Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 7


    "కలొచ్చిందా?" శశాంక తలకింద దిండునుంచి, భుజాలపై తలానించి అడిగింది.


    తలూపేడు అవునన్నట్టుగా.


    "నాకేదో అయినట్టు కదూ" అతడు తన జీవితం కన్నా ఎక్కువ ప్రేమించేది తననే అన్న నమ్మకం ఆమె గొంతులో.


    శశాంక బదులు చెప్పలేదు.


    కాని అతడి కళ్ళల్లో అస్పష్టంగా పరచుకున్న నీలి నీడల్ని చూడగానే అర్థమైపోయింది తను అనుకున్నది తప్పు కాదని.


    "నాకేం కాదు" నుదురుపై పరచుకున్న ముంగురుల్ని సవరిస్తూ అంది "మీరున్నారుగా".

    
    ఇంకా అలాగే చూస్తున్నాడు పీడకల రగిల్చిన సెగలింకా చల్లారనట్టు.


    "ఇదిగో మీరలా ఉలుకూ పలుకూ లేకుండా మొద్దబ్బాయిలా చూస్తే ఊరుకోను" కోపాన్ని అభినయిస్తూ లేచింది "అర్జెంటుగా ఫిజియో థెరపీ మొదలుపెట్టేస్తాను".


    ఆమె ఆ పదాన్ని ఎప్పుడు వాడేది తెలిసిన శశాంక పెదవులు విడీవిడనట్టుగా విచ్చుకున్నాయి. అతడ్ని తన కనుకూలంగా మలుచుకున్న ఒక మంచి శిల్పకారిణిగా ఆమెకు తెలిసిన మరో గొప్ప కళ అదే.


    చూడడానికి నిశ్శబ్దంగా ప్రవహించే మందాకినిలా వున్నా, అవసరమైతే సెలయేరులా నవ్వుతుంది. జలపాతంలా హోరుమంటూ అతడ్ని తన మార్గంలోకి రప్పించుకుంటుంది.


    "అబ్బా... మాటాడమంటుంటే... మిమ్మల్నే" కుదిపేసింది కోపంగా.


    "సైకో థెరపీ అవసరమైనచోట ఫిజియో థెరపీ అంటే ఏం మాట్లాడను?"


    "ఈ విషయంలో మీరు పొరపాటు పడ్డారని గట్టిగా చెప్పగలను మిష్టర్ శశాంకా! చూశారూ... అసలు మనసన్నది బుల్లెట్ అయితే శరీరం రివాల్వర్ లాంటిది. రెండింటికీ అంత అవినాభావ సంబంధముంది. అసలు ఫ్రాయిడ్ ఏమంటాడంటే..."


    "ఇలాంటి ఇబ్బందికరమైన క్షణాల్లో సైకోథెరపీ సంగతి వదిలి అర్జెంటుగా ఫిజియోథెరపీ కానిచ్చేయమంటాడు" ఆమెను పైకి లాక్కున్నాడు.


    "అంటే మిమ్మల్ని బోర్ కొట్టించానా?"


    అతడి గుండెపై వాలి చిరుకోపంగా అడిగింది.


    నిశ్శబ్దం చాలాసేపటిదాకా.


    "కృపా" ఆర్ద్రంగా పిలిచాడు. "ఉనికి కోల్పోయిన నేను ఉన్మాదినయ్యేవాడ్నో లేక పగిలిన ఒక బాష్ప బిందువునై పెను తుఫానుల ఇసుక...లో ఇంకిపోయే వాడ్నో మరి ఆశ్రయాన్ని పొందాను...మీ ఆశ్రయం నీడలో ఊహించని అంతస్తునీ చేరుకున్నాను. ఇది నీ కృప అందునా లేక, నా పూర్వజన్మ సుకృత మందునా? వెన్నెల ప్రమిదగా మారి ఆరిపోతున్న మీ శశి కాంతికి ఊపిరైన నా నేస్తం ఎలా తీర్చుకోను మీ రుణం..."


    "ఏంటీ?" అడిగింది గుంభనంగా. "మరేం లేదు... ఏదో పొయిట్రీలా వినబడితేనూ"


    తలపైకెత్తిన కృప కొన్ని క్షణాలు అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ వుండిపోయింది.


    అదే నవ్వు అతడి పెదవులపై... విడీ విడకుండా... చాటుగా పదే పదే చూడాలన్నంత ఉత్కంఠ కలిగించే వెన్నెలని పెదవుల కద్దుకున్న అందమైన చిరునవ్వు.


    "పడుకుందామా?" అడిగింది అతడి పక్కకు జరిగి.


    "అదేంటి ఫీజియో థెరపీ?"


    "రేపు..."


    "ఏం?"


    "అదంతే!"


    "పరీక్షా?"


    "మరచిపోయారా?"


    "ఏంటి?"


    "మరో ఎనిమిది గంటల్లో అంటే వాల్ క్లాక్ ని చూస్తూ "ఉదయం పదిగంటలకు మీరు వెళుతున్న పరీక్ష సంగతి" అంది.


    లిప్తపాటు శశాంక రక్త ప్రసరణ స్తంభించిపోయింది.


    ఏ టెన్షన్ లో తాను అలాంటి పీడకల కన్నదీ అర్థమైపోయింది.


    సుమారు పన్నెండు సంవత్సరాల అకుంఠిత దీక్షా, కృషి సఫలమైందో, విఫలమైందో తెలిసిపోయే ముఖ్యమైన రోజు...


    జాతీయ స్థాయిలో పాల్గొనడానికి గాని, అంతర్జాతీయ స్థాయి వరకు ఎదగడానికి గాని అర్హత సంపాదించుకోవలసిన తొలి ఘట్టం


    అవును...


    కల్నల్ వంటి అసాధారణమైన ప్రజ్ఞా ప్రాభవాలు గల రాజామణీ వంటి వ్యక్తి ఆధ్వర్యంలో తర్ఫీదు పొందిన శశాంక షూటింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు రేపే.


    అతడి జాతకానికిదో పరీక్ష. కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో.


                                                      *    *    *    *


    ఉదయం తొమ్మిది గంటలు కావస్తూంది...


    చలికాలానికి వీడ్కోలు చెబుతున్న ప్రకృతి కపోలాలపై సూర్యుడు నునువెచ్చని పసిమి ఛాయనద్దుతున్నాడు.     


    బయట కారు హారన్ మోగడంతో కంగారుగా కిటికీలో నుంచి బయటికి చూసిన కృప "డాడీ వెయిట్ చేస్తున్నారండి" అంటూ బెడ్ రూంలో డ్రెస్ చేసుకుంటున్న శశాంకని చేరింది. "ఒక్కటీ సవ్యంగా చేసుకోలేరు కదా... చూడండి బనీను తిరగేసి వేసుకున్నారు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS