Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 9


    "ఆల్ రైట్ ..."
    ఇద్దరూ బయల్దేరా రక్కడినుంచి.
    సీట్లో కూర్చున్నాడు సృజన్. అతని ఆలోచనలన్నీ శ్రీపతిమీదకు మళ్ళినయ్! ఆధునిక యువకుడు శ్రీపతి. అతని అభిప్రాయాలూ-ఆలోచనలూ తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయాడు సృజన్ ఎంతో విశాల హృదయం అతనిది! మన దేశంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయాల్ని అతను సునిశితంగా విమర్శిస్తోంటే-అతని విమర్శలో ఎలాంటి లోపమూ కనిపించేది కాదు. ముఖ్యంగా భర్త చనిపోయిన స్త్రీల పరిస్థితికి అతను ఎంతో సానుభూతి చూపుతుండేవాడు.
    ఆ కారణం చేతనే అతనిని శాంతికి పరిచయం చేశాడు సృజన్. ఐతే ఆమె భర్త వివాహం జరిగిన నాలుగు నెలల లోనే మరణించాడన్న విషయం తెలియనీలేదు. స్త్రీల గురించి, వాళ్ళకున్న దారుణమైన పరిస్థితుల గురించి అతను లెక్చరిస్తోంటే విని నవ్వుకొనేది శాంతి. సందర్భం వచ్చినప్పుడు ఆమె విషయం తెలియజేయ వచ్చునని ఊరు కొన్నాడు అతను.
    సాయంత్రం 'రవీంద్ర భారతి' దగ్గర అతనినీ, శాంతినీ కలుసుకొన్నాడు శ్రీపతి.
    "నమస్తే" అన్నాడతను శాంతినిచూసి నవ్వుతూ.
    ప్రతి నమస్కారం చేసింది శాంతి.
    ముగ్గురూ లోపలకు నడిచేరు. క్రింద ఎక్కడా ఖాళీ లేకపోవడంవలన మేడమీద కూర్చోవాల్సి వచ్చింది.
    నాటికలు చూస్తున్నంతసేపూ ఆ నాటిక గురించి అభిప్రాయాలు వెలిబుచ్చుతూనే ఉన్నాడు శ్రీపతి వాటితో చాలా వరకు శాంతి ఏకీభవించింది. మధ్యలో ముగ్గురు దగ్గరలో ఉన్న హోటల్ కి నడిచారు.
    "మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు రోజూ?" అడిగాడు శ్రీపతి శాంతిని. శాంతి నవ్వి ఊరుకొంది జవాబివ్వకుండా.
    "ఆఁ ఏముంది? పుస్తకాలు చదువుకోవడం-సినిమాలు చూడటం!" అన్నాడు సృజన్.
    "నన్నడిగితే మన స్త్రీలు తమ భవిష్యత్తు తామే పాడుచేసుకుంటున్నారని చెప్తాను. మీరు ఇంటర్మీడియట్ పాసయ్యారని అన్నారుకదా! పై చదువులెందుకు చదవరు?"
    శాంతి జవాబివ్వలేదు.
    "పదండి పోదాం!" అంటూ లేచాడు సృజన్.
    ముగ్గురూ మళ్ళీ రవీంద్రభారతిలోకి నడిచారు. నాటి లన్నీ అయిపోయాక సృజన్, శాంతీ ఇద్దరూ ఆటోలో ఇల్లు చేరుకొన్నాడు.
    శారదమ్మ ఇద్దరికీ భోజనం వడ్డించింది.
    "నేను కాలేజీలో చేరతానన్నాయ్! చదువుకో ఏదయినా ఉద్యోగం చేస్తాను!" అంది శాంతి తలవంచుకునే.
    అతను ఆశ్చర్యపోయాడు. శ్రీపతి ప్రభావం ఆమె మీద పడుకొందని తెలుసుకొన్నాడతను.
    "తప్పకుండా చేరు శాంతీ! రేపే ఆ గొడవేదో చూద్దాం!" అన్నాడు ఆనందంగా.
    
                                           6
    
    పెళ్ళివారింట్లో రాధమ్మ ఓ గదిలో కూర్చుని బట్టలన్నీ పెట్టెల్లోకి సర్దుతోంది. నెమ్మదిగా అక్కడికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు సురేంద్ర. రాధమ్మ అతనివంక చూసి తిరిగి తన పనిలో నిమగ్నమయింది.
    "అమ్మా!" అంటూ పిలిచాడు సురేంద్ర కొద్ది క్షణాలాగి.
    చేస్తూన్న పని అది కొడుకువంక ప్రశ్నార్ధకంగా చూసిందామె.
    "మనం ఇవాళే వెళ్ళిపోదామమ్మా" అన్నాడు పొడిగా ఆమె ఆశ్చర్యపోయింది.
    "ఎక్కడికి?" అంది అతనివంకే చూస్తూ.
    "మన ఊరు!" ఆమెనుంచి చూపు మరల్చుకుంటూ అన్నాడతను.
    "అదేమిట్రా! ఇక్కడ నువ్వు మూడు రాత్రులు గడపాలిగా!" విస్తుపోతూ అందామె.
    "ఇంకొక్క క్షణంకూడా నాకిక్కడ ఉండటం ఇష్టం లేదమ్మా! ఇప్పుడు నన్నింకేమీ అడగకు. మన ఊరు చేరుకున్నాక అన్ని విషయాలూ వివరంగా చెప్తాను మధ్యాహ్నం రెండు గంటలకు వైజాగ్ బస్సుంది. దానికి వెళ్ళిపోదాం."
    రాధమ్మ అయోమయంగా అతనివంక చూస్తుండి పోయింది. ఇంత హఠాత్తుగా ప్రయాణం పెట్టుకోడానికి కారణమేమిటో, ఆ కారణం ఇప్పుడే తనకెందుకు చెప్పకూడదో ఆమెకేమాత్రం బోధపడలేదు. ఒకవేళ స్వరూపతో ఏమయినా తగూపడ్డాడా? మొదటిరాత్రే తగూలేముంటయ్ తన పిచ్చిగాని!
    ఒకవేళ పెళ్ళివారి తరపున వీడికేమయినా లోటుపాట్లు జరిగినయ్యా? అలాంటిదేమయినా ఉంటే తనతో చెప్పడానికేముందీ? ఐనా అలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకునే మనస్తత్వం కాదు వాడిది!
    "మూడు రాత్రులనందే మరి వాళ్ళు స్వరూపను పంపుతారో లేదో."
    "మనం స్వరూపను తీసుకెళ్ళడం లేదు" నిశ్చయించుకున్నట్లుగా అన్నాడతను.
    రాధమ్మ మరింత ఆశ్చర్యపోయింది.
    "అదేమిటి? స్వరూపను తీసుకెళ్ళకుండా ఎలా?"
    "ఏమోనమ్మా ఇప్పుడు నన్నేమీ అడగవద్దని చెప్పానుగా. స్వరూప మనతో రావడానికి వీల్లేదు అంతే! వాళ్ళతో ఏదో ఒక కారణంచెప్పి మనం బయలుదేరాలి" కుర్చీలో జేరగిలబడి, తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకున్నాడు.
    రాధమ్మకేమీ పాలుపోవడంలేదు. సురేంద్రలో ఏదో అశాంతి చోటుచేసుకుందని తేలికగానే తెలిసిపోతోంది. ఇలాంటి సమయంలో ఇంకేమడిగినా అతని మనస్థితిని దిగజార్చటమే తప్ప మరేమీ ఉపయోగం ఉండదు.
    ఇంతకూ ఇప్పుడు తమ హఠాత్ప్రయాణానికి కారణం పెళ్ళివారి కేమని చెపుతుంది.
    ఆలోచనలో పడిందామె.
    "నేను బస్ స్టాండ్ కు వెళ్ళి మనందరికీ సీట్లు రిజర్వేషన్ చేసుకొస్తాను" లేచి బయటకు నడుస్తూ అన్నాడు సురేంద్ర.
    తనూ లేచి స్వరూప తల్లిదగ్గరకు నడిచింది రాధమ్మ.
    "రండి కూర్చోండి" అందామె లేచినిలబడుతూ.
    "మీరూ కూర్చోండి" ఆమెపక్కనే కూర్చుంటూ అంది రాధమ్మ.
    "పెళ్ళి గొడవలో బాగా అలసిపోయినట్లున్నారు" అంది స్వరూప తల్లి నవ్వుతూ.
    "అవునండీ! అదే చెప్దామని వచ్చాను. రాత్రి మళ్ళీ గుండెనొప్పి వచ్చింది. అబ్బాయికీ సంగతి చెబితే ఇప్పుడే వైజాగ్ వెళ్ళిపోదామని కూర్చున్నాడు. అక్కడయితే ఇంత వరకూ నాకు వైద్యంచేసిన డాక్టరుంటాడు కదా!"
    ఆమె ఏమీ మాట్లాడలేక పోయింది కొద్దిక్షణాల వరకూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS