Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 7

అప్రయత్నంగా ఆ పక్కగదిలోకి చూశాడు సాహస్.
నిజమే!
కొద్ది క్షణాల క్రితమే ఒక మనిషికి అక్కడ శిరచ్చేదం చేయబడింది. తల ఒకచోటా - మొండెం ఒక చోటా వున్నాయి. కళ్ళు ఇంకా షాక్ తో తెరుచుకునే వున్నాయి. నోరు తెరుచుకుని వుంది.
మొండెం ఒక గజం అవతలగా గిలగిల కొట్టుకుంటోంది.
ఎదురు దాడికి దేహాన్ని సిద్ధం చేశాడు సాహస్.
"టేకిట్ ఈజీ!" అంది లేడీ పోలీసాఫీసర్ వ్యంగ్యంగా.
అదే క్షణంలో, ఆ అమ్మాయి మాటలకు ఎక్స్ టెన్షన్ లాగా, వెనక నుంచి ఎవరో ఒక రివాల్వర్ సాహస్ మెడకి ఆనించారు.
అతి కష్టంమీద తనని తాను అదుపులో పెట్టుకున్నాడు సాహస్.
అంచనా వేస్తున్నట్లు ఆ అమ్మాయి వైపు చూశాడు.
ఆ అమ్మాయి చెంపలమీద కూడా ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు రక్తం చిమ్మింది. తుడుచుకుంది తను. రూజ్ పూసుకున్నట్లు ఎర్రగా అయ్యాయి ఆమె చెంపలు.
ఆ అమ్మాయి మొహంలో ముందుగా కనబడేది -
అతి తీక్షణంగా చూసే కళ్ళు -
అవి అందమైన కళ్ళే!
కానీ ఆడవాళ్లకు సహజమైన సిగ్గూ, బిడియం, దయా దాక్షిణ్యం, కరుణా - ఏమీలేవు.
నల్లటి రివాల్వర్ బారెల్సు తాలూకు కొనల్లాగా -
సూటిగా చూసే కనుపాపలు!
సాహస్ అలా ఆమె కళ్ళల్లోకి చూస్తూ వుండగానే -
ఆమె కళ్ళలో మెరుపులు!
నిజంగానే!
రెండుసార్లు మెరుపులు కనబడ్డాయి ఆమె కళ్ళలో!
నిజంగానే కనబడ్డా - ఆమె కళ్ళలో మెరిసిన మెరుపులు కావవి!
సాహస్ కి వెనకనున్నవాడు రివాల్వర్ పేల్చాడు. అతని ముందు వున్న వాళ్ళలో ఒకడు నేలకొరిగాడు.
గన్ ఫైర్ తాలూకు ఫ్లాష్ ఆమె కళ్ళలో ప్రతిఫలించింది.
తన కాళ్ళ దగ్గర పడివున్న మృతుడివైపు ఒకసారి చూసింది ఆమె. తర్వాత సాహస్ వైపు తిరిగింది.
ఇక్కడ దయాదాక్షిణ్యాలూ -సెంటిమెంట్లూ వుండవు" అంది క్లుప్తంగా.
అది తనకు వార్నింగ్ అని తెలుసు సాహస్ కి.
కానీ -
తనకు వార్నింగ్ ఇవ్వడం కోసం -
ఒక నిండు ప్రాణాన్ని ....
ఇందాక రివాల్వర్ పేలినప్పుడు ఆ మెరుపులు ఆమె కళ్ళలో ప్రతిఫలించాయి. కింద పడిపోయిన ఆ మనిషి తాలూకు రక్తపు ఛాయలు సాహస్ కళ్ళలో ప్రతిఫలించి, కళ్ళు ఎర్రబడ్డాయి.
"నౌ యూకెన్ గో!" అంది ఆమె రివాల్వర్ వాలాని.
"యస్ కమిషనర్?...సర్!" అని రివాల్వర్ వాలా స్మార్ట్ గా సెల్యూట్ కొట్టాడు. తర్వాత, రెగ్యులేషన్ బూట్లు టక్ టక్ లాడించుకుంటూ వెళ్ళిపోయాడు.
కొన్ని చోట్ల ఫోర్సెస్ లో లేడీస్ ని కూడా 'సర్' అని సంబోధించడం జరుగుతూనే వుంటుంది.
"నా పేరు ప్రగతి! నా మారుపేరు టెర్రర్!" అంది ప్రగతి అనే ఆ లేడీ ఆఫీసర్.
నిశ్చలంగా ఆమె వైపు చూశాడు సాహస్.
"ప్రగతి, ఐ.పి.ఎస్. పోలీస్ కమిషనర్" అంది ప్రగతి, ప్రతి అక్షరంలో పొగరుని పలికిస్తూ.
తల పంకించాడు సాహస్.
కిసుక్కున నవ్వాడు అంకుష్ అనే ఆ పిల్లాడు.
చివుక్కున అంకుష్ వైపు తిరిగింది.
"నవ్వొస్తోందా నీకు?" అంది తీవ్రంగా.
"నాచురల్లీ!" అన్నాడు అంకుష్.
"నవ్వెందుకు?"
"నీకు తెలీదా?" అన్నాడు అంకుష్ ఆశ్చర్యం నటిస్తూ.
ఉరుముతున్నట్లు చూసింది ప్రగతి.
నవ్వు ఆపుకుంటూ చెప్పాడు అంకుష్. "కమిషనర్ సర్! ఒక సర్వ్ ప్రకారం, సగటున పిల్లలు రోజుకి నాలుగొందల సార్లు చిరునవ్వు నవ్వుతారు. 150 సార్లు గట్టిగా నవ్వుతారు. పెద్దలు మాత్రం రోజుకి పదిహేను సార్లు చిరునవ్వు నవ్వుతారు. ఓ డజను సార్లు పెద్దగా నవ్వితే గొప్ప!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS