అతను రాగానే విశ్వనాధం మొహం విప్పారడం , మీనాక్షి చేస్తున్న పని సైతం మధ్యలో ఆపేసి గంటల తరబడి అతనితో కబుర్లు చెప్పడం గోవింద కి చిత్రంగా తోచేది. అతని అడుగుల చప్పుడు వినబడగానే పాలు తాగడం ఆపేసి పసివాడు దిక్కులు చూస్తుంటే గోవింద గుండెలు గతుక్కు మనేవి. చటర్జీ ఒకరోజు రాకపోతే ఆరోజు పాలు మానేసి మారాం చేసే కొడుకు కోసం అన్నగారు ఫోను చేసి ఆగమేఘాల మీద చటర్జీ ని రప్పించడం ఏదో చేయరాని నేరం చేస్తున్నట్లూ, చచ్చిపోయిన విష్ణుమూర్తి కి ద్రోహం చేస్తున్నట్టూ బాధపడేది. కనుకోలుకుల్లో నీరు నిండు తుంటే కనిపించని అతనికి మనుసులోనే క్షమార్పణ లు కోరుకునేది.
పసివాడికి చతర్జీయే పేరు పెట్టాడు. విశ్వనాధం, మీనాక్షి అనందంతో అమోదించారు. తన బిడ్డ మీద ఆ ముగ్గురికీ వున్న హక్కుల్లో నూరో వంతైనా తనకు లేవేమో అని ఆలోచిస్తూ విలవిల్లాడిపోయేది గోవింద. శ్రీకాంత్ పేరు అతను స్థిరం చేయగానే 'కాదు ఆ పేరు బాగులేదు. నా బిడ్డడి పేరు నా యిష్టం' అని ఎదిరించాలని నోటి చివరి దాకా వచ్చిన మాటల్ని గొంతులో వెలక్కాయ చిక్కుకున్నట్లు కాగా గోవింద బదులు చెప్పలేక పోయేది.
చిన్నారి శ్రీకాంత్ కి యిప్పుడు అత్త , తాత, మామ అనడం వచ్చింది. పసివాళ్ల నోటికి భగవంతుడే పదాల్ని కలిపి పంపుతాడేమో. నాన్న....నాన్న అంటూ వాడు దిక్కులు చూస్తుంటే తన గుండెల్ని యినప చేతుల్తో యెవరో కసితీరా నలిపెస్తున్నట్లు తన్నుకు లాడేది గోవింద.
4
విశ్వనాధం పసివాడికి యేడాది నిండక మునుపే ఒక మంచి రోజు చూసుకుని గోవింద భోజనం చేస్తున్న సమయంలో నెమ్మదిగా ప్రసంగాన్ని ప్రారంభించాడు. అతను గొంతు సవరించుకుని యెడమ తోడ మీద కూర్చున్న బాబుని చిన్నగా ముద్దు పెట్టుకొని సౌమ్యంగా అన్నాడు. 'నువ్వు ఒంటరిగా యీ బట్టలతో వుండడం, నుదుట కుంకుమ లేకుండా తిరగడం మాకు బాధగా వుంది. అన్నగా నిన్ను నేనెప్పుడూ చూడలేదు. 'నీకు పిల్ల లెంతమందోయ్' అని యెవరైనా అడిగినప్పుడు చటుక్కున నువ్వే గుర్తుకు వచ్చేదానివి. తెలియని వాళ్ళందరికీ ఒక ఆడపిల్లని చెప్పడం కూడా నాకు అలవాటే!'
గోవింద కనుబొమ్మలు చిట్లించి అన్న వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.
'నేను బరువు బాధ్యతలకి లొంగి పోలేక పిరికిగా పారిపోయే రకాన్ని కాను. దేవుడు మేలుచేసి పాతికేళ్ళ బాంక్ జీవితంలో యిప్పుడు వెయ్యి రూపాయలు తెచ్చు కుంటున్నాను. ఈ డబ్బంతా కూడ బెట్టి నా అనబడేవాళ్ళకి యిచ్చేందుకు నిన్ను మించినవాళ్ళు నా కెవరూ లేరు.'
'పూర్వకాలానికీ, ప్రస్తుత కాలానికీ మధ్య అనేక మార్పులు వచ్చాయి. ఆ కాలంలో ఆడపిల్లకి ఐదోఏటే పెళ్లి చేసి గుండెల మీది బరువు దింపుకునేవారు. యిప్పుడు కోటీ రోడ్డు మీద నిలబడి చూడు. మీ వదిన యీడు వాళ్ళు సైతం పెళ్ళిళ్ళు కాకుండా కాలేజీ లకో వుద్యోగాలకో వెడుతున్నారు.'
'ఆనాటి సాంఘిక వ్యవస్థ వేరు. ఆ పరిస్థితులు వేరు. యిప్పుడు యీ మారుతున్న కాలంలో మనిషి యంత్రం అయిపోయాడు. సాధ్యం అయినంత వరకూ నూటికి ఒకళ్లిద్దరైనా పరోపకారం చేసేందుకు సిద్దంగా వున్నారు.'
గోవింద కి అవగాహన కాలేదు అతని ధోరణి.
'నువ్వనేదేవిటో నాకు బోధపడడం లేదన్నయ్యా.' అంది భోజనం ముగించి లేస్తూ.
'విష్ణుమూర్తి పోయాక నువ్వు రాత్రి భోజనం మానుకున్నావు. నిన్ను బలవంతం చేయడం వల్ల నువ్వు అతన్ని తలుచుకుని మరింత బాధపదతావని నేను గ్రహించి ఆ విషయాన్ని చూసీ చూడనట్లు వదిలేశాను.'
'నిన్నో మాట అడుగుతాను గోవిందా. నిష్కల్మషంగా చెబుతావా.'
