శ్రీపతి వెళ్ళి అడిగాడు. "ఎలక్షన్ల పదహారూ పదిహేడూ పద్దెనిమిది తేదీల తరవాత విడుదల చెయ్యటానికి సాధ్యపడుతుంది. అదీ బెయిల్ మీద__బాధ్యతాయుతమైన ఉద్యోగిగానీ, వ్యక్తిగానీ పూచీపెడితే__" అని ఇంగ్లీషులో వివరించాడు సి.ఐ.
సుధీర్ ని పంపేసి నడక సాగించాడు శ్రీపతి.
__ఎలక్షన్ల మాయలో పడే ప్రజలు సాయుధ పోరాటం చేస్తారటయ్యా మోహనం! యెప్పటికీ ఎలక్షన్లు వుండవని నిర్ధారణ అయిన స్థితిలో అది సాధ్యమైతే కావచ్చునేమోగానీ _ ఇందిరమ్మ ఓ సామాన్య స్త్రీ కాదు నాయనా_ అరవై తొమ్మిదిలో ఆత్మ ప్రబోధపు విష్ణుచక్రం ప్రయోగించి దిగ్గజాలవంటి రాజకీయ మహామహులను చిత్తుచేసి యువరాణిగా పార్లమెంటు సింహాసనాన్ని అధిష్టించింది. అనుకోని పరిస్థితి యేర్పడి_ అంతకంటే గ్రహపాటు బాగోక అని అనుకోవాలేమో_ప్రతిపక్షాలు నానా గొడవా చేస్తే కొందరు ప్రజలు వాళ్ళతో సహకరించగా పడవ మునుగుతుందేమోననిపించి ఎమర్జన్సీ దండం చేతబట్టి__ ఎమర్జన్సీ పోట్లు పొడిచి_ ఎమర్జన్సీ స్మగ్లర్ల, బ్లాక్ మార్కెటీర్ల అరెస్టుల నాటకం ఆడింది. అప్రాముఖ్యమైన అంశాలలో పేదప్రజలు, ముఖ్యంగా అణగారిన ప్రజలని కాసేపు వేడుకకి చంకనెత్తుకుంది. ఇతర చవట ప్రజానీకానికి ఎమర్జన్సీ మార్ఫియా ఇంజక్షనిచ్చింది. అదేదో అత్యయికస్థితి అని స్ఫురణకి రానంతగా మామూలుగా సాగిపోతున్న తరుణం చూసి మొన్న ఎలక్షన్లు ప్రకటించింది__ ఎలక్షన్లు పెట్టమని అడిగే హక్కు లేని స్థితిలో_ ఆహా, ఇందిరమ్మ యెంత న్యాయమైంది. ఎలక్షన్లు పెట్టకపోతే మాత్రం ఇప్పుడామెను యెవరడగగలరు! అని అనిపించుకుంది. రాజకీయ నాయకులందర్నీ జైళ్లలో పడేసింది_కాసేపు కుప్పిగంతులెయ్యండిరా_అని. అవునూ, యీ జగజ్జీవన్ యెందుకు విభేదించి వచ్చినట్లు_ ఇందిర బతికుండగా కనీసం ఉపప్రధానిగా మరొకరు వుండే ప్రసక్తి లేదు_ తన వెనక అరవయ్ డెబ్బయ్ యస్సీ బీసీ సీట్లు వుంటాయనా_ అంతదాకా వస్తే, ఆ యస్సీ బీసీలంతా నాకు ఆత్మబంధువులు_ అతనికి స్వార్థానికి మాత్రమే బంధువులు అని తనవైపు తిప్పుకోగలదు. నాలుగు రూకలు కొసరు కూడా వేసి__ కొన్నిలక్షల రూపాయల రాబడిపన్నుకట్టటం మర్చిపోయేటంత మతిమరుపు వున్న బాబూ జగజ్జీవన్ రామ్ ఇంకేదో మహా మతిమరుపు స్ఫురించి అడ్డం తిరిగి వుంటాడు_ మునుగుతాడు_ఇందిరా కాంగ్రెస్ సీట్లకోసం ఏమీ అగచాట్లు పడ్డారు! అవును మరి అమ్మబొమ్మ చూపెట్టి గెలిచెయ్యొచ్చు, ఊరూ పేరూ లేని యే అనామకులైనా....
కొంపకి చేరాడు శ్రీపతి.
పందొమ్మిదో తేది ఉదయం రత్నాకరరావుని తీసుకెళ్ళి బెయిల్ మీద మోహన్ రెడ్డిని విడుదల చేయించాడు శ్రీపతి. రత్నాకరరావు తార్నాక వెళ్ళిపోయాడు స్కూటర్ మీద. శ్రీపతీ మోహన్ రెడ్డీ నడవసాగించారు.
"అతిథి మర్యాదలెలా జరిగాయయ్యా మోహన్" అన్నాడు శ్రీపతి.
"పోలీస్ బద్మాష్ ల మర్యాదలు యెప్పటి లెక్కనే వున్నవి. ఈడ సిటీల ఏమి చేద్దామనుకుంటున్నావ్. నక్సలైట్ హర్రామ్ కా బచ్చా....అని అడ్డమైన కూతలు కూసినాడు" అని ఒకక్షణం ఆగి, "నన్నెందుకు విడిపించినావు శ్రీపతి, జైల్లో వేస్తే యెప్పుడో యెక్కడో గాయత్రి కనిపించును" అన్నాడు మోహన్ రెడ్డి.
మోహన్ రెడ్డి ముఖంనిండా విచారం అలుముకుంది.
"గాయత్రిని యిలాంటి జైళ్ళలో వుంచరు, నీకు కనిపించటానికి. నార్త్ లోని యే జైలుకో పంపివుంటారు" అన్నాడు శ్రీపతి.
యింటికి చేరుకున్నారు.
మోహన్ రెడ్డికి ఆ యింటికి వెళ్ళాలనిపించడం లేదు. గాయత్రి జ్ఞాపకాలతో పిచ్చెక్కినట్లవుతుంది అతనికి. యింట్లో అడుగుపెట్టగానే "ఆ ఇల్లు మార్చివేద్దువు. అందాకా నువ్వు యిక్కడే నాతో వుండు" అని మోహన్ రెడ్డిని తన గూట్లోనే వుంచాడు శ్రీపతి.
సాయంత్రం సుధీర్ మరో యిద్దరు వచ్చారు. పొద్దుపోయేదాకా కబుర్లు. వాళ్ళు వెళ్ళాక బజారువెళ్ళి ఇరాని హోటల్లో బన్నుతిని టీ త్రాగి వచ్చారు.
మార్చి యిరవై ఒకటో తేదీ రాత్రి. ట్రాన్సిస్టరు పక్కనే పెట్టుకుని వింటున్నారు__ ఎన్నికల ఫలితాలు_ ఎన్నికల కమీషన్ ఇందిరా కాంగ్రెసుకి పాత చిహ్నం కాక ఆవూ_దూడ యిచ్చారు.
జనతాపార్టీ ముందు పీటీలో కనిపిస్తోంది. నమ్మలేకుండా వున్నారు.
ప్రతి ఐదు నిమిషాలకి పది నిమిషాలకి ప్రకటనలు.
అర్దరాత్రి దాటింది __ యిరవై రెండో తేదీ.
'సూర్యుడు తూర్పు నుండి పడమరకు పోతున్నట్లా, పడమర నుండి తూర్పుకి పోతున్నట్లా!" అన్నాడు మోహన్ రెడ్డి.
"నడినెత్తిన వొక్కసారిగా మండితే తూర్పు పడమరలు కలిసిపోతాయేమో చూద్దాం" అన్నాడు శ్రీపతి.
ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం ఇరవై రెండో తేదీ వుదయం మూడుగంటలు.
ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది_చిత్తుచిత్తుగా.
"హే" అని సంచలనంగా బిగ్గరగా అరిచాడు మోహన్ రెడ్డి.
రేడియోలో మరికాసేపటికి __ రూపు తేరా మస్తానా రికార్డు వినిపిస్తోంది. ఆ వెంటనే__అదేపాట సంగీతం రికార్డు.
మళ్ళీ ఫలితాల ప్రకటనలు.
నాలుగు గంటలకి నీలం సంజీవరెడ్డి గెలిచినట్లు ప్రకటన.
మరికాసేపటికి వెంకటేశ్వర సుప్రభాతం.
ఐదు గంటలకి "స్టేట్ ఆఫ్ ఎమర్జన్సీ ఈజ్ లిమిటెడ్" అని అత్యయిక పరిస్థితి తొలగింపు వార్త.
ఆరుగంటలకి సంజయ్ గాంధీ ఓటమి వార్త.
"బాలభానుడు కూడా అస్తమించాడు. ముప్పయ్యేండ్ల మోతీలాల్ వంశపు హయాం అంతరించింది. షి డెజర్వ్స్ యిట్. బట్ దీజ్ రాటెన్ బోల్డ్ హ్యాగ్స్ డోంట్ డెజర్వ్ దిస్ వన్ ఈవిల్ ఈజ్ రిప్లేస్డ్ బై అనదర్ ఈవిల్." అని మోహన్ రెడ్డి, ట్రాన్సిస్టరు పీకనొక్కి పక్కమీద పడుకుని వొళ్ళు విరుచుకున్నాడు.
"డైనమైట్ కేసంటూ జైల్లో పెట్టి__ఆఖరికి ఎలక్షన్లకి కూడా విడుదల చెయ్యకపోయినా భారత రైల్వే కార్మిక సింహం జార్జ్ ఫెర్నాండెజ్ జైలులోంచే నామినేషన్ వేసి జైల్లో వుండే గెలిచాడు. విశేషమే! జైలు నుంచి విడుదల కాని అభ్యర్థి అతనొక్కడే అనుకుంటాను." అన్నాడు శ్రీపతి.
"ఆ సింహాన్ని రైల్వే మంత్రి చేస్తే వదిలిపోతుంది గర్జింపు. ఈ చట్రంలో నిజాయితీపరుడెవడు చేరటమూ అర్ధరహితం" అన్నాడు మోహన్ రెడ్డి.
