"వుంది!"
"యల్.యస్.డి."
"అంటే?"
"యల్. ఫర్ లౌ (Love) యస్ ఫర్ సెక్స్ డి ఫర్ డేట్.
శబరి తన్మయత్వంతో వినసాగింది.
"రేపు వస్తావా?"
"మరి స్వర్గం చూపిస్తావా? శబ్దాల్ని చూపిస్తావా? రంగులు వినిపిస్తావా!"
"వస్తే చూపిస్తా! వినిపిస్తా!"
"వస్తాను!"
రెండడుగులు ముందుకువేసి ఆగి, వెనక్కువచ్చి "నీ పేరేమిటి?" అని అడిగింది.
"చెప్పానుగా?"
"అంటే క్రైస్టు అనమంటావా? బుద్ధుడు అనమంటావా?"
"నువ్వు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను!"
"బుద్ధుడు అని పిలవనా?"
"నీ యిష్టం"
"బుద్ధుడు పలకడానికి కటువుగా వున్నది. గౌతమ్ అంటాను."
"వెరీగుడ్! నీకు టేస్టు వుంది బేబీ!"
"బేబీయా? నేను నీ కళ్ళకు బేబీలా కన్పిస్తున్నానా?"
"నాకు అలా పిలవడం ఇష్టం!"
"ఓ కే అలాగే పిలువు!"
"అమ్మాయిగారూ!"
"నువ్వొకడివి మధ్య మధ్య పానకంలో పుడకలాగ" విసుక్కుంది.
"వెళతాను గౌతమ్! రేపు వస్తాను!"
హిప్పీతల ఊపాడు. కళ్ళు మూతలు పడుతున్నాయి. శబరి కారు దగ్గరకు నడుస్తూ ఉంటే, ఎంతో కాలంగా తన మనసును చుట్టివేసిన మొనాటనీ ఏదో బద్దలై పెళ్ళలు పెళ్ళలుగా పడిపోతున్నట్టు అన్పించింది. మంచుగడ్డలా ఉన్న ఏదో పదార్ధం తనలో కరిగిపోతున్నట్టుగా ఉన్నది.
కారులో కూర్చుంది. శబరికి ఉత్సాహంగా వున్నది. తను ఏదో జరగాలని కోరుకున్నది. ఏదో అద్భుతం చెయ్యాలి అనుకున్నది. ఆ రోజు దగ్గరలోనే కన్పిస్తున్నది! రేపు తన శబ్దాలను చూడబోతున్నది. రంగులను వినబోతున్నది!
"వండర్ ఫుల్!"
"మార్వలెస్!"
"థ్రిల్లింగ్"
యాంత్రికంగా పైకే అనేసింది. సుబ్బన్న వెనక్కు తిరిగి చూసి, వెంటనే చూపుల్ని రోడ్డుమీదకు మరలించాడు.
"అమ్మాయిగారికి నిజంగానే పిచ్చెక్కేలా ఉన్నది!" అనుకున్నాడు.
6
శబరి క్లాసులో అశాంతిగా కూర్చుని వున్నది. చెడ్డ చిరాగ్గా ఉన్నది. గడియారం ముల్లు అంత స్లోగా కదులుతుందని ఆమెకు అంతకుముందు ఎప్పుడూ అన్పించలేదు. ముంజేతి వాచీ తీసి లెక్చెరర్ ముఖం మీదకు విసిరెయ్యాలనిపించింది శబరికి. ఈ మధ్య చాలాకాలంగా క్లాసుల్లో కూర్చోవాలంటే విసుగ్గానే ఉంటూ ఉన్నది. ముఖ్యంగా రోజూ ఒకే సీట్లో... ఆడపిల్లల బెంచీమీద కూర్చోవటం... రోజూ చూసిన ముఖాలే చూడటం... విన్న పాఠాలేవినడం... లెక్చరర్స్ అయినా మారరు-
ఆమె బుర్రలో గానుగ ఎద్దు మెదులుతూ వుండేది. కాని ఈరోజు ఆమె బుర్రలో గానుగెద్దు తిరగడంలేదు. క్రితం రోజు చూసిన హిప్పీ బోయ్ మెదులుతున్నాడు. ఆమె చెవులకు ఆ హిప్పీ మాటలు పదే పదే విన్పిస్తున్నాయి. ఆ రోజు కూడా జ్యోతి కాలేజీకి రాలేదు. ప్రకాశం కూడా రాలేదు. జ్యోతి తనతో నిజం చెప్పడంలేదు. ప్రకాశాన్ని అది తప్పక పెళ్ళి చేసుకుంటుంది. తండ్రి అంగీకరించకపోతే, పారిపోతుందన్నమాట! పారిపోయి? ప్రకాశాన్ని పెళ్ళి చేసుకుంటుంది. మరి తనను రమ్మంటుందేం? ఛ! తను ఆ రొటీన్ లైఫ్ లైక్ చెయ్యదని జ్యోతికి తెలియదా!
జ్యోతి ప్రకాశం భార్యాభర్తలు అవుతారు. ఆ తర్వాత... ఆ తర్వాత అంతా మామూలే! పిల్లల్ని కంటారు! పిల్లలు... సంసారతాపత్రయం- "ఏమండీ చంటివాడికి ఇవ్వాళ పొట్ట ఉబ్బుగా వుందండీ" అంటుంది భర్తతో, జ్యోతి. శబరి తనలోతనే నవ్వుకున్నది. జ్యోతి కూడా అతి మామూలు ఆడదే!
తనకూ ప్రేమించాలని ఉన్నది, కాని రొటీన్ ప్రేమా... ఆ తర్వాత పెళ్ళీకాదు తను కోరుకొనేది! అతనెవరు? అతని పేరేమిటి? ఏ పేరుతో పిల్చినా పలుకుతానన్నాడుగా? తను పెట్టినపేరుతో పిలవాలి? గౌతమ్ అని పిలవాలి! భలే తమాషా వ్యక్తి! గమ్మత్తుగా మాట్లాడుతాడు. అతని మాటల్లో అద్భుతమైన థ్రిల్ ఏదో వున్నది. ఆ మందు... అదేమిటి చెప్మా? ఆ! యల్.యస్.డి. అది వేసుకుంటే స్వర్గం కనిపిస్తుందట! రంగులు విన్పిస్తాయట! శబ్దాలు కనిపిస్తాయట! చిత్రంగా వుంది! చెబుతుంటే వినడానికే అంత థ్రిల్లింగ్ గా వుందే, మరి అనుభవిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో? ఆలోచనల్లో మునిగిపోయి ఉంది శబరి.
కాలేజీ వదిలారు. శబరి వచ్చి కార్లో కూర్చుంది. క్రితంరోజు హిప్పీ కన్పించిన స్థలం దగ్గరౌతూ వుంటే శబరి గుండెలు దడదడలాడాయి.
"డ్రైవర్ కారు ఆపు!" చెట్టు దగ్గరకు రాగానే అన్నది శబరి.
"ఎందుకమ్మాయిగారూ!" డ్రైవరు కారు ఆపకుండానే అన్నాడు.
"ముందు కారు ఆపు!" గట్టిగా అరిచింది శబరి.
కారు ఆగింది. శబరి కారుదిగి డోర్ వేసి "ఇక నువ్వెళ్ళు" అన్నది డ్రయివర్ తో.
"అమ్మాయిగారు!" డ్రయివర్ కంఠంతో భయం నిండి వుంది.
"ఏం అయ్యాగారు చంపేస్తారా? బొత్తిగా షివెల్రీ లేదు. ఒకరోజు చూడరాదూ ఎలా చంపేస్తారో!"
సుబ్బన్న శబరి ముఖంలోకి వెర్రివాడిలా చూశాడు.
"ఏమిటలా చూస్తావ్? బొత్తిగా మామూలు మనిషివి... నిన్ను చూస్తుంటే జాలికి బదులు కోపం వస్తోంది. వెళ్ళు! వెళ్ళు!"
సుబ్బన్న అయోమయంగా ముఖం పెట్టాడు.
"వెళ్ళు! వెళ్ళి చెప్పు! నేను జ్యోతి వాళ్ళింటికి వెళ్ళానని చెప్పు. నిన్నేం అనర్లే అలా చెబితే!"
"కాదండీ అమ్మాయిగారు... వాళ్ళు చాలా చెడ్డ..."
"వెళ్ళు అధిక ప్రసంగం చెయ్యకు!" దాదాపు అరిచినట్టే అన్నది శబరి. సుబ్బన్న ఓ క్షణం ఆలోచించి వెళ్ళి కారు స్టార్టు చేశాడు.
"పూర్ ఫెలో! గానుగెద్దుకీ ఇతనికీ భేదం లేదు" వెళుతున్న కారు డ్రయివర్ను చూస్తూ అనుకున్నది. శబరి చెట్టు దగ్గరకు వచ్చింది. అతను కనిపించలేదు. చుట్టూ చూసింది. ఎక్కడా అతని జాడలేదు.
ఇంకా రాలేదేం? తను మరి త్వరగా వచ్చిందేమో? శబరి టైం చూసుకుంది. అతను చెప్పిన టైం గూడా అయిపోయింది. మరి ఇంకా రాలేదేం? ఒకవేళ రాకపోతే? వస్తాడు! తప్పక వస్తానన్నాడుగా? ఒకవేళ మరిచిపోయాడేమో? యల్.యస్.డి. తిని, వంటరిగా స్వర్గంలో రంగులు వింటూ ధ్వనుల్ని చూస్తూ వుండిపోయాడేమో? ఇప్పుడు తనేం చెయ్యడం? ఆలోచిస్తూ నిల్చున్న శబరికి భుజం మీద వెనకనుంచి చెయ్యి పడింది. శబరి కెవ్వుమన్నది.
"భయం వేసిందా? ఇంత పిరికిదానివి మాతో స్నేహం ఎలా చేస్తావ్?" స్వచ్చమైన ఇంగ్లీషులో స్త్రీ కంఠం వినిపించింది.
శబరి గిర్రున తిరిగి చూసింది. ఒక అమెరికన్ యువతి నిల్చుని నవ్వుతూ కన్పించింది. శబరి కళ్ళు పెద్దవి చేసుకొని కుతూహలంగా చూడసాగింది.
ఆ యువతి టీషర్టు వేసుకుని వుంది. కుడికాలు ప్యాంటు మోకాలు పైగా చిరిగి వుంది. ఎడంకాలి ప్యాంటు మోకాలు కింద కత్తిరించి మాసికలు వేసి కుట్టినట్టున్నది. ప్యాంటు కొత్తదిగానే వున్నది. కాని మురిగ్గా వున్నది. చిరిగి వున్నది. కాదు కావాలనే చింపి మాసికలు వేసినట్టుగా వుంది.
శబరి ఆ యువతిని ఎగాదిగా చూసింది. తెల్లని శరీరంమీద మురికి చారికలు! మురికి! అంతా మురికి! బట్టలు మురిగ్గా వున్నాయి. ఒళ్ళు మురిగ్గా వుంది.. శబరికి ఏదోగా అన్పించింది ఓ క్షణం. జుట్టు సగం ముఖాన్ని కప్పేసింది. మెడ మడతల్లో మురికి పేరుకొని వున్నది. ఆ యువతి ముఖంలోకి చూసింది శబరి. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. తెల్లగా అందంగా వున్న పాదాలకు చెప్పుల్లేవు. మురిగ్గా వున్నాయి పాదాలు కూడా.
