Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 7


    "ఇంకా నయం- పెద్ద ఆఫీసరనుకున్నారు గాదు" అన్నాడు నవ్వి.
    ఎడ్లని ఉషారెక్కిస్తూ పరుగెత్తిస్తున్నాడు కిషోర్. బండినున్న దీపం వెలుగుతప్ప చుట్టూ గాడాంధకారం అలుముకుంది.
    "మీరో మంచి పాట పాడండమ్మాయిగారూ బాగా పాడతారంట గదా" ఉన్నట్టుండి అడిగాడు కిషోర్.
    "నీ కెవరు చెప్పారు?" ఆశ్చర్యంగా అడిగింది వాణి.
    "బాబుగారింటికాడ చెప్పుకుంటే విన్నాను- మీరు సంగీత పాఠాలు చెప్తారంటగాదూ- మంచి పాట పాడండి అమ్మాయిగోరూ- పాటంటే నాకెంత యిష్టమో."
    "యిప్పుడా...యిలా, యీ బండి కుదుపులో ఏం పాడతాను- మరోసారి ఎప్పుడన్నా పాడుతాలే" అంది వాణి.
    "పాడండి...ప్లీజ్....ఇల్లు చేరేలోపల రెండు పాటలన్నా పాడాలి."
    వాణి ఒక్కక్షణం ఆలోచించి 'ఆలయమున వినపడునదిగో- దేవాలయమున వినపడు నదిగో' తనకెంతో యిష్ట మైన పాట అందుకుంది- వాణి పాట అందుకోగానే కిషోర్ బండి జోరు తగ్గించి నెమ్మదిగా నడపసాగాడు. చాలా రోజుల తర్వాత- ప్రశాంతంగా, ఆహ్లాద కరంగా వున్న వాతావరణం మధ్య వాణి స్వేచ్చగా గొంతెత్తి పాడసాగింది. ఎద్దుల మెడలో గంటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగ వినిపిస్తుంటే పాటవింటున్న కిషోర్ దేవాలయంలో గంటలు మోగుతున్న అనుభూతిని చవి చూస్తున్నట్టు తననితను మరిచి తనకు తెలియకుండానే బండి ఆపేశాడు. పాట పూర్తి అయ్యేవరకు వాణి బండి ఆగినట్టే గమనించలేదు- "అదేమిటి బండి ఆపారు" పాట పూర్తిచేస్తూ అడిగింది. కిషోర్ యింకా తన్మయత్వం నించి తేరుకోలేదు "అదేమిటి అలా చూస్తున్నారు- బండి పోనీండి" అంది వాణి నవ్వుతూ.
    "అబ్బ- ఏం గొంతుమీది-యిలాంటి పాట నేనెక్కడా వినలేదు మీ గొంతులో దివ్యనాదం వుందండీ-ఎంత భాగ్యం చేసుకున్నాను ఈ రోజు మీ పాట వినడానికి-జన్మ తరించినట్లుందండీ-" సంతోష పారవశ్యంతో అలా చెప్పుకుపోతున్న కిషోర్ ఉద్రేకాన్ని ఆపుతూ వాణి గలగల నవ్వింది.
    "పొగడ్త ఆపి-బండి బయలుదేరించండి మహాశయా-యిలా అయితే యిల్లు చేరినట్లే" అంది.
    కిషోర్ తేరుకుని వాణిని ఆరాధనాపూర్వకంగా చూస్తూ- "మీ పాట మరోసారి వినే భాగ్యం నాకు కల్గిస్తానని మాటిస్తే బండి కదుపుతాను. మరోసారి ఎప్పుడన్నా ఓ రెండుగంటలు నాకు కావల్సిన పాటలన్నీ పాడించుకుంటాను."
    "ఓ దానికేం-రాజారావుగారిల్లు మీకు తెల్సిందే గదా- ఎప్పుడన్నా రండి" అంది వాణి.
    కిషోర్ బండి బయలుదేరదీసి జోరుగా నడపసాగాడు. మరొక్క పావుగంటలో ఊర్లోకి ప్రవేశించింది బండి.
    
