"అంటే నూరేళ్ళు ఆయుష్షున్న మాటనాకు! థాంక్యూ అమ్మా, నాన్నా ఇంకా నిద్రలేవలేదా?"
"పెద్దమ్మ ఎప్పుడో లేచింది. మొక్కలకు నీళ్ళు పోస్తుంది. పెదనాన్న ఇంకా లేవలేదు."
"ఓకే! నేనిప్పుడే మొఖం కడుక్కుని వస్తాను. కానీ రడీగా ఉంచాలి." అక్కడి నుంచి వెనక్కు తిరుగుతూ అన్నాడతను.
మొఖం కడుక్కొని వచ్చేసరికి కప్పుతో కాఫీ తీసుకొచ్చి అందించింది శాంతి.
"నువ్వు తాగవేం?" నవ్వుతూ అడిగాడు సృజన్.
"తెచ్చుకుంటాను!" లోపలకు నడుస్తూ అందామె.
"పెళ్ళి బాగా జరిగిందా?" హాలులోకోస్తూ అడిగింది తల్లి.
"ఆఁ..." క్లుప్తంగా అని ఊరుకున్నాడతను.
"పెళ్ళికూతురెలా ఉంది?" వివరాల కోసం అడిగిందామె.
"బాగానే ఉంది."
"ఏం చదువుకొందిట?"
"ఏమోనే! అవన్నీ నాకేం తెలుసు!" తల్లిమీద విసుక్కొన్నాడు సృజన్.
శారదమ్మ ఆశ్చర్యపోయింది.
బహుశా ప్రయాణపు బడలికవల్ల విసుగ్గా ఉందేమోఅనుకొని మౌనంగా ఊరుకుండిపోయింది.
"కాసేపు నిద్రపోరాదూ! మళ్ళీ పదింటికి ఆఫీసు కెళ్ళాలిగా!" అంది శాంతి అదే మంచిదనిపించింది సృజన్ కి లేచి తన గదిలోకెళ్ళి మంచంమీద వాలిపోయాడు. ఇంకా ఎంత రాకపోయినా పూర్తిగా తెల్లారిపోయింది. చల్లనిగాలి కిటికీలోనుంచి ఆహ్లాదంగా వీస్తోంది. బలవంతంగా కళ్ళు మూసుకున్నాడతను. గంటసేపు గడిచిపోయిందిగాని నిద్రపట్టటంలేదు. ఆలోచనలన్నీ స్వరూపమీదే. తనువచ్చేసిన తరువాత ఏం గొడవయిందో ఏమో! అన్నీ వివరంగా ఉత్తరం రాస్తానన్నాడు సురేంద్ర! కానీ అంతవరకూ ఈ సస్పెన్సు భరించటం ఎలా? లేనిపోని మనో వైకల్యాన్నికొని తెచ్చుకున్నట్లయింది. అసలు అతనీ పెళ్ళికి వెళ్ళక పోయినా బాగుండేది. లేచి కూర్చున్నాడతను! ఊహుఁ ఒంటరితనం తను భరించలేడు! హాల్లోకి నడిచాడు. శాంతి అప్పుడేవచ్చిన పేపరు చదువుతోంది, తండ్రి బయటనుంచుని ప్రక్కింటి ముసలాయనతో ఏవో రాజకీయాలు చర్చిస్తున్నాడు.
"నిద్రపట్టటం లేదా?" అడిగింది శాంతి.
"ఊహుఁ!"
"ఎందుకని?"
"ఏమో!"
"ఒక్కోసారంతే! నిద్రవస్తున్నట్లుంటుంది కాని రాదు" నవ్వుతూ అంది. ఆమెవంకే చూడసాగాడు సృజన్. శాంతి నవ్వులో అదివరకటి జీవంలేదు. ఆమె కళ్ళల్లో అదివరకటి వెలుగులేదు. ఆమె మొఖంలో అదివరకటి అందం లేదు. విషాదం-దిగులు-గతం-ఇవన్నీ ఆమెని చిత్రవధ చేస్తున్నాయి! ఆమె చెప్పకపోయినా తనకు తెలుసా సంగతి. ఈ శాంతి మళ్ళీ అదివరకటి శాంతి కావడానికి ఎంత కాలం పడుతుందో! ఎంతకాలమయినాసరే ఈ శాంతి జీవితంలోకి మళ్ళీ వసంతం రావాలి. అందుకే బాబాయితోనూ, పిన్ని తోనూ వాదించి, నచ్చచెప్పి శాంతిని తమ ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకురాకపోతే శాంతి పరిస్థితెలా క్షీణించిపోతుందో తనకు తెలుసు. వచ్చేపోయే ప్రతివారూ ఆమె దురదృష్టాన్ని గుర్తుచేయడం-మన పల్లెసీమల నైజం అది. ఈ వాతావరణంలో ఉంటే శాంతి తమకు దక్కదని తనకు అనుమానం!
"ఏమిటి-ఒకటే ఆలోచన?" అడిగింది శాంతి.
సృజన్ బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు.
"ఏమీలేదు! సాయంత్రం ప్రోగ్రామేమిటా అని ఆలోచిస్తున్నాను."
శాంతి ఏమీ మాట్లాడలేదు.
ఆమె హైద్రాబాద్ వచ్చి రెండు నెలలవుతుంది ఇంచుమించుగా ఆమెను ప్రతిరోజూ సినిమాకో, రవీంద్ర భారతిలో నాటకాలకో, మరేదయినా ప్రోగ్రాంకో తీసుకెళ్తున్నాడు తను. అందువలన త్వరగా ఆమెగతాన్ని మర్చిపోడానికి అవకాశం ఉంటుంది! నిజానికి అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు వచ్చింది. వచ్చిన కొత్తలో ఏమీ మాట్లాడేది కాదు! ఏ పనీ చేసేదికాదు. ఎప్పుడూ పడుకుని ఏడుస్తూండేది! రానురాను అందరితో మాట్లాడటం-ఇంటి పని చూడటం - పేపరు - మిగతా పత్రికలు చదవడం చేస్తోంది!
"ఇవాళ సిటీలో ప్రోగ్రామ్స్ చూడు-పేపర్లో!" అన్నాడు సృజన్.
పేపర్ తిప్పి చదివింది శాంతి.
"రవీంద్రభారతిలో లలితకళాసమితి నాటిక పోటీలున్నాయి!" అంది అతనివంక చూస్తూ.
"ఓకే! సాయంత్రం నేను వచ్చేసరికల్లా రడీగా ఉండు మరి వెళ్దాం."
తలూపింది శాంతి.
భోజనం ముగించి పదింటికల్లా ఆఫీస్ చేరుకున్నాడు సృజన్. లోపలికెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అప్పటికే స్టాఫంతా వచ్చేశారు. ఎమర్జెన్సీ వచ్చాక చాలా మార్పులు జరిగినయ్ ఆఫీసులో. అందులో టైముకి ఆఫీసుకి చేరుకోవడం ఒకటి! బలవంతంగా ఫైల్స్ మీద మనసు కేంద్రీకరించడానికి ప్రయత్నించాడు సృజన్.
"ఏం గురువా! పెళ్ళికెళ్ళొచ్చేశావేమిటి?" పలుకరించాడు రామకృష్ణ.
"అవునవును! ఇవాళే వచ్చాను"
"అందరి పెళ్ళిళ్ళూ చేస్తున్నావ్ గాని, మరి నీ పెళ్ళెప్పుడు?" నవ్వుతూ అడిగాడతను.
"జులైలో..."
"ఏదీ? వచ్చేనెలా?"
"సంవత్సరం ఇంకా తెలీదు! జులైలో చేసుకోవాలని మాత్రం నిర్ణయం జరిగింది" నవ్వుతూ అన్నాడు సృజను.
"పో గురూ, నీకన్నీ తమాషాలే..." తనసీటువేపు నడుస్తూ అన్నాడతను.
లంచ్ టైమ్ వరకూ ఏ పనీ చేయకుండానే గడిపాడు సృజన్.
కాంటీన్ దగ్గర శ్రీపతి కనిపించాడు. అతన్ని చూడగానే సృజన్ కి ప్రాణం లేచివచ్చినట్లయింది. తనకున్నకొద్దిమంది ఆప్తమిత్రుల్లో అతనొకడు. అతనుకూడా అదే ఆఫీసులో మరో సెక్షనులో చేస్తున్నాడు.
"ఇవాళ వచ్చివుంటాననే అనుకున్నాను" నవ్వుతూ అన్నాడతను. ఇద్దరూ కాంటీన్ లోకి నడిచి కాఫీ, టిఫినూ తీసుకున్నారు.
"ఇవాళ సాయింత్రం రవీంద్రభారతి కెళుతున్నాం! నువ్వూ వస్తావా?" అడిగాడు సృజన్.
"వెళుతున్నాం అంటే ఎవరెవరూ?"
"నేనూ మా కజిన్ శాంతీ!"
"ఏమిటక్కడ ప్రోగ్రామ్?"
"నాటికల పోటీలట!"
"ఓ యస్! నాటికల పోటీలంటే నాకు చాలా ఇష్టం."
"అయితే సాయంత్రం ఆరున్నరకి రవీంద్ర భారతి దగ్గరే నుంచుని ఉంటాం! అక్కడే కలుసుకో."
