అతను కాళ్ళు చాపుకుని చెట్టుకు చేరబడి కూర్చుని వున్నాడు. చూస్తున్నాడు. ఆ చూపులు అలా ఉన్నాయేం? తననే చూస్తున్నాడా? చూస్తున్నట్టు కూడా లేదు. ఎదురుగా తను నిల్చుని వుంది. అతను కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అయినా తను చూడటంలేదు. వింతగా చూస్తున్నాడు? దేన్ని చూస్తున్నాడు! ఎవర్ని చూస్తున్నాడు? కదలడేం? అరే నవ్వుతున్నాడు! తనని చూసి నవ్వుతున్నాడా? కాదు! వింతగా నవ్వుతున్నాడు. చిత్రంగా చూస్తున్నాడు! భలేగా వున్నాడు.
అతను ఏదో గొణిగాడు. శబరి ఒక అడుగు ముందుకు వేసింది. వినడానికి ప్రయత్నించింది. కాని అతని మాటలు అస్పష్టంగా వున్నాయి. పలకరిస్తే? పిచ్చివాడేమో? శబరి గుండె ఝల్లుమంది. పిచ్చివాడిలా కూడా లేడు. ఆ చూపుల్లో పిచ్చితనంలేదు. కాని ఏదో వున్నది. మత్తుగా ఆ చూపులు ఏవో లోకాల్ని చూస్తున్నాయి. పలకరిస్తే?
"ఎవరండీ మీరు?"
అతనిలో ఎలాంటి మార్పూ లేదు. గొణుక్కుంటున్నాడు, ఆనందంగా నవ్వుతున్నాడు.
"ఏమండోయ్!" బిగ్గరగా పిలిచింది శబరి.
అతను కదలలేదు. కాని ఎక్కడో చూస్తున్న అతని చూపులు మాత్రం శబరి మీద నిల్చాయి. అతని ముఖం మీదకు నీరెండ పడుతూ ఉన్నది. అలా చూస్తాడేం? ఏదో వస్తువును చూస్తున్నట్టు నిర్వికారంగా చూస్తున్నాడు. తన ఎదురు ఒక అందమైన ఆడపిల్ల నిల్చున్నట్టుగా కూడా అతనికి తెలిసినట్టుగా లేదు. మరుక్షణంలో అతని కళ్ళు శబరి మీదనుంచి ఆకాశంకేసి మళ్ళాయి.
"అద్భుతం! వెన్నెల ఎంత... బాగుంది... చంద్రుడు... చందమామ... అదే మామయ్య! వెళ్ళిపోతున్నాడు. ఎర్రగా ఉన్నాడేం? ఎందుకో అంత కోపం? నాకు తెలుసులే! ఈ మనుషులంటే నీకు కోపం! ఈలోకం అంటే నీకు అసహ్యం. అందుకే వెళ్ళిపోతున్నావ్!"
శబరి ఆశ్చర్యంగా అతని మాటలు వినసాగింది. ఎండను వెన్నెలంటాడేం? అస్తమిస్తున్న సూర్యుణ్ణి చంద్రుడంటాడేం? నిజంగా పిచ్చివాడే!
"ఇది ఎండ! వెన్నెల కాదు. ఆ వెళ్ళిపోతున్నది సూర్యుడు చంద్రుడు కాదు!" అన్నది శబరి.
"సూర్యుడా? వాణ్ణి నేను చంద్రుడని అంటాను. సూర్యుడని ఎందుకనాలి?" శబరి కేసి చూడకుండానే తనకు తానే చెప్పుకుంటున్నట్టు అన్నాడు.
"సూర్యుణ్ణి నువ్వు చంద్రుడంటే మారిపోతాడా ఏం? సూర్యుడు సూర్యుడే చంద్రుడు చంద్రుడే!"
"ఏం ఎందుకు కాకూడదూ? వాడు ఎవరికైనా తన పేరు సూర్యుడని చెప్పాడా? ముందు ఎవడో అన్నాడు. ఆ మాటని అతని చుట్టూ వాళ్ళు మళ్ళీ అన్నారు. ఆ తర్వాత ఒకరినుంచి ఒకరు అదే మాటను విని అనసాగారు. మా నాన్నకు వాళ్ళ నాన్న, మా తాతకు వాళ్ళ తాత, వాళ్ళ తాతకు వాళ్ళ ముత్తాత వీడు సూర్యుడు అని చెప్పారు. అందుకే వీడు సూర్యుడు అయ్యాడు. నేను చంద్రుడు అంటాను. నా కొడుకు. నా కొడుకు, వాడి కొడుకు చంద్రుడు అని అంటే వీడు మళ్ళీ చంద్రుడే అయిపోతాడు. ఛ! మళ్ళీ రొటీన్! నా కొడుకు అలా అనడు. వాడి కొడుకు వాడి నాన్నలా అనడు. వండర్ ఫుల్! నిత్య నూతనం! ఎవడి ఇష్టం వచ్చిన పేరుతో వాడు పిలుస్తాడు!"
ఆ యువకుడు కళ్ళు మూసుకున్నాడు. శబరి కళ్ళు వెడల్పు చేసుకొని అతన్నే చూస్తున్నది వింతగా. మూసుకున్న కళ్ళకు ఏం కన్పిస్తుందో అతను నవ్వుతూ అన్నాడు. సగం కళ్ళు తెరిచాడు. తలపైకెత్తి ఆకాశం కేసి చూస్తున్నాడు.
"ఆహా! నక్షత్రాలు మెరుస్తున్నాయి. అందుకుంటా!"
"పచ్చటి ఆకులు, కాయలు కోస్తాను! ఆ ఆకుల్ని చెట్టు కొమ్మలకు తగిలిస్తాను. చెట్టునుంచి కోసిన నక్షత్రాలను ఆకాశం మీద వెదజల్లుతాను."
"భలే! భలే! వండర్ ఫుల్!" చప్పట్లు కొట్టింది శబరి.
అతను చూపులు మరల్చాడు. శబరికేసి పరిశీలనగా చూశాడు. ఆ చూపుల్లో గుర్తింపు ఉన్నది. ఒక మనిషి యెదురుగా ఉన్నట్టు గుర్తించాడు.
"ఎవరు నువ్వు?" శబరి అడిగింది.
"నేను యెవర్ని? ఏమో? అది తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను."
"అంటే నీకు పేరూ ఊరూ లేవా?"
"అన్ని పేర్లూ నావే! అన్ని ఊర్లూ నావే! నేనే క్రీస్తును. నేను బుద్ధుణ్ణి! నేనే రాముడ్ని. నేనే నేను! నేనే నువ్వు!"
శబరి వింత జంతువును చూసినట్టు చూసింది. అతడికేసి.
"నేనే కృష్ణుణ్ణి. రాధను కూడా నేనే. నేను ప్రియుణ్ణి- ప్రియురాలిని కూడా నేనే!"
శబరికి అతని మాటల్లో ఏదో థ్రిల్ కన్పించింది.
"మీ అమ్మా నాన్నా నీకు పెట్టిన పేరేమిటి?"
"మర్చిపోయాను!"
"మర్చిపోయావా! ఎలా?"
"మర్చిపోవాలనుకున్నాను, మర్చిపోయాను. ఎందుకు గుర్తు పెట్టుకోవాలీ?"
"చిత్రంగా మాట్లాడుతున్నావ్!"
"వాళ్ళెవరు నాకు పేరు పెట్టడానికి? నా ఇష్టం వచ్చిన పేరు నేనే పెట్టుకుంటాను."
"ఇక్కడెందుకు కూర్చున్నావ్?"
"ఎందుకు కూర్చోకూడదూ? ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడే కూర్చుంటాను. నా మనసు నాది. నా ఇష్టం నాది. నా మనసుకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తాను."
"మీవాళ్ళు?"
"నా వాళ్ళు నాపాడ్ లో అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే వుంటారు స్వేచ్చ స్వతంత్రం."
"అమ్మాయిగారూ!"
శబరి తలతిప్పి చూసింది.
"ఆ హిప్పీగాడితో మీ కెందుకమ్మా? వెళదాం పదండి!" అన్నాడు సుబ్బన్న. హిప్పీ! ఇతను హిప్పీయా! తను వాళ్ళ గురించి కొద్దిగా విన్నది. కాని ఎప్పుడూ చూళ్ళేదు. హిప్పీలంటే ఇలా వుంటారా?
"వస్తాలే! నువ్వెళ్ళి కార్లో కూర్చో!"
"నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు- పదండమ్మా!"
"అబ్బబ్బ సుబ్బన్నా! బోర్ కొట్టకు! ఎప్పుడూ అదేమాట. చంపేస్తారు చంపేస్తారు అదే మరోరకంగా ఎక్స్ ప్రెస్ చెయ్యకూడదూ?" సుబ్బన్న శబరి ముఖంలోకి భయం భయంగా చూశాడు.
అమ్మాయిగారికి మతిస్థిమితం లేనట్టుంది. ఈ మధ్య అదోలా మాట్లాడుతున్నారు అనుకొన్నాడు సుబ్బన్న.
"అంతే! చెప్పింది చెప్పడం చేసిందే చెయ్యడం కుళ్ళు సంఘం అంతా దగా మోసం-" హిప్పీ గొణుక్కున్నాడు.
దూరంగా కోకిల కూస్తూ వుంది.
"ఆ కూత ఎంత అందంగా కన్పిస్తూంది!" హిప్పీ అన్నాడు.
"కూత కన్పించదు వినిపిస్తుంది."
"నేను శబ్దాలను చూస్తాను రంగుల్ని వింటాను."
"ఏంటమ్మాయిగారూ ఆ పిచ్చివాడితో మీకు."
"పిచ్చి! అంతా పిచ్చే! అందరికీ తలో పిచ్చి! కొందరికి డబ్బు పిచ్చి"
కొందరికి ప్రేమపిచ్చి! కొందరికి అధికారంపిచ్చి! కొందరికి తిండిపిచ్చి! కార్లపిచ్చి - దుస్తులపిచ్చి! అందరికీ తలొక పిచ్చి. అందుకే ఆ పిచ్చి సంఘాన్ని వదిలేశాను. పిచ్చి నుంచి నిర్వాణం పొందడానికే వచ్చేశాను.
"నిర్వాణమా! అంటే?" శబరి ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
"విముక్తి. అన్ని బంధాల నుంచి వుముక్తి. ఫ్లవర్ పవర్ (Flower power) యల్.యస్.డి.పాట్. పాట్ లోనే వుంది నిర్వాణం. హిరాయిన్ లోనే వుంది విముక్తి. యల్.యస్.డి.లో స్వర్గం ఉంది. స్వర్గం ఈ నరకంనుండి విముక్తి."
శబరి మంత్ర ముగ్ధలా నిలబడిపోయింది.
"స్వర్గం చూడాలని వుందా?"
"చూపిస్తారా?"
"రంగుల్ని విని శబ్దాలను చూడాలని వుందా?"
