మరో అయిదు నిమిషాలలో ఆమె శశాంకకి ఫోన్ చేసింది. వెంటనే లైన్ లోకి వచ్చాడు శశాంక.
"నేను శశీ సోఫియాని..."
"చెప్పు"
"జయచంద్ర భవంతిలో మరో పిల్లర్ కూల్చే ఆఫరొచ్చింది. అది నువ్వు దిగ్విజయంగా పూర్తి చేయాలి. చేస్తే పది శాతం అంటే ఒక మూడు రోజులలో నువ్వు అయిదు లక్షలు సంపాదిస్తావు."
"వివరాలు కావాలి"
"ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకొస్తాను."
"అదేమిటీ?"
"కొత్త రోజు పుడుతున్న వేళలో పాత శశాంకకి గుడ్ బై చెప్పడానికి..." ఒకనాడు అతడన్నమాటే తిరిగి వల్లించింది "శశాంకా ఈ రోజు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు నువ్వు సోఫియా సామ్రాజ్యంలో శంఖుస్థాపన చేయబోతున్నావు" ఫోన్ క్రెడిల్ చేసింది.
అక్కడ భావరహితంగా నిలబడ్డ శశాంకకి అప్పుడు గుర్తుకొచ్చింది తన దగ్గర ఒకనాడు సోఫియా ఇచ్చిన పదిలక్షలూ వున్న విషయం.
* * * *
"ఇంత డబ్బా..." అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది శశాంకవేపు. ఆశ్రమంలో పిల్లల కేకలు, అరుపులు అస్పష్టంగా వినిపిస్తుంటే శశాంక నిశ్శబ్దంగా చూశాడు ఆమెను. "ఏం చేసుకోవాలయ్యా? అసలింత ఎలా సంపాదించావు?" నిశ్చేష్టతగానే అడిగింది.
"అమ్మా" శశాంక గొంతులో ఏ క్షణమైనా ముగిసే తన బ్రతుకులో రవ్వంత ఆనందాన్ని ధ్వనింపచేసే ఆర్ద్రత. "ఇది నా కష్టార్జితమే...ఇప్పటికి దీనితో నాకు పని లేదు. అందుకే నీకేమీ కాని పిల్లల కోసం నువ్వు పడుతున్న శ్రమలో నాకు నా చేతుల్లో రాలిపోయిన అమ్మ కనిపించిందో, లేకపోతే నా ఈ బ్రతుక్కి ఓ అర్థం కల్పించుకోవాలన్న దురాశే కలిగిందో ఈ డబ్బుని అనాధలైన పసిపిల్లల కోసం ఖర్చు చేయాలనిపిస్తూంది. కాదనకు"
అప్పటికే జాకీ ద్వారా కొంత వింది శశాంక గురించి. శశాంక కూడా ఓ అనాధగానే మరో ఇంట ఆశ్రయించిన కథ తెలుసు. ఆ తర్వాత తన వాళ్ళని పోగొట్టుకున్న విషయం తెలుసుకుని ఆ తర్వాత అతడి జీవితమేమిటో జాకీ కూడా చెప్పలేదు.
ఒక మేరువులా కనిపించే శశాంక కళ్ళలోని ఉద్విగ్నతని, అశాంతిని గురించి ఆప్యాయంగా తల నిమిరింది. "దేనికయ్యా నీ ఆవేదన? ఇప్పుడేం చేజారిందని... నువ్వు రుణపడాల్సింది జీవితానికి కాదు. నీ చుట్టూ వున్న ప్రపంచానికి. అదే నీ జీవితంగా మారినపుడు అంతా ఆనందంగానే కనిపిస్తుంది."
ఇక లేవూ అనుకున్న నీటిబొట్లు శశాంకకి తెలియకుండానే అతడి కనుకొలకుల్లో పేరుకుపోయాయి.
"ఎందుకయ్యా ఆ కన్నీళ్లు" తల్లిలా శశాంక కళ్ళు తుడిచింది "అమ్మ పొత్తిళ్ళు గుర్తుకొచ్చాయా... ఇదిగో ఈ అమ్ముంది. ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే బాధితుడ్ననుకుంటున్నావా? అంతకన్నా నష్టపోయాననిచెప్పుకోవడానికి నాకూ ఒక కథుంది. పిచ్చి నాన్నా..." శశాంక తలని ఒడిలోకి తీసుకుందిప్పుడు. "విశ్రాంతీ, ప్రశాంతీ ఎక్కడుంటుందయ్యా? అది నీరుదక్కేది అమ్మ కడుపులో పిండంగా వున్నప్పుడే. పేగు తెగిన క్షణమే ఈ ప్రపంచంతో నీకు బంధమేర్పడుతుంది. ఇక్కడా పిండంగానే బ్రతికితే ఇదీ అమ్మ కడుపంత హాయినిస్తుంది"
ఎన్నాళ్ళయిందని ఇంత ప్రశాంతతననుభవించి. మనసు పొరలు పగిలిన ఆ క్షణంలో తానేం చేసింది, ఏం చేయబోతున్నదీ చెప్పాలన్నంత ఉద్విగ్నత తొందర చేస్తుంటే చాలా కష్టపడ్డాడు నిభాయించుకోవడానికి.
అదిగో అప్పుడు వచ్చింది నాలుగేళ్ల రూపం, రూపతోబాటు జాకీ వచ్చాడు.
"నమస్తే అంకుల్" చేతులు జోడించింది శశాంకని చూస్తూ. "నేను చచ్చిపోలేదు నువ్వు రచ్చిచ్చావుగా. బతికేశాను" గుండె ఆపరేషన్ తర్వాత తిరిగొచ్చింది రూప మూడు రోజుల క్రితమే.
బుడిబుడి నడకలతో సమీపిస్తున్న రూపాని అమాంతం పైకెత్తుకున్నాడు. కళ్ళల్లో నీటిపొరలు, శరీరం కంపించిపోతోంది. మొన్న తనిచ్చిన లక్షతో ఓ పసికందు ప్రాణం నిలబడింది.
ఆత్మీయంగా రూపాని ముద్దు పెట్టుకోగానే శశాంక గుండెలపై వాలిపోయింది.
ఎప్పుడో అమ్మ పోయాక ఏ దారీ లేని తనకు ఓ సహృదయుడు ఆసరా ఇస్తే ఇలాగే సరిగ్గా ఇదే స్థితిలో చోటుదొరకని భావాలతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. చిత్రం... ఇప్పుడూ గొంతు పెగలడం లేదు.
'నేనెవరినైనా మీకేమీ కాకపోయినా జీవన పోరాటంలో అలసినవేళ అరక్షణమైనా గుర్తుచేసుకునే అందమైన మజిలీలమ్మా మీరు. ఎవరూ లేని నేను మీ అమ్మకు పెద్ద కొడుకునై, మీ అనాథలకి పెద్దన్నయ్యనై పోయేదాకా బ్రతికితే చాలు. పోయాక మీకు గుర్తుండేలా' రూపని దించాడు.
అన్నపూర్ణ ఇంకా గమనిస్తూనే వుంది. ఆమెకు అర్థమౌతూంది. శశాంక కథ అక్కడెక్కడో ముగిసినా మరెక్కడికో సాగిపోతూందని. అక్కున చేర్చుకొనైనా అడగాలనుకుంది. కాని అప్పటికే వెళ్ళిపోయాడు.
కొన్ని ప్రశ్నలకు జవాబు వెంటనే తెలుసుకోగలిగితే చాలా ప్రశ్నల ప్రవృత్తి ఆగిపోతుంది. లేనినాడు ఆ ప్రశ్నలు ప్రపంచమంత పెద్దగా విస్తరించిపోతాయి.
ఇక్కడ అన్నపూర్ణ సైతం చెప్పనిది తాను ఒకనాడు జయచంద్ర భార్యనని. చెప్పి వుంటే బహుశా ఒక సుదీర్ఘ పోరాటానికి వారధి అయ్యేదేమో...
* * * *
రాత్రి పదకొండున్నర కావస్తూంది.
