"చూడు బాబూ మన వంశం వెలను శౌర్యపు వంశం. యితరుల యిళ్ళలో అలాంటి పనులు చూసేవాళ్ళని నిగామానులుంటారు. అసలు లెక్కా డొక్కా ఆసామీయే చూసుకుంటాడు. మనం లెక్కలు చూసుకోము. లెక్కలు చూపెడితే తనిఖీ చూస్తాము. అందుకని దివాన్ జీ అనే అంటారు. చట్టం మారిపోయిందని ఒంట్లో నెత్తురు మారిపోదు" అంది.
"నేను ఏలూరు దగ్గిర మిత్రుల పెళ్ళికి వెళ్ళి వస్తున్నాను. ఇవన్నీ నాకు__"
"మిత్రుల కోసమో రికామీగానో కాక, ప్రత్యేకించి యిక్కడికి వచ్చావని భ్రమపడనులే. ఇవన్నీ నాకు మాత్రం దేనికి" అంది.
"నాకెలా తెలుస్తుంది?" అన్నాడు.
"అసలు నీకు ఏదైనా తెలుసా?" అంది.
"ఏమీ తెలీదు. ఏదైనా తెలుసుకుందామనే విశ్వసించుదామనే అన్వేషణలోనే వున్నానింకా."
"మన విశ్వం మారదు__ఆ అమ్మాయి పేరేమిటి__ఆ అమ్మాయి పెళ్ళి ఓ ముత్రాసి అతనితో యెందుకు జరిపించావు? నీకేం అవసరం వచ్చింది? పెళ్ళిళ్ళకు హాజరవటమూ పరువు తక్కువ పెళ్ళిళ్ళు జరిపించటమూ తప్ప నీ పెళ్ళి ప్రసక్తి లేదన్నమాట."
"రమాదేవి యిద్దరూ సమ్మతించి చేసుకున్నారు. మధ్యలోనే కాదంటే ఆగిపోతారా! ఐనా అందులో తప్పేముంది?"
"నువ్వెవరివో గ్రహిస్తే అందులో తప్పేమిటో గ్రహించగలవు!"
"వేదకాలం నుంచి యిప్పటివరకు_ "తానెవరు?" అనే యత్నంలో తెలుసుకోకుండానే గడిచిపోయిందని మహామహులన్నారు. నేనేపాటివాణ్ని" అన్నాడు.
"చూడు బాబూ. వితండవాదం అని ఛలవాదం అని కొన్ని వున్నాయి. వాటిని వక్రత్వానికి వాడుకోవటం ఉన్నత లక్షణం కాదు" అంది.
"యీవిడకి భారతీయ తర్కశాస్త్రం యెలా తెలుసబ్బా! వెనకటి కాలంలో న్యాయతర్కం కూడా వుండేదేమో దర్బారు వేడుకల్లో_" అనుకున్నాడు శ్రీపతి.
"ప్రస్తుతం నువ్వు ఆ వూళ్లో ఏం చేస్తున్నావు బాబూ?" అంది. గొంతులో బాధ కలిసిన వ్యంగ్యం.
"ఏమీ చెయ్యటం లేదు.
"యెందుకని?"
"ఏం చెయ్యాలో తెలియక __ పోనీ మీరు చెప్పండి ఏం చెయ్యాలో" అన్నాడు.
"పెళ్ళి చేసుకో."
"యెందుకు?"
"అందరూ ఎందుకు చేసుకుంటారో అందుకే."
"అందరూ యెందుకు చేసుకుంటారో నాకు తెలియదు" అన్నాడు.
"యిన్ని పెళ్ళిళ్ళు చూడటమేకాక గోత్రీకులలో ఘనత వహించగల వివాహాలు జరిపిస్తున్నావు_ ఆ మాత్రం తెలియదూ!"
"చేసుకోవాలనిపించి చేసుకుంటున్నారనుకుంటాను."
"నువ్వూ అలాగే చేసుకో."
"చేసుకోవాలని నాకూ అనిపించాలిగా!"
"చేసుకోవాలని యెందుకు అనిపించడం లేదు?" అంది.
"చేసుకోవాలని అనిపించక చేసుకోవాలనిపించటంలేదు."
"ఇటీవల మంచి సంబంధం ఒకటి వచ్చింది. అమ్మాయి ఇంగ్లండులో కేంబ్రిడ్జిలో చదువుతోంది. మన పూర్వీకులకీ వాళ్ళ పూర్వీకులకి సంబంధాలున్నాయి. నువ్వు సరే అంటే అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తారు" అంది.
"కయ్యానికైనా వియ్యానికైనా సాటివారు కావాలన్నారుగా?సీమ దేశంలో గొప్ప యూనివర్శిటీలో పెద్ద చదువు చదివే ఆమెకి అతి సామాన్యమైన చదువూ వాలకమూ మనిషిని నేను తగినవాణ్నెలా అవుతాను!"
"కావాలని తనని తాను కించపరుచుకోవటం ఒక రకం ఆత్మవంచనే అవుతుంది."
"ముందుగా ఆత్మ చిక్కాలిగా ఆత్మని వంచించుకోవటానికి? ఆత్మ కోసమే మానవకోటి యింకా వెదుకులాడుతోందిట!"
"వూఁ" అని భారంగా శ్వాస విడిచింది.
ఆ తరవాత మౌనంగా భోజనాలు ముగించారు.
రాత్రుళ్ళు భోజనం చేసిన వెంటనే విశ్రమించటం అలవాటు ఆమెకి.
వుదయం యెనిమిదింటికి తయారయ్యాడు శ్రీపతి.
తల్లి హాల్లో కూచుని వుంది. అక్కడే పనివాళ్ళున్నారు.
వెళ్ళి, ఒక క్షణం మౌనంగా నిలుచుని పనివాళ్ళవంక చూసి, "అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్త" అన్నాడు.
ఆమె భారంగానూ ఉదాసీనంగానూ చూసింది కొడుకు వంక.
"వెళ్ళొస్తా" అన్నాడు తల్లి వైపు చూసి.
"వూఁ" అని భారంగా హుందాగా శ్వాస వదిలింది.
107
గంగి, తను యేడాది క్రితం కొన్న స్థలంలో మొక్కలు నాటించింది. లాన్ కోసం పచ్చి బెరళ్ళు తెప్పించి పరిపించింది. ఆ స్థలంలో మూడు నాలుగు పెద్ద చెట్లు ముందే వున్నాయి. బంగళా లేచేసరికి చక్కని తోటా తయారై వుంది.
మిలిటరీ కంటోన్ మెంట్ రూల్స్ తో పేచీ వస్తుందేమోనని బాగా వెనకటి స్టాంపు వొకటి సంపాదించి సేల్ డీడ్ రాయించుకుంది. రిజిస్ట్రేషను జోలికి పోలేదు.
ఆ స్థలానికి దగ్గిరగా బోయినపల్లి పెంకుటిళ్ళు. దూరంగా__ ఒకవైపు మిలిటరీ కంటోన్ మెంట్, ఇంకోవైపు బేగంపేట విమానాశ్రయం, ఇంకోవైపు మారెడ్ పల్లి, మరోవైపు పెరేడ్ గ్రౌండ్.
లారీలతో మట్టి తోలించి బరంతు చేయించింది.అప్పుడెప్పుడో సిటీలో ఓ ఆర్కిటెక్ట్ తో బంగళా ప్లాను తయారు చేయించింది. ఐదు లక్షలు అవుతుంది ఖర్చు. ప్రస్తుతానికి రెండో అంతస్థు తలపెట్టలేదు. ఐదారు నెలలనుంచి పని జోరుగా సాగించింది. ఈ మార్చి నాటికి పూర్తిచేసి ఉగాదికి గృహప్రవేశం చెయ్యాలనే తలంపుతో. పని మధ్యలో బోయ్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం అమాంతం వెళ్ళిపోయేది. అన్నీ చూసుకోవటానికి సాయిలు వున్నాడు. ఇప్పుడు అతనికో మోటార్ బైక్.
రంగులతో సహా బిల్డింగు ప్లాను ఆర్కిటెక్టులకి అప్పగించటం వల్ల చాలా చక్కగా తయారైంది.
బంగళాకి ఒకప్రక్క మల్లెలు జాజులు లాంటివి. ముందుప్రక్క అశోకచెట్లు నాలుగు. ముందు ప్రక్కనే రకరకాల రంగుల గులాబీతోట. వాటితోపాటు నల్ల గులాబీలు. నల్ల గులాబీలు రవికి యిష్టం అని బాగా ఎరువూ అదీ వేసి ప్రత్యేకంగా పెంచాడు సాయిలు. మొక్కలు నిలువెత్తున గంగి అంత యెత్తు పెరిగాయి. కాని ఒక్క పువ్వూ పూయటం లేదు.
