ఆ పిలుపులోని మార్దవానికి పులకించినట్టు "ప్లీజ్" మత్తుగా గొణిగింది చేతులు సాచి.
'కొన్ని క్షణాలపాటు నీ అందాన్నిలాగే చూడనియ్ సోఫియా... నిన్నటిదాకా ప్రపంచపు పరిధిలో నుంచి ఇప్పుడే నీ లోకపు సరిహద్దుల్లో అడుగుపెడుతున్నవాడ్ని. శరీరాన్ని తాకే ముందు నీ మనో నిగ్రహపు లోతుల్ని కొలవనియ్..." అతడెందుకిలా మాటాడుతున్నదీ గ్రహించే స్థితిలో లేదామె.
"ఎంతటి అసాధారణమైన సౌందర్యం నీది! రాసిపోసిన సంపంగి పూల గంధాన్ని మేను కద్దుకుని ఎదపై పెంచుకున్న అందాలు పూల బంతుల్లా! పిలుపు మాత్రానికే సుఖాతి రేకంతో అరమోడ్పులౌతున్న నీ నేత్రాలు తెలి మబ్బుల మాటున నిదురపోయే వేగుచుక్కలా లేక తెలవారని కోర్కెల సంద్రంలో అల్లనల్లన సాగే కాంక్షల కెరటాలా... అంగలార్చుకుపోతున్న నీ ఆర్తిని చూస్తుంటే అనిపిస్తూంది నువ్వు పద్మినివని!"
సోఫియా గొంతు నుంచి సన్నని మూలుగు... ఇప్పుడామె మదనుడి వింటినుంచి జారిపడిన పూల బాణమై కంపిస్తూంది.
"మూడు రేఖల శంఖాన్ని గొంతుగా మార్చుకుని రేయి మొదటి జామున చకోరంలా వలపు తళుకుల వానలో ఊర్పుల్ని కలగలిపి పురుష సంగమం కోసం ఉలికిపడుతున్నావు కులుకుల కిన్నెరసానిలా కోర్కెల ఉయ్యాలలో ప్రియుడ్ని పెట్టి పరవశించాలనుకునే నువ్వు చిత్రిణివా?"
"ఉహు" అరమోడ్పులైన నేత్రాలతో ఎగిరెగిరి పడుతూంది.
"కోర్కె తీరని తాపంతో ఉద్విగ్నపడతావు. కొలిమిగా మారి వేడి సెగలతో ఒంటికి చలి కాచుకుంటావు. అది తాపమో లేక ప్రకోపమో తెలియక సందిగ్ధపడతావు. ఇన్ని తెలిసిన నువ్వు వీణని కాదంటావు. జాణనైతే చాలంటావు. అంకుశాన్ని గుర్తించే మదపుటేనుగువా లేక శంకతో శశాంకుడ్ని చేపట్టాలనుకునే శంఖిణివా"
"అదీకాని నాడు మృదుస్వరాల రాపిడికే మెత్తబడి గాఢ సంగమాన్ని ప్రగాఢంగా వాంఛిస్తూ మోహపు కంఠాన్ని కంచు గంటగా మార్చి క్రూర కాంక్షకి లొంగే హస్తినివా... ఈ కళలో ఇంతటి నిష్ణాతురాలినని మురిసే సోఫియా నువ్వు ఏ ఒక్కదానివీ కాదు అన్నీ కలిసిన ఆడదానివి. నన్ను ఓడించాలని అనుక్షణమూ ఆలోచిస్తున్నదానివి.."
అరక్షణంపాటు రొప్పుతూ చూసిన సోఫియాలో కదలిక ఆగిపోయింది. గాటుపడకుండానే గట్టుకూలిన గండిలా నిస్త్రాణగా పైకి లేచి బాత్ రూం వేపు నడిచింది. షవర్ కింద నిలబడింది అయిదు నిమిషాలపాటు. టవల్ తో తలను రుద్దుకుంటూ బయటికొచ్చి "మగాడివే" అంది లాలనగా. నీరసంగా నవ్వుతూ అతడి పక్కన చేరుతూంటే ఫోన్ రింగవడం మొదలుపెట్టింది.
అది బెడ్ కి ఎడంవేపు వుండడంతో సోఫియా అందుకుంది అసహనంగా "యస్"
"గుడ్...నువ్వక్కడే వున్నావన్నమాట"
"ఎవర్నువ్వు?" ఆ వేళలో ఫోన్ రావడం ఆమెకు నచ్చలేదు.
"వినీల"
"ఐసీ... ఇక్కడుంటానని ఎలా అనుకున్నావు?" సోఫియా పిడికిలి బిగుసుకుంది.
"నీ విజయాన్ని చెప్పుకోవడానికి అక్కడికే ముందు వెళతావనిపించింది. ఆ ఉత్సాహంతో నీ ఆడతనాన్ని మొత్తం అక్కడే పరిచేస్తావనీ అనిపించింది. తెలిసిందిప్పుడు."
"ఏమని?"
"నా అంచనా తప్పు కాలేదని"
"నాకు ఇందాకే తెలిసింది"
"ఏమని" వినీల అడిగింది.
"నువ్వు జయచంద్ర మనిషివని"
"మనిషినే కాదు సోఫియా... జయచంద్ర కూతుర్ని."
"ఓహ్" సోఫియా కళ్ళలో అణువంత విస్మయం. "చెప్పు ఎలా వున్నాడు నీ తండ్రి?"
"నువ్వనుకున్నట్టుగా మాత్రం కాదు. అవును సోఫియా... నువ్వూహించి వుండవు. నీ రాకను నేను గమనించానని... అందుకే నీ ప్రయత్నమంతా చూశాను. నువ్వు సెలైన్ బాటిల్ పాయిజన్ ఇంజెక్ట్ చేసిన మరుక్షణం నాన్నగారి చేతికున్న నీడిల్ ని లాగేశానని..."
"ఐసీ" ఇప్పుడు సోఫియా గొంతు పూడుకు పోయింది. "అలాంటప్పుడు నన్నెందుకు అడ్డుకోలేకపోయావు?"
"మన పోరాటానికి అది వేదిక కాకూడదనిపించింది. నీకు కొన్ని గంటలపాటైనా ఈ పాశవికమైన ఆనందాన్ని మిగల్చాలనిపించింది. అంతకుమించి మన హడావుడి, అల్లరి నాన్నగారి ఆరోగ్యానికి మంచిది కాదనిపించింది"
"ఇది చెప్పడానికే ఫోన్ చేశావా?"
"ఇదొక్కడే కాదు సోఫియా... చాలా తెగువున్న ఆడదానిగా మురిసిపోతున్న నీతో కొన్ని పర్సనల్ గా మాటాడాలని వుంది"
"ఏమిటది?"
"పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్న నీకు కొన్ని యుద్ధ నిబంధనల గురించి ముందు తెలియ చేద్దామని"
"పిల్లకాకివి" సోఫియా గొంతులో కర్కశత్వం.
"అయినా నీలాంటి ఆడ రాబందును ఎదుర్కోవాలనుకుంటున్నాను."
"అంటే తండ్రి మంచం పట్టగానే క్షీణించిపోతున్న నీ సామ్రాజ్యానికి యువరాణివి అయ్యావా?"
"ఇంతవరకు కాలేదు సోఫియా... కాని నీ ప్రియుడి మూలంగా మంచం పట్టిన నా తండ్రి స్థితిని చూసి ఆ స్థితిని అవకాశంగా మార్చుకుంటున్న నీ ఉత్సాహాన్ని గమనించి ఇప్పుడు రాజ్యాధికారానికి నేను వారసురాలిని కావాలనుకుంటున్నాను."
