ఎసఁగి లోకంబు తీరేడు నేలు వాని
మిగులఁ బొడవైన తెల్లని మేనువాని
మహితవృషరాజు నెక్కినమహిమవాని
మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.
అంబికా!
ఉ. భారతివై సరోజభవు పాల వసించి రమావధూటివై
నీరజనాభుఁ జెంది ధరణీధరనందనవై మహేశ్వరుం
గోరి వరించితమ్మ నినుఁ గొల్వక యూరక యేలకల్గు సం
సారసుఖంబు లీమనుజసంతతికిం దలపోయ నంబికా!
ఉ. కూడేడి వెండ్రుకల్ నిడుదకూఁకటఁ బ్రోవుగ బోడ్డుపై వళుల్
జాడలు దోపఁ గ్రోమ్మొలక చన్నులు మించుదొలంక సిగ్గునం
జూడఁగ నేరముల్ మెఱుఁగుఁజూపుల నీన హిమాద్రియింట నీ
వాడుట శూలికిన్ మనము వాడుట గాదె తలంప నంబికా!
ఉ. వాలికన్ను ముంగురులు వాతేఱ కెంపు మెఱంగుఁ జంటి పై ఁ
గ్రాలెడు తారహారమును గంకణచారుకరంబు డావలం
దూలుచునున్న పయోధ్యయుఁ దోచిన కన్నులు మోడ్చి మోడ్చి నీ
పాలగునీశుమేను సగపాలు మనంబునఁ జేర్తు నంబికా!
ఉ. లాచి వరంగనల్ వరవిలసమనోహర విభ్రమంబులన్
జూచినఁజూడఁడుత్తముఁడు, చూచినఁ జూచును మధ్యముండు, దాఁ
జూచినఁ జూడకుండిననుఁ జూచును నీచుఁడు , నన్ను వీరిలో
జూసినఁ జూడకుండుగుణిఁ జూచిన చూపునఁ జూడు మంబికా!
చ. బెడఁ గగురత్న దర్పణముఁ బెరిన వెన్నెల వోసి నిచ్చలుం
దుడువఁగఁ బాలసంద్రమునఁ దోఁచి సుధాకరు మేనికందు వోఁ
గడుగఁగ, నేరేటేట సితకంజము ముంపఁగ , నైజకాంతితోఁ
దొడరినతల్లి! నీ మొగముతో సరివోల్పఁగఁ జాలు నంబికా!
ఉ. ఆదిమ'శక్తి యీ తరుణీ యాద్యకుటుంబిని యీకుమారి ము
తైదువ యీ తలోదరి చిదాత్మక యిసతి విశ్వమాత యీ
పైదలి సర్వలోకగురుభామిని యీ'చపలాక్ష్మి యంచు బ్ర
హ్మదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి నిన్నే ఱిఁగింతు రంబికా!
రఘురాముడు
సీ. బల్ జరీయంచు చల్వసఫేదు చీరపై
లాల్ పావడా డాల్ విలాస మోసగ
ఓనరు నీరా నమో జూదాబగష్టు కం
చుకముపై గుబ్బచన్సోగసు లొల్క
వగగుల్కు తగజిల్కు జిగితళ్కు కఠినమౌ
పొగసుకీల్జడకుచ్చు లోగి నటింప
నిగనిగ దగుమోము నొగిబాగు కస్తురి
పగ చుక్కబొట్టు ఠీవై చెలంగ
గీ. సరస మలరంగ తొలకరి మెఱు పనంగ
నలరు సీతాంగనను గూడి తౌననంగ
పృద్వీజారామ బుట్టయపేట హేమ
సౌదనిజధామ రఘురామసార్వభౌమ!
చం. గరుడని నెక్కి హేమ పటకంకణరత్న కిరీటకుండలా
భరణము లెల్లఁ దాల్చి కరపద్మయుగంబున శంఖచక్రముల్
మెఱయఁగ నింద్రనీలమణిమేచక కాంతుల దివ్యమూర్తితోఁ
ఐరగెడివేల్పు రామజనపాలుఁడు మాకు సహాయ మయ్యెడిన్.
శతకరత్నములు
శా. శ్రీనాధాంబుజ సంభవార్చిత నిజ శ్రీపాదపద్మద్వయున్
నానాదేవమునీంద్ర బృందకృతపుణ్యస్తోత్రపాత్ర క్రియా
నూనైశ్వర్య విరాజితున్ భుజగకేయూరాంకితున్ భక్త లో
కానీ కైకశరణ్యఁ గొల్తు నిను దాక్షారామ భీమేశ్వరా!
భీమేశ్వర శతకము
ఉ. గుండయ నుత్తమొత్తమునిఁ గూటికిఁ గప్పెరయై కడంగి యేం
డోండుగ నాటి యంగడికి నూరక తెచ్చితి తెచ్చి యత్తఱిన్
నిండిన వారిలోన నతనిన్ గడుఁబిన్నఁదనంబు సెర్చి తే
మండుము నీదు పెద్దతనమా యిది కొట్టయశంకరేశ్వరా!
కస్తూరి భట్టురాజు.
మ. ధరలో నుద్దురలోభులన్ ధనముచింతం గాంచి కాసంత వే
సరితిం గేసరి తీవ్రరోగహతి నష్టంబైనరీతిన్ మదు
ద్దరణం బాదరణంబున న్నిలుపవె తాపత్రయాగ్నిస్పుర
ద్గరిమార్చిన్ బరిమార్చి భక్తసులభా గౌరీ మనోవల్లభా!
గౌరీమనో వల్లభ శతకము.
ఉ. ప్రాణు నపానుఁ గూర్చి యలపాము గదల్చి తదూర్డ్వకీలితో
డ్యాణము నొత్తి మేను దృడమై నిగుడన్ బిగియించి దృష్టులన్
ఘోణముఁ జేర్చి యా ప్రణవ ఘోషణమున్ విని యందు మానస
క్షీణము చేసినన్ బసవసిద్దుఁడనా శివదేవధీమణి!
శివదేవ శతకము
ఉ. వారక కాశిలో నిలిచి వర్ధిల్లు పుణ్యులు చచ్చి పుట్టఁగా
నేరరుగాని నేరుతురు నేన్నుదుటం గనుచూపనైన దు
ర్వారవిషోరగేంద్రము శిరంబునఁ జుట్టఁగ నైన మ్రింగి సొం
పారఁ గళ ప్రదేశమున నాగఁగ నైనను గాలకూటమున్.
కాశీ శతకము
తో. చెలువార గజాజినచేలముతో
గలనీలిమతో నహికంకణుఁడై
తలఁ జంద్రకళం గలదైవము మా
కుల దైవము దైవత కోటులలోన్.
ఉపవాసము లెల్లను నుండుట నీ
కృప పచ్చుటకా యిది రిత్త సుమీ
అపవిత్రుని పుల్లని యంబలికై
సుపవిత్రునిఁ జేయుట శుద్ధి గదా!
రంగనాధుని తోటకములు
ఉ. లోకము లెల్ల నీతనువులోనివ నీవట యెంత గల్గుదో
నాకపపద్మ సంభావజనార్ధను లాదిగా నెల్లవారలున్
నీకొలఁ దింతయంత యననేరక ,మ్రొక్కుఁ దొడంగి రన్న ని
న్నేకరణిన్ నుతింతుఁ బరమేశ్వర! శ్రీగిరిమల్లికార్జునా!
పండితారాధ్య దేవర
మ. నిను సేవించినఁ గల్గుమానవులకున్ వీటీవధూటీ ఘటీ
ఘనకోటీ శకటీ కటీతటిపటీ గందేభవాటీపటీ
ర నటీహరిపటీ సువర్ణమకుటీ ప్రచ్చోటికా పేటికల్
కనధామ్నయమహతురంగ శివలింగా! నీలకంఠేశ్వరా!
ఎర్రా ప్రేగ్గడ.
