చీకటి జవరాలి మరో ప్రపంచపు అంచులను తాకే ఆర్తిలా ప్రపంచాన్ని కమ్మింది.
పగిలిన అనురాగపు ప్రమిదలో ఆరిపోతున్న దీప కాంతిలాంటి కూనిరాగంలా గాలి మంద్రంగా వీస్తూంది.
హాస్పిటల్ లో సందడి క్రమంగా తగ్గి నిశ్శబ్దం ఆవరించింది. అయినా పోలీసులు అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు చుట్టూ. జయచంద్ర గాయపడిన తర్వాత ఆ పరిసరాలను వదలకుండా కాపలా కాస్తున్న సర్కార్, కుమార్ దాదాలు తన అనుచరులతో ఎలర్ట్ గా వున్నారు.
ఒక సువిశాల ప్రపంచాధినేతగా బ్రతికిన జయచంద్ర నీడలో హత్యలతో, నేరాలతో అనుక్షణం తలమునకలవుతూ వుండడమే అలవాటైన వారికి ఇది బందిఖానాలా వుంది. అంతకుమించి నేరస్థుడిపై కసి తీర్చుకుని తమ స్వామిభక్తిని నిరూపించుకోవాలనే తొందరపాటుగానూ వుంది.
సర్కార్ హాస్పిటల్ కారిడార్ లో కూర్చుని సిగరెట్ వెలిగించుకొని ఆలోచిస్తున్నాడు.
అదే సమయంలో జయచంద్ర గదిలోకి వచ్చిన ఓ నర్స్ నిద్రపోతున్న ఆయనకి మార్చిన సెలైన్ బాటిల్ ఖాళీ అవడంతో మరో బాటిల్ స్టాండుకు తగిలించి వెళ్ళిపోయింది.
ఉదయం వచ్చిన దగ్గర్నుంచీ భోజనం సైతం మరిచి ఆయన పక్కనే కూర్చుని వుంది వినీల.
వినీలని చూడగానే జయచంద్ర ఆశ్చర్యపోలేదు. తన ప్రణాళిక అమలు జరిగినందుకు ఆనందపడ్డాడు. కాని ఆ భావం కనిపించకుండా "వస్తావనుకోలేదమ్మా" అన్నాడు గొంతులో నిస్త్రాణని ధ్వనింపచేస్తూ.
బదులుగా కన్నీళ్ళు పెట్టుకుంది.
ఆప్యాయంగా తల నిమిరాడు. "నేను చేసింది పొరపాటే అయినా అది నీ మీద ప్రేమతో జరిగిన తొందరపాటని నేను పోయేలోగా తెలుసుకున్నావు. సంతోషమమ్మా... ఏ అహంకారంతో ఆ పనికి పూనుకున్నానో ఇప్పుడా అహంకారమే నేలకూలింది వినీలా... నాలాంటివాడికి సమస్య పోతున్న ప్రాణాలు కాపాడుకోవడం కాదు. ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించుకున్న ఈ సామ్రాజ్యాన్ని చచ్చేదాకా కాపాడుకోవడం... కొడుకులుంటే ఆ బాధ్యత అప్పచెప్పేవాడ్ని. నాకెవరున్నారు నువ్వు తప్ప. నీ సహకారం కావాలి. కనీసం నేను పోయేదాకా..." ఆయన రొప్పుతూ మాట్లాడుతుంటే వారించింది అతిగా మాట్లాడితే రక్తం నోటినుంచి స్రవిస్తుందనీ, టెన్షన్ ఎక్కువైతే ప్రాణాలు కూడా పోవచ్చని ఆ ఉదయమే వినీలకి ఓ థొరాసిక్ సర్జెన్ చెప్పాడు.
తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి కన్నాకూతుళ్ళనే విషకన్యలుగా మార్చిన తండ్రులున్న నిన్నటి చరిత్రకి జయచంద్ర కూడా వారసుడే. అందుకే తన ప్రణాళికలో ఓ భాగంగా అలా చెప్పించాడు.
ఉదయం నుంచి ఆలోచిస్తూందామె. తండ్రికి కూతురై తను కోరని మార్గంలో అడుగుపెట్టాలా లేక తన నమ్మకాలను, ఆదర్శాలను నిలబెట్టుకోవడం కోసం తండ్రికి దూరం కావాలా?
భారంగా కళ్ళు మూసుకుంది. బయటిలాగే మనసంతా చీకటి... మగతగా నిద్రలోకి జారిపోయింది.
సరిగ్గా అప్పుడు ద్వారం తెరిచిన చప్పుడు. ఓ నర్సు లోపలికి వచ్చింది. ముందు వినీలని పరిశీలనగా చూసింది. తర్వాత మెలకువగా లేని జయచంద్రని గమనిస్తూ సెలైన్ బాటిల్ ను చేరుకుంది. బాటిల్ నుంచి అతడి చేతిదాకా వేళ్ళాడుతున్న రబ్బరు ట్యూబ్ నెమ్మదిగా గిస్ కనెక్ట్ చేసి సెలైన్ బాటిల్లో ఓ సిరంజిని గుచ్చి ఓ ద్రవాన్ని ఇంజక్టు చేసింది.
ఈ ఆపరేషన్ మొత్తం పూర్తి చేయడానికి ఆమెకు పట్టింది కేవలం ఒకటిన్నర నిమిషాలు. మరో ఇరవై సెకండ్లలో బాటిల్ ని స్టాండు కమర్చిన ఆ యువతీ బయట ఏదో చప్పుడు కావడంతో వేగంగా కిటికీలో నుంచి బయటకు దూకింది.
అంతకు నాలుగు నిమిషాల పూర్వమే కారిడార్ లో వున్న సర్కార్ కి బాత్ రూమ్ లో నుంచి ఓ మూలుగు వినిపించింది. ఉద్వేగంగా అక్కడికి వెళ్ళి చూస్తే ఓ నర్సు కనిపించింది నోటికి ప్లాస్టరంటించబడి వుంది. "ఏం జరిగింది?"
జవాబు చెప్పకుండా ఆమె భయంతో వణికిపోతూంది. అంతే జయచంద్ర గదివేపు దూసుకుపోయాడు సర్కార్.
అప్పటికే నర్స్ లా జయచంద్ర గదిలో స్వయంగా అడుగుపెట్టిన 'సోఫియా' సెలైన్ బాటిల్లో సైనేడులాంటి విషద్రవాన్ని నింపి వెళ్ళిపోయింది.
ఒక్క అయిదు సెకెండ్లు చాలు సైనేడు శరీరంలో ప్రవేశించిన రోగి చనిపోవడానికి...
* * * *
"యురేకా" ఉత్సాహంగా శశాంక గదిలోకి అడుగుపెట్టింది సోఫియా. సోఫియాలో అంతవరకు కాల్చేసిన కాంక్ష చూశాడు, రక్తం తాగే రాక్షసత్వాన్నీ చూశాడు కాని ఇలాంటి ఉత్సాహం ఇంతవరకు అతడికి పరిచయం కాలేదు.
"ఏమైంది?"
"గెలిచాను శశీ... ఈ రోజుతో పూర్తిగా గెలిచాను... ఈ రాత్రితో సర్వం గెలిచేయబోతున్నాను" కారులోనే నర్సు వేషం తాలూకు కాస్టూమ్స్ అన్నీ తీసేసింది. ఇప్పుడామె మెక్సీలో వుంది.
అర్థరాత్రి పన్నెండు కావడానికి ఇంకా మిగిలింది అయిదు నిమిషాలు మాత్రమే.
గడియ పెట్టిన సోఫియా అతడు చూస్తుండగానే తన ఒంటిపై ఆచ్చాదనాన్ని పూర్తిగా తొలగించింది.
కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆమె సౌందర్యాన్ని చూసి కొన్ని లిప్తల పాటు తల తిప్పుకోలేకపోయాడు. జ్ఞానేంద్రియాలను స్థబ్దం చేసి కర్మేంద్రియాలన్నింటినీ ఒకేసారి గతి తప్పించగల అసదృశ్యమైన ఒంపులు.
