రవళి వెళ్ళిన అయిదు నిముషాల్లో ఫోను మ్రోగింది. థియేటర్ లో ఫోన్ మోగడం అరుదైన విషయం గనుక అక్కడందరికీ ఆ శబ్దం చిత్రంగా అనిపించింది.
అతని నోటి మీది మాస్క్ తొలగించి మాట్లాడేందుకు వీలుగా కార్డ్ లెస్ టెలిఫోన్ పట్టుకుంది నర్సు.
"హలో సర్!" అటు నుండి రవళి గొంతు.
"ఎస్ రవళీ! బాబుకేమైంది? బలమైన ఇంజరీస్ తగిలాయా!" ఉద్వేగం అతని గొంతుని తన్నుకొస్తోంది!"
"స్కూలు నుండి వస్తుంటే స్కూటర్ గుద్దేసిందట సార్! కాలుకి ఫ్రాక్చరైంది. చేతిపొడవునా లోతైయిన గాయం తగిలింది. స్టిచెస్ వేయాల్సి ఉంటుంది సార్!"
ఆమె చెప్పింది వినగానే రోడ్డుమీద రక్తం మడుగులో నిస్సహాయంగా జీవన్ పడివున్న దృశ్యం అతని కళ్ళ ముందు కదిలింది. గుండెనెవరో పిండుతున్న అనుభూతిలోంచి....
"బ్లడ్ బాగా పోయిందా?" అన్నాడు.
"కొంత పోయింది. హి ఈజ్ నాట్ దట్ సేల్ సర్! ఓపెన్ వూండ్ క్ ప్రెషర్ అప్లయ్ చేశారు."
"ఓకే రవళీ. నేను కృపాకర్ తో మాట్లాడతాను. కంగారు పడవద్దని నా వైఫ్ తో చెప్పండి. నేనొచ్చేంతవరకూ మా వాళ్ళకి సపోర్టివ్వడము మీకేం ఇబ్బంది కాదుకదా!"
"నాటెటాల్ సర్! దగ్గరుండి అన్నీ నేను చూసుకుంటాను."
"థాంక్యూ!"
జీవన్ కి తీవ్రగాయాలే అయినా ప్రాణాపాయం కాని దెబ్బలే అయినందున అతని మనసు కొంత తేలిక పడింది.
ఒంటినిండా గాయాలతో... అంతకు మించిన ప్రాణభయంతో జీవూ ఎంత బెదిరిపోయి ఉంటాడో.... వాడికిప్పుడు తండ్రిగా తన అవసరం ఎంత వుందో తెలియని వాడేం కాదు! కానీ - ఇక్కడ తన అవసరం అంతకు మించింది.
'సారీ జీవూ' అనుకున్నాడు.
"డాక్టర్ కృపాకర్ కి కనెక్షన్ తీసుకోండి" చేస్తున్న పని కొనసాగిస్తూనే నర్స్ తో చెప్పాడు.
కృపాకర్ అనుభవమున్న ఎముకల స్పెషలిస్టు. అదే హాస్పిటల్లో ప్రొఫెసర్ కూడా.
మరో మూడు నిముషాల్లో ఆయన లైన్లోకొచ్చాడు.
"కృపాకర్! మీరు నాకో సాయం చేయాలి" అంటూ విషయం అంతా వివరించాడు శరత్ చంద్ర.
"డోంట్ వర్రీ శరత్ చంద్రా! అంతా నేను చూసుకుంటాను. బాబు విషయం మర్చిపోయి మీరు ప్రశాంతంగా సర్జరీ చేసుకోండి" హామీ ఇచ్చాడాయన.
శరత్ చంద్ర సిన్సియారిటీ ఆయనకు బాగా తెలుసు. అతనంటే చాలా గౌరవం కూడా.
"థాంక్యూ వెరీమచ్ డాక్టర్!" మనసారా చెప్పాడు. సంభాషణ అంతా ఇంగ్లీషులో సాగింది.
ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అంతరాయం లేకుండా సర్జరీలో లీనం అయిపోయాడు.
రక్తం ముద్దలా ఉన్న కొడుకు దృశ్యం కళ్ళముందు నుండి క్రమంగా అదృశ్యమై.... గుండె కండరాలను రక్తప్రసరణ జరిపేందుకు కొత్త మార్గాలను ఏర్పాటుచేసే పనిలో తన అనుభవాన్ని చూపించడమొక్కటే అతని మస్తిష్టం నిండా నిండి ఉంది.
ఆ డిటాచ్ మెంట్ లేకపోతే ఏ వ్యక్తీ అంకితభావంతో పనిచేయలేడు- విజయాన్ని సాధించలేడు.
అతని దృఢత్వం చూసి మృత్యువు భృకుటి ముడిచింది.
* * * *
జీవన్ ఎమర్జన్సీ వార్డులో బెడ్ మీద పడుకొని వున్నాడు. టెంపరరీగా నొప్పి తగ్గి నిద్రపట్టేందుకు ఇంజక్షన్ ఇవ్వబడింది.
అయినా తండ్రి ఇంకా కనబడలేదన్న ఆందోళన అతనికి నిద్రపట్టనివ్వలేదు.
పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు - ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ దగ్గరే ఉండాలనీ, వాళ్ళు కురిపించే అమితమైన ప్రేమలో స్వాంతన పొందాలనీ అనుకోవడం సహజం.
మామూలుగానే తండ్రి తమతో ఎక్కువకాసం గడపడని జీవన్ కి అసంతృప్తి ఉంది, ఇప్పుడు మరీ ఆరాటంగా ఉంది.
ఇప్పుడు ప్రతి చిన్న శబ్ధానికీ అతని కళ్ళు తండ్రి కోసం వెతుక్కుంటున్నాయి.
"డాడీ...! డాడీని పిలువు మమ్మీ!" కలవరిస్తున్నట్లుగా అడిగాడు అతని గొంతు వణుకుతోంది.
అతను అడగడం అతనికది పదవసారి.
"వస్తారు నాన్నా!కబురు చేశాను వచ్చేస్తారు" జీవన్ తల నిమురుతూ అనునయంగా అబద్ధం చెప్పింది నీలిమ. తల్లినానుకొని భయం భయంగా నిలబడి అంది మువ్వ.
అప్పటికి రవళి అక్కడికొచ్చి పదినిముషాలయింది.
నీలిమకి తనని తాను పరిచం చేసుకొని శరత్ చంద్ర రాలేని విషయం, తనను పంపించిన విషయం అంతా చెప్పి భయపడవద్దని ధైర్యం చెపుతూనే చకచకా తిరుగుతూ ఏర్పాట్లు చేస్తోంది.
చేతి గాయం నుండి రక్తం పోకుండా చెయ్యి పొడవునా ఓ టవల్ చుట్టబడి ఉంది జీవన్ కి.
ఒంటినిండా గీసుకుపోయిన గాయాలతో, రక్తంతో తడిసి చిరిగిన బట్టలతో దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు. విరిగినచోట వంకరపోయి ఉంది.
ఆకాశంలో గిరికీలు కొడుతూ ఆడుకొంటున్న పక్షిపిల్ల రాలుగాయి రాయి దెబ్బకి నేలరాలి గిలగిలలాడుతున్నట్లున్న కొడుకుని చూస్తే కడుపు తరుక్కుపోతోంది నీలిమకి. పైటకొంగుతో కళ్ళు వొత్తుకుంది.
"మమ్మీ! నాకు డాడీ కావాలి! డాడీ వుంటే నాకన్నీ తగ్గిపోతాయి మమ్మీ?" కళ్ళనీళ్ళు కారిపోతుండగా మళ్ళీ అన్నాడు జీవన్.
కొడుకు ఏడుపుకు కారణమైన భర్త మీద కుతకుతలాడిపోయింది నీలిమ మనసు.
అన్న ఏడవటం తనూ కన్నీరుపెట్టుకుంది మువ్వ.
"డాడీ ఎవరికో ఆపరేషన్ చేయాలట బాబూ! నీ పనులన్నీ చూడమని ఈ ఆంటీని పంపించారు." అంది నర్స్ సాయంతో గాయాలు క్లీన్ చేస్తున్న రవళిని చూపిస్తూ ఆమె గొంతు వ్యంగ్యంగా ఉంది.
ఆ వ్యంగ్యానికి అర్ధం చేసుకునే స్థితిలో లేడు జీవన్. ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయాడు.
విరిగిన కాలి కన్నా, తండ్రి తన దగ్గరికిరాలేదనే బాధే ఎక్కువగా ఉంది వాడికి.
రవళి ఆమె మాటని పట్టించుకోనే లేదు. గాయాలని పరీక్షగా చూసే ఏకాగ్రతలో ఉంది.
జీవన్ ప్రక్కనే నిలబడి రవళిని క్రింది నుండి పైదాకా నిశితంగా పరిశీలిస్తూ... 'అందమైందే' అనుకుంది నీలిమ.
