న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు నుంచి నివాసం ఇక్కడికి మార్పించింది. టెలిఫోన్లు. రెండు కార్లు. ఆమె తల్లిదండ్రులు యిక్కడే వుండి, వంటమనిషీ పనిమనుషుల అజమాయిషీ చూస్తుంటారు.
పై అంతస్థు కూడా వేస్తే సగభాగం తనకీ, రెండో సగభాగం రవికీ అని ప్లాను వేయించింది. ప్రస్తుతానికి, కిందే కుడివైపున తనగదీ, తూర్పువైపున రవి గదీ ఏర్పాటు చేయించింది.
బంగళాకి సరిపడా మరికొంత ఫర్నిచరు కొంది.
గృహప్రవేశం చాలా అట్టహాసంగా ఘనంగా జరపాలని అంటే__ "నీ ఇష్టమొచ్చినట్లుగా జరిపించు కానీ నా పేరు మాత్రం వీల్లేదు__" అన్నాడు రవి. అందుకని ఆహ్వానాలు అచ్చొత్తించకుండా వెళ్ళి కలుసుకునీ ఫోనులోనూ చెప్పింది.
ఈ బంగళా తయారవుతున్న రోజుల్లోనే ఒకరోజున రాంనగర్ తన పాకలో ఓ సాయంత్రం వేళ, "రాములూ నా దగ్గిర గత ఐదారు నెలల జీతంలో నుండి కొద్దిగా డబ్బు మిగిలింది. ఈ పాకకి చుట్టూ వున్న కొద్ది ఖాళీ స్థలం చుట్టూ ఈయేడు మళ్ళ కంచె తీసేసి, పాక మూసుకుపోకుండా మూడు అడుగుల యెత్తు ప్రహరీగోడ ఒంటిరాతి మందంతో కట్టించు. చిన్న గేటు పెట్టించు" అన్నాడు రవి. రాములు అలాగే కట్టించాడు. రాములు వాళ్ళ పెంకుటింట్లో ఒక్కడూ వుంటున్నాడు. వండుకు తింటున్నాడు. రోజూ సాయంత్రాలు వచ్చి యీ పాక ముందు పచ్చికమీద పడుకుంటాడు. మొక్కలకి నీళ్ళు పోస్తాడు బయటినుంచి బక్కెట్లతో తెచ్చి. ఆ నల్లగులాబీలు అప్పటికే యెప్పటికీ అంతే వున్నాయి ఎదగకుండా. పూలు మాత్రం అప్పటిలాగే గుంటపూలు పూస్తూనే వున్నాయి.
వారం పదిరోజులకి ఒకసారి రవి వచ్చి పాకలోనో, వాకిట్లోనో కాసేపు గడుపుతాడు. రాములుతో కలిసి, ఆ ప్రాంతపు ప్రజలను ముఖ్యంగా పేద ప్రజలను కలుసుకుంటూ వుంటాడు. వాళ్ళలో అతని పలుకుబడి మరింత పెరిగింది.
ఒకసారి "రాములూ యిక్కడ వొంటరిగా వండుకుని తింటూ యెందుకు? నీ చెల్లెలేగా అక్కడకి రారాదూ?" అన్నాడు రవి.
"చెల్లెలితోటి అన్న పోడు, మగని తోటి పెండ్లం. పెండ్లం తోటి మగడు పోతరేమోగాని. యీడ మా నాయన అవ్వ సొంతం కట్టిన ఇల్లున్నది. నీకు ఇష్టమైన ఈ కాటేజ్ వున్నది. ఈ మొక్కలున్నవి. ఇవన్నీ యెవరు చూస్తారు నేను యీడ లేకుంటె. రవీ సాబ్! గంగి తోటి ఆమె నాయన, అవ్వ ఆడ్నె వున్నరు గద!" అన్నాడు రాములు.
గంగి తండ్రి కొమరయ్య కొత్త అలవాటు ప్రకారం కల్లుపాకలోకి వెళ్ళి పూటుగా తాగి వస్తాడు. అలా వెళ్ళకుండా కట్టడి చేసింది. ఎమ్మెల్యే క్వార్టర్సులో వుండగానే. సాయిలు చేత సారా సీసాలు తెప్పించి వాళ్ళమ్మ పోశవ్వ దగ్గిర పెట్టించుకుంది. రోజూ వో కాయ సారా పోస్తారు అతనికి.
గృహప్రవేశం తరవాత ఒకరోజున ఇన్కంటాక్స్ వాళ్ళొచ్చి రవిని పట్టుకుని లెక్కలు అడిగారు. "ఆవిడని అడగండి" అన్నాడు రవి. గంగిని అడిగితే "ఇల్లు అంతా సోదా చేసుకుని మీకు కావాల్సినవి సీల్ చేయండి. తీసుకెళ్ళండి. రేపు మా ఆడిటర్ వచ్చి లెక్కలు చెబుతాడు" అని ఇంగ్లీషులో అంది.
స్థలం చాలా చవకగా కొన్నట్లు రాయించగలిగింది__వెనకటి దస్తావేజు అవటం వల్ల మిగతా ఆదాయానికి_ తన రెండు మూడు వ్యాపారాలు__కాంట్రాక్టులు, షేర్స్, రియల్ ఎస్టేట్ డీల్స్ వంటివి కొన్ని పకడ్బందీగా తయారుచేయించి వుంచాడు ఆమె ఆడిటర్. ఆ పైన ఇల్లు కట్టటానికి రెండు లక్షలు అప్పు చేసినట్లు__ అదీ చేబదులు. చేబదులు యిచ్చినట్లు చెప్పించింది వొకతని చేత. ఒక కారు తనది కాదని మరొకరిది వాడుకుంటున్నట్లు చెప్పింది. ఆ కారు యెలాట్ ఐన అతను అప్పుడే అమ్మే హక్కు లేనందున అది తనదే అని చెప్పాడు. అంతా గట్టెక్కాక, అదే అధికారులకి ఘనంగా మందు పార్టీ యిచ్చి, "తెలివి మీ ఒక్కరి సొంతమే కాదు. కాగా యెప్పుడన్నా మీలో యెవరికన్నా మాతో అవసరం కలగొచ్చు సుమా!" అంది ఇంగ్లీషులో.
ఇల్లు జనసమ్మర్ధం లేనిచోట వుండటంవల్ల చాలాసార్లు బాయ్ ఫ్రెండ్స్ ని ఇంటికే తెచ్చుకుంటూ వుంటుంది. సాధారణంగా రవి యింట్లో వుండగా వచ్చిన తను తన గదిలోవున్నా, అతను బయటికీ లోనకీ వెళ్ళటం జరగదు. రవి లేనప్పుడే జరిగేలా చూస్తుంది. అసలు రవి యింట్లో వుండేదే తక్కువ. ఉదయం ఎనిమిదింటికి వెళతాడు. మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు లోపల వచ్చి భోంచేసి ఓ కునుకు తీసి వెళితే, రాత్రి యెప్పుడో పొద్దుపోయి వస్తాడు. తన నియోజకవర్గం ప్రజలతోనో, కార్మికులతోనో, ఎమ్మెల్యేలతోనో, మినిస్టర్లతోనో, ప్రభుత్వాధికారులతోనో, రాజకీయ దళారీలతోనో వుంటాడు. అప్పుడప్పుడు వెనకటి మిత్రులతో__ తటస్థపడి, తీరిక వుంటే.
తనకిష్టమైన ఆర్ధికశాస్త్రం పుస్తకాల పఠనం ఆగిపోయి చాలా నెలలైంది. అసెంబ్లీ రాజకీయాల పఠనంలోనూ, అసెంబ్లీలో తన పలుకుబడి పెంచుకోవటానికి కొందరికి చేయించిపెట్టే పనుల వల్ల వచ్చే గొడవల తోనూ, గంగి చేపించే పనుల మెలికలతోనూ సరిపోతుంది__ సమయమంతా.
108
మార్చి పదిహేనో తేదీ మధ్యాహ్నం సుధీర్ వచ్చి మోహన్ రెడ్డిని అరెస్టు చేసినట్లు చెప్పాడు శ్రీపతికి. చదువుతున్న రీజ్జ్ మన్న్ పుస్తకం, 'ది లోన్లీ క్రౌడ్" మూశాడు శ్రీపతి.
లిబర్టీ థియేటరు దగ్గిరిలో యెవరితోనో రాజకీయ స్థితి చర్చిస్తూ ఎలక్షన్ల గురించి ఉపన్యాస ధోరణిలోకి దిగాడట. జనం జమయ్యారు__ వింటున్నారు.
"అటు ఇందిరా యిటు జనతా రెండూ పేదప్రజలను మోసగించే దోపిడీదారులే. ఎలక్షన్ల బూటకం. అడ్డమైన అక్రమాలు సాగిస్తారు. డబ్బు విరజిమ్మి పేద ప్రజల ఆర్ధిక దుస్థితిని వాడుకుంటారు. ఎన్నికలంటే ఫార్స్, మోసం, దగా. పేద ప్రజలు తమని తాము రక్షించుకోవాలంటే ఎన్నికలను బహిష్కరించటమే మార్గం." అని ఉర్దూలో ప్రారంభించాడు మోహన్ రెడ్డి.
సుధీర్ మరో ఇద్దరిని తీసుకుని వెళ్ళి విడుదల చెయ్యమని అడిగితే, "నక్సలైట్ గూండాగాండ్లు మిమ్ములగూడ నాకల వెట్టమంటరా?" అని కసిరాడట సి.ఐ.
