సిటీలోని ఓ స్టార్ హోటల్.
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎం.డి. ఛాంబర్ లో పర్సనల్ ఫోన్ రింగయింది. అలవోకగా రిసీవరందుకుంది ఫైల్సు చూస్తున్న సోఫియా. ఇప్పుడామె ఓ చీకటి ప్రపంచపు ఎంప్రెస్ లా లేదు. ఆ స్టార్ హోటల్ యజమానురాలిలా వుంది. "ఎస్. సోఫియా హియర్"
"నేను... బాంబే నుంచి సక్సేనాని మాట్లాడుతున్నాను..." అవతలివేపు నుంచి వినిపించింది సక్సేనా కంఠం. భారతదేశంలోని మొదటి ఇద్దరు టెక్స్ టైల్ టైకూన్స్ లో సక్సేనా ఒకడు.
చాలా ముఖ్యమైన సందర్భాలలో తప్ప సక్సేనా ఫోన్ లో పలకరించడు. రెండు తరాల నుంచి టెక్స్ టైల్ పరిశ్రమ నడుపుతున్న సక్సేనా కుటుంబంలో సుధీర్ సక్సేనా తన హయాంలో ఎంత ప్రాముఖ్యతని సంతరించుకున్నాడూ అంటే ఏడాదికి నూట ఏభై కోట్ల టర్నోవర్ గల తన ఫ్యాక్టరీని మూడువందల కోట్ల ఉత్పత్తికి పెంచాడు అయిదేళ్ళ కాలంలోనే. దానితో సక్సేనా 'కమల్' టెక్స్ టైల్స్ ని తయారుచేసే రాహుల్ కి సమీప ప్రత్యర్థి అయిపోయాడు. రాహుల్ కి కేంద్రప్రభుత్వంలో వున్న పరిచయం (?) కొద్దీ ఆ మధ్య సక్సేనా దిగుమతి చేసుకున్న మెషినరీలో ఫెరా (ఫారిన్ ఎక్స్ చేంజ్ రెగ్యులేషన్ ఏక్ట్)ని ఉల్లంఘించినట్టు ఓ అభియోగాన్ని మోపి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశాడు కూడా.
సక్సేనా కూడా సామాన్యుడు కాడు. కనీసం కొన్ని గంటలపాటైనా తనను అరెస్ట్ చేయాలని సిబిఐ ఛార్జి షీటుతో శనివారం సాయంకాలం అతడ్ని కస్టడీలోకి తీసుకుంటే ఆదివారం కోర్టు శలవు కావడంతో సోమవారందాకా కస్టడీలో వుండాల్సిన స్థితిలో రామ్ జెఠ్ మలానీ చేత రాత్రి పది గంటలకల్లా బెయిల్ ఆర్డర్ సృష్టించి బయటికొచ్చేశాడు. (ఏ మేజిస్ట్రేట్ అయినా రాత్రి పదిగంటల్లోగా బెయిల్ ఆర్డర్ పై సంతకం చేయాలి. అదీ డెడ్ లైన్)
"చెప్పండి మిస్టర్ సక్సేనా! వాట్ హెల్ప్ కెన్ ఐ డూ ఫర్యూ?" అడిగింది సోఫియా ఉత్కంఠగా. ఆమెకు తెలుసు ఇప్పుడు చాలా ఖరీదైన ఓ కాంట్రాక్టులో తాను అడుగుపెడుతున్నానని.
"నాకూ రాహుల్ కి మధ్య వున్న శతృత్వం మీకు తెలుసు" వారి మధ్య చర్చ ఇంగ్లీషులో కొనసాగుతోంది.
"నా టెక్స్ టైల్ పరిశ్రమలో ముఖ్యంగా నేను పోలిస్టర్ తయారీకి ఉపయోగించే ముడి పదార్ధం డి.ఎం.టి Dimethyl terephthalate. దానితో నా బిజినెస్ సక్రమంగానే కొనసాగుతోంది. ఈ మధ్యనే తెలిసింది రాహుల్ పి.టి.ఎ. Purified terephthalic acid ఇంపోర్ట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడని. ఇంటర్నేషనల్ స్టేండర్డ్స్ ప్రకారం డి.ఎం.టి కన్నా పి.టి.ఎ. చాలా తక్కువ ఖరీడైనదీ, ఎక్కువ రాబడినిచ్చేదీ... అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కాస్త గట్టివాడైనా ఏ ఒప్పందం జరిగిందో వాడు నాలుగురోజుల్లో ఆ ఫైలుపై సంతకం చేసి విదేశాలకు టూర్ చేస్తున్నాడు. ఈ ఒప్పందానికి రాహుల్ కి ముఖ్యంగా సహకరించింది జయచంద్ర.
సోఫియా కొద్దిగా ఉలికిపడింది.
"ఈ వేళ పేపర్లు చూశాను జయచంద్ర హాస్పటలైజ్ అయ్యాడని. ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ ఆ ఫైలుపై సంతకం చేస్తే నష్టం కొట్లలో వుంటుంది కాబట్టి ఆయనా సంతకం చేయకూడదు... ప్రస్తుతానికి జరగాల్సిందదే. అది ఆగితే చాలు. ఆ తర్వాత కథ నేను నడిపించుకుపోతాను. అలా మీరు చేసే ఓ ఏభై లక్షలు ఖర్చు చేయడానికైనా వెనకాడను. నాకు తెలుసు ఇది మీతో సాధ్యమని."
నవ్వింది సోఫియా "ఆశ్చర్యంగా వుంది మిస్టర్ సక్సేనా ఈ పనికి మీరు ఏభై లక్షల ఖర్చు చేయబోతున్నారూ అంటే ఈ లెక్కన జయచంద్రకి రాహుల్ ఎంత ముట్టచెప్పుండాలి?"
"సుమారు కోటి రూపాయలు" టక్కున జవాబిచ్చాడు సక్సేనా. "ఎస్ మిస్ సోఫియా... అదీ డబ్బు రూపేణా కాదు జయచంద్రకున్న మందుల కంపెనీకి ఎక్స్ టెన్షన్ గా పెట్రోకెమికల్ ఫేక్టరీ పెడుతున్నాడు. డాని మెషినరీ ఇన్వెస్ట్ మెంట్ వగైరా రాహుల్ సమకూర్చుతున్నట్టు తెలిసింది."
జయచంద్ర పెడుతున్న పెట్రో కెమికల్స్ ఫేక్టరీ గురించి వింది. కాని అందులో రాహుల్ హస్తం వున్నట్టు ఇప్పుడే తెలిసింది.
"సో" సాలోచనగా తలపంకించింది సోఫియా. "ఆ ఫైలుపై సంతకం ఆగిపోతే నాకు ఏభైలక్షలు లాభం జయచంద్రకి సుమారు కోటి రూపాయిల నష్టం. వెల్... నా ప్రత్యర్థి చిత్తు కావడమూ, నా యుద్ధనీతి కూడా కాబట్టి ఇట్స్ డన్. ఫైనాన్స్ మినిస్టర్ టూర్ వెళ్ళేలోగా అది జరిపిస్తాను."
"కానీ అదంత సులభం కాదు."
"కాబట్టే మీరు ఏభై లక్షలిస్తున్నది"
"కాని ఆర్ధిక శాఖ మంత్రి సంతకం చేయకపోవడానికి ఓ రీజన్ కావాలి."
"సింపుల్... దట్ విల్ బి పుట్ అండర్ రెస్ట్రిక్టేడ్ లిస్టాఫ్ ఇంపోర్ట్స్. ప్రస్తుతం ఈ దేశం దిగుమతి చేసుకోకూడని వస్తువుల లిస్టులో పి.టి.ఎ. కూడా చేరుతుంది" మెరుపు వేగంతో ఆమె ఇచ్చిన జవాబుకి అవతలివేపు మాట్లాడుతున్న సక్సేనా కూడా ఎంతగా అదిరిపడ్డాడూ అంటే తను ఆమెను ఎన్నుకోవడంలో తప్పు చేయలేదని బోధపడిపోయింది.
"అడ్వాన్స్ పంపండి" అంటూ ఫోన్ క్రెడిల్ చేసిన సోఫియాని చూసి ఎవరు కాదనగలరు ఆమె సామాన్యమైన ఆడది కాదంటే.
