అట్లా పీనిగపోతోంది. పీనిగనిచూస్తే భయం. భయం పోకపోవడం సిగ్గుపడాలి. నేను అట్లా అయిపొయ్యేరోజుజ్ఞాపకం వొస్తుంది. చస్తేనేం? అసలు అట్లా నిర్జీవంగా అయిపోవడం అసహ్యం. శరీరం యెట్లాగో మాయంకావలి. అట్లా కట్టె కాకూడదు. ఎన్నో ప్రేమాలింగనాల్ని పొందిన దేహం, రామ్మూర్తి అన్నట్టు ప్రతి అంగుళమూ స్త్రీచుంబనాలతో పవిత్రమైన దేహం - మృత్యువంటే భయం ఎంత తర్కించుకున్నా పోదు. అది చిన్నతనపు అనుభవాలతో శాశ్వతంగా అతుక్కుంది మనసుమీద. జీవితంమీద ఈలోకం లోని సుఖాలమీదవున్న అభిలాషచేత మృత్యువంటే తిరగబడతాను.
చచ్చిపోతే మాయమౌతాము. అసలు లేకుండాపోతాము. అంటే కలలులేని నిద్ర. ఇంకేంభయం?
తలుచుకుంటే గమ్మత్తుగా వుంటుంది. ఒక్క వూపుతో, యీ డబ్బుకోసం దిగులు, school results మీది ధ్యాస, ఈ దేహాన్ని చక్కగా వుంచుకోవాలనే మమత, పిల్లలందరూ ఎట్లా అభివృద్ధి పొందుతున్నారో అనే యోచన, కథలు, పత్రికలు, సంస్కారం స్త్రీ స్వేచ్చ, రాత్రిభోజనం-అన్నీ అన్నీ-యివేమీ వుండవు. నిద్ర, చీకటి-యింకేం లేదు.
మళ్ళీ పుడతామా? ఆ పుట్టడం తలుచుకుంటే కోపం ఎవరికో పిల్లై పుట్టడం, వాళ్ళు పెంచడం, మళ్ళీ నడవడం, నవ్వడం చదవడం నేర్చుకోడం-ఎంత waste, ఎంత stupid! మళ్ళీ ఆటీచర్లూ, అన్నలూ, కొట్టడం! వీల్లేదు. మళ్ళీ పుట్టడం వొప్పుకోను. ఈ లోకమే, అనుభవాలే, మనిషిని, క్రమంగా సంస్కరించి, యీ కర్మ ఫలాలవల్ల, బాధపెట్టి పాపకార్యాలనించి మళ్లించడమే, యీ జన్మల ఉద్దేశ్యమైతే-మళ్ళీ చిన్నతనం, చదువు, పెళ్ళీ-ఒకటే అనుభవాలు తిరిగి, తిరిగి జరగడం-ఎంత stupid waste!
పుటకకీ పుటకకీ మధ్య స్వర్గనరకాలున్నాయా? జీవితం అంటేనే చాలామందికి పాపం పెంచుకోడం. నరకానికి ఇంకా ఎక్కువగా యోగ్యులు కావడం ఇంకా పాపంచేసి నరకభారం పెంచుకోడం కంటే యెంతత్వరగా చస్తే అంత నయం.
ఇట్లా Argue చేస్తారనే, ఆత్మహత్య అంటే అంత బెదురు పెట్టారు. ఆత్మహత్య ఎందుకు తప్పు? అని నిలవేసి అడుగుతే 'దేవుడి ఉద్దేశ్యానికి విరుద్ద'మని, వాళ్ళకి దేవుడు తన వుద్దేశ్యాలని తెలియచేసి నట్టు మాట్లాడతారు. ఒకాయన యామన్నాడంటే To die volun traily is to socept defeat at life's hands అన్నాడు. కాని మన బతుకే అపజయం. చావేనన్న మాటేమిటి?
నిజంగా తలుచుకుంటే యీ బతుకు ఎంత దుర్భరం? యీ తిండి, పొట్టలోకి పదార్ధాలు తొయ్యడం; దొడ్డికిపోవడం, దేహం లోంచి వొచ్చే మురికిని కడగడం! ఇతరుల్నీ మోసంచెయ్యకుండా, Competetion లేకుండా బతకలేకపోవడం, భయాలు, ద్వేషాలు ఇవి యెంత ప్రయత్నించినా వొడలకపోవడం, సెక్సు, పిల్లలు, యేడుపులు, నిస్సహాయంగా ఆధారపడేవారు....ఒక్క బాధని, రోగాన్ని తీసి వెయ్యలేని నిరాధారం, మృత్యువు-ఛీ యింత దుర్భరం-
ఏ విధానచూసినా, చావును చూసి భయపడవలసిన కారణం కనపడదు. కాని కారణం కనపడకుండానే మన reason కీ శక్తికీ తిరగబడి మనసు పనిచేస్తుంది. ఇంద్రియాల్ని నిగ్రహించగలిగినవాడికి కూడా మనసుని పాలించడం చాతకాదు. ఈ మనసుని లోబరుచుకునేందుకే యోగమూ, జపం, తపస్సు యిన్ని ఏర్పరిచారు గావును!
