Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 77


    "గూడ్... తండ్రికి ఇప్పుడు కూతుర్ననిపించుకుంటున్నావన్న మాట" సోఫియా గొంతు వ్యంగ్యంగా పలికింది.


    "అవును సోఫియా...ఆ బంధంతో పెరిగినదాన్ని. ఆ తండ్రి రక్తంతో రూపుదిద్దుకున్న ఆడపిల్లని. బహుశా ఇలాంటి బంధాలకు అతీతురాలివేమో... పాపం నీకేం తెలుస్తుంది?"  


    "డోంటాక్ రాట్"


    "ఏం... వినడానికి ఇబ్బందిగా వుందా? వూహించగలను సోఫియా...అలాంటి ఎటాచ్ మెంట్స్ కి అతీతమైన నీలాంటివాళ్లే ఈ మార్గంలో అడుగుపెడతారని చెప్పడానికి పెద్ద మేథస్సు అక్కర్లేదు. కాస్త సైన్సు తెలిస్తే చాలు."


    శశాంక గమనించలేదు సోఫియా కళ్ళలో నీళ్ళు తిరగడాన్ని. "మిస్ వినీలా... నువ్వు మాటాడుతున్నది ఎవరితోనో తెలుసా?"


    "చెప్పానుగా బంధాలకీ, అనుబంధాలకీ అర్థం తెలీక ఓ రాక్షసిగా మారిన ఓ ఆడదానితో... వెల్... ఏమంటావు? కలిసి మాట్లాడుకుందామా?"


    తల పంకించిన సోఫియా స్థిరంగా అంది "అలాగే"


    "అయితే రేపు వూరవతలి స్మశానంలో మనం కలుసుకోబోతున్నాం."


    "అక్కడెందుకు?"


    "పోరాటానికి ముందు అక్కడ కలుసుకుంటే ఫిలాసాఫికల్ గా వుంటుందని. ఒంటరిగా రావాలి... అంటే రెండు సామ్రాజ్యాలకు చెందిన మనిద్దరమే మాటాడుకోవాలి. అర్థమైందనుకుంటాను. సరేనా..."


    "ఓ కె."


    "సారీ ఫర్ ఇంటరప్షన్ ఇన్ మిడిల్. ఇప్పుడు మీ కార్యక్రమంలోకి మీరు దిగొచ్చు" ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు.


    వినీల మాటలు సోఫియాపై ఎంత బలంగా పనిచేశాయీ అంటే ఆమె మూడ్ చెదిరిపోయింది. ఇప్పుడు శశాంకతో గడిపే స్థితిలో లేదు. అందుకే శశాంక చూస్తుండగానే బయటికి నడిచింది.


    ఆ రాత్రి సోఫియా నిద్రపోలేదు.


    'బంధాలకీ అనుబంధాలకీ అతీతంగా బ్రతికిన ఆడదాన్నని నన్ను అవహేళన చేసిన వినీలా... ఆ బాధేమిటో నీ తండ్రికి తెలిసేట్టు చేస్తాను' అసహనంగా బెడ్ పై దొర్లుతూ అనుకుంది.


                               *    *    *    *


    అసుర సంధ్యవేళ...


    పాశవికంగా ప్రకృతిని చుట్టుకోవాలనుకుంటున్న చీకటి ఇంకా స్మశానానికి తరలిరాని సమయంలో...


    సరిగ్గా అయిదు గంటలకల్లా వినీల స్మశానపు నడి బొడ్డుని చేరుకుంది. మూసుకున్న జీవిత యంత్ర కవాటాల్లా పరుచుకున్న సమాధుల చుట్టూ ... ఊరికి దూరంగా వుండడంతో ఆ ప్రదేశం నిర్మానుష్యంగా వుంది.


    మరో అయిదు నిమిషాలు గడిచాయి. ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మధ్య జరిగబోయే సన్నివేశానికి తను సాక్షిని కాలేనన్నట్లు సూర్యుడు పశ్చిమాన జారిపోతున్నాడు.


    అప్పుడు చూసింది వినీల రాయంచలా సమాధుల మధ్య నడుచుకొస్తున్న సోఫియాని. "వెల్ కమ్"


    "నీ ఇంటికి అతిథిని ఆహ్వానిస్తున్నట్టుంది" సోఫియా వినీలనే తదేకంగా చూస్తూ అంది.


    "ఎప్పటికైనా మనందరం ఇక్కడికి అతిథులుగా రావల్సినవాళ్ళమే సోఫియా"


    "ఫిలాసఫీ చాలు. చెప్పు ఏంటి మాటాడాలనుకుంటున్నది."


    "యుద్ధానికైనా కొన్ని నియమాలు కావాలి. అవి నువ్వు ఆచరించడం లేదు."


    "నీ తండ్రికీ నాకూ మధ్య వున్న పోరాటం నియమాలకు అతీతమైనది. తను ఆచరించని నీతి సూత్రాలు నేనెందుకు పాటించాలి?"


    "ఆ వివరాలు నాకు తెలీదు సోఫియా... కాబట్టి అప్పటి సంగతి మరచిపోదాం. ఇప్పుడు అటువేపు వున్నది నేను కాబట్టి కొన్ని నియమాల్ని మనం ఏర్పరచుకుందాం"


    "ఏమిటవి" అవహేళనగా చూసింది సోఫియా.


    "వ్యాపారానికి పోటీ తప్పనిసరి అని అంగీకరిస్తున్నాను. దానికి మేథస్సుని వినియోగించుకుందాం తప్ప మనుషుల్ని, వాళ్ళ ప్రాణాల్ని పెట్టుబడిగా ఉపయోగించుకోవడం మానేద్దాం."


    విస్మయంగా చూసింది సోఫియా. "ఇప్పటికే నేను పోగొట్టుకున్న నా వాళ్ళ సంగతేమిటి?"


    "దానికి నా తండ్రి శిక్ష అనుభవించాడు."


    "కాని బ్రతికే వున్నాడు. నా మనిషిని నీ తండ్రి మూలంగా ఎప్పుడో పోగొట్టుకున్నాను" ఏమయ్యాడో తెలియని రమేష్ గుర్తుకొచ్చాడో, జయచంద్ర తాకిడికి తట్టుకోలేక ఎంతో నష్టపోయిన తన వ్యాపారమే స్పురణకొచ్చిందో కసిగా జవాబు చెప్పింది.


    "నేను గతాన్ని మరిచిపోమంటున్నాను సోఫియా" మృదువుగా అంది వినీల.


    "అలా మరిచిపోవడానికి బంధాలూ, అనుబంధాలూ తెలిసిన ఆడదాన్ని కాదు నేను. అన్నిటికీ అతీతంగా పెరిగిన రాక్షసిని..." సోఫియా రొప్పుతూంది. నిన్న వినీల మాటల్నే తిరిగి అప్పచెబుతూ.


    "నీ కంటే వయసులో చిన్నదాన్ని!"


    "కాని పెద్ద సామ్రాజ్యానికి యువరాణివయ్యావు."

    
    "ఇది నేను కోరనిది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS