"ఏమీ అనను. నా సంపాదన మనిద్దరికీ సరిపోతే మనిద్దరం- కలిసి ఓ గృహాన్ని నిర్మిద్దామంటాను. లేదూ, సంపాదనలోనే నీకు ఆనందం వుంది అనుకుంటే ఆ సంపాదనతో మన గృహాన్ని ఎలా నిర్మించుకుందామనేది ఇద్దరం కలిసి ఆలోచిద్దామంటాను. మన పిల్లల్ని మరింత ఆప్యాయతతో పెంచడానికి మనమేం త్యాగాలు చెయ్యాలో ఎప్పటికప్పుడు పునరాలోచించుకుందామంటాను".
నేను లేచి నిలబడ్డాను. "థాంక్స్ సూర్యమ్! ఈ కేసు నువ్వు గెలిస్తే గెలిచి వుండవచ్చు. కానీ జీవితంలో నేనొక తప్పటడుగు వేయకుండా ఈ కేసు నన్ను రక్షించింది. నువ్వెలాంటి వాడివో, నీ ఆలోచనా విధానం ఏమిటో, స్త్రీ పట్ల నీకెలాంటి అభిప్రాయం వుందో క్లియర్ గా తెలుసుకోవడం కోసం నాకీ కేసు సహాయపడింది. ఇదే ఆరు నెలల తర్వాత జరిగుంటే నీతో పెళ్ళి జరిగి అప్పటికే ఆ ఊబిలో పూర్తిగా కూరుకుపోయేదాన్ని. బై.... బై ఫరెవర్!" సూర్యమ్ మొహం వివర్ణమమైంది. నేనిలాంటి నిర్ణయాన్ని ఇంత తొందరగా తీసుకుంటానని బహుశా అతను ఊహించివుండడు. పాలిపోయిన మొహంతో "నువ్వేం మాట్లాడుతున్నావో నీ కర్థమవుతోందా?" అనడిగాడు.
"అర్థం చేసుకునే శక్తి మెదడు కింకా మిగిలింది కాబట్టే సరియైన నిర్ణయాన్ని తీసుకోగలిగాను. నువ్వొక ఎంసిపివని తెలుసుకోగలిగాను".
ఒక్కసారిగా సూర్యమ్ మొహం రక్తం ఇంకిపోయినటైంది. అయితే అతడేమీ ఆవేశపడినట్టు కనపడలేదు. "నువ్వు చాలా తొందరపడి ఈ నిర్ణయం తీసుకుంటున్నావనుకున్నాను. నీకోసం, నీ ఆలోచనల్లో మార్పుకోసం ఎదురు చూస్తుంటాను".
"అవసరం లేదు. నీ దయా కటాక్ష వీక్షణాల కోసం నేను అభిప్రాయం మార్చుకుని తిరిగిరాను. ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకో సూర్యమ్. స్త్రీకి కావలసినది పురుషుడి నుంచి దయ, సానుభూతి కాదు. గౌరవం! గౌరవం కావాలి! అది తెలుసుకుని వివాహం చేసుకో, నీ భార్య సంతోషిస్తుంది".
"దయ, గౌరవం, సానుభూతి పరస్పరం ఒకరిమీద ఒకరికి వుంటే- అన్నీ కలిస్తే అదే ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను శ్యామలా".
"ప్రేమలో సానుభూతికి చోటులేదు. ప్రేమకి పునాది నమ్మకం".
"నన్ను నువ్వు ప్రేమించడానికి కావలసింది నమ్మకమే అయితే నా సంపాదనంతా నీకే ఇచ్చేస్తాను. అప్పుడు నువ్వు భయపడే ఆర్థిక అభద్రతాభావం కూడా భవిష్యత్తులో నీకు రాదు కదా".
"థాంక్స్. నేనీ వివాహం చేసుకోలేకపోయినా ఆ అభద్రతా భావం నాకు రాదు. వెళ్లొస్తాను సూర్యమ్. ఇన్నాళ్ళూ నాతో స్నేహంచేసినందుకు నీకు నా కృతజ్ఞతలు" అని విసవిసా కోర్టులోంచి బయటికి రాబోతోంటే వెనుకనుంచి అతడు అన్నాడు- "కోర్టులో చెప్పినా, జడ్జిముందు వాదించినా, స్త్రీ వాదులకి విన్నవించినా ఒకే మాట. అదే నీతోనూ చెప్తున్నాను. నాణానికి రెండోవైపు కూడా చూడు".
"నేనూ అదే చెప్తున్నాను. కోర్టులో చెప్పినా, పురుషాహంకారానికి ప్రతినిధివిన నీతో చెప్పినా, పురుషాహంకారానికి ప్రతినిధివైన నీతో చెప్పినా ఒకేమాట. ఇంకొకరి సమస్యని నీ కళ్ళతో చూడకు, సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు" అని అక్కణ్ణించి బయటకు వచ్చేశాను.
సానుభూతితో అర్థం చేసుకోలేకపోవడమంటే ఏమిటో నాకు వారంరోజుల తర్వాత అర్థమైంది.
6
నన్ను అర్థం చేసుకున్నది ప్రకాష్ ఒక్కడే.
"చాలా కరెక్టయిన నిర్ణయం తీసుకున్నావ్ సిస్టర్" అన్నాడు. "తను తెలివైనవాడినని సూర్యానికి చాలా గర్వం. తను చెప్పిందే శిలాశాసనమన్న అభిప్రాయం కూడా అతడి రక్తంలో బాగా జీర్ణించుకుపోయి వుందని నా అనుమానం. మీ ఇద్దరికీ సరిపడదని నాకెందుకో అనిపించింది".
ప్రకాష్ వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశాను. ఇరవై రెండేళ్ళ వయసులోనే వాడు చాలా మనోవైజ్ఞానిక గ్రంథాలు చదివాడు. ఎంత పెద్ద సమస్యకైనా తన శాస్త్ర పరిజ్ఞానంతో అనుభవాల్ని రంగరించి క్షణాల్లో నిర్ణయాల్నీ, పరిష్కారాల్నీ చెప్తుంటాడు. అవతలివారిని ఒక పుస్తకం చదివినట్లు చదివెయ్యగలగడం ప్రకాష్ కి వెన్నతో పెట్టిన విద్య. గంటల తరబడి తన ఈడు వాళ్ళతో కూచుని ప్రపంచంలోని రకరకాల వ్యక్తుల మనస్తత్వాల గురించి విశ్లేషిస్తుండడం అతడి అభిరుచి. అందుకే అమ్మ వీడి నప్పుడప్పుడూ నాకు 'దేవుడిచ్చిన తమ్ముడు' గా అభివర్ణిస్తూంటే నేనేమీ వుడుక్కోను. నవ్వేస్తాను. వీడిలో వున్న మరో గొప్పతన మేమిటంటే మనసు సంతృప్తిపడేలా అప్పటికప్పుడు కొత్త కన్వీనియెంట్ ఆర్గ్యుమెంట్ చెప్పి మనం చేస్తున్నదే (లేక తను చెయ్యమన్నదే) కరెక్ట్ అన్న అభిప్రాయం కలిగిస్తాడు. పువ్వు పుట్టకముందే పరిమళిస్తుందన్నట్టు భవిష్యత్తులో గొప్ప గొప్ప మేధావులు, మత ప్రవక్తలు, మానసిక శాస్త్రవేత్తలు, బాబాలు, రాజకీయ నాయకులు, వేశ్యలు- అవబోయే వారందరికీ ఈ నైపుణ్యం చిన్నతనం నుంచే అలవడుతుందనుకుంటాను. అదే కాని పక్షంలో ఇంతమంది సామాన్యులు వీరిచుట్టూ చేరరు కదా! ఏది ఏమైనా ఆ క్షణం వాడు నన్ను సమర్ధించినందుకు సంతోషం వేసింది.
అమ్మ మాత్రం "తొందరపడి నిర్ణయం తీసుకున్నావేమోనమ్మా? సూర్యమ్ తెలివైనవాడు. ఆవేశంతో అతనికి దూరమవడం అనాలోచితమేమో ఆలోచించు" అంది.
"కేసు గెలిచేసరికి న్యాయం ఎవరిపక్షాన వుందో వదిలేసి సూర్యమ్ తెలివితేటలని సమర్థిస్తున్నావామ్మా" అనడిగాను.
"న్యాయం గురించి కాదు నేను మాట్లాడుతున్నది, తర్కం గురించి. అతను వాదించినదాంట్లో తర్కం వుండబట్టే కదా మీ వాళ్ళు అతనిమీద విరుచుకుపడలేదు" అంది అమ్మ.
"విరుచుకు పడలేదా? నా కెన్ని ఉత్తరాలు వచ్చాయో తెలుసా నీకు?" అంటూ వేగంగా నా రూమ్ లోకి వెళ్ళి పెద్ద ఫైలు తీసుకొచ్చి అమ్మముందు పడేశాను.
"ఆ జడ్జిమెంటును నిరసిస్తూ ఎక్కడెక్కడినుంచో వచ్చిన ఉత్తరాల ఫైల్ ఇది" అంటూ అందులోంచి చేతికందిన ఒక ఉత్తరాన్ని తీసి తన చేతికిచ్చి "ఏ ఉత్తరం చదివినా నీకు ఈ క్షోభ అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు" అన్నాను.
అమ్మ ఈ ఉత్తరం చదివి ఏమీ మాట్లాడకుండా నాకు ఇచ్చేస్తూ "నువ్వు విజ్ఞురాలివి. నీకేది బాగా అనిపిస్తే అది చెయ్యి. సూర్యమ్ కాకపోతే మరొకరిని చేసుకోవచ్చు. నువ్వు ఆనందంగా వుండడమే నాకు కావాలి" అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.
మరింత రెట్టించకుండా తను నా అభిప్రాయాల్ని గౌరవించడంతో అమ్మమీద గౌరవం పెరిగింది. ఫైల్ లో పెట్టెయ్యబోతూ ఆ ఉత్తరాన్ని చదివాను. ఇండియాలో వున్న నా స్నేహితురాలు తన పత్రిక్కి ఎవరో రాసిన ఉత్తరాన్ని నాకు పంపింది. ఆ స్నేహితురాలు ఆ దేశంలో పత్రికాఫీసులో పనిచేస్తోంది. కోర్టులో మా వాదోపవాదాలన్నీ భారతదేశపు వివిధ భాషల పత్రికల్లోనూ తర్జుమా అయినట్టున్నాయి. అది చదివి ఎవరో అమ్మాయి ప్రతిస్పందించి అంబాజీపేట నుంచి పత్రికకి రాసిన కవిత అది.
"ఓ స్త్రీ!
అయిపోయావు.
బ్రిటన్ కోర్టులో
క్రీస్తుని శిలువ వేసినట్టు
నిన్ను సమాధి చేశారు.
నెత్తిమీద కత్తి పెట్టాడు పురుషుడు
ఎత్తుమడమల కాలి జోళ్ళెందుకన్నాడు.
మగపిల్లవాడి కోసం మూడోసారి అబార్షన్
చేయించిన పురుషాహంకారానికి కావాలి అబార్షన్
అందాల్ని చీల్చి, పైటల్ని కాల్చి
స్త్రీ స్త్రీగా నిలబడే దినం కోసం
మేం చేసే విప్లవాన్ని
ఏ న్యాయస్థానం ఆపలేదు".
"ఎడిటర్ గారికి- దీన్ని ఇంగ్లీషులోనికి అనువదించి ఒక కాపీ తీర్పు నిచ్చిన జడ్జికి, మరొక కాపీ బ్రిటీష్ ప్రధానమంత్రికి పంపగలరు. నేనొక కాపీ ఇక్కడ మన రాష్ట్రపతిగారికి పంపుతున్నాను" అని వుందందులో.
ఉత్తరం ఫైల్లో పెట్టేశాను. నాకెందుకో ఆ క్షణం చాలా నిరాసక్తంగా అనిపించింది.
7
మూడురోజుల నుంచీ ప్రకాష్ నాకు కనపడలేదు. కారణం తెలీదు. అతడి ప్లాట్ కి ఫోన్ చేస్తే ఒకటి రెండు మాటలు ముక్తసరిగా మాట్లాడి పెట్టేశాడు. తనలో ఈ మార్పు నా కర్థంకాలేదు. ఆ సాయంత్రం అతడి ప్లాట్ కి వెళ్ళాను.
కారు ఇంటిముందు ఆపుచేసి పైకి వెళ్ళేసరికి గదిలో అతడొక్కడే ఏదో పుస్తకం చదువుకుంటూ కనపడ్డాడు. "ఏమిటి బొత్తిగా నల్లపూసవై పోయావ్?" అడిగాను నవ్వుతూ.
"ఏం లేదు" అన్నాడు.
అయితే అతడు ముభావంగా సమాధానం ఇవ్వడాన్ని గుర్తించి "చూడు ప్రకాష్ ! నువ్వు గొప్ప మనోవిశ్లేషకుడినని చెప్పుకుంటూ వుంటావు కదా! మన మనసులో ఏదైనా వుంటే ముసుగులో గుద్దులాటకన్నా అవతలివారికి స్పష్టంగా దాన్ని చెప్పెయ్యడం మంచిది కదా! - నా పట్ల అటువంటి అభిప్రాయం నీకేదైనా వుంటే దాచుకోకుండా చెప్పేసెయ్" అన్నాను.
అతడు మొహం పక్కకి తిప్పుకుని "అబ్బే, ఏం లేదు" అన్నాడు.
నేను వెళ్ళి అతడి ఎదురుగా కూచుంటూ "ఏం లేకపోవడమేమిటి? నువ్వు చెప్పాలి. చెప్పక తప్పదు. ఇళా మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరోలా వుండే వాళ్ళంటే నా కసహ్యం" కటువుగా అన్నాను.
అతడేమీ గిల్టీగా ఫీలవలేదు. నేనెలా చూశానో అదే విధంగా చూస్తూ "చెప్తే నువ్వు ఫీలవుతావు" అన్నాడు.
"అవును. చెప్పు".
"ఏం చెప్పను? నువ్వూ, నేనూ ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళమని చెప్పనా? సుఖంగా సంసారం చేసుకుంటూ కూడా నీ తల్లి ఎవరితోనో రహస్యంగా సంబంధం పెట్టుకుని రెడ్ హాండెడ్ గా పట్టుబడిందని చెప్పనా? అమాయకుడైన ఆమె భర్త ఇంత షాక్ భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని చెప్పనా? మృత్యుముఖం నుంచి బయటపడి, జీవితంలో రాజీపడి పెద్దలు కుదిర్చిన మరో వివాహం చేసుకుంటే ఆ తల్లికి పుట్టిన బిడ్డనే నేనని చెప్పనా?"
నా కాళ్ళకింద భూమి కదులుతున్నట్టనిపించింది. ఆకాశం విరిగి మీదపడ్డట్టు కంపన కలిగింది. కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. "నిజమేనా? నేను విన్నదంతా నిజమేనా నా తల్లి?....నా తల్లి... నాతో చెప్పిందంతా అబద్ధమా?"
* * *
"అమ్మా! ఒకటడుగుతాను నిజం చెప్తావా?" సూటిగా ప్రశ్నించాను.
"అడుగు" అంది.
నా గుండె గొంతులో కొట్టుకుంటోంది. "నువ్వూ, నాన్నా ఎందుకు విడిపోయారు? ఏ కారణంవల్ల నాన్న నిన్ను వదిలేశాడు? అసలు నాన్న బతికున్న సంగతి కూడా ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదు? నన్నూ, నాన్ననీ ఎందుకు కలుసుకోనివ్వ లేదు?"
అమ్మకో క్షణం కాలం ఆగిపోయినట్టు అనిపించింది. కాస్త తటపటాయించి అన్నది.
"మా ఇద్దరికీ కొన్ని భేదాభిప్రాయాలు రావడంవల్ల విడిపోవలసి వచ్చింది".
"అబద్ధం!" అరిచాను. "మీరిద్దరూ భేదాభిప్రాయాల కారణంగా విడిపోలేదు. నీ కెవరితోనో అక్రమసంబంధం వుంది. ఆ విషయం నాన్నకి తెలీడంవల్ల విడిపోయారు. అవునా, కాదా?"
"అసలు నేను చెప్పేది..."
"నేనడుగుతున్న ప్రశ్నకి సమాధానం అది కాదు. చెప్పు సంబంధం వుందా, లేదా?"
"ఉ... ఉంది".
భూమి చీలిపోయి నేనందులో కూరుకుపోతే బావుణ్ణనిపించింది. నా కళ్ళు అప్రయత్నంగా అశ్రుపూరితాలయ్యాయి.
నేను లేచి నిలబడ్డాను అమ్మేదో మాట్లాడబోయింది. "నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. నువ్వు తప్పు చేశావన్న బాధ నాకేమీలేదు. కానీ నేను నా తండ్రిని ఒకసారి చూడాలి. ఆయన నిన్ను వద్దనుకున్నారు. కానీ ఆయన్ని నేనొకసారి చూడడం నా అవసరం".
అమ్మ షాకింగ్ గా చూస్తోంది.
"అవన్నీ నాకెలా తెలిశాయనుకుంటున్నావా? ప్రకాష్ ఎవరనుకుంటున్నావ్? నీ భర్త రెండవభార్య పెద్ద కొడుకు... నాకు తమ్ముడు".
అమ్మ శరీరం కంపించడం స్పష్టంగా కనబడుతోంది. బయటికి నడవబోతూ ఆగి చివరి మాటగా అన్నాను. "నేను స్త్రీ హక్కుల పరిరక్షణోద్యమం తరఫున వాదించిన లాయర్నైతే అయి వుండవచ్చు. అలాని స్త్రీల తప్పుల్ని సమర్థించలేను. కనీసం ఏ దారీ లేక తప్పుచేసే ఆడవాళ్ళ పట్ల సానుభూతి చూపించవచ్చేమో కానీ. నీలా అన్నీ సవ్యంగా వుండి, ప్రేమించే భర్తుండీ, కేవలం ఆకర్షణకో, మోజుకో లోనై తప్పటడుగు వేసే వాళ్ళని నేను సపోర్ట్ చేయలేను. తల్లిగా నువ్వు ఇంతకాలం నా కోసం చేసినదానికి థాంక్స్. నువ్వు చేసిన పనికి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన నా తండ్రి రూపం నా కళ్ళలో కదలాడుతోంది. నీ మీద ఎంత ప్రేమ వుంటే ఆయనలా చేసివుంటాడు? అలాంటి తండ్రిని నేను వదులుకోలేను. వెళ్తున్నాను".
బయటికొచ్చి కారు తీస్తూ ఆలోచించాను. పాస్ పోర్ట్ వచ్చే వరకూ ఏ స్నేహితుల ఇంట్లో వుండాలనేది నా ఆలోచనల సారాంశం. తిరిగి ఈ ఇంట్లో అడుగుపెట్టదల్చుకోలేదు. గేటు నుంచి కారు బయటకి తీస్తుంటే రియల్ విండోలోంచి గుమ్మం దగ్గర నిలబడ్డ అమ్మ కనపడింది.
ఒంటరిగా, నిశ్శబ్దంగా గుమ్మాని కానుకుని నిలబడి వుంది.
కారు ముందుకు వెళ్తున్నకొద్దీ ఆమె ఆకారం అస్పష్టమై అదృశ్యమై పోయింది.
* * *
