Previous Page Next Page 
నయనతార పేజి 7

 

    "అబ్బ , ఎంత బాగుంది మీ తోట. ఈ వెన్నెల, గాలి, ఈ పూలు ఎంత అదృష్టవంతురాలివి సుందరీ, రియల్లీ ఐ ఎన్వియూ."
    "వద్దు, వద్దు , అసూయ పడద్దు. తరువాత జాలి పాడ్తావు నా అదృష్టానికి." తార పచ్చిక మీద చేతులు వెనక్కి చాచి కాళ్ళు సాచుకు కూర్చుంటూ నవ్వుతూ అంది.
    "పోవోయ్ పోజులు మాను! లక్షలు, ఈ బంగాళా, ఈ తోట అన్నీ వుండి ఏదో అష్టకష్టాలు పడుతున్నట్టు పోజులు మాను."
    "సర్లే నే చెప్పినా నమ్మలేవు ఇప్పుడు. కొన్నాళ్ళు పొతే నీకే అర్ధం అవుతుంది.
    "అవును గాని సుందరీ. ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న?" నీవింటి లోంచి వెళ్ళిపోయాక ....."
    "కధ చెప్పమంటావు? ఎందుకు లెద్దూ , అవన్నీ చెప్పడం నాకూ , వినడం నీకూ ఇద్దరికీ బాగుండదు. ఏ ఏ కష్టాలు పడ్డానో, ఏమేం పోగొట్టుకుని ఏం సంపాదించానో ఈనాడు ఇలా కూర్చుని ఎలా చెప్పగలను?-"
    "పోనీ అన్ని వివరాలు వద్దు. కేవలం తారవి ఎలా అయ్యావో ఆ వివరం చెప్పు." కుతుహాలంగా అడిగాడు సారధి.
    తార లానులో చెంపకి చెయ్యి ఆన్చి ఓరగా పడుకుంది. సారధి కొద్ది దూరంలో కూర్చున్నాడు. "ఏం చెప్పమంటావు ఆ రోజు నీ దగ్గరికి రాత్రి వచ్చాను గదూ. నీవు నన్ను పెళ్ళి చేసుకుంటానంటావేమోననే మిగిలిన చిన్న ఆశ కూడా ఆరిపోయింది. ఇంకేం చేసి పెళ్ళి తప్పించుకోవాలో తెలియలేదు. ఇంటిలోంచి పారిపోవాలనుకున్నాను. అందరూ కాస్త నిద్రలో పడ్డాక పెళ్ళి కని వుంచిన డబ్బు లోంచి అయిదు వందలు తీసుకుని ఇంటిలోంచి బయటపడి, ఏ రైలు ముందు వస్తే దాన్లో ఎక్కేసాను. నాకో గమ్యం లేదు. భవిషత్తు లేదు. రైలేక్కాక గానీ నా ముందు గతిని గూర్చి ఆలోచన రాలేదు.
    "చదువు సంధ్య కూడా లేని నేను ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో తలుచుకుంటే ఏడుపు ముంచుకు వచ్చింది . నా ప్రక్కన కూర్చున్నావిడ చాలాసేపు నా ఏడుపు చూసి ఎందు కేడుస్తున్నావంటూ పలకరించింది. సానుభూతి చూపే మనిషి దొరగ్గానే మరింత ఏడుపు వచ్చింది. ఆవిడ ఓదార్చి కారణం అడిగితే ఏదీ దాచకుండా అంతా చెప్పాను. నా ముందు గతి ఏమిటని ఏడ్చాను.
    "ఆవిడ జాలి పడింది. ఓదార్చింది . ధైర్యం చెప్పింది. ఆవిడ మెడ్రాసు వెడుతుంది. నన్ను తనతో రమ్మంది ఆవిడ భర్త అక్కడ సినిమాలకి ఎక్స్ స్ట్రా సప్లయిర్ ట. కావలిస్తే నాకూ ఎక్ స్ట్రాగా పనిప్పించగలడు అని ధైర్యం  చెప్పింది.
    "నాకో ఆలోచనుంటేగా? ఆవిడ చెప్పిందానికి తలాడించి ఆవిడ వెంట వెళ్ళాను. ఇంటికి తీసికెళ్ళి నా కధ చెప్పి మొగుడికి నన్ను అప్పచెప్పింది. అప్పటి నుంచి అతని క్రింద వుండే వందలాది ఎక్ స్ట్రాలలో ఒకర్తిగా బ్రతికాను. ఆ మందలో నన్ను ఓ పశువుగా చేర్చి అవసరమైనపుడు స్టూడియోలకి తోలు కెళ్ళేవాడు. ఏ గుంపులో నన్నా నిలబడ్డ రోజు ఐదో పదో పనిని బట్టి దొరికేవి డబ్బులు.
    "నా సంపాదనలో సగం యిస్తానని నన్ను వాళ్ళింటి లోనే వుంచుకుని ఇంత తిండి పడేయమని ఆవిడని బ్రతిమిలాడాను. నేను ఒక్కర్తినీ వుండగలిగే మనస్తైర్యం వచ్చే వరకు ఇంటిలో వుంచుకోమని ప్రాధేయపడ్డాను. అలాగే వుంచుకున్నారు.
    "ఆ రోజులు గురించి తలచుకుంటే భయంతో వళ్ళు జలదరిస్తుంది. లేకపోతే నాలాంటి అనామిక, అనాకారికి అంతకంటే మంచి బ్రతుకు వుంటుందని ఆశించటం వీలులేనిది గదా! ఆ ఎక్ స్ట్రాలలోనూ ఎన్ని రకాలు -- ఒక్క ప్రేమ్ లో , సింగిల్ షాట్ లో కనిపిస్తే పొంగిపోయేవాళ్ళు, ఒక్క ముక్క డైలాగుంటే కొండెక్కి నంత సంబరపడేవాళ్ళు ---- ఏ దాసీ దానిలా కనపడినా పెద్ద తార అయినంత బ్రహ్మానంద పడేవాళ్ళు ------ అల్ప సంతోషులు ! అబ్బ! ఆ మందలో మందలా బ్రతికాను రెండేళ్ళు !"
    "ప్రొద్దుటే వేన్ లో ఎక్కించి ఏ స్టూడియో కో తీసి కెళ్ళి దింపేవారు. ఏ చెట్ల క్రిందో, రంగులు పులుముకుని వాళ్ళిచ్చిన గుడ్డలు కట్టుకుని చెమటలు కార్చుకుంటూ అలా రోజంతా కూర్చునేవాళ్ళం. వాళ్ళకు దయపుడితే ఎప్పుడో ఇంత కాఫీ, టిఫిను మా మొహాన పోసేవారు. ఎప్పటికో మాకు పిలుపు వచ్చేది. ఏ గుంపులోనో నిల్చుని మా సీను అయ్యేవరకు కాచుకునే వాళ్ళం. ఎక్ స్ట్రా జీవితం గురించి క్రొత్తగానే చెప్పక్కరలేదు. నీకూ తెలిసే వుంటుంది. ఆ  నికృష్ట జీవితం రెండేళ్ళు గడిపాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS