"అయినా ఆ తండ్రికి వారసురాలి వయ్యావుగా!"
"నాకు అక్కవైవుంటే ఆ స్థానం నువ్వు తీసుకునేదానివి"
"బుల్ షిట్" సోఫియా ప్రకంపించిపోతూంది. వినీల అసంకల్పితంగా ఆమె మనసు పొరల్ని స్పృశించి కంగారుపెడుతూంది. అదే సోఫియాని అసహనానికి గురి చేసింది కూడా. "నీ ప్రపోజల్స్ ని అంగీకరించని నేను నిన్నిప్పుడు అర్జెంటుగా నా అదుపులోకి తీసుకోబోతున్నాను."
ముందు అర్థం కాలేదు వినీలకి. అర్థమయ్యేసరికి నలుగురు వ్యక్తులు నిలబడి వున్నారు సమీపంలో.
వినీల నుదుట చెమట పట్టేసింది. మనుషులుగా కాక రాక్షసుల్లా కనిపిస్తున్న నలుగురు సోఫియా అనుచరుల్ని చూడగానే. "నేను రమ్మన్నది ఒంటరిగా"
"చెప్పానుగా. నాకు ఆ నియమాలు వర్తించవని" సోఫియా నవ్వింది హేళనగా. "మర్యాదగా రా. లేదూ అంటే నువ్వన్నావే బంధాలూ అనుబంధాలూ తెలీని ఆడదానినని. నీ ప్రాణాలు తీసి అది నిరూపించుకోవలసి వుంటుంది."
వినీల వినకుండా ముందుకు నడుస్తూంది.
"ఆగు" అరిచింది సోఫియా.
సోఫియా అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టు నలుగురూ ఆమె వెనుకే నడుస్తున్నారు. "వినీలా... మర్యాదగా ఆగు. లేకపోతే నేనేమిటో నీకు తెలియచేయాల్సి వుంటుంది."
వినీల వినలేదు. నిర్భయంగా నడుస్తూనే వుంది.
సోఫియా ఆవేశం అదుపు తప్పింది. ఆమె ఏ ఆదేశం జారీచేసేదో కాని వినీలని దూకుడుగా సమీపించిన నలుగురు వ్యక్తుల చేతుల్లోని రివాల్వర్స్ వరుసగా జారిపడ్డాయి.
రక్తం కారుతున్న చేతుల్తో మూలుగుతూ నేల చదికిలబడిపోయిన అందరి ముందుకి అప్పుడు వచ్చాడు శశాంక.
అంత వేగంతో ఒడుపుని ప్రదర్శించగల వ్యక్తి సామాన్యుడయ్యుండడని ఒక క్షణం క్రితమే అనుకున్న సోఫియా చేతిలో రివాల్వర్ తో నిలబడి వున్న శశాంకని చూసి అరిచింది ఉక్రోషంగా "నువ్వు మధ్యలోకెందు కొచ్చావు?"
"సోఫియా" భావరహితంగా చూస్తూనే వినీలకి రక్షణ ఇస్తున్నట్టు ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు శశాంక. "మన ఒప్పందం రీత్యా పోరాడాల్సింది, దెబ్బతీయాలనుకున్నది జయచంద్రని"
"సోఫియా క్రోధంగా చూస్తోంది "వినీలని విడిచిపెట్టనంటావు."
"నీకు లేకపోయినా నాకు కొన్ని నియమాలున్నాయి సోఫియా. ఈ విషయంలో నీ మాట కాదంటున్నందుకు క్షమించు" వినీలని కారులోకి వెళ్ళమని సౌంజ్ఞచేసి తను డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు.
పది నిమిషాల ప్రయాణంలో వినీల ఒక్క మాట మాట్లాడలేదు. హాస్పటల్ పరిసరాల్లో దిగుతూ అంది "ఐ హేట్ యూ"
"బట్ ఐ డోంట్..." టక్కున ఆమె చేతిని పట్టుకున్నాడు.
"పగ కోసం ఓ పాముతో స్నేహం చేస్తున్న మిస్టర్ శశాంకా" ఆమె కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. "ఇన్నాళ్ళు నీ కోసం వెంపర్లాడిన వినీలనే చూశావు. ఇప్పుడు నా ద్వేషాన్నీ చూడబోతున్నావు"
ఆమె వెళ్ళిపోయింది.
* * * *
"నీ తొందరపాటుతో నేనో అవకాశాన్ని కోల్పోయాను" సోఫియా గొంతు అసహనంగా పలికింది. "నువ్విలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు. ఒకవేళ నీ ప్లేసులో మరెవరన్నా వుంటే..."
"ఏం చేసేదానివి?" గిరుక్కున వెనక్కు తిరిగాడు. అప్పటిదాకా కిటికీ దగ్గర నిలబడి చీకటిలోకి చూస్తున్న శశాంక.
"సోఫియా... గుర్తుంచుకో... నెంబర్ వన్ నేను ఎవరి బెదిరింపులకీ లొంగను. నెంబర్ టు నా ఆవేశాన్ని నీ అవసరంగా మార్చుకుని నాతో చేతులు కలిపావు తప్ప నేను నీకేమీ కాను. నెంబర్ త్రీ నాకున్న శత్రువు ఒక్క జయచంద్రే తప్ప నువ్వు ద్వేషించే ప్రతివాళ్ళని నేనూ దూరం చేసుకోవాలీ అంటే అది జరగని పని"
అవాక్కయి చూస్తూండి సోఫియా... ఆ చిన్న విషయానికే అతడెందుకలా ఆవేశపడుతున్నాడో, తననెందుకలా తక్కువ చేస్తున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు.
తమాయించుకుంటూ అంది "మనం కలిసిందెందుకైనా ఒక మార్గంలో ప్రయాణిస్తున్నాం శశాంకా! జయచంద్ర మనకి ప్రత్యర్థి అయినప్పుడు వినీల కూడా మనకి శత్రువే. వినీలని అదుపులోకి తీసుకోవడమూ అందులో ఓ భాగమే."
"పొరపాటు పడుతున్నావు... వినీల జయచంద్రకి కూతురు మాత్రమే. అంతమాత్రం చేత మనకు ప్రత్యర్థి కాదు"
"కానీ ఇప్పుడు కాబోతోంది. అలా అనే నన్ను హెచ్చరిస్తోంది."
"నీకది అర్థం కాదు."
"అంటే" సోఫియా విస్మయంగా చూసింది.
"ఆమె స్థానంలో నిలబడ్డ ఏ అమ్మాయి అయినా అలాగే ప్రవర్తిస్తుంది. అవును సోఫియా... మనం ఎలా అర్థం చేసుకున్నా వినీల జయచంద్ర కూతురు..."
ఏ గతం గుండెల్లో మెదిలిందో ఓ సన్నటి నీటి పొర సోఫియా కళ్ళల్లో "ఎస్" కావచ్చు శశాంకా... తండ్రి కూతుళ్ళ మమకారం అంటే ఏమిటో తెలియని ఆడదాన్ని నేను... కాబట్టే అర్థం చేసుకోలేకపోయాను. ఓకె... చిన్న సందేహం. ఒకవేళ నువ్వు కూల్చాలనుకుంటున్న ఎంపైర్ ని తను కాపాడాలనుకుందీ అనుకో అప్పుడేం చేస్తావు. ఆ వ్యక్తికి కూతురు కాబట్టి నీకు కావాల్సిన మనిషి కాబట్టి క్షమించి వదిలేస్తావా... ఆహా... నీ ఏంగిల్ లోనే నేనూ ఆలోచిస్తున్నాను..."
