Previous Page Next Page 
ప్రతీకారం పేజి 7


    ఆనాటి నుండి నేను మరో మనిషిని అయ్యాను! నా గుండెలు ఆరిపోయాయి. కళ్ళల్లో ఆర్ద్రత ఎండిపోయింది. మొద్దుబారిన మనస్సులో కాఠిన్యం ప్రవేశించింది. ఆనాటి నుంచి హింస నా రెండో ప్రకృతిగా ఏర్పడింది. ఎన్నో కొట్టాలి, ఎవర్నో బాధించాలి, ఏదో అశాంతి, జంతువుల్ని వేటాడ్డం ప్రారంభించాను.
    జంతువు నా తుపాకి ఎరకు గురై రక్తపు మడుగులో తన్నుకుంటూ వుంటే నాకేదో ఆనందం కలిగేది. నెలలో దాదాపు సగం రోజులు జంతువుల్ని, పక్షుల్నీ వేటాడుతూ అడవిలోనే గడిపేవాణ్ని.
    అయినా నాలో రగులుతున్న అగ్నికి ఉపశమనం లభించలేదు. జ్వాల చల్లారలేదు. రోజు రోజుకీ ఆ గని విజృంభించ సాగింది.
    నాన్న మాట కాదనలేక వివాహం చేసుకున్నాను. బాబు పుట్టాడు. అయినా ఎంత ప్రయత్నించినా వేట మానలేకపోయాను.
    ఆ రోజు...అదే నా వేటకు చివరి రోజు...నాలోని అగ్ని చల్లారిన రోజు...నాలోని అగ్ని చల్లారిన రోజు...నాలోని పశుత్వం విజృంభించిన రోజు...నువ్వు కూడా అడవిలో నాతోనే ఉన్నావు.
    దెబ్బతిన్న ప్రేమ ద్వేషంగా మారింది. ఆ ద్వేషం జ్వాలలై రగిలి రగిలి ప్రతినిముషం నన్ను దారుణ వ్యధకు గురిచేసింది. ఆ రోజు ఆ అగ్ని చల్లారే అవకాశం దొరికింది. జ్వాల చల్లారింది.
    అప్పుడు మళ్ళీ నేను నాలోకి వచ్చాను. నేను చేసిందేమిటో తెలుసుకున్నాను. పశ్చాత్తాపం కలిగింది. ఇంటికి వచ్చేసరికి నేను చేసిన పాపానికి ప్రతిఫలం ఎదురుచూస్తూ ఉంది. నా భార్య శవం కనిపించింది. జగన్నాధం కంఠం బొంగురు పోయింది.
    మూర్తికి ఎక్కడా క్లూ దొరకలేదు. ఇంతకీ జగన్నాధం చేసిన పాపం ఏమిటి? ఆరోజు అరణ్యంలో ఎవర్నయినా హత్య చేశాడా? ఎవర్ని?
    జగన్నాధం తను లేడి వెంట పరిగెత్తిన తర్వాత జరిగిన ఉదంతం విన్పించాడు.
    "ఇప్పుడు చెప్పు మూర్తీ! నేను హంతకుణ్ణి కానా? నాలాంటి హంతకుణ్ణి అరెస్టు చేసి దండించే నియమాలు ఏ శాస్త్రంలోనూ లేవా?" ఉద్రేకంగా అడిగాడు జగన్నాధం.
    మూర్తి జాలిగా జగన్నాధం ముఖంలోకి చూశాడు.
    "నువ్వు మళ్ళీ నన్ను హంటింగ్ కు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు. అలాగయినా ఈ దుఃఖాన్ని మర్చిపోతాననీ నీ భ్రమ! ఇక చాలు మూర్తీ. ఇంతవరకూ చేసిన జీవహింస చాలు. నో ఫర్దర్ కిల్లింగ్...నో ఫర్దర్ హంటింగ్" మూర్తి లేచి జగన్నాధం భుజం మీద చెయ్యి వేశాడు.
    "జరిగిపోయిందేదో జరిగిపోయింది. బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు కనీసం ఆ పసివాడి కోసమైనా మళ్ళీ మనిషివి కావాలి" అన్నాడు మూర్తి.
    "అవును నేను మనిషిని కావాలి. అవుతాను. మనసున్న మనిషిగా, ఆదర్శమూర్తిగా తీర్చిదిద్ది మానవత్వానికి ప్రతిరూపంగా నిలబెట్టడానికి నేను మనిషిని అవుతాను." జగన్నాధం ఉద్రేకంగా అన్నాడు.

                                              5

    జగన్నాధం చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి చూశాడు. రవి అప్పన్నతో అడుగుతున్నాడు. అప్పన్న పులి చర్మం కప్పుకొని, పులిలా అరుస్తూ రవి మీద మీదకు వస్తున్నాడు. రవి వేటగాడి పోజులో పులిని తరుముతున్నాడు. అప్పన్న భయపడినట్టు, కాళ్ళూ చేతుల మీద పాకుతూ అక్కడనుంచి ఇంట్లోకి పరుగుతీశాడు. రవి కూడా అప్పన్న వెంట పరుగు తీశాడు. జగన్నాధం తనలో తను నవ్వుకుని మళ్ళీ పుస్తకం చదవసాగాడు.
    అప్పన్న కెవ్వున అరిచాడు. జగన్నాధం ఉలిక్కిపడ్డాడు. చేతిలో పుస్తకం కింద పడిపోయింది.
    "చచ్చాను బాబోయ్!" అంటూ ఇంకా అప్పన్న అరుస్తూనే ఉన్నాడు.
    "జగన్నాధం ఒక్క ఉదుటున అప్పన్న, రవి ఉన్న గదిలోకి పరుగు తీశాడు. అప్పన్న కప్పుకున్న పులి చర్మం ప్రక్కగా పడి వుంది. భుజం పట్టుకుని అరుస్తున్నాడు. భుజం నుంచి రక్తం కారుతూంది. రవి చేతిలో కత్తి పట్టుకొని గర్వంగా చూస్తూ నిల్చున్నాడు. జగన్నాధానికి జరిగిందేమిటో అర్థం అయింది.
    అప్పన్న భుజానికి రక్తం కారకుండా గట్టిగా కట్టు కట్టాడు.
    "నాన్న! నేను పులిని కొట్టేశాను. నేనే గెల్చాను" అంటున్నాడు రవి ఉత్సాహంగా.
    "పులి తనమీదకు ఎలా వచ్చిందీ, తను టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకుని దాన్ని ఎలా పొడిచిందీ వర్ణించి చెబుతున్నాడు.
    జగన్నాధం రవి ముఖంలోకి చూశాడు. గది నాలుగు వైపులా కళ్ళు తిప్పి చూశాడు. గోడకు గన్ తగిలించి ఉంది. గది నిండా జింక తోళ్ళూ, పులి చర్మాలు ఉన్నాయి. స్టఫ్ డు జంతువులు...చిరుత పులీ... ఎలుగుబంటీ ఉన్నాయి. ఒక టేబిల్ మీద రాబందు వుంది. వాటన్నింటినీ జగన్నాధమే అక్కడ చేర్చాడు. ఒకనాడు ఆ గది చూస్తే అతనికి ఏదో సంతృప్తిగా వుండేది! కాని ఆ రోజు ఆ గది అతని కళ్ళకు హింసకు చిహ్నంగా, భయంకరంగా కన్పించింది.
    "అప్పన్నను కత్తితో పొడిస్తే చచ్చిపోడూ? చూడు ఎంత రక్తం కారిందో?" అన్నాడు జగన్నాధం రవితో.
    "అప్పన్న కాదు నాన్నా! పులి! పులిని చంపాను. ఒక్క దెబ్బకే పులి పడిపోయింది. నేను వీరుణ్ని అచ్చంగా నీలాగే..."
    జగన్నాధం గుండెల్లో లోతుగా ఏదో కలుక్కున గుచ్చుకుంది. రవికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.
    "అప్పన్నా! నువ్వు డాక్టరు దగ్గర కెళ్ళిరా! రా బాబూ! అంటూ రవిని బయటకు తీసుకువచ్చి గదికి తాళం వేశాడు.
    అప్పన్నా! నాకు తెలియకుండా ఈ గది ఎవరూ తెరవకూడదు" అన్నాడు.
    "అట్టాగే బాబూ!" అంటూ అప్పన్న వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS