ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త
అఖిల మంత్రములకు ఆదిమూలమ్మౌట
"ఓం"కార మిట సమలంకృతమ్ము
సకల శుభమ్ములు సంతరించు కతాన
"శ్రీ"కార మిట సఫలీకృతమ్ము
స్వామియై హృది యథేచ్చగ రమించుటవల్ల
"సాయిరాం" పద మిట సార్థకమ్ము
ఆచార్యులకు నెల్ల ఆచార్యు డగులచే
"గురుదేవ" పద మిట సురుచిరమ్ము
అందరకును తాన్ స్వయందత్తు డగుటచే
"దత్త" శబ్దమిట యథాతథమ్ము
ఇది పవిత్రమైన "ఏకాదశాక్షరి"
విశ్వయోగి మాట వెలుగుబాట.
పరమేశ్వరుడు జగత్పతి పెండ్లి కొమరుడై
శ్రీ గణేశుని పూజచేసినట్లు
శ్రీ వల్లభుడు వామనావతారమున "భి
క్షాం దేహి" యని చేయి చాచినట్లు
సాక్షాన్మహాలక్ష్మి జానకి, శ్రీగౌరి
ముందు సాగిలపడి మ్రొక్కినట్లు
బ్రహ్మణ్యమూర్తి సుబ్రహ్మణ్యు దేవేరి
పుట్టలోపల పాలు పోసినట్లు
ఈశ్వరాంశ సంభూతుడౌ విశ్వయోగి
శాస్త్రవేత్తలు మంత్రముల్ చదువుచుండ
కోరి మన మధ్యమున క్రింద కూరుచుండి
లీల పూజించె ముక్కోటి వేలుపులను.