'అదేవిటన్నయ్యా . నేను యెప్పుడైనా మనసులో మాటలు దాచుకుని యేరుగుదునా.'
విశ్వనాధం , మీనాక్షి , గొవిందల మనసులో క్షణం చిన్నతనం లో గోవింద కాలేజీలో చేరినప్పటి సంగతి మెదిలింది..... కాలేజీ నుంచి రాగానే పుస్తకాలు బల్ల మీదికి గిరవాటు వేసింది గోవింద. వస్తూనే అన్నయ్యా అంటూ వీధి లోంచే పొలికేక పెట్టింది. అతను పెరట్లో నూతి పళ్ళెం దగ్గర స్నానం చేస్తున్నాడు. వేసవికాలం కాకపోయినా వర్షాలు పడకపోవడం వల్ల ఉడక వేస్తోంది. ఆఫీసులో చాలాసేపు పని చేసి వచ్చిన అతను యేకా యేకీ బావి దగ్గరకే వెళ్ళాడు. చెల్లెలి కేక విని 'యిక్కడమ్మా నూతి దగ్గరున్నాను.' అని జవాబు యిచ్చాడు.
మీనాక్షి హడావుడి విని ఖంగారుగా బయటికి వచ్చేసింది. వంటింట్లోంచి. మసి చేతులైనా తుడుచుకోకుండా మరదలి వైపు చూస్తుంటే గోవింద వదిన గారిని కూడా చేయి పుచ్చుకుని లాక్కు వెళ్ళి నూతి దగ్గరే చెప్పడం ప్రారంభించింది.

'యివాళ నాకో వుత్తరం వచ్చిందన్నయ్యా.'
'యెవరు రాశారమ్మా?' అతను నెత్తి మీద బాల్చీ తో నీళ్ళు కుమ్మరించుకోవడం మరిచి పోయాడు.
'సస్పెన్స్ . నేను చదివి వినిపిస్తానన్నయ్యా గోవింద వుత్తరం చదవడం ప్రారంభించింది.
డియర్ గోవిందా!
నీ మీద నా ప్రేమని యీ చిన్న వుత్తరం లో యెలా విడమరిచి చెప్పగలను? నువ్వంటే నాకున్న అనురాగాన్ని వినదలుచుకుంటే గోదావరి వొడ్డుకి యీ శనివారం సాయంత్రం తప్పకుండా రా. నిన్ను గోదావరి సమక్షంలో చూడాలని వువ్విళ్ళూరుతూ-- నీ జవాబుకు యెదురు చూసే--
నీ వాడు రవీంద్ర.
విశ్వనాధం మొహం యెరుపు రంగు పులుముకుంది. అతను తువ్వాలు అందుకుని 'యేవడమ్మా ఆ స్కౌండ్రల్ . వాడిని పట్టుకుని ప్రిన్సిపాల్ దగ్గరికి లాక్కు వెడతాను .' అన్నాడు.
గోవింద పకపకా నవ్వింది. 'వొద్దులే అన్నయ్యా. సన్మానం చేయించే వచ్చాను. ప్రిన్సిపాల్ వరకూ దేనికి? కాళ్ళు పట్టుకునే వరకూ తన్ని తన్ని వదిలి పెట్టాడు అప్పారావు. అప్పారావంటే కాలేజీ కే హడల్.'
మీనాక్షి భయం భయంగా చూస్తూ అంది: 'చదువులూ వొద్దు పాడూ వొద్దు. మగవేధవలు రౌడీ కారు యేది చేసినా తరవాత అనుకుని ప్రయోజనం వుండదు. వాడు పగ బట్టాడంటే పిల్లనే మైనా చేస్తాడేమో.'
విశ్వనాధం నిశ్చలంగా అన్నాడు: 'అప్పారావు ఆడపిల్లల పాలిట దేవుడు మీనాక్షి. వాడు వున్నంత వరకూ యేమీ జరగదు.'
గోవింద కాలేజీ లోనే కాదు యెక్కడ యేది జరిగినా అన్నతోనూ, వదిన తోనూ చెప్పనిదే నిద్ర పోలేక పోయేది.
యిప్పుడు గోవింద 'నేనెప్పుడైనా మనసులో మాట దాచుకున్నానా అన్నయ్యా' అనగానే ఆనాటి సంఘటన మీదికి దృష్టి మళ్ళింది.
విశ్వనాధం అన్నాడు. 'నీకు మేము అన్నా వదినలం గానే కనిపిస్తున్నామా గోవిందా.'
గోవింద అర సెకండు కళ్ళు మూసుకుని తిరిగి అన్న వైపు చూసింది. 'అమ్మ మొహం ఎలా వుంటుందో నాకు తెలియ దన్నయ్యా. అమ్మ వున్నా వదిన అంత ప్రేమగా చూస్తుందని నేను అనుకోను. నాన్న నా చిన్నతనం లోనే పోయారు. అందరికీ అమ్మా నాన్నలు వున్నా నేను సుఖ పడినట్లుగా వాళ్ళు సుఖ పడలేదేమో అనిపిస్తుంటుంది.'
'మేము నీ శ్రేయోభిలాషులం కాదంటావా తల్లీ.'
'అలాగని నేనన్నానా అన్నయ్యా.'
'నా మాట వింటావా.'
'..................'
'మాట్లాడు గోవిందా . నేను చేసే పని పట్ల నాకే అవిశ్వాసవుంటే ఆ పని యెటువంటిదైనా నేనుచేయనని నీకు తెలుసు. ఒక మంచి పని చేస్తున్నాను అని తోచింది నాకు. నువ్వు యేమంటావో అని.......', అని కాస్సేపు ఆగాడు.
