Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 9


                                   విశ్వమందిరము

    తెలుగు గగనాన విశ్వమందిరములోన
    ప్రభవ మందెను విశ్వ ప్రభాకరుండు;
    కటిక చీకటి దొంతరల్ కరగిపోయె
    మురిసినవి దీనజన మనస్సరసిజములు.
    
    తెలుగు నగరాన విశ్వమందిరములోన
    వినపడెను విశ్వమోహన వేణుగీతి;
    పొంగి పొరలెను యమునా తరంగ పంక్తి
    నవ్వి నటనం బొనర్చె బృందావనంబు.

    తెలుగు వనమందు విశ్వమందిరము నందు
    పల్లవించెను విశ్వకల్పద్రుమంబు;
    నీడ నిచ్చును భవతాప పీడితులకు
    ఫలము లొసగు భక్తులకు కావలసినన్ని.

    తెలుగు పథమందు విశ్వమందిరము ముందు
    వెడలినది విశ్వసంక్షేమ విజయరథము;
    కంచు జయభేరి "ధణధణ" మంచు మ్రోగె
    జనత జేజేలు పలికి ముందునకు సాగె.

    తెలుగు పొలమందు విశ్వమందిరము నందు
    దర్శనంబిచ్చె విశ్వ సుదర్శనంబు;
    సమసిపోవుత! ధూర్త దుర్జన భయంబు;
    సంగతం బౌత! సాధు సజ్జన జయంబు.

    విశ్వయోగి దారి వేదాంత జయభేరి
    విశ్వయోగి వాణి వేదవాణి
    విశ్వయోగి పల్కు వేదసుధల్ చిల్కు
    విశ్వయోగి వాక్కు వేదవాక్కు.

    అగాధ గాథం భగవత్ప్రబోధం
    పురాణనాథం భువనైకనాథం
    అనాథనాథం కరుణాసనాథం
    శ్రీ షిర్డినాథం శిరసా నమామి.

                                             *

                సౌందర్య సార సర్వస్వం
                మందస్మిత మనోహరం
                వందారు జన మందారం
                వందే సాయి మహేశ్వరమ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS