Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 71


    బడలికగా చూసింది. గొంతు పూడ్చుకుపోతుంటే భారంగా గోడకి జారగిలబడిపోయింది. "మరుసటి రోజే నిన్ను కలుసుకున్నాను. నిన్ను చూసిన ప్రతిక్షణమూ నా గుండె తరుక్కుపోయేది, నిన్ను ప్రేమించిన తనే నీ బ్రతుకలా కావడానికి కారణమయ్యానన్న బాధతో తల్లడిల్లిపోయేదాన్ని. ఈ దేశం గర్వించాల్సిన వ్యక్తిని దారితప్పి ఆ కాసిలో ఎక్కడ పొరపాటు చేస్తావో అన్న భయంతో అనుక్షణమూ నీకు అడ్డం పడ్డాను. నిన్ను చల్లార్చే ప్రయత్నం చేశాను. సమయం వచ్చినపుడు నీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను. కాని ఇలా చెప్పాల్సి వస్తుందనుకోలేదు. శశాంకా... తప్పు చేసిన నా తండ్రిపై పగ తీర్చుకున్నావు. సంతోషంగా వుంది. ఇప్పుడు నీ మిగతా పంతం నెరవేర్చుకోవాలీ అంటే దీనికంతటికీ ముఖ్యంగా కారణమైన నేను సిద్ధంగానే వున్నాను. రా... నీ కసి తీర్చుకో.. కమాన్" ఆమె చూస్తోంది వధ్యశిలపైకి తనంతట తానుగా అడుగుపెట్టిన బలి పశువులా.


    ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం. అదీ కొంతసేపే...


    అంతసేపూ బయటికి చూస్తూ నిలబడ్డ శశాంక నెమ్మదిగా అన్నాడు. నీ కథని నువ్వు వినిపించావు వినీలా... నువ్వు చెప్పిన కారణాలు నీ ఆర్గ్యుమెంట్ కి బలాన్నివ్వగలవేమో గాని నాకు జరిగిన నష్టాన్ని పూడ్చలేవుగా..."


    "నేను జరిగింది చెప్పాను"


    "ఇప్పుడు జరిగింది మననం చేసుకోవడం కురుక్షేత్ర యుద్ధ భూమిలో నేలకూలుతున్న కౌరవ సేన ఆనాడు సంధి కుదిరితే పోరాటం తప్పేదిగా అని ఆలోచించడం లాంటిది. నీ సంజాయిషీ నీకున్నట్టే నా ప్రతీకారానికీ ఓ తర్కం వుంది"


    "అది తీరిపోయిందిగా"


    "లేదు వినీలా... తీరిపోవాల్సింది తప్పిపోయింది."


    "ఇప్పటికి సాధించింది చాలదా?"


    "నో" సరిగ్గా ఇక్కడే శశాంక ఆవేశం కట్టలు త్రెంచుకుంది.


    "ఇది కాదు సాధించడమంటే... ఏం చేసినా చెల్లుతుందన్న ఏ అహంకారంతో నా చిన్ని ప్రపంచంపై దాడిచేసి నాశనం చేశాడో ఆ వినాశనాన్ని నేనూ కళ్ళ చూడాలి. నా కృప ఆత్మ శాంతించేట్టు నా మనసు చల్లారేట్టు అతడి ఉన్మాదపు భవంతిని సమూలంగా పెరికి నీ తండ్రి దురంహంకారాన్ని కసిగా నేలకూల్చాలి. అప్పుడే నా ఈ పోరాటం ఆగేది. ఇది శాడిజమను, లేదా నా చితిపై నేను నిర్మించుకునే భస్మ సింహాసనమను నా తర్కాన్ని మాత్రం ప్రశ్నించకు..."


    "చివరికి ఏం దక్కించుకోవాలని"


    "ఇప్పుడేం దక్కనిచ్చారని?"


    "ఒక్క క్షణం ఆలోచించు శశాంకా!"


    "ఆలోచిస్తూనే వున్నాను. గడచిన క్షణాలు ఏమయ్యాయా అని, ఎందుకా క్షణాలు చేజారాయా అని."


    "శశాంకా"


    "మిస్ వినీలా" అర్ధిక్తిలోనే ఖండించాడు. "నీ లాజిక్ తో నన్ను వారించే ప్రయత్నం చేయకు. ఇది ఎప్పుడో ప్రారంభమైన పోరాటం. ఇప్పుడు ఆపాలని నాకు అడ్డంకాకు"


    "ఇదే నీ చివరి మాటా?"


    "ఇదీ నీ తండ్రి మొదలుపెట్టిన నాటకంలో మరో సన్నివేశమే అని నీ గురించి నేను పొరపాటు పడకూడదూ అనుకుంటే ఈ ప్రసక్తి ఇక్కడే ఆపేయ్"


    వినీల ఉద్వేగంగా కదిలింది అక్కడ్నుంచి.


    ఆ క్షణాన నిస్సహాయంగా చావు బ్రతుకుల మధ్య వూగిసలాడుతున్న తండ్రిపై మమకారమే పెల్లుబికిందో లేక మొండిపట్టుదలతో మాటాడుతున్న శశాంకపై ఏవగింపే అనిపించిందో వినీలకి తెలీదు.


    శశాంకతో అదే చివరిసారి కలయిక అన్నట్టు ఉక్రోషంగా సరాసరి హాస్పటల్ కి వెళ్ళింది.


    జరిగే ప్రతి సంఘటన్ని వ్యాపారాత్మకమైన మలుపుగా సమన్వయపరచుకోవడమే ఒక మేధావి లక్ష్యమైతే ఇక్కడ ఒక ఓటమితో జయచంద్ర మళ్ళీ గెలిచాడు. నిజానికి జయచంద్ర ఊపిరితిత్తుల్లో బులెట్ లేదు. ఆ రాత్రే డాక్టర్లు బయటికి తీసేశారు. తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో స్పృహలోకి వచ్చిన జయచంద్ర డాక్టర్లు చెప్పింది విన్నాడు. తెలివిగా వాళ్ళని కొనేసి తను బ్రతికేది కొన్ని వారాలు మాత్రమే అన్న సెంటిమెంటల్ లింక్ తో ఇటు కూతుర్నీ రప్పించుకున్నాడు. అటు ప్రత్యర్దుల్నీ తప్పు దోవపట్టించాడు. ఇక్కడ కోలుకుంటున్న జయచంద్ర పరిస్థితి విషమించలేదన్నది తెలిసింది కేవలం ఆ ముగ్గురు డాక్టర్లకి మాత్రమే. అతడి అనుచరులకీ తెలీదు. వారసులు లేని జయచంద్ర ఇదంతా చేసింది వినీలని క్రమంగా శశాంకకి దూరం చేయడం, తన సామ్రాజ్యానికి యువరాణిగా మార్చడం.


                              *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS