Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 7

 
    తను కోరాలేగానీ నమ్మశక్యంగాని ఓ సుదీర్ఘ దాస్యం సొంతమైన సంతృప్తితో బ్రుతుకుని నూరేళ్ళ కావ్యంగా మలుచుకోవాలనుకుంటాడే తప్ప ఏ మగాడయినా అరుదయిన తనలాంటి అదృష్టాన్ని చేజార్చుకోగలడా?

 

    అహంకారపుట్టద్దంలో క్రమంగా తన ఆకృతి తనకే అగుపడని స్థితిలో  కూరుకుపోతున్న విజూషకి ఘాటుగా జవాబు చెప్పాలనుకుంది. కానీ ఇంతలోనే టీవిలో అనౌన్స్ మెంట్ వినిపించింది.

 

    "డియర్ ఫ్రెండ్స్!" సూటు వేసుకున్న ఓ మధ్యవయస్కుడు ప్రేక్షకులకి వివరిస్తున్నాడు.

 

    'రాష్ట్రప్రభుత్వం మానవ వనరుల శాఖ నిర్వహిస్తున్న క్విజ్ కాంపిటీషన్ ఫైనల్స్ ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు" క్షణం ఆగి అన్నాడు. "ఇప్పటిదాకా అన్ని వారాలపాటు  అన్ని జిల్లాలనుంచి యూనివర్శిటీ కాలేజీల నుండి వచ్చిన పార్టిసిపెంట్స్ ని ఫిల్టర్ తీసి చివరగా నలుగురు యువకుల్ని ఫైనల్స్ కి రప్పించడం జరిగింది. ఈరోజు జరిగే కాంపిటీషన్ లో ప్రధముడుగా వచ్చిన వ్యక్తి ఆ తర్వాత సౌత్ జోన్ క్విజ్ కాంపిటీషన్స్ కి పంపబడతారు. అక్కడ విజయం సాధిస్తే ఢిల్లీలో జరిగే జాతీయస్థాయిలో పాల్గొనే అర్హత దక్కించుకుంటాడు. వేదికమీద వున్న నలుగురు వ్యక్తులూ మీకు పరిచయమే అయినా మరోసారి తమకి తాముగా ప్రేక్షకులకి పరిచయం చేసుకోవాలని కోరుతున్నాను.
 


    క్విజ్ మాస్టర్ గా వ్యవహరించటే ఆ వ్యక్తి పైనుండి ఒక్కో యువకుడిపైకి కెమెరా 'ఫేస్' చేయబడింది.

 

    " నా పేరు జగన్నాధ్. ఆంధ్రా యూనివర్శిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను"

 

    "నా పేరు సురేంద్ర. ఓ . ఎన్. జీసిలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను"

 

    "అయామ్ రమేష్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పర్సనల్ మేనేజర్ని. "

 

    "నా పేరు రుత్వి" ఆ తర్వాత అతడేం చెప్పిందీ వినిపించలేదు.

 

    పాతికేళ్లు నిండిన ఆకర్షణ హిమశైల శిఖరంలా ఎదిగినా ఎందుకో అణువంత ఒరిగినట్టనిపించింది.

 

    అతడి గళసీమ గంధర్వ సంగీతమై ఏ కిన్నరుడో కొనగోట మీటిన విపంచియై విజూషని కదిపింది. అణువంత  కుదిపింది.

 

    అది స్పందన కాదు, ముడుచుకున్న పడుచుదనాన్ని మనసు లాకర్ లో ఇంతకాలం  ఎందుకు  దాచావు కాలమా అని నిలదీయాలన్న ఉద్దేశ్యం. కనురెప్పల క్రింద కానకుండా దాచుకున్న ఒక స్వప్నంలా కథనానికి మధనానికి మధ్య జరిగే  చిలిపి కథనంలా ఇంకా రాయని స్వర్ణాక్షర సంకేతంలా ఎగురువేయాలనుకునే కేతనంలా రారమ్మని ఆహ్వానించే ఆడతనంలా....

 

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?" స్పూర్తి అడిగింది.

 

    దేన్ని ఉద్దేశించి అడిగింది అనే విషయమూ ఆలోచించలేదు విజూష.

 

    "అతడ్ని ఓడిస్తాను" అనేసింది అసంకల్పితంగా.

 

    స్పూర్తి మొహంలో ఏ భావాలు ఆమెను ఇబ్బంది పెట్టాయో వెంటనే సర్దుకుంటూ  అంది విజూష - "రుత్విలాంటి వ్యక్తిని ఆకట్టుకోవటం కష్టమనే గా నీ ఉద్దేశ్యం."

 

    "కష్టం కాదు అసంభవం."

 

    "నో" ఉద్విగ్నంగా అంది విజూష. "నాకు సాధ్యమే అని నిరూపిస్తాను. ఎస్ స్పూర్తీ! ఒక వేళ  రుత్వి ఈ క్విజ్ పోటీలో గెలిస్తే అతడ్ని నా వెంటపడేట్టు చేసుకుంటాను"

 

    "ఓడితే?"

 

    వెంటనే తోచలేదు ఏం జవాబు చెప్పాలో.

 

    రుత్వి గెలవాలనే తను కోరుకుంటుందని చెప్పలేకపోయింది. "అతడు గెలుస్తాడు."

 

    విస్మయంగా చూసింది స్పూర్తి.

 

    "ఇంట్యూషన్" అసంకల్పితంగా అంది విజూష. రాత్రి కల గురించి చెప్పకుండా అందరి దగ్గరా గెలిచే రుత్వి నా దగ్గర ఓడిపోతాడని నాకున్న నమ్మకం."

 

    "సో.... జీవితంలో తొలిసారి ఓ అబ్బాయి విషయంలో పందెం కాస్తున్నావ్."

 

    "ముందు చాలెంజ్ చేసింది నువ్వు."

 

    "చేసినాగానీ నువ్వు ఇలాంటి పందెంలో నన్ను నేను పోగొట్టుకోలేనూ అనేదానివి నీకంత యిష్టం లేకపోతే."

 

    ఉలికిపాటుగా చూసింది విజూష.

 

    "కానీ రుత్వి మీద నీకెందుకు ఇష్టం ఏర్పడింది."

 

    "లేదు" అనాలనుకుంది. అనలేకపోయింది. అలా అని నిశ్శబ్దంగా వూరుకోవడమూ విజూషకు ఇష్టంలేదు "నువ్వేమనుకున్నా నాకు అభ్యంతరంలేదు."

 

    "గుడ్ పోటీ పూర్తవగానే రుత్వితో పరిచయం పెట్టుకుంటావ్."

 

    "రెండు నెలలవ్యవధిలో అతడ్ని..."

 

    ఆర్దోక్తిగా అంది స్పూర్తి. "నీ మనిషిగా చేసుకుంటావ్."

 

    బాహాటంగా ఒప్పుకోలేని విజూష దృష్టి మరల్చుకుంటూ అంది.

 

    "మనిషిగా చేసుకోవడం కాదు ఐ లవ్యూ అని  అతడిచేత అనిపించుకుంటాను. ఎస్. ఈ పందెం అంతవరకే."

 

    స్పూర్తి విప్పారితంగా చూసింది. తను రాయబోయే కొత్త నవలకి కొత్త సబ్జెక్ట్ దొరికినట్టుగా.


                                                    *    *    *    *

    
    క్విజ్ లో పార్టిసిపెంట్స్ అనుసరించాల్సిన నియమాలు, నిబంధనలూ పాతవే...." క్విజ్ మాస్టర్ ప్రేక్షకులని చూస్తూ చెప్పాడు.

 

    "పోటీలో మూడు రౌండ్స్ వుంటాయి. మొదటి రౌండు రౌండ్సులో ఒక్కో అభ్యర్దిని సుమారు ఇరవై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. జవాబు చెప్పడానికి అభ్యర్దికిచ్చే వ్యవధి పది సెకండ్లు. ఒక అభ్యర్ది తర్వాత వ్యక్తినీ అడిగి పదేసి మార్కులు ఇవ్వటం జరుగుతుంది" క్షణం ఆగి అన్నాడు.

 

    "చివరిది రేపిడ్ ఫైర్ రౌండ్. ఒక్కో అభ్యర్దికి పది ప్రశ్నలు జవాబు తెలీనప్పుడు 'పాస్' అనాలి. ఆన్సర్ తప్పు అయితే పదిమార్కులు మైనస్ చేయడం జరుగుతుంది.  సో.... ఆల్ ది బెస్ట్ అండ్ గెట్ రెడీ" స్కోర్ నోట్ చేసే యువతిని చూస్తూ "మిస్ వసంత అనగానే" నేను రెడీ సార్" అంది క్విజ్ మాస్టర్ తో మృదువుగా నవ్వుతూ.

 

    కెమెరా పార్టిసిపెంట్స్ క్లోజప్స్ ని ప్రేక్షకులకి చూపిస్తుండగా మొదటి ప్రశ్న అడిగాడు క్విజ్ మాస్టర్.


 
    "మిస్టర్ జగన్నాధ్! మనిషి రక్తంలో అవసరానికి మించి కాల్షియం డిపాజిట్ అయితే అది మూత్రపిండాల స్టోన్స్ గా రూపుదిద్దుకుని కిడ్నీని పాడు చేస్తాయి. సామాన్యంగా రక్తంలో కాల్షియం లెవెల్ ఎంతవుండాలి?"

 

    "9.11 మిల్లీగ్రామ్స్" టక్కున జవాబు చెప్పాడు జగన్.

 

    "రైట్" ఇప్పుడు మిస్టర్ సురేంద్రని చూస్తూ "1964 ఒలింపిక్స్ నుండి సస్పెండయిన దేశం ఏది?" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS