తను తప్పక ఎం.ఎల్.ఏ. అవుతుంది. ఆ తర్వాత చిన్న మంత్రిని కాలేకపోతుందా? తప్పదు. ఇలాంటి ముష్టి మూడెకరాలు ఒక లెక్కా! అలాంటి ఎకరాలు ఎన్నయినా సంపాదించుకోవచ్చు! అనుకొంటూ దస్తావేజు మీద సంతకం పెట్టింది మిసెస్ కైలాసం.
ప్రతి ఓటరు అవసరాల్నీ, ఉద్దేశాల్నీ పసిగట్టి వాగ్దానాలు చేస్తూ ప్రచారం సాగించారు. మిసెస్ కైలాసం తాలూకు వారు.
బీదలు సాగుచేస్తున్న భూములకు పట్టాలిప్పిస్తామనీ ఎన్.జీ.ఓ. లు వుంటూ వున్నచోటు హక్కు భుక్తం చేస్తామనీ ప్రచారం సాగించారు. మిసెస్ కైలాసంగారి గొప్పతనాన్ని గురించి చెబుతూ - ఆమె దేశంలో ప్రబలిపోతున్న అవినీతినీ, అన్యాయాన్నీ చూసి సహించలేక గెజిటెడ్ ఆఫీసరు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఉరికిందనీ, ఆమెలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం ప్రజలు తమను తామే గౌరవించుకున్నట్టనీ శ్రీమతి శిఖండి గంట వాయించినట్టు వేదికల మీద ఎక్కి అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తోంది.
ఒక బహిరంగ సభలో మిసెస్ కైలాసం ఏమంటున్నారో వినండి_ "మహాజ్జనులారా! నన్ను గెలిపించి మిమ్మల్ని మీరే గౌరవించుకోండి! (జనంలో నవ్వులు) నవ్వకండి నేను చెప్పేదేమంటే మన దేశంలో ... మన ఈ భారతదేశంలో ... రెండే రెండు పార్టీలున్నాయి. మిగతావన్నీ చిల్లర పార్టీలు. దేశంలో ఎక్కడ చూసినా లంచగొండితనం పెరిగిపోయింది. కాగడా వేసి వెతికినా నీతీ నిజాయితీ కన్పించడం లేదు. కార్మిక కర్షకలకు నిజమైన ప్రాతినిథ్యం వహించి దేశంలో సోషలిజాన్ని స్థాపించ గలిగేది నిజంగా మన పార్టీయే. కూలివాళ్ళ దగ్గరనుంచి జమీందార్ల దాకా మన పార్టీలో వున్నారు. అంటే కూలీలకు జమిందార్లమీద నమ్మకం రుజువు అయిందన్న మాట. అంటే మన పార్టీ కూలీలకూ, జమిందార్లకూ మధ్య వైషమ్యంకాక, సామరస్యం కుదిరించగలిగింది.
వేదిక మీద అధ్యక్షాసనంలో కూర్చునివున్న మిసెస్ వైకుంఠం చప్పట్లు కొట్టింది. సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయ్. మిసెస్ కైలాసం బొడ్లో దోపుకున్న కర్చీపు తీసి ముఖం తుడుచుకొని ఓసారి గర్వంగా సభను కలియచూసింది. ఆమెకు ఒత్తుల్లేని కొన్ని శబ్దాలకు ఒత్తులు పెట్టి పలకటం అలవాటు.
"ఈ మధ్య మన పార్టీకి ఎవరో మహారాజ్జులూ, జమీందార్లూ, విదేశీయులూ లక్షలిచ్చారని చిల్లర పార్టీల వాళ్ళు పుకార్లు లేవదీశారు. అవన్నీ ఒట్టి పుకార్లే. పోనియ్! ఒకవేళ ఇచ్చారే అనుకుందాం?"
సభలో కలకలం "వినండి! వినండి!" అనే కేకలు. మిసెస్ కైలాసం ఒకసారి దగ్గి, ఎదురుగా వున్న గ్లాసులోని నీరు సిప్ చేసి సున్నితంగా పెదవులు కర్చీఫుతో అద్దుకొని మళ్ళీ ప్రారంభించింది.
"ఇలా వచ్చారే అనుకుందాం. దీనినిబట్టి, మనపార్టీకి విదేశాల్లోనూ, జమిందార్లలోనూ వున్న పలుకుబడి స్పష్టంగా తెలుస్తుంది. మన పార్టీ అధికారంలోకి రాగానే తల వొక్కింటికి పదెకరాలు పంచి పెడుతుంది."
"మరి రెండు తలకాయలుంటే?" ఎవరో లేచి ప్రశ్నించారు.
"రెండు పదులు ఇరవై." తడుముకోకుండా సభాధ్యక్షురాలు మిసెస్ వైకుంఠం కంఠం దేవుడి గుడిలోని గంటలా ఖంగ్ న మ్రోగింది. మళ్ళీ సభలో కరతాళధ్వనులు!
"ప్రజాసేవ చెయ్యాలనే భావం నన్ను నిద్రపోనిచ్చింది కాదు. అందుకే గెజిటెడ్ ఉద్యోగం వదులుకొని, మీ మధ్యకు వచ్చి నిలబడ్డాను. మీరు కూడా కేవలం మాజీ అదేమందలా ప్రవర్తించకుండా విచక్షణా జ్ఞానంతో ఓట్లు వేసి నన్ను గెలిపించి, నాకు మీ అందరిసేవ చేసే అదృష్టాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను." అంటూ మిసెస్ కైలాసం సభకు ఓ పెద్ద నమస్కారం పెట్టి కూర్చుంది.
ఈ విధంగా సభల్లోనూ, ఇళ్ళకు వెళ్ళీ తమ పార్టీ అధికారంలోకి రాగానే, తమ పార్టీ చెట్టు నీడ క్రింద వున్న వాళ్ళందరికీ తలో మేడా కట్టించి ఇస్తామన్నారు. అందాకా తాను నిర్మించిన గాలి మేడల్లోనే వుండిపొమ్మన్నారు.
తాటస్థ్యం లో పాక్షికత్వాన్ని, పక్షపాతంలో తారస్థ్యాన్ని, ఏకత్వంలో భిన్నత్త్వాన్ని, ప్రజాస్వామ్యంలో నియంతృత్వాన్నీ, పెట్టుబడిదారీ వర్గ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్నీ అయోమయంలో స్పష్టతనూ చూపగలిగిన తను పార్టీ ఒక్కటే నన్నారు. అన్నింటికంటే వ్యక్తి స్వాతంత్ర్యానికి తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందట. తమ పార్టీలో ప్రతి సభ్యుడికి, నాయకుడికీ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వాతంత్ర్యం వుంటుందట.
