Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 73


    వొకరి దోసిలిలో యింకొకరి దోసిలి. కలిసిన దోసిట్లో కొబ్బరిబొండాం. ముఖమూ పాదాలూ చూస్తుండిపోయిన అనంత్ రెడ్డి కొబ్బరి బొండాం. ముఖమూ పాదాలూ చూస్తుండిపోయిన అనంత్ రెడ్డి కొబ్బరిబొండాం సంగతి మర్చిపోయాడు. బరువంతా ఆమె చేతుల్లో పడింది. ఒక నిమిషం చూసి, యెడమ చేతి చిటికెన వేలి గోరుతో నొక్కింది. దాంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు అనంత్ రెడ్డి.
    గ్రహించిన ముసలి పౌరోహితుడు, 'పిల్లవాడు పారవశ్యంలో వున్నాడు. రవ్వంత తాళుము నాయనా__ యీ దివ్వె నీ సొంతమే మరి!' అని తనలో తాను పరిహాసమాడాడు.
    శంకరరెడ్డి అల్లుడి కాళ్ళు పళ్ళెంలో కడుగుతున్నాడు.
    'ది కన్యాదానం. వరదానం పద్ధతి యేర్పాటులెందుకో! మాతృ స్వామికంలో వుందేఁ. ఓ మళయాళనాయర్ని అడిగి తెలుసుకోవాలి__' అనుకున్నాడు శ్రీపతి.
    పెళ్ళి క్రతువు ముగిసేసరికి రెండున్నర ఐంది. యింకో గంటకో రెండు గంటలకో వెళ్ళిపోతారు. ప్రయాణానికిగాను వొక బస్సు, కార్లు సిద్ధంగా వున్నాయి.
    యీలోగా మళ్ళీ ఆ కాటేజీకి దేనికి__అనుకుని అక్కడే పెళ్ళిపందిరి బయట టచ్చాడుతున్నాడు శ్రీపతి. ఒక అరగంట అలా వీధుల్లో తిరిగివచ్చాడు.
    హరనాధరెడ్డి లోనకి పిలిచాడు.
    వాళ్ళకి మరీ దగ్గిరి వాళ్ళంతా నిలుచుని వున్నారు. 'అంపకాల ముందు ఘట్టం కాబోలు యిది' అనుకున్నాడు శ్రీపతి.
    దంపతులు _ ఆ పెద్దలకు ఒక్కొక్కరికి పాదాలకు నమస్కరిస్తున్నారు కానుకలిస్తున్నారు.
    శ్రీపతి యిది యింతకు ముందెప్పుడూ చూడలేదు. ముచ్చటగా చూస్తూ గమనిస్తున్నాడు.
    అంతలో__ తన కాళ్ళకి నమస్కరించారు. అనుకోని వూహించని సంఘటనకి తడబడ్డాడు. 'అందరూ కానుకలిస్తున్నారు. తనేమివ్వాలి? జేబులో పది పదిహేను వందనోటు వున్నాయి. వెయ్యినూట పదహార్లు ఇవ్వొచ్చు కానీ వెధవ కరెన్సీ నోట్లు__ అనుకుంటూంటే బుర్రలో చటుక్కున ఆలోచన వచ్చింది__
    అటో చెయ్యి ఇటో చెయ్యి వేసి లేవనెత్తాడు. పాపం, అందాకా యేం చెయ్యాలో తోచక వాళ్ళు అలా వొంగే వుండిపోయారు.
    తన యెడమచేతి __ మధ్యవేలికి వున్న మరకతం వుంగరం తీసి అనంత్ రెడ్డి వేలికీ, ఆ పక్క వేలికి వున్న నీలం వుంగరం స్వప్నరాగలీన వేలికి తగిలించాడు.
    ముగ్గురి కళ్ళలో ఆత్మీయపు గాఢత్వం.
    చివరి ఘట్టం, అంపకాల ఘట్టం. శ్రీపతి బయటికొచ్చి కార్ల దగ్గిర నించుని వున్నాడు.
    అంతలో హరనాధరెడ్డి శ్రీపతితో, "వీరు మీ మిత్రుడి తండ్రిగారు వీరారెడ్డిగారు" అని పరిచయం చేశాడు. శ్రీపతి గురించి చెప్పకముందే, "వచ్చేముందే మీ గురించి మీ మిత్రుడు చెప్పినాడు" అన్నాడు వీరారెడ్డి.
    యింక బయల్దేరాల్సిన ఘడియలు.
    దంపతులు కారులో కూర్చున్నారు.
