన్నది వనజ.
    "వాణ్ణి అంటున్నావ్ గాని మరి నువ్వెందుకు తప్పావెం? ఆనందరావు ప్రశ్నించాడు నవ్వుతూనే.
    "వనజ కఠినంగా సమాధానం చెప్తూ "ఔను , తప్పాను. ఇప్పుడే చెప్తున్నాను. ఈ బి,యస్.సి కూడా పాసవుతానన్న నమ్మకం నాకు లేదు. చదువుకు , నాకూ చాలా దూరం " అన్నది.
    "సిగ్గులేకపోతే సరి' పంతులమ్మ అన్నది.
    "నా గురించి మీ కేందుకి కోల్డు వార్? నేను వెళ్ళి జింఖానా క్లబ్బులో పుట్ బాలన్నా అడుకొంటాను. గుడ్ బై డాక్టర్ సాబ్. అంటూ రివ్వున బయట కెళ్ళి పోయాడు. కాని అంతలోనే మళ్ళీ వచ్చి "కొపదీసి మీరంతా సినిమా కెళ్ళటం లేదు కదా?--ఇవ్వాళ ఆదివారం కదూ, అందుకని" అన్నాడు.
    వనజ ఉత్సాహంతో "ఔనండి. మంచి ఇంగ్లీషి పిక్చరోచ్చింది , వెళ్దామా?" అన్నది. పంతులమ్మ కూడా ఉత్సాహం చూపించింది. "దానికేం అలాగే వెళ్దాం. ఇవ్వాళ అందరికీ భోజనాలు కూడా ఇక్కడే. హాయిగా భోం చేసి మాట్నీకి వెళ్దాం" అన్నది.
    "డాక్టరు గారు మనబోటి వాళ్ళింట్లో భోజనం చేస్తారో లేదో?" వనజ సందేహాన్ని వెలి బుచ్చింది.
    "రాజు చాచా , నాకు అటువంటి అభ్యంతరాలే లేవు. కాని సినిమాకి రావటానికే వీలుండదేమో నని ఆలోచిస్తున్నాను. సాయంత్రం మెయిలు కి విజయనగరం వెళ్ళాలి. మా నాన్న గారెందుకో అర్జంటుగా విజయనగరం వచ్చి కలుసుకోమని టెలిగ్రాం ఇచ్చారు" అన్నాడు.
    "చెడ్డ చిక్కే వచ్చి పడింది.... పరీక్షలున్నాయి, రావటానికి వీలుకాదని మళ్ళీ టెలిగ్రాం ఇచ్చేస్తే పోలా?" ప్రకాశం సలహా ఇచ్చాడు.
    "పని మీద వెళ్ళే వాళ్ళను ఆపడమెందుకు? ఈసారికి మనమే వెళ్ళి వద్దాం" ఆనందరావు అన్నాడు.
    "ఐతే నేను రాను?' వనజ అన్నది.
    "ఇప్పుడేగా వెళ్దామని అన్నావ్? డాక్టరు గారు రాకపోతే నువ్వూ రాకూడదని ఎక్కడైనా ఉందా?" ఆనందరావు నిలదీశాడు.
    వనజ అనాలోచితంగా అన్న మాటకు పంతులమ్మకు కూడా కోపం రాకపోలేదు.... కాని ఆనందరావు పోట్లాట పెంచుకుంటాడెమో నన్న భయంతో "పోనీండి, ఈసారి మరెప్పుడైనా వెళ్దాం లే. నిజానికి నాకూ పేపర్లు కరెక్టు చేసుకోవాల్సిన పని బోలెడుంది." అని సర్ది చెప్పింది.
    ఆనందరావు ముఖం అదోలా పెట్టుకొని మౌనం వహించాడు. వనజ నిర్లక్ష్యంగా లోపలి కెళ్ళి పోయింది. ఆనందరావు చేసిన ప్రయత్నా మంతా వృధా ఐయిపోయింది. ఆరోజు ఎవరూ సినిమాకు వెళ్ళనే లేదు.

                                    5
    రాజు తీరా విజయనగరం వెళ్ళేసరికి నాన్నగారు హైద్రాబాదు వెళ్ళిపోయారని తెలిసింది. బంగళా వాచ్ మన్ ఒక ఉత్తరమూ, కారు తాళాలు రాజు చేతికి చ్చాడు.
    "........నీకోసం ఇప్పటి వరకూ ఎదురు చూశాను. హైదరాబాద్ నుంచి అర్జెంటు కాల్ రావటం వల్ల ఆలస్యం చెయ్యటానికి వీల్లేక వెళ్ళి పోతున్నాను. నాకు కొత్త అంబాసిడర్ కారు అలాట్ మెంటు వచ్చింది. ఇప్పుడున్న మన కారు నువ్వు వాడుకో- అవసరం లేదనుకొంటే అక్కడేఅమ్మి వేయి. నీతో మాట్లాడదలుచుకొన్న విషయం -- నీ పెళ్ళి గురించి. అక్కయ్య తొందర పడుతుంది. ఆడపిల్లను కన్నవాళ్ళు కనుక తొందర పడటం లో ఆశ్చర్యమేమీ లేదు. నీ అభిప్రాయం ఏమిటో అక్కయ్యకే తెలియపర్చు....."
    రాజు ఉత్తరం చదివి నవ్వుకొన్నారు. పిచ్చి అక్కయ్య! ఉన్నది ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటి నుంచీ పద్మను తనకిచ్చి చెయ్యాలని అందరూ అనుకొంటున్నదే. పద్మంటే తనకూ ఇష్టమే. ఆ సంగతి అక్కయ్య కూ తెలుసు. మరి ఎందుకంత తొందర పడుతోంది? ఆలస్యం చేస్తే తన మనసేమన్నా మారిపోతుందని అక్కయ్య భయమేమో? తానంత చపల చిత్తుడు కాడని అక్కయ్య కు ఉత్తరం రాయాలి. పద్మ ఇప్పుడెలా ఉందో? తాను చూసి చాలా రోజులైంది.
    రాజు తిరిగి విశాఖపట్నం చేరుకొనే సరికి ఐదు గంటలు కావొస్తోంది. కాలేజీ అమ్మాయిలూ, సినిమాలకూ , షాపింగు కూ బయలుదేరిన కొత్త జంటలూ, టీ షర్టులు -- గొట్టం పాంటు రోమియో లు వీరందరితో జర్నర్ సత్రం సెంటరు టెక్నికలర్ సీనులా అందంగా ఉంది. హటాత్తుగా రాజు దృష్టి వనజ మీద పడింది. చేతిలో పుస్తకాలతో, నలుగురైదుగురు అమ్మాయిలతో క్యూ లో నిలబడి ఉంది. బస్సు కోసం కాబోలు. రాజు కారు పక్కకు తీసి ఆపుతూ, చేయ్యిపాడు. వనజ రాజును గుర్తించి తొందర తొందరగా కారు దగ్గరకు వచ్చింది. రాజు ముందు డోర్ తెరిచాడు.
    "ఏం , వనజా ఇవ్వాళ బస్ స్టాండు లో నిలబడ్డావెం?"
    "యూనివర్శీటికెళ్ళి మా ఫ్రెండ్స్ ని చూద్దామని బయలుదేరాను. మీరు విజయనగరం వెళ్ళలేదా ఏం?"
    "యెందుకు వెళ్ళలేదూ? నా అవతారం చూస్తె తెలియటంలా? ఇప్పుడు అక్కడ్నించే వస్తున్నాను."
    రాజు గేరు మార్చి క్లచ్చినడిపాడు. కారు మెల్లగా స్పీడందుకొంటుంది.
    "మీ నాన్నగారు టెలిగ్రాం ఇచ్చారన్నారు. చెడు వార్తేమీ కాదు గదా?' వనజ ప్రశ్నించింది.
    "అబ్బే అదేమీ లేదు. నాన్నగారు కొత్త కారు కొనుక్కున్నారు. ఈ కారు నాకివ్వటం కోసమే పిలిపించారు." అబద్దం! తన పెళ్ళి విషయం మాట్లాడటాని కని చెప్పలేక పోయాను. ఎందుకో రాజుకే అర్ధం కాలేదు.
    "మీరు చాలా భాగ్యవంతులా?' వనజ అమాయకంగా ప్రశ్నించింది.
    "చాలా అంటే"? -- ఆకాశమంత ఎత్తూ, భూమంత విశాలమూ అనా నీ అర్ధం?" రాజు నవ్వుతూ అన్నాడు.
    "పొండి మీరు మరీను!" వనజ కృత్రిమ కోపాన్ని ప్రకటిస్తూ అన్నది "ఐనా మీరి మధ్య మాటలు బాగా నేర్చుకున్నారు."
    "ఔను నిజమే. నాకీ మధ్య మాటలు నేర్పే గురువుగారొకరు దొరికారు.
    రాజు ఎవర్ని గురించి ఆ మాట అన్నదీ వనజ గ్రహించింది. ఏదో మధురానుభూతితో ఆమె వళ్ళు పులకరించింది. "పాపం ఇదివరకు అసలు మాటలే రానట్టు ! మీరు ఆ గురువు గారికే నేర్పక పొతే చాలు. ఇంతకూ వారెవరో?"
    "ఉహూ. ఇప్పుడే చెప్పను. నాది ఏక లవ్యుని విద్య. గురువుగారి రూపాన్ని హృదయ పీఠం లో ప్రతిష్టించుకొని, వారి అనుమతి లేకుండానే విద్యలన్నీ నేర్చుకొంటున్నాను." అన్నాడు.
    వనజ ముఖం చాటు చేసుకొని నవ్వింది. "చెప్పకపోతే పోనీండి. కాని గురుదక్షిణ మాత్రం మర్చిపోవద్దు."
    హాస్టలు దగ్గర కొచ్చేసింది. "మీ స్నేహితురాళ్ళ తో మాట్లాడుతూ ఉండు. నేను కాస్త స్నానం చేసి , ఓ గంటలో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను."
    "యస్ డాక్టర్" అన్నది వనజ చిలిపిగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS