Previous Page Next Page 
ప్రతీకారం పేజి 8


    "రవీ! ఇంకెప్పుడూ నువ్వు ఈ గదిలోకి రాకూడదు. పులీ వేటగాడు- ఆట ఆడకూడదు. గుర్రం రాజకుమారుడు ఆట ఆడుకోవాలి తెలిసిందా? జగన్నాధం అన్నాడు.
    రవి తల ఆడించాడు.
    జగన్నాధం మనసు మనసులో లేదు.
    రవిలో కూడా హింసా ప్రవృత్తి తలెత్తుతుంది. తన స్వభావమే రవికీ వచ్చింది. తనలాగే రవి కూడా...వీల్లేదు. రవి అలా కాకూడదు. రవిని క్రూరత్వానికీ, హింసకూ దూరంగా పెంచాలి. రవిని మనసుగల మంచి మనిషిగా పెంచాలి. అహింసా మూర్తిని చెయ్యాలి.

                                              6

    జగన్నాధం భగవద్గీత చదువుతున్నాడు. వెనగ్గా వచ్చిన రవి, తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి, వీపుమీదుగా వంగి, "నాన్నా! నాన్నా!" అన్నాడు.
    జగన్నాధం పుస్తకం మూసి టేబులు మీద పెట్టాడు.
    చేతులు వెనక్కి పోనిచ్చి రవిని ముందుకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.
    "ఏం బాబూ!" అన్నాడు తల నిమురుతూ.
    "ఇందులో ఏముందో చెప్పు? "మూత వున్న సిగరెట్ టిన్ను చూపిస్తున్నాడు రవి.
    జగన్నాధం డబ్బాను అందుకోబోయాడు.
    "ముందు చెప్పాలి ఇందులో ఏముందో?" అన్నాడు రవి చెయ్యి వెనక్కు తీసుకుంటూ.
    జగన్నాధం ఆలోచిస్తున్నట్టు ఓ క్షణం నటించి "అందులో మరేమో...ఊహు! నాకు తెలియదు. నువ్వే చెప్పు" అన్నాడు.
    "మరి ఓడిపోయావా?"
    "ఆఁ. ఓడిపోయాను" చిన్నపిల్లవాడిలా అమాయకంగా ముఖం పెట్టి అన్నాడు జగన్నాధం.
    "నాన్న ఓడిపోయాడు" అని కిలకిల నవ్వాడు రవి.
    "మరి చూపించు"
    అయితే కళ్ళు మూసుకో...అమ్మదొంగ చూస్తున్నావ్! గట్టిగా మూసుకోవాలి. ఆఁ అట్లా! ఇక కళ్ళు తెరవచ్చు!"
    జగన్నాధం కళ్ళు తెరచి చూశాడు. ముఖం వెలవెలా బోయింది. డబ్బాలో పిచ్చుక పిల్ల కోన ఊపిరితో ఉంది.
    "నాన్నా! దీన్ని మరేమో ఎట్లా పట్టుకున్నానంటే-"
    "రవీ!" జగన్నాధం గట్టిగా అరిచాడు.
    రవి భయంగా తండ్రి ముఖంలోకి చూశాడు.
    రవి కళ్ళలో నీరు తిరిగింది.
    "అట్లా డబ్బాలో పెడితే అది చచ్చిపోతుంది. అది చచ్చిపోతే దాని అమ్మ ఏడుస్తుంది"
    "అమ్మ చచ్చిపోయినట్టా?" బిక్క మొహంతో అన్నాడు రవి.
    "అవును బాబూ! చూడు అది ఎట్లా కొట్టుకుంటుందో పాపం! దానికి నొప్పి పుట్టదూ మరి? నిన్ను మన బియ్యం డబ్బాలో కూర్చోపెట్టి మూత వేస్తే ఏం చేస్తావు?"
    "ఏడుస్తాను. కాని అది ఏడవటం లేదుగా!"
    "దానికి ఏడవటానికి నోరు లేదు బాబూ! కాని నొప్పి మాత్రం ఉంటుంది. అదీ మనలాంటి ప్రాణే. దాన్ని చంపకూడదు. చూడు పాపం. అది ఎట్లా కొట్టుకుంటుందో?" అన్నాడు జగన్నాధం.
    రవి దిగులుగా పిచ్చిక పిల్లకేసి చూశాడు.
    "అప్పన్నా! చూడు దీన్ని తీసుకెళ్ళి తోటలో వదిలేయ్! బాబును జాగ్రత్తగా చూసుకోమని చెప్పలేదు? వాడు దీన్ని పట్టుకుంటూంటే నువ్వేం చేస్తున్నావు?" జగన్నాధం అప్పన్నను మందలించాడు.
    జగన్నాధం రవి చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్ళాడు. బుద్ధిడి బొమ్మ దగ్గిర నిల్చున్నాడు.
    "చూడు రవీ! ఆ బొమ్మ ఎవరిదో చెప్పు చూద్దాం"
    "బిచ్చగాడి బొమ్మ!" రవి ఠకీమని జవాబిచ్చాడు.
    "కాదు... రాజకుమారుని బొమ్మ"
    "అన్నీ అబద్ధాలే! రాజకుమారుడా? మరి కిరీటం లేదేం? మంచి బట్టలు వేసుకోలేదేం? చేతిలో గిన్నె ఉందేం? గుర్రం కూడా లేదు" అన్నాడు రవి.
    "అవును బాబూ! రాజకుమారుడే! ఆ రాజకుమారుడి కథ చెబుతాను వింటావా?" అన్నాడు జగన్నాధం.
    రవి ఉత్సాహంగా తల వూపాడు. జగన్నాధం బుద్ధిడి కథ చెప్పాడు, రవి శ్రద్ధగా విన్నాడు.
    జగన్నాధం కథ ముగించి రవి ముఖంలోకి చూశాడు. రవి చెంపల మీదుగా కన్నీళ్ళు కారుతున్నాయి. జగన్నాధం సంతృప్తిగా నిట్టూర్చాడు.
    "ఇంకెప్పుడూ పిట్ట, తూనీగల్నీ పట్టుకోను నాన్నా! నేను కూడా బుద్ధుణ్ని అవుతాను" అన్నాడు రవి తండ్రి ముఖంలోకి చూస్తూ.
    "బాబూ!" అంటూ జగన్నాధం కొడుకుని గుండెలకు హత్తుకుని తలమీద ముద్దు పెట్టుకున్నాడు.
    "ఏమిటి జగన్నాధం! పసిపిల్లలకు అలాంటి కబుర్లు చెబుతారా? అనవసరంగా నువ్వు పిరికివాణ్ని చేస్తున్నావ్?" అంతకుముందే వచ్చిన మూర్తి అందుకున్నాడు.
    జగన్నాధం జవాబుగా చిరునవ్వు నవ్వాడు.
    "పిల్లల్ని స్వేచ్చగా పెరగనివ్వాలి. ఇది తప్పు అది తప్పు...అంటూ పిరికిమందు పొయ్యకు. నేను చూడు... రజనీని ఎలా పెంచుతున్నానో..." అన్నాడు మూర్తి.
    "నా రవి పిరికివాడు కాడు. అహింసా మూర్తి అవుతాడు. అట్లా చూస్తూ ఉండు" అన్నాడు జగన్నాధం గర్వంగా.

                                                                       7

    రవికి తొమ్మిదేళ్ళు నిండాయి. జగన్నాధం కూర్చుని రవికి 'గాంధీజీ బాల్యం' కథగా వినిపిస్తున్నాడు. రవి శ్రద్ధగా వింటున్నాడు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS