Previous Page Next Page 
తృప్తి పేజి 7


    సుధాకర్ ప్రేమగా చూశాడు కావేరివైపు "నీకు నిజంగా ఆ చీర కొనుక్కోవాలనిపించిందా?"
    "అనిపించింది. కానీ అది క్షణికమే. వెయ్యిరూపాయలంటే మనకి మామూలు కాదు. అవే వుంటే రేపు జయ శ్రీమంతానికి తడుముకోనక్కర్లేదు. మళ్ళీ స్కూళ్ళు తెరిచినప్పుడు పుస్తకాలకీ, డ్రస్స్ లకీ అప్పు చెయ్యనవసరం లేదు. ప్రభకీ, మీ బావగారికి పండక్కి బట్టలు పెట్టి పంపొచ్చు. ఇలాంటి ముఖ్యమైన పనులన్నీ వదిలిపెట్టి అ చీర కొనుక్కుని కట్టుకుంటే మనసుకి తృప్తా పాడా?"
    "పిచ్చి! ఎప్పుడూ ఇతర్లకోసమేనా? నీ కోసమాలోచించుకోవా?" గడ్డం పట్టి తనవైపు తిప్పుకున్నాడు సుధాకర్.
    "నా కోసమాలోచించడానికి మీరున్నారుగా! అయినా అడిగారు కాబట్టి చెప్తున్నాను. పూజకి జ్వరమొచ్చి కంగారుపడినప్పుడు బెజవాడ కనకదుర్గకి చీర పెడ్తానని మొక్కుకున్నాను. ఆ ఒక్కటీ తీర్చుకుందామండీ ఈ సంవత్సరం"
    "అది కూడా నీకోసం కాదే పిచ్చిమొద్దూ! నీలాంటి తెలివిలేనిదాన్ని నేను కాబట్టి భరిస్తున్నాను" తన తలతో ఆమె తలను ఢీకొట్టి చెప్పాడు సుధాకర్.
    "అవున్లెండి నేను మొద్దునీ, మీరు తెలివైనవారూ" దీర్ఘం తీసింది కినుకగా కావేరి.
    "అవునో కాదో ఇప్పుడే తెల్చేసుకుందామా? పూజా! అమ్మ తెలివైందా? నాన్న తెలివైనవాడా?" అడిగాడు అప్పుడే అటుగా వచ్చిన పూజని సుధాకర్.
    "చెప్పమ్మా. రేపు నీకు వచ్చేటప్పుడు క్యాడ్ బరీస్ తెచ్చిస్తాను" దాన్ని ఒళ్ళోకి తీసుకుంటూ చెప్పింది కావేరి.
    "రేపు ఐస్ క్రీమ్ తెద్దామనుకుంటున్నానే" కావేరి దగ్గరనించి తన ఒళ్ళోకి తీసుకుంటూ చెప్పాడు.
    వాళ్ళిద్దర్నీ మార్చి మార్చి చూసింది పూజ. క్యాడ్ బరీస్, ఐస్ క్రీం ఏది వదులుకోవడం? అన్నయ్య కూడా లేడు సలహా చెప్పడానికి.
    "ఇప్పుడే వస్తా" ఒక్క గెంతులో బామ్మ దగ్గరికి పరుగెత్తింది. "బామ్మా! ఒక్కమాట ఇలారా" అంటూ టి.వి. చూస్తున్నావిడ్ని చెయ్యిపట్టి గుంజుకొచ్చింది.
    "ఏమిటే" అంటూ దానివెంట పడుతూ లేస్తూ వచ్చింది వర్ధనమ్మగారు.
    "అమ్మ తెలివైందా? నాన్న తెలివైనవారా?" నడుంమీద చేతులు పెట్టుకొని ఆరిందాలా అడుగుతున్న కూతుర్ని చూస్తే నవ్వాగలేదా తల్లిదండ్రులకి.
    వర్ధనమ్మగారు కూడా నవ్వుతూ "వాళ్ళముందే అడిగితే ఎట్లా చెప్పేదే?" అంది.
    పక్కగదిలోంచి అన్నిమాటలూ వింటున్న మధుగాడు తల లోపలికి పెట్టి "అమ్మే తెలివైంది. ఏదడిగినా కొనకపోయినా కోప్పడదు. నాన్న గట్టిగా అరిచి, కోప్పడి చివరకు అమ్మకు తెలీకుండా రహస్యంగా కొననే కొంటారు" అన్నాడు.
    వాడి మాటలకి పకపకా నవ్వేరు అత్తాకోడళ్ళు.
    బుంగమూతి పెట్టి కొడుకువైపు చూస్తున్న సుధాకర్ ని ప్రేమగా చూస్తూ "నా కొడుకెంత తెలివైనవాడు కాకపోతే ఆరోజు పెళ్ళిచూపులవగానే "అమ్మా నాకా అమ్మాయి నచ్చింది. వాళ్ళ స్థితిగతులూ అవీ మనతో సమానంగా వున్నాయి కాబట్టి ఆ అమ్మాయికి మనలాగే ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. అదే లేనినాడు ఎన్ని కట్నాలు, కానుకలు ఇచ్చినా అర్థం లేదు అని టక్కున చెప్పాడు" అన్నారు.
    అవునా అన్నట్లు కళ్ళతోటే అడిగింది కావేరి.
    అంతేకాదు ఇంకా చాలా అన్నట్లు కనుబొమ్మలెగరేసి చెప్పాడు.
    "అయితే క్యాడ్ బరీస్, ఐస్ క్రీం" చప్పట్లు కొట్టింది పూజ.
    "రేపు తెచ్చిస్తారు కానీ ముందన్నాలు పెడ్తాను పదండి"
    వంటింట్లోకెళ్తున్న వర్ధనమ్మగారికి ఎదురుపడింది ప్రభ "అమ్మా! పచ్చడేమైనా వుందా? మేమివాళ దోసెలేసుకుంటున్నాము"
    "ఆ దోశలపిండేదో ఇక్కడికే తీసుకొస్తే వేసుకుని అందరం తినొచ్చుకదే" నవ్వుతూ ఆటపట్టించాడు సుధాకర్.
    "ఊర్కోండి. పొద్దుట చేసిన అల్లంపచ్చడివ్వండి అత్తయ్యా" అంటూ వంటింట్లోకి తనూ నడిచింది కావేరి.
    "ఇలారా నాన్నా, సైకిల్ బర్త్ డేకి కొంటాను సరేనా!" కొడుకుని దగ్గరకి తీసుకుంటూ చెప్పాడు సుధాకర్.


                                            *    *    *    *


    "ఛీ,ఛీ ఒక్క వస్తువు పెట్టిన చోటుండదు. ఏమిటే ఇల్లంతా ఇంత చిరాగ్గా పెట్టారు. వల్లీ! ఈ ప్లాస్టిక్ బొమ్మలు కాళ్ళల్లో గుచ్చుకుంటాయి. ఇంట్లో ఇలా ఇష్టం వచ్చినట్లు పారేయద్దని చెప్పానా? ఆ దిండ్లు కిందెందుకు పారేశారు? మాసిపోవూ, ముసలావిడేదీ? ఇల్లంతా అంగడంగడి చేసేస్తుంటే వద్దని కూడా చెప్పకుండా పడుకుని నిద్రపోయిందా? అబ్బా! అన్నం మెతుకులు, గోపీ ఏడి? సీతా ఇల్లూడ్చి, కుర్చీలు సరిగ్గా పెట్టు" అంటూ ధుమధుమలాడ్తూ లోపలికొచ్చింది నర్మద.
    నిజంగానే దొడ్లో మంచం వాల్చుకుని పడుకుని కనిపించింది తులశమ్మ. దాంతో అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది. "ఎంత రాజభోగం, ఎంత దర్జా! చచ్చీచెడీ కొంపచేరితే, ఇల్లంతా ఇలా వదిలేసిందిగాక నిద్రపోతోంది చూడు..."
    ఇంకా ఏదో అనబోతుండగా "అమ్మా! మామ్మనేమీ అనకు. పొద్దుటినుండి ఒకటే జ్వరం. అలాగే పనంతా చేసింది. సాయంత్రం నుండి ఎక్కువయిపోయింది. ఒకటే మూలుగు. నాకు భయమేసి పక్క మామ్మగారిని తీసుకొచ్చాను. ఆవిడేదమాత్ర, కాఫీ కలిపి తీసుకొచ్చి వేశారు. ఇప్పుడే నిద్రపట్టినట్లుంది" అంటూ భయం భయంగానే చెప్పింది పెద్దకూతురు.
    "పక్కింటివాళ్ళకి, ఎదురింటివాళ్ళకి తెలిసిందా? అమ్మయ్యా! ముసలావిడ్ని నానా కష్టాలు పెట్టేస్తున్నారు. లేవలేకపోయినా చూసే దిక్కులేదు అని అందరికీ ప్రచారమైపోవాలి. అంతేగా ఆవిడకి కావలసింది. ఇంకాసేపుంటే మా కోడలొస్తుంది. ఏ మందో మాకో ఇప్పిస్తుంది అని వాళ్ళతో చెప్పిందా? చెప్పదు ఎందుకు చెప్తుంది? ఈవిడకి సానుభూతి కావాలి. అందుకే ఈ వేషాలు" అంటూ ఇంకా అక్కసు తీరక వంగి నోట్సు రాసుకుంటున్న వల్లిని రెండు తన్ని "పో తమ్ముడ్ని తీసుకొచ్చి హోమ్ వర్క్ చేయించు" అంటూ గదిమింది. అది ఏడుస్తూ వీధిలోకి పరుగెత్తింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS