శబరికి ఆమెను చూస్తుంటే చీదరగా అన్పించింది. కడుపులో దేవినట్టు అన్పించింది.
"నాతో వస్తావా?" ఆ యువతి శబరిని అడిగింది.
"ఎక్కడికి?" శబరి గౌతమ్ కోసం నాలుగు దిక్కులూ పరికిస్తూ అడిగింది.
"నీకు స్వర్గం చూడాలని వుందన్నావటగా?"
శబరి ఆ యువతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.
"జాన్ చెప్పాడు నీ గురించి. రా వెళదాం?"
"జానా? అతనెవరూ?"
"నిన్న నీకు కన్పించాడటగా?"
"అతని పేరు జానా?"
"కాదు. అతని పేరు ఏమిటో నాకు తెలియదు. అతను తన పేరు ఎవరికీ చెప్పడు. వండర్ ఫుల్ బాయ్! నేనే అతనికి జాన్ అని పేరు పెట్టాను. మా వాళ్ళంతా అతన్ని జాన్ అనే పిలుస్తారు. నువ్వుకూడా నీఇష్టం వచ్చిన పేరుతో పిల్చుకోవచ్చు!"
"అతను రాలేదేం?"
"వచ్చాడు. రా! అతని దగ్గరికే తీసుకెడతాను."
శబరి ఆ యువతి ముఖంలోకి చూస్తూ నిల్చుంది.
"త్వరగా రావాలి. నీ కోసమే ఎదురు చూస్తున్నాం. ఈ పాటికి మేం స్వర్గంలోకి వెళ్ళిపోయే వాళ్ళమే! మా నరాలు పీకుతున్నాయి. త్వరగా రా! రా!"
శబరికి ఆమె కళ్ళలో ఏదో బాధ కన్పించింది. ముఖంలోకి తన్ను కొస్తున్న బాధను అణచుకొనే ప్రయత్నంలో కణతల దగ్గర నరాలు తేలుతున్నాయ్. శబరి ఆ యువతి వెనకే బయలుదేరింది.
"మీ పేరు?"
"మేరీగ్రేస్"
"జాన్ అంటే నాకు చాలా యిష్టం. బలే చిత్రమయినవాడు. నేను ఈ ధర్మంలో ప్రవేశించాక దాదాపు ఇరవై అయిదుమంది బాయ్స్ తో స్నేహం చేశాను."
శబరి ఆశ్చర్యంగా పక్కనే మాట్లాడుతూ నడుస్తున్న మేరీకేసి చూసింది.
"అందరిలోకి నాకు నచ్చినవాడూ, నేను మెచ్చినవాడూ జాన్. చాలా తెలివైనవాడు. హిప్పీ ధర్మాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు."
శబరి వింటూ ఆమె వెనకే నడుస్తూ వున్నది. ఇరవై అయిదుమంది బాయిస్ తో స్నేహం చేసిందా? తను కూడా వీళ్ళలో చేరితే... ఇరవై ఛ... తను అలా చెయ్యదు. తను గౌతమ్ నే ప్రేమిస్తూంది. అతనితోనే స్వేచ్చగా కొండచరియల్లో, సముద్రతీరాల్లో, అరణ్యాల్లో తిరగొచ్చును. రియల్లీ థ్రిల్లింగ్! ఇద్దరూ ఊరిబయట కొండ దగ్గరకు చేరుకున్నారు. కొండ పక్కనే ఒక చిన్న రాతిమీద కూర్చుని వున్నాడు. కిందటిరోజున కన్పించిన హిప్పీ. శబరి దగ్గరకు వెళ్ళగానే "వచ్చావా? రాక ఎక్కడికి పోతావ్?" అన్నట్టుంది అతని నవ్వు.
శబరి అతని ముఖంలోకి చూసింది. ముఖం పీక్కుపోయినట్టు వుంది. కళ్ళలో ఏదో బాధ... అదే బాధ- తను అంతకుముందు మేరీ కళ్ళలో చూసిన బాధ... అతని కళ్ళలోనూ కన్పించింది. అతని ముఖం అంతకుముందు రోజు తను చూసిన ముఖంలా లేదు. ఆ కళ్ళలో నిన్న కన్పించిన తేజస్సు కన్పించదేం?
"ఇంత లేటుగా వచ్చావేం? స్వర్గం చూడాలనుకున్నవాళ్ళు తలుపులు తెరువక ముందే రావాలి!" అన్నాడు.
"నేను నువ్వు చెప్పిన సమయానికి వచ్చాను. కాని నువ్వు అక్కడ కన్పించలేదు... అందుకే."
"స్వర్గం అక్కడే వుందని నేను చెప్పలేదే? మనం ఎక్కడ వుంటే అక్కడే స్వర్గం వుంటుంది. మనం యెక్కడ కావాలంటే అక్కడే స్వర్గం నిర్మించుకోవాలి. నిన్న అక్కడ వుంటే యివ్వాళ కూడా అక్కడే ఎందుకుండాలి?"
"ఐయాం సారీ!" శబరికి గాలివాటుకు కొట్టుకుపోతున్నట్టుగా వుంది.
"మనం సుఖ దుఃఖాలకు అతీతులం! ఉయ్ ఆర్ ఫ్లవర్ చిల్డ్రెన్... అంటే పూల బాలలం! ఫ్లవర్ పవర్ అంటే పూలశక్తి! మనం ఎక్కడ వుంటే అక్కడే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయ్!"
"ఓ జాన్! త్వరగా తియ్! నేను భూమిలోకి దిగిపోతున్నాను. ప్రాణం ఎగిరిపోతూ వుంది!" వింత మృగంలా అరిచింది మేరీ.
శబరి ఆ అరుపుకు బెదిరిపోయింది. ఇద్దర్నీ భయం భయంగా, మార్చి మార్చి చూసింది. అంతవరకూ ఉన్న సౌమ్యత మేరీ ముఖంలో కన్పించటం లేదు. ఆ ముఖం రాయిలా బిగుసుకుపోయినట్టు కన్పించింది శబరికి.
"కమాన్ మేరీ! ఇదుగో! తీసుకో!" అన్నాడు శబరికి గౌతమ్, మేరీకి జానూ, అయిన హిప్పీ! జాన్ ఇచ్చిన సంచిలో నుంచి మేరీ చిన్న సీసాను బయటికి తీసింది. చిన్న చిన్న టేబ్ లెట్స్ ను (మందుబిళ్ళలను) చేతిలోకి వంపుకున్నది. అందుకొని ఆత్రంగా నోట్లో వేసుకుని మింగాడు జాన్. మేరీ కూడా మాత్రం మింగింది. శబరి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ నిల్చుంది. ఏదో భయంగా వుంది. అయినా అక్కడనుంచి పారిపోవాలని లేదు. జాన్ ఒక మాత్ర శబరి చేతిలో పెట్టాడు. ఓ క్షణం శబరి చెయ్యి వణికింది. పది నిముషాల్లో వాళ్ళ ముఖాల్లో అంతవరకూ వున్న బాధ పురివిచ్చి పోతున్నట్టు శబరికి అన్పించింది. కళ్ళు వింత వెలుగుతో మెరిసి పోతున్నాయ్. ముఖాల్లో ప్రశాంతత నెలకొన్నది.
"కమాన్ బేబీ వేసుకో!" అన్నాడు జాన్.
"భయపడుతున్నావా?" పక పక నవ్వింది మేరి.
"భయపడకు! స్వర్గం చూడాలన్నావుగా! మెదడు కరగడం, మనసు ఊదేసిన బెలూన్ గా మారి గాలిలోకి ఎగరడాన్ని అనుభవించాలని లేదూ! కమాన్ బేబీ! మరో పదినిముషాల్లో ట్రిప్ మొదలౌతుంది. మేము ఆ వింత ప్రపంచంలోకి వెళ్ళిపోతాం! ఇరవై నిమిషాల్లో స్వర్గంలో అడుగుపెట్టేస్తాం! త్వరగా వేసుకో! లేకపోతే నువ్వు స్వర్గం బయటే వుండిపోతావ్!" హెచ్చరించాడు జాన్.
"ఇందులో డేంజర్ ఏమీ లేదా!"
"ఎందుకు లేదూ? ఈ ప్రపంచంలో డేంజర్ కానిది ఏది? జీవితమే ఒక డేంజర్ గేమ్! డేంజరన్న మనకు మనమై ఆహ్వానించడంలోనే వుంది థ్రిల్!" అన్నది మేరీ.
"కమాన్ బేబీ! నీ మనసును ఊదేయ్! నీ మెదడును బద్దలుకొట్టు. అడుగుపెట్టు స్వర్గంలో! ఆలస్యం చేస్తే నిన్ను వంటరిగా వదిలేసి మేం వెళ్ళిపోతాం" అన్నాడు జాన్.
శబరి చేతిలో వున్న టాబ్ లెట్ కేసి చూడసాగింది.
"ఊ! త్వరగా!"
శబరి కళ్ళు మూసుకుని గబుక్కున మాత్ర గొంతులో వేసుకుంది.
"వెరీగుడ్! మేరీ శబరిని కౌగలించుకుంది.
"రా బేబీ కూర్చో. నేను వెళ్ళిపోతున్నాను. నీకు నాతో రావడానికి మరో పది నిముషాలు పడుతుంది. నిలబడకు కూర్చో" అన్నాడు జాన్. శబరికి భయంతో వళ్ళంతా చెమట పట్టింది.
జాన్ ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో ఏదో వింత మార్పు వచ్చింది. కళ్ళలో అంతకుముందు కన్పించిన వెలుగులేదు. బాధ లేదు. ఏ భావమూ లేదు. ఆ కళ్ళు గాజు గోలీలలా వున్నాయి. ముఖం బాధారహితంగా వుంది. అతని శరీరం ఆ కొండరాళ్ళ మధ్య మరో రాయిలా మారుతున్నట్టు అన్పించింది శబరికి. మేరీకేసి చూసింది. మేరీ ఊగిపోతూ జాన్ వళ్ళో కూర్చుంది. జాన్ చేతులు మేరీ శరీరంమీద పాకుతున్నాయి. శబరికి ఎలాగో అన్పించింది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అక్కడినుంచి పారిపోవాలనిపిస్తున్నది. తల్లి వడిలో వాలిపోయి బిగ్గరగా ఏడవాలనిపిస్తున్నది. కాళ్ళలో సత్తువ లేనట్లు వక రాతిమీద కూలబడింది.
శబరికి మెదడులో షార్టుసర్క్యూట్ అయినట్టూ, శరీరమంతా మండిపోతున్నట్టూ ఉన్నది. కళ్ళ ముందున్న వస్తువులు అస్పష్టంగా కన్పిస్తున్నాయి. పెద్దగా అరవాలని నోరు తెరిచింది. కాని శబ్దం బయటికి రాలేదు. ఏమిటిది? ఇలా వుందేం? తను ఏమైపోతుంది? అరే! అదేమిటి ఆకాశం కిందకు దిగుతుందే? భూమి పైకి లేస్తోంది! బలే తమాషాగా వుంది! తను పైకి లేస్తున్న భూమితోపాటు, కిందకు దిగుతున్న ఆకాశం వైపుకు వెళ్తూ వుంది.
అబ్బా! ఏమిటిది? తల బద్దలైపోతున్నది. మెదడు ఎగిరిపోతున్నది. నీటి బుడగలా మనసు గాల్లోకి ఎగిరిపోతున్నది. తన మెదడూ తన గుండెకాయా, బద్దలవడం, గాలిలోకి ఎగిరిపోవడం తనకు కన్పిస్తున్నాయేం? ఏమిటీ బాధ? ఇది స్వర్గమా? కాదు కాదు నరకం. స్వర్గం నరకం ఒక దానిలో ఒకటి కలిసి పోతున్నాయి! బాధా, ఆనందం, భయం, ధైర్యం, ఏడుపూ, నవ్వూ, వింత అనుభూతి, చిత్రమైన అనుభవం. అయ్యో! తన కళ్ళు ఇలా బయటికి తోసుకు వస్తున్నాయేం? శబరి రెండు చేతులూ కళ్ళకు అడ్డం పెట్టుకున్నది. తన కనుగుడ్లు చేతుల్నించి బులెట్స్ లా దూసుకుపోతున్నాయ్! శబరి కెవ్వున అరిచింది.