    ఆమె తల్లిదండ్రుల కళ్ళలో కన్నీళ్ళు గమనించి 'ఆనందాన్ని విషాదమూ __విషాదాన్ని ఆనందమూ జయించలేని సమతూకపు సంయోగ విషాదానందం, ఆనందవిషాదం' అనుకున్నాడు శ్రీపతి.
    కార్లు కదిలాయి.
    "యింకో అరగంటకి ఫస్ట్ బస్సు వుంటుందేమో వెళ్తాను" అన్నాడు శ్రీపతి హరనాధరెడ్డితో.
    "అట్లా యేం కుదరదు" అన్నాడు హరనాధరెడ్డి.
    "యీ పనుల సమయం__ మరోసారి వస్తాగా" అన్నాడు శ్రీపతి.
    "పెళ్ళి తరువాత పనులకేం తొందరుండదు. కాగా మా అన్నయ్యా వాళ్ళూ చూసుకుంటారు" అని శ్రీపతిని వుంచేశాడు.
    మధ్యాహ్నపు భోజనం స్వప్నరాగలీన యింట్లోనే ఆమె తల్లిదండ్రుల్ని, యింకో పినతండ్రి నాగిరెడ్డి దంపతుల్ని తన భార్యని పరిచయం చేశాడు. అవీ యివీ కబుర్లు.
    ఆ తరవాత నాగిరెడ్డి తన కారులో వెళ్ళిపోయాడు.
    ఆ తరవాత శ్రీపతిని తన కాటేజీకి తీసుకొచ్చాడు. కొంచెంసేపు వాళ్ళతోపాటు అతని భార్య వుండి__ ఆ యింటికి వెళ్ళింది పనులున్నాయని.
    సాయంత్రం నాలుగున్నరకి బయల్దేరాడు శ్రీపతి. విజయవాడ చేరుకుని, మళ్ళీ బస్సెక్కి వాళ్ళ వూరు వుట్టిపల్లి చేరుకున్నాడు. అతను వస్తున్నట్లు యింట్లో తెలియదు. చూడగానే పనివాళ్ళు లోనకి పరుగుతీశారు, వాళ్ళమ్మకి చెప్పటానికి. ఒకతను వచ్చి బ్రీఫ్ కేస్ అందుకున్నాడు.
    తన గదిలోకి వెళ్ళాడు. స్నానించాడు. పడుకున్నాడు. చిన్నగా కునుకు పట్టింది.
    లేచేసరికి తొమ్మిదిన్నర.
    వాళ్ళమ్మగారు యెదురుచూస్తున్నట్లు పనిమనిషి చెప్పి వెళ్లాడు.
    లేచి చన్నీళ్ళతో ముఖం తుడుపుకుని తువ్వాలుతో తడి అద్దుకుని వెళ్ళాడు.
    "కూర్చో బాబూ. దారితప్పి వచ్చినట్లున్నావు!" అంది తల్లి.
    "ఓ దారి అంటూ వుంటేగా అమ్మగారూ, దారి తప్పటానికి!" అన్నాడు.
    "వూఁ" అని భారంగా గంభీరంగా నిట్టూర్చింది.
    "మీ ఒంట్లో కులాసాగా వుంటోందా?" అన్నాడు.
    "దేనికి?" అంది.
    మౌనంగా వుండిపోయాడు.
    లేచి వెళ్ళి తాళాలగుత్తి తెచ్చి అతనిప్రక్కన కుర్చీ అంచుమీద పెట్టి అవతలికి అడుగులు వేసి సోఫాలో కూర్చుని, "అవి నీకు అప్పగిస్తున్నాను. యేమన్నా చేసుకో. నేను కాశీకో, ఊటీకో వెళ్ళిపోదామనుకుంటున్నాను" అంది.
    ;కాశీకో ఊటీకో యేమిటి? వొకటి అసహ్యమైన మురికి చిరాకు చోటు. రెండోది ఆహ్లాదకరమైన అందమైన కులాసా చోటు. ఒకటి భక్తికీ రెండోది రక్తికీ సంకేతంగా భావిస్తే__మరి యిది భక్తా రక్తా! అయినా మధ్యన ఈ తాళాల గుత్తి నేనెక్కడ మోసేది?' అనుకుని, "అవన్నీ నాకేం తెలుస్తాయి?" అన్నాడు.
    "దివాన్ జీ వున్నారు చూడటానికి" అంది.
    "యింకా మనకి దివాన్ జీలు వున్నారా!" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS