జోహార్లందుకో శ్రీశ్రీ
కె.సి
చుక్కల్లో కలిశాడు శ్రీశ్రీ!
సూర్యునిలో వెలిశాడు శ్రీశ్రీ
అందుకో ! అందుకో !
అమరుడా జోహార్లు అందుకో
శ్రీశ్రీ జోహార్లు అందుకో !
సుత్తీ కొడవలి నీవు
శ్రామికశక్తివి నీవు
జనం గుండెమంటల్లో రగులుతున్న
నిప్పు నీవు || అందుకో ||
నీ రక్తాన్ని సిరాజేసి కార్మిక బ్రతుకులు రాసి
సమసమాజ స్థాపనకై శక్తినంతా ధారపోసి
వంటినెత్తురింకిపోయి వల్లకాడు చేరిన
శ్రీశ్రీవై మాచెంతనే చిరంజీవిగున్నావు || అందుకో ||
కార్మికులకు కర్షకులను విద్యార్థి మేధావికి
చారిత్రక స్థితిగతులను వెన్నుతట్టి తెలిపావు
ఈ వ్యవస్థ మారాలని ఈ దోపిడి కూల్చాలని
కలం పట్టి కాలంపై క్రాంతి రేఖ విసిరావు || అందుకో ||
అనుక్షణం నిరంతరం యువతరాన్ని కదిలించి
మరో ప్రపంచానికి పోరు మార్గాన్నే చూపించి
ఎర్రజెండా ఎగరాలని ఎలుగెత్తి చాటావు
శాంతిలేని నీవు విశ్రాంతి కొరకు వెళ్లావా || అందుకో ||
ఈ శతాబ్ది కాలానికి తాళాన్నే వేశావు
యుగయుగాల గడచినా ఈ జగము విడువలేవు
విరసం స్థాపకుడా నక్సలైటు ప్రేమికుడా
ఎర్రజెండా వెలుగువై ఎల్లకాలం ఉంటావు || అందుకో ||
పతితులారా భ్రష్టులారా ! దగాపడిన తమ్ములారా!
ఏడ్వకండేడ్వకండి శ్రీశ్రీ మనకు లేడని.
వ్యక్తికాదు శ్రీశ్రీ మహాశక్తి అని తెలువదా
మరో ప్రపంచంలో మనల కలుసుకుంటాడు. || అందుకో ||
నీ రక్తం నీ త్యాగం వృథా మేం కానీయం
నీ కలమే మాచేతిలో కత్తి అయ్యి కదిలింది.
ప్రజాయుద్ధపంథాలో పోరాటం సాగిస్తాం
మరో ప్రపంచం కొరకు మరఫిరంగులవుతాము || అందుకో ||
('జనం పాటలు', జనసాహితీ ప్రచురణ ఏప్రిల్, 1997)
యిప్లవం యాడుందిరా
ఆడనే నీ కూడుందిరా - నీ గూడుందిరా
(మరోప్రస్తానం...'ఎరుపు' విరసం బులెటిన్, 1974)
