Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 7


    "ఛీ! ఆడదానిమీద పశుబలం చూపడానికి సిగ్గుండక్కర్లేదూ? మీకు నా చరిత్ర వివాహానికి ముందే తెలిసి నప్పుడు-అప్పుడు మా వాళ్ళను అడగాల్సింది. అమ్మ ఆరోగ్యం వంకన పెళ్ళెందుకు చేసుకున్నారు? మరేదైనాకారణం అని ఆపేయవచ్చుగా?"
    "చాలా తెలివైనదానివి స్వరూపా నీ దురదృష్టవశాత్తూ నీ కంటే తెలివైనవాణ్ణి దొరికాను నీకు. నాక్కావలసింది 'వివాహం' కాకపోవడంకాదు. నీకు తగిన శాస్తి జరగడం. జీవితంలో మరోసారి నాలాంటి వాళ్ళని మోసగించకుండా గుణపాఠం నేర్పడం-అందుకే వివాహం చేసుకున్నాను. ఈ రాత్రి గడిస్తే చాలు, సంఘం దృష్టిలో నువ్వు వివాహితురాలివవుతావ్. ఎక్కడకెళ్ళినా, ఎప్పటి కైనా "ఫలానావాడి భార్య" అన్న ముద్ర మాసిపోదు. అదే నాక్కావలసింది. అప్పుడిక నీ మోసాలూ-నటనలూ పనిచేయవ్, మరెవ్వరూ నీవలలో పడరు, నిజంగా నాభార్యా నయ్యానని సంతోష పడుతున్నావేమో. ఆ ఆనందంకూడా నీకు డక్కనివ్వను, ఇదే మనకు మొదటి రాత్రీ, ఆఖరిరాత్రీ కూడా ఈ క్షణం నుంచీ నీకూ నాకూ ఎల్లాంటి సంబంధమూ ఉండదని గుర్తుంచుకో. నిన్ను చూస్తేనే నా కసహ్యంగా ఉంది." కోపంగా అన్నాడు సురేంద్ర. ఉద్రేకంతో అతనికి ఆయాసం కూడా వచ్చింది.
    స్వరూప మొఖం వివర్ణమయిపోయింది. పెదాలు బిగపట్టి దుఃఖం ఆపుకోడానికి ప్రయత్నించింది. కొద్ది క్షణాల తర్వాత తేరుకొని నెమ్మదిగా అంది.
    "నా జీవితంలో మిగిలిందేమీలేదు-ఇప్పుడు పోగొట్టుకోడానికి. నేనేమయిపోతానో అన్న బాధ, భయం కూడా నాకు లేదు. నన్ను అసహ్యించుకొనే మనుషుల కంటపడటం నాకూ అయిష్టమే..." చరచర తలుపు దగ్గరకు నడిచిందామె. సురేంద్ర మెరుపులా నడిచి తలుపు కడ్డంగా నిలబడ్డాడు.
    "ఇప్పుడే గది వదలి వెళ్ళడానికి వీల్లేదు. నీ కిష్టం ఉన్నా లేకపోయినా ఉదయం వరకూ ఇక్కడ పడి ఉండాల్సిందే..." కర్కశంగా అన్నాడు.
    స్వరూప నిస్సహాయంగా అతని వంక చూసి, నెమ్మదిగా వెనక్కు తిరిగి దూరంగా ఉన్న కుర్చీలో కూలబడి పోయింది.
    సురేంద్ర లైట్ స్విచ్ ఆఫ్ చేసి నైట్ బల్బ్ వెలిగించుకొన్నాడు. గదంతా మసక కాంతితో నిండిపోయింది.
    మంచం మీదకు వరిగి సిగరెట్ వెలిగించుకొన్నాడు. అతని మనసంతా అల్లకల్లోలంగా అయిపోయింది. అతనికి తెలీకుండానే అతని కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్. మొదటి రాత్రి. ఎన్నో కధల్లో చదివాడు. ఎన్నో సిమిమాల్లో చూశాడు. తన మొదటి రాత్రికూడా అంత మధురంగానూ ఉంటుందని కలలు కన్నాడు. కాని చివరకు జరిగిందేమిటి ఈ చరిత్రహీనురాలు మూలాన తన కలలన్నీ ధ్వంసమయిపోయినయ్. స్వరూప మీద కసికొద్ది తన జీవితం కూడా అర్ధరహితంగా చేసుకున్నాడు. ఫలానావాడి భార్య అన్నముద్ర ఆమె మీద పడాలన్న ఆవేశంలో-తనకీ 'ఫలానా అమ్మాయి భర్త" అన్న పేరు మిగిలిపోతుందన్న విషయమే మర్చిపోయాడు. శిలాప్రతిమలా కూర్చున్న స్వరూపను చూస్తూంటే అతనికి కోపమూ, ద్వేషమూ ఎక్కువయి పోతున్నాయ్. సమయానికి సృజన్ బాబు చెప్పబట్టి తెలిసింది. లేకపోతే, దీని పవిత్రను నమ్మి, స్వరూపతో సంసారం సాగించేవాడే! చెడిపోయిన స్త్రీతో సంసారం! ఆ ఊహే భయంకరంగా ఉంది. స్త్రీ కాలు జారడం తప్ప, మరే తప్పు చేసినా క్షమించగలడు తను.
    తెల్లారేసరికి గదంతా సిగరెట్ పీకలతో నిండిపోయింది.
    "ఇంక నువ్వు బయటకు పోవచ్చు." స్వరూప నుద్దేశించి అన్నాడతను. అంత వరకూ శిలా ప్రతిమలా కూర్చున్న స్వరూపాలో చలనం కలిగింది. లేచి వాడిపోయిన మొఖంతో గది తలుపు తీసుకుని బయటకు నడిచింది. స్వరూప వెళ్ళిపోయాక హృదయం కొంతవరకూ తేలిక పడ్డట్టనిపించిందతనికి. అలసటగా కళ్ళు మూసుకొన్నాడు. కొద్ది క్షణాల్లోనే గాఢంగా నిద్రపట్టేసింది.
    
                                            5
    
    ఇంకా చీకట్లు పూర్తిగా విచ్చుకోకుండానే వరుసగా హైద్రాబాద్ చేరుకుంటున్నాయ్, ఆర్టీసీ బస్ లు! సృజన్ ఓ బస్సులోనుంచి, సూట్ కేస్ చేత్తో పట్టుకొని దిగాడు ఆటోవాళ్ళు అతన్ని చుట్టుముట్టేశారు. వాళ్ళకి సైకాలజీ తెలుసు. చికాగ్గా, పరధ్యానంగా ఉన్న ప్రయాణికులు ఎంత డబ్బడిగితే అంతా ఇచ్చేస్తారు. ఒక్కోసారి మీటరు చార్జి కాకుండా మరో మూడునాలుగు రూపాయలు ఎక్కువ వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయ్.
    "ఎక్కడికి పోవాల్సార్?" గట్టిగా అరిచాడు ఓ ఆటో డ్రైవరు.
    సృజన్ బాబు అప్పటిగ్గాని ఆలోచనల్లోంచి తేరుకోలేదు. బస్ హైద్రాబాద్ బస్ స్టాండ్ చేరుకోవడం, తను సూట్ కేస్ తీసుకుని దిగడం-ఇవేమో గుర్తు లేవతనికి. అంచేత ఆటో డ్రైవరు అడిగిన ప్రశ్నకి తేరుకొని ఆశ్చర్యపోయాడు. తను బస్ దిగి అప్పుడే బయటివరకూ నడిచివచ్చేశాడు.
    "విజయ్ నగర్ కాలనీ!" ఆటోలో కూర్చుంటూ అన్నాడు.
    "మీటరు మీద ఒక్క రూపాయి ఇవ్వాల్సార్!"
    "సరే-సరే త్వరగాపద." విసుగ్గా అన్నాడు సృజన్ బాబు. మరుక్షణంలో వాయువేగంతో దూసుకుపోసాగింది ఆటో.
    అతనికి కళ్ళు మండిపోతున్నాయి. రాత్రంతా కంటి మీద కునుకులేదు. ఎంత ప్రయత్నించినా స్వరూప రూపం కళ్ళ ముందునుంచి తొలగించటం సాధ్యం కాలేదు. ఎడతెరపి లేని సంఘర్షణ! గుండెల్ని కాల్చివేసే పశ్చాత్తాపం.
    తను స్వరూప జీవితం నాశనం చేసేడు. సురేంద్ర పట్టుదల తనకు తెలుసు. ఆ అమ్మాయిని చంపేస్తాడేమో అన్న అనుమానంకూడా లేకపోలేదు. అప్పుడు తను రెండు జీవితాలను నాశనం చేసినట్లవుతుంది. ఇంత దారుణానికి ఎందుకు పూనుకున్నాడు తను? స్వరూపని గుర్తించనట్టే ఊరుకుంటే ఎంత బావుండేది. ఆమె చరిత్ర మర్చిపోతే ఈ గొడవుండేది కాదుకదా! ఎవరికెలా రాసిపెట్టుందో అలా జరిగేది. మధ్యలో తనెందుకు కల్పించుకున్నాడు? తనలాంటి పాపాత్ముడు మరొకరెవరూ ఉండరు.
    సృజన్ బాబు కీ ఆలోచనలు నచ్చలేదు. తనిలా ఆలోచించకూడదు. ఏది మంచో ఏది చెడో తనకు తెలుసు. ఓ మంచిస్నేహితుడిగా తనధర్మం తనూ నెరవేర్చాడు. ఇందులో తప్పేముంది. తన ప్రాణస్నేహితుడు-ఓ కాలుజారిన అమ్మాయిని చేసుకోవడం తనెలా సహించగలడు? తనేకాదు-నిజమయిన స్నేహితుడెవరయినాసరే-తను చేసినపనే చేస్తాడు.
    ఆటో విజయ్ నగరు కాలనీలో ప్రవేశించింది.
    "అదిగో! ఆ మోటరుసయికిలున్న ఇంటిఅవతల ఆపు" చేతితో చూపుతూ అన్నాడు సృజన్. ఆ ఇంటి ముందు అది ఆగింది. డ్రైవరుకి చార్జి ఇచ్చేసి దిగి ఇంటిలోపలకు నడిచాడతను.
    అప్పటికే శాంతి వంటింట్లో కాఫీ తయారు చేస్తుంది. సృజన్ బాబుని చూడగానే చిన్నగా నవ్వింది.
    "ఇప్పుడే అనుకుంటున్నానన్నాయ్-ఇంకా రాలేదే మా అని!" అంది అతనివంక చూస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS