సాక్షాత్కారము
కనువిందు గావించు మునుముందు విజయ సం
ధాయకుం డగు "విఘ్ననాయకుండు"
ద్వారాని కెదురుగా దర్శనం బిచ్చు వి
శ్వ క్షేమదాయి "శ్రీ సత్యసాయి"
లోన కాలిడునంతలోన ప్రత్యక్షమౌ
ఏడుకొండల "వేంకటేశ్వరుండు"
పూజాగృహాన విరాజిల్లుదురు "షిర్డి
సాయి "దత్తాత్రేయ" "సాంబశివులు"
ఒక్కచోట చేరి ముక్కోటి వేల్పులు
సేవ లందుకొనెడి దేవళంబు
భారతీయ ధర్మ పరమార్థ సందేశ
సుందరమ్ము! విశ్వమందిరమ్ము!
వంద నందనములు కందళించిన యట్లు
చందమామ సుధలు చిందునట్లు
అందరకును శాంతిసందేశ మిడు "విశ్వ
సుందరు"నకు వేయి వందనములు!!
