Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 7


    "నీ కవిత్వంతో అఘోరిస్తే ఆ కథ కాస్తా చచ్చి ఊరుకుంటుంది. కనుక ఆ ప్రయత్నం మానుకో అన్నాడు మూర్తి.
    "నీవంటి రసికత తెలియని చవటలకు నా కవిత్వంలో సారం తలకెక్కదు" అంటూ పొడిచాడు కవి.
    "సవటాకు రుచిలేని నీ వెధవ కవిత్వం చవటలు కూడా చదవరనే సంగతి గుర్తించావన్నమాట. సంతోషం అన్నాడు రమణమూర్తి విరుస్తూ.
    ఇంకా అక్కడే వుంటే వీళ్ళ గందరగోళం ఎక్కువైదని లెమ్మని బయల్దేరదీశాను. మరో అరగంటలో కొండవీడు సత్రంగా పిలువబడే 'ఫారెస్ట్ బంగ్లా' కు వెళ్ళాము. అప్పుడు ఏడుగంటలు కావస్తోంది. చౌకీదారు రూమ్ శుభ్రం చేశాడు. చలిగాలి రివ్వున వీస్తోంది. చుట్టూ సమ్మున్నతమైన గిరిరాలు, పచ్చని చెట్లు, ఒక పక్క గృహరాజు సౌధములు వంక రాణి వాసాలు బురుజులూ, మరొకవంక లోతు యని అగాధమైన కోనేరు తూర్పున అంతూ దరీ కనిపించని 'రిజ్వర్డు ఫారెస్టు' కొద్దిపాటి గుడ్డి వెన్నెలలో అడవి వృత్తే  నల్లగా దయ్యాల్లా అవుపిస్తున్నాయి. ఒకటే కీచురాళ్ళరొద. దూరంగా నక్కల అరుపులు.
    చీకటి పడుతున్నకొద్దీ ఏకాంతం నన్ను చుట్టుముట్టింది. అలసిపోయిన మిత్రులు గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను వరండాలో పచార్లు చేస్తున్నాను. నా కనులముందు పెద్ది యజ్జ్వ దర్శనమిచ్చారు.
    దబ్బపండు వంటి మేని చాయతో వేదాలు ఉట్టిపడే ముఖ వర్చస్సుతో, 'రా నాయనా' అని పిలుస్తున్నట్టుగా మాటలవైపు కాసాగాను. ఆ భావన కలిగినప్పుడల్లా అడవిలోకి నా చూపులు ప్రవర్తిస్తున్నాయి. ఓబులు చెప్పిన కథ ప్రకారం ఆ లోయలోని అడవిలోనే అతనికి పెద్దియజ్జ్వ కనిపించారు.
    పెద్దియజ్జ్వ!
    రెడ్డి రాజుల కుల గురువు. అపర అభిమన్యుడైన సోమదేవుని కడసారి చూచిన ఏకైక వ్యక్తి. అగ్నిప్రవేశం చేస్తున్న ముగ్ధకుమారి వేమాంబ కడసారి పలుకులు విన్న ఏకైక వ్యక్తి.
    శాపగ్రహస్తమైన ఆ ప్రేమ హృదయాల బాధామయగాధ కుమిలి వున్న సాక్షి. కసుక్కున ముల్లు దిగితేగాని నేను అడవిలో నడుస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఇక వెనుతిరగాలనిపించలేదు.

                                               3

    అది మనోదౌర్బల్యం కావచ్చు. మరొక మానసిక రుగ్మత కావచ్చు. లేక మానవాతీతమయిన ఆకర్షణ ఏదైనా ఉండి ఉండవచ్చు.
    నేను ఆ రాత్రి అడవిలో ఒంటరిగా నడుస్తున్నానన్న సంగతి నాకు స్ఫురిస్తూనే ఉంది. ఎందుకలా వెళుతున్నాను, గమ్యం లేకుండా ఎందుకు పోవాలి? అనే ప్రశ్నలు మటుకు నాకు ఉదయించలేదు. ఓబులు ఇది మానసిక శక్తితో నన్ను ప్రేరేపించినప్పుడే నాలో మార్పువచ్చి వుంటుంది. అది యిప్పటివరకూ సబ్ కాన్షస్ లో వుండి ఇప్పుడు ఉరకలు పరుగులు వేస్తూ ఉంది. ఎలాగైతేనేం నేను ఉన్మత్తుని వలె మారిపోయాను.
    అలా ఎంతసేపు నడిచానో! అవన్నీ నాకు అపరిచిత ప్రాంతాలు. కొండవీడు పాతదే అయినా అడవిలో ఒంటరిగా తిరగడం నాకు క్రొత్త. అందునా అర్థరాత్రి కాబోయేముందు భయమనేది తెలియలేదు. రెండు మూడు గంటలు గడిచాయి. గంట పది దాటిపోయింది. కీచురాళ్ళధ్వని. నక్కల అరుపులు! నేను దాదాపు "రిజర్వ్ ఫారెస్టు" మధ్యలో వున్నాను. వెన్నెలవెండి దారాలు అల్లుతోంది. చుట్టూ ఎత్తయిన కొండలు లోయలో ఎటు చూచినా వృక్షాల సముద్రం! వెదురు పొదల్లోంచి దాటి వెళ్ళాలంటే మటుకు చాలా కష్టంగా వుంది.
    అక్కడక్కడా ఎత్తయిన రాతిగుట్టలున్నాయి. పదహారు నక్షత్రాలతో కూడిన వృశ్చిక రాశిని నేను ఆకాశంలో సులభంగా గుర్తించగలను. దాని ఆధారంగా చూస్తే నేను ఈశాన్య దిక్కుగా నడుస్తున్నానని తెలుస్తూనే ఉంది. అంటే మొత్తం అడవిలోకి చాలా దుర్గమమైన ప్రాంతాలకు వెళుతున్నానన్నమాట!
    మరికొంతదూరం పోయాక కొన్ని గుహలు కనిపించాయి. గుహలమీద ఎత్తయిన వేదికల్లా అవుపించే రాతి గుట్టలు.
    ఆ గుహల్లో అతి పెద్దదైన గుహముందు వేదికపైన ఏదో ఆకారం అవుపించింది. అది మానవాకారమే! నన్ను రమ్మని సైగ చేస్తున్నట్లు ఉన్నది. వెళ్ళాను. మరీ దగ్గరగా వెళ్ళాను.
    నేను దగ్గరగా పోయాక ఆ మానవమూర్తి నవ్వినట్లనిపించి కొన్ని వందల మెరుపులు ఒక్కసారిగా వెలిగినట్లయింది నాలో. అది మానసికమైన భావావేశం పొంగిపొర్లిపోతోంది. నాది మామూలు పాంచ భౌతికమైన దేహమనీ. అదీ కొన్ని పరిధుల్ని అతిక్రమించి ప్రవర్తిస్తే నిలవదనీ, చలనాన్ని కోల్పోతుందనీ, ఈ విషయాలన్నీ నేను మర్చిపోయానా!
    ఛెంగు ఛెంగున రాళ్ళ గుట్టలు దాటుకుంటూ వెళ్ళి ఆ మహోన్నత మానవాకారం ముందు ప్రణమిల్లాను. ఆ మానవమూర్తి అలానే దరహాసాల్లో మెరుపుల్ని కురిపిస్తూ నా తలమీద చేయి వుంచి "లే నాయనా!" అన్నది. నేను లేచి వినమ్రుడనై నిలిచాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS