మూర్తి కూతుర్ని వెంటపెట్టుకుని వచ్చాడు. రజనీకి ఏడేళ్ళు నిండాయి.
"ఓ రజనమ్మ వచ్చిందా?" అంటూ జగన్నాధం రజనీని ఎత్తుకొని ముద్దులాడాడు.
"రవీ! మీరిద్దరూ తోటలోకి వెళ్ళి ఆడుకోండి!" అన్నాడు మూర్తి.
"రా! ఆడుకుందాం!" అంటూ రవి రజని చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరూ ఆడుకోవడానికి వెళ్తూ ఉంటే జగన్నాధం సంతృప్తిగా చూశాడు. అతని మనస్సులో మొదటిసారిగా పిల్లలిద్దరి గురించిన ఏదో ఆలోచన వచ్చింది. కళ్ళు సంతోషంతో వెలిగాయి.
"రవీ! జాగ్రత్తగా ఆడుకోండి!" కేకవేసి చెప్పాడు జగన్నాధం.
చెస్ బోర్డు టేబులు మీద పరిచి బలగాన్ని పేరుస్తున్నాడు జగన్నాధం.
"జగన్నాధం, డిసిప్లిన్ పేరుతో పిల్లల్ని మరీ కట్టడిలో పెట్టకూడదు. నీ ధోరణి ఇంకా మారలేదు. అహింస పేరుతో పిల్లల్ని మరీ అంతగా హడలగొడితే ఎట్లా?" అన్నాడు మూర్తి, మంత్రి ఎదురుగా వున్న సిపాయిని జరుపుతూ.
"మొక్కగా వంగనిది మానై వంగుతుందని నేను నమ్మను. పిల్లల మనసులు మైనపు ముద్దల్లా ఉంటాయి. మనం కోరిన విధంగా మలచడానికి అనువైన వయస్సు ఇదే. నన్ను మా నాన్న ఏనాడూ కట్టడిలో పెట్టలేదు. ఏది కావాలన్నా క్షణంలో తెప్పించేవాడు. ఏది సంభవమో కూడా ఆలోచించేవాణ్ని కాదు. అందువల్లనే నేను కోరిన రాధను పొందలేకపోయినప్పుడు, నాలో పట్టుదలా, కసీ జనించాయి. నిజమైన ప్రేమకు ద్వేషం తెలియదు అంటారు. బహుశా నేను రాధను ప్రేమించి వుండను, కాంక్షించి ఉంటాను. నా కాంక్ష తీరలేదు, నా హృదయం పాషాణం అయింది. రాక్షసుడిలా ప్రవర్తించాను. కాని నా కొడుకు నాలా కాకూడదు. వాణ్ని మనిషిగా పెంచుతాను. నేను ఆశించే ఆదర్శ శిఖరాలను మా రవి అధిరోహించ గలడనే నమ్మకం నాకు పూర్తిగా వుంది." అన్నాడు జగన్నాధం ఉద్రేకంగా.
"ఎవరి పిచ్చి వారికానందం! సరే ఎత్తువేయ్!" అన్నాడు మూర్తి.
రజనీ ఏడుస్తూ వచ్చింది.
"ఏం తల్లీ ఏం జరిగింది?" జగన్నాధం అడిగాడు రజనీని దగ్గరకు తీసుకుంటూ.
"రవి...కొట్టాడు" అంది బెక్కుతూ.
జగన్నాధం కోపంతో "రవీ!" అంటూ అరిచాడు.
రవి భయపడుతూ తండ్రి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు.
"ఏమిటోయ్ అంత గొడవ పెడతావ్. పిల్లలు ఆటల్లో కొట్టుకుంటారు. అలాంటివి మనం పట్టించుకోకూడదు. రజని వెళ్ళమ్మా! రవితో ఆడుకో!" అన్నాడు మూర్తి చెస్ బోర్డు మీదినుంచి కళ్ళు ఎత్తకుండానే.
"ఎందుకురా రజనీని కొట్టావ్?" గద్దించి అడిగాడు జగన్నాధం.
"నాన్నా! మరే! రజనీ తూనీగల్ని పట్టి వాటి రెక్కలు విరిచి వదిలేస్తూంది. పాపం అవి ఎగర్లేక కిందపడి తన్నుకుంటున్నాయి. మరి అట్లా చేస్తే అవి చచ్చిపోవూ? వాటికి నొప్పి పుట్టదూ" అన్నాడు రవి భయం భయంగానే.
జగన్నాధం రవి ముఖంలోకి ఓ క్షణం చూశాడు. అతని కళ్ళలో గర్వం తొణికిసలాడింది. మూర్తికేసి చూశాడు "చూశావా? నా శిక్షణ వ్యర్థం కాలేదు" అన్నట్టు మూర్తి సమాధానంగా చిరునవ్వు నవ్వాడు.
"తప్పమ్మా! తూనీగల్ని పట్టుకోకూడదు. ఇప్పుడు చూడు. నువ్వు రవి కొట్టాడని ఏడ్చావా? నొప్పి పుట్టింది కదూ, రవి కొడితే? అలాగే తూనీగలకి కూడా నువ్వు పట్టుకుంటే నొప్పు పుడుతుంది. పుట్టుకోవు గదూ?" లాలిస్తూ అడిగాడు జగన్నాధం.
రజని తల అడ్డంగా తిప్పింది.
"ఇక వెళ్ళండి వెళ్ళి ఆడుకోండి" అన్నాడు మూర్తి మంత్రితో శకటాన్ని తీసేస్తూ.
పిల్లలిద్దరూ మళ్ళీ చెయ్యి చెయ్యి పట్టుకుని పరుగు తీశారు.
"ఏం ఆట ఆడుకుందాం?" అడిగాడు రవి.
"అమ్మా నాన్న ఆట" అన్నది రజని.
"ఛీ! ఆ ఆట ఏం బాగుండదు. పిచ్చి ఆట" అన్నాడు రవి.
"అదే బాగుంటుంది" అన్నది రజని మొండిగా.
"నేను ఆడను పో!" అన్నాడు రవి దూరంగా వెళ్ళిపోతూ.
"నువ్వే చెప్పు ఏం ఆట ఆడుకుందాం?" రవి దగ్గిరగా వస్తూ అడిగింది రజని.
"రాజకుమారి...రాజకుమారుడి ఆట ఆడుకుందాం!" అన్నాడు.
రజని కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది.
"అది ఎట్లా ఆడాలి?" ఉత్సాహంగా అడిగింది.
"నువ్వు ఒక అరణ్యంలో ఒంటరిగా వున్నావు. దొంగలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. నువ్వు పెద్దగా ఏడుస్తావు. అప్పుడు నేను గుర్రం మీద వచ్చి డిష్యుం! డిష్యుం!" చేసి అందర్నీ చంపేసి నిన్ను రక్షిస్తాను" రవి ఛాతీ విరుచుకుని నిలబడ్డాడు.
రజని కుతూహలంగా చూసింది.
"మరి దొంగలు రాకుండా పెద్దపులి వస్తే?" సాలోచనగా అడిగింది రజని.
"పెద్దపులిని ఒక్క వేటుతో చంపేస్తాను. నా దగ్గిర చాలా పెద్ద కత్తి వుంటుంది తెలుసా?
"వట్టి గొప్పలు! పులిని చూసి జడుసుకొని పారిపోతావు. నీ సంగతి నాకు తెలియదా ఏం? తూనీగల్ని పట్టుకోవాలంటేనే భయం!" అంది రజని.
రవికి కోపం వచ్చింది. రోషం వచ్చింది. ముఖం ఎర్రబడింది. ఎలాగయినా తన సాహసాన్ని ప్రదర్శించాలనే పట్టుదల కలిగింది. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. గతరాత్రి చూసిన సినిమా గుర్తొచ్చింది. హీరోయిన్ మంటల్లో చిక్కుకుంది. హీరో మంటల్లో దూకి రక్షించాడు. రవి బుర్రలో మెరుపులాంటి ఆలోచన తట్టింది. రజని చెయ్యి పట్టుకుని బరబరా ఈడ్చుకుపోయి గార్డెన్ పక్కగా వున్న గుడిసెలోకి తోసి తలుపు గొళ్ళెం పెట్టాడు. రజని ఏడుస్తూ తలుపు బాదసాగింది. రవి ఒక్క పరుగున ఇంట్లోకి వెళ్ళి అగ్గిపెట్టె తెచ్చాడు. నిప్పు పుల్ల గీచి కిందగా వున్న చూరు ముట్టించాడు. రజని ఏడుపు విని, తోటపని చేస్తున్న అప్పన్నకు రవి చూరుకు నిప్పు అంటించడం కనిపించింది. అరుస్తూ పరుగెత్తుకొచ్చి తలుపుతీసి, రజనీని ఎత్తుకొని బయటకు తెచ్చాడు. అప్పన్న అరుపులు విని జగన్నాధం, మూర్తీ తోటలోకి వచ్చారు. అప్పటికే పాకమీద మంటలు లేచాయ్.