సాయంత్రం. Express trains కి వేళ అవుతోంది. ఇక్కన్నించి తప్పించుకుని బైటపడాలి. ఎందుకో రైళ్ళని చూస్తే సంతోషం? రైల్లో మనుషులు సంతోషంగా వుంటారనా? కాక నిలవఉన్న నీరుమల్లే గాక కదలుతో వుంటారనా? రైలులో మనుషులు- ఎక్కడికో-దూరంగా-కలలుకన్నా ప్రదేశాలకి-యీ మామూలు వాతా పరిణనించి ఎక్కడికొ యింకో అందమైన లోకాలకి వెడుతున్నట్టు కనపడతారా! రైళ్ళవల్లనే అత్యంతప్రియులైన మిత్రులు నా దగ్గరికి వొస్తోవుంటారనా?
ఒక్కొకరిసే పలకరించి ఆ రైల్లో మనుషుల్ని ఏం పనిమీద యెక్కడికి వెడుతున్నారో కనుక్కోవాలనిపిస్తుంది. నేనే వూహించుకుంటాను వాళ్ళ మొహాన్ని చూసి. మొన్న పెద్ద స్వంతపెట్టి లో రాత్రి ఒక గొప్ప అయ్యర్ని చూశాను. ఎంత అదృష్టవంతుడో అనుకొంటామా! వొంటరిగా, దిగులుగా అన్నియావలూ illusions పోయినవాడివలె కూచుని వున్నాడు ఓ కుర్చీలో. వాళ్ళ బాధలు వాళ్ళవి. వాళ్ళకీ నిరాశలూ, disappointments వుంటాయి. బీదతనంలో వుండే struggle లేనిదీ జీవితానికి చురుకు లేదేమో! మళ్ళీ దరిదాపులేని దారిద్ర్యం మొద్దుబారిస్తుంది మనిషిని. సోషలిజమ్ వొచ్చి అందరి భౌతిక వాంఛలూ తృప్తిపొందితే ఇప్పటి చురుకు పోతుందేమో ఒకవేళ!
ధనవంతులు, సుఖంలో జీవించేవారు అదృష్టవంతులనుకుంటామా! కాదు. ఏ నిమిషాని కానిమిషం తీసుకొచ్చే సుఖబాధల quality మీద ఆధారపడివుంటుంది మన జీవితపు విలువ. అన్నం లేక మాడినవాడి నోట్లో పెట్టుకున్న అంబలిముద్ద, ఆకలిలేని ధనికుడు తినేపరమాన్నంకన్న pleasing quality లో ఎక్కువ విలువ కలది. అట్లానే గొప్ప ఉద్యోగస్తుడు రోజల్లా వుద్యోగపు సమస్యలతో చిరాకుపడుతూ వుంటే, నెమ్మదిగా బస్తాలుమోసే కూలీకంటే సుఖంలేని హీనస్థితిలో వున్నాడన్నమాటే! ఎండలో నుంచుని కిటికీలోంచి అధికారిని చూసి కూలివాడు ఆ పంకాలూ, బల్లలూ, అద్దాలూచూసి అనవసరంగా యీర్ష్య పడతాడు.
ర-----కి చాలా జబ్బుచేసింది. ఓసారి హాస్పిటల్లో పడుకోపెట్టాల్సివొచ్చింది. దూరంగానే వేరే గది యిచ్చారు. డాక్టరు ర----- బతకడన్నాడు. రాత్రింబవళ్ళు అన్ని గంటలూ ఆ గదిలో మేమిద్దరం యెదురుగా అంతసేపు అతని జీవన మృత్యువుల్ని గురించి ఆలోచిస్తో హృదయక్షోభతో నేను-అతను లేకపోయినరోజు నా వంటరితనం....ఏమౌతాడు? ఆ మెత్తని వేళ్ళూ ధిక్కరించే చూపులూ, కవిత్వం, జీవితంమీది ఆశలూ, కలలూ అన్నీ.......ఏమైపోతాడు? అంతా శూన్యమా ఇంత వికృతమా జీవితం? చదువుకుందామంటే కళ్ళు కలిగాయి. నా ఆదుర్దా. భరించరానివేదన.