                                   *    *    *    *

    రాజారావు యిల్లుని యిల్లు అనడంకంటే భవంతి అంటే సరిపోతుంది. రాజారావు తాతగారు పిల్లజమీందారు. ఆ గ్రామాల చుట్టుపక్కల భూములన్నీ వారివే- వారి హయాములో ఆ భవంతి కట్టించి మకుటంలేని మహారాజులా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటి జమీందారులా వుండే వారు- ఆ భవంతిలో రెండు- అంతస్థులలో మొత్తం ముఫ్ఫై గదులున్నాయి. పెద్ద పెద్ద హాళ్ళు, భోజనసావడులు, వంటసాలలు, సామానుగదులు. ధాన్యాగారం, గొడ్ల చావిడులు, చుట్టూ రెండెకరాల స్థలంలో ప్రహరీగోడ వుంది. పై అంతస్థులో కుటుంబసభ్యులకి ప్రత్యేకం ఒక్కోగది- మరో పెద్ద హాలు, కింద అంతస్థుతో సంబంధం లేకుండా జమీందారి ఫాయిలో వుంటుంది.
    ఇంటిముందు బండి ఆగేసరికి తొమ్మిదిన్నర అయింది. "దిగండమ్మాయిగారూ- వచ్చేశాం. యిదే రాజారావు గారిల్లు" అన్నాడు. ఎలక్ ట్రిక్ లైట్ల కాంతిలో వెలుగుతున్న ఆ భవంతిని బెరుకుగా చూసింది వాణి బండి దిగి.
    "ఏమిటలా నిలబడిపోయారు లోపలికి వెళ్ళండి" కిషోర్ అన్నాడు.
    "మీకు చాలా థేంక్స్- రాత్రి అనవసరంగా శ్రమ యిచ్చాను- మీ ధర్మమా అని యిల్లుచేరాను- నే వెళ్ళేలోగా కనిపిస్తారా" అంది వాణి కిషోర్ తో కృతజ్ఞతా పూర్వకంగా.
    "ఓ యస్- మీ రెళ్ళేలోగా మీ పాట వినకుండా వదులుతానా ఏమిటి" కిషోర్ చనువుగా అన్నాడు బండి వెనక్కి తిప్పుతూ.
    వాణి బ్యాగుపట్టుకుని గేటుతీసి లోపలికి అడుగుపెట్టింది- ముందు పొడుగాటి విశాలమైన వరండా- అంతా లోపల వున్నట్లున్నారు ఎవరూ కనపడలేదు. ఎదురుగావున్నా నగిషీలు లతలు చెక్కిన పెద్ద తలుపున్న ద్వారబంధం దగ్గిర నిలబడి తలుపుతట్టింది వాణి. కాసేపటికి ఎవరోవచ్చి తలుపు తెరిచి వాణిని ఆశ్చర్యంగా చూశారు.
    "పెద్దమ్మగారున్నారా?" వాణి తడబడ్తూ అడిగింది.
    "వున్నారు మీరెవరు?"
    వాణి తన పరిచయం చెప్పుకుంది.
    "మీరా....మీ కోసం బస్సు స్టాండ్ కి వెళ్ళాను బస్సు రాలేదన్నారు- పెద్దమ్మగారు మీరేమయ్యారోనని గాభరా పడ్తున్నారు- రండి- రండి" సంభ్రమాశ్చర్యాలతోపాటు మర్యాదకనపరిచి లోపలికి ఆహ్వానించాడు బంట్రోతు.
    వాణి ఎవరో తెలియగానే ఎక్కడలేని భక్తి, గౌరవం కనపరిచి వెంటబెట్టుకుని మేడమీదికి తీసికెళ్ళాడు.
    మేడమీద మరో పెద్దహాలు దాటినా తరువాత విశాలమైన వరండామీద వున్న ఒక గదిలోకి తీసుకెళ్ళాడు.
    "అమ్మగారూ-అమ్మాయిగారొచ్చేశారు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS