Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 70


    ప్రసాదు బ్రతికిలేడన్న విషయం బయటికి చెప్పలేక వాస్తవాన్ని అంగీకరించలేక ఎంత నలిగిపోయాడూ అంటే ఒక రహస్యం తెలిసిన ప్రత్యర్థి ఇంత తెలివిగా అవకాశం తీసుకుంటాడని వూహించలేకపోయాడు. సదాశివయ్య నుదుట చెమట పట్టేసింది. "సరే... సాధ్యమైనంత త్వరలో వాడ్ని పట్టుకుతీరాలి. లేకపోతే వాడు మరిన్ని అనర్ధాలకు కారణం కావచ్చు" ఇక్కడ సదాశివయ్య చెప్పింది లేని ప్రసాదు నుద్దేశించి కాదు. ఇలా అవకాశం తీసుకుంటున్న తెలివైన శతృవు గురించి.


    "ఎస్సర్. అయామ్ ఆన్ జాబ్" టక్కున జవాబు చెప్పాడు అవినాశ్.


    అదిగో సరిగ్గా అప్పుడు సదాశివయ్య టేబుల్ పై ఫోన్ రింగ్ అయింది. అది ఆయన పర్సనల్ ఫోన్. "హల్లో"


    "హోం మినిస్టర్ గారా?" అటునుంచి ఓ నవ్వు వినిపించింది.


    "ఎవర్నువ్వు?"


    "ప్రసాద్... నీ స్నేహితుడు జయచంద్రపై చావుదెబ్బ తీసిన ప్రసాద్. ఒకనాడు జయచంద్ర అనుచరుడ్ని."


    "నువ్వు..." సదాశివయ్య గొంతు ఉక్రోషంగా ధ్వనించింది. "నువ్వు కాదు"


    "ఏం...నన్ను చంపేశానని చెప్పారా పాపం... వాళ్ళకి తెలీదు చీకటిలో నాకు బడులు మరొకరిని లేపేసిన సంగతి. చెప్పు సర్కార్ కి. పాపం జయచంద్రకి చెప్పడానికి వినే స్థితిలో లేడుగా. మరో విషయం మిస్టర్ సదాశివయ్య ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా చాలా గొడవలు జరిగిపోతాయి. ఇట్సే ఛాలెంజ్. నీకూ, నీ అధికారులకీ. యస్... దమ్ముంటే నన్ను పట్టుకో... మరో విషయం... నా మీద ఇంటరాగేషన్ ఆపు చేయించకపోతే నిన్నూ విడిచిపెట్టను. అలా కంగారుపడకు. మనందరం నేరస్థులం కాబట్టి ఎక్కడో ఓ చోట ఢీకొనడం తప్పదుగా... చెప్పు మీ అవినాశ్ కి. నన్నేదో పట్టేస్తానని చాలా బీరాలు పలుకుతున్నట్టున్నాడు..." ఫోన్ పెట్టేసిన చప్పుడు. సాలోచనగా రిసీవర్ని క్రెడిల్ చేశాడు సదాశివయ్య.


    "వాట్ హేపెండ్ సర్... ఎవరు ఫోన్ చేసింది?" ఆయన ముఖ కవళికల్ని పరిశీలిస్తూ అడిగాడు డి.జి.పి.


    "ప్రసాద్..."


    "వ్వాట్"


    "లేదు వాడు చనిపోలేదు... నిజం" అసంకల్పితంగా నోరుజారిన సదాశివయ్య అక్కడ పోలీసాఫీసరు తననే గమనిస్తుంటే తొట్రుపాటుగా సమర్థించుకున్నాడు "లేదు జయచంద్ర చనిపోలేదు. చనిపోకూడదు..."


    "మళ్ళీ జయచంద్రపై ఎటాక్ చేస్తానంటున్నాడా" డి.జి.పి. ఉద్వేగంగా అడిగాడు "అసంభవం. మన రక్షణ వలయాన్ని దాటి హాస్పటల్లో అడుగుపెట్టలేడు."


    "ఈలోగా" అవినాశ్ అన్నాడు "ఆ ప్రసాదు సంగతేమిటో నేను చూస్తాను సర్...మే ఐ గో సర్"


    "ఎస్. బి ఆన్ ది జాబ్ అండ్ సీ దట్ ప్రసాద్ ఈజ్ ఇమ్మీడియెట్లీ టేకెన్ ఇంటూ కస్టడీ" డి.జి.పి. అనగానే శాల్యూట్ చేసి వెనక్కి తిరిగిన అవినాశ్ మరో అర నిమిషంలో బయటికి వచ్చాడు.


    వేగంగా నడుస్తున్న అవినాశ్ కి తెలీదు అలా ఫోన్ చేసింది రాత్రి నుంచి తననే వెంబడిస్తున్న జాకీ అని గాని, అతడికా బాధ్యత అప్పజెప్పింది శశాంక అనిగాని...


    ఇక్కడ మరో విశేషం


    హత్యా ప్రయత్నం జరిపిందే శశాంకే అని అవినాశ్ కి స్పష్టంగా తెలిసినా అతడ్ని డిపార్టుమెంట్ అనుమానించకుండా తనే ఓ కర్చీఫ్ లాంటి ఆధారాన్ని సృష్టించి అవినాశ్ కూడా అందర్నీ తప్పు పట్టించాడని ఎవరూ ఆలోచించలేకపోవడం...


    అవినాశ్ చాలా నిజాయితీ గల పోలీసాఫీసరు. నిజమే. కాని తన పై అధికారుల మూలంగా గాని, వాళ్ళని అదుపుచేసే రాజకీయ శక్తుల మూలంగా గాని చాలా హ్యుమిలియేట్ చేయబడ్డాడు.


    అదిగో దాని పర్యవసానమే ఇదంతా...


    జీపెక్కుతుండగా ఫోన్ కాల్ జ్ఞప్తికొచ్చిన అవినాశ్ పెదవులపై అస్పష్టమైన చిరునవ్వు. "మిస్టర్ శశాంకా... యూ ఆర్ ఏన్ ఇంటెలిజెంట్ బాస్టర్డ్"


                                                    *    *    *    *


    "ఏం శశాంకా... నమ్మలేకపోతున్నావా... ఎస్. నేనే జయచంద్ర కూతుర్ని. నీ భార్య మరణానికి పరోక్షంగా కారణమైనదాన్ని" వినీల కళ్ళ నుంచి నీళ్ళు ధార కడుతున్నాయి.


    "వినీలా" శశాంక నమ్మలేనట్టు విస్మయంగా చూస్తున్నాడింకా. "ఇది ఇదెలా సాధ్యం? హౌ కెనిట్ బి..."


    "సాధ్యమే శాశంకా... "రొప్పుతుందామె. ఎప్పుడో యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే నిన్ను నేను ప్రేమించాను. కాని అప్పుడు చెప్పలేకపోయాను. కారణం స్త్రీ సహజమైన సిగ్గు. తర్వాత విడిపోయాం. వెళ్ళేముందు నువ్వు ఎడ్రెస్ ఇస్తానన్నావు. కాని ఇవ్వకుండా వెళ్ళిపోయావు. నాకు తెలీదు ఆ తర్వాత నీకు పెళ్ళయిందని. తెలుసుంటే ఈ పొరపాటు జరిగేది కాదు. అవును శశాంకా. నాన్నకు ఒక్కగానొక్క కూతుర్ని. కోటీశ్వరుడిగా నాకు ఏం కావాలో ఆయనే ఏర్పాటు చేసేవాడు. కాని తొలిసారి అడిగారు. నువ్వు కోరిన వ్యక్తెవరైనా వున్నారా అని. ఆ ప్రశ్న నాన్న నోటి నుంచి వచ్చేదాకా పెళ్ళిని దాటేస్తూ వచ్చిన నేను నీ గురించి చెప్పాను. ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో తెలీదన్నాను. చెప్పానే గాని ఇదంతా ఇలాంటి మలుపు తిరుగుతుందని వూహించలేకపోయాను శశాంకా. అంతదాకా నాకు తెలిసింది నాన్న ఓ ఇండస్ట్రియలిస్టని మాత్రమే. అసలు ఆయన చీకటి జీవితం ఏమిటో తెలియకుండానే పెంచారు నన్ను..." ఓ క్షణం ఆగింది  " మా నాన్న చేతి కింద కొందరు రాక్షసులున్నారు గాని ఆయన చెప్పింది యథాతథంగా చేసుకుపోవడమే తప్ప సంజాయిషీ ఇవ్వడం తెలీనంత గొప్ప కిరాతకులని గాని నాకు తెలీదు. అవును శశాంకా... నీ ఆచూకీ తెలుసుకోమని కుమార్ దాదాకి చెప్పారు నాన్న. తనకు శశాంక అల్లుడయ్యే ఏర్పాటు చేయాలని ఒక బిజినెస్ లాగే తెలియచేశారు. అంతే రెండు రోజుల్లో నీ ఆచూకీ తెలుసుకున్న కుమార్ దాదా నీకు పెళ్ళయిందని తెలిసి ముందు నీ భార్యని హత్య చేశాడు. ఆ రాత్రి నాన్నతో చెబుతుంటే విన్నాను రహస్యంగా. నా గుండె పగిలిపోయింది. తొలిసారి నాన్నపై విరుచుకుపడ్డాను. మమకారం కోసం మరో బంధాన్ని ఇంత రాక్షసంగా కడతేర్చిన ఆయన్ని ఎంత అసహ్యించుకున్నానూ అంటే ఆ రాత్రే ఆయన్ని కాదని బయటకొచ్చేశాను. జరిగింది పొరపాటే అని ప్రాధేయపడ్డారు. తను ఏం చెప్పినా చేయడమే తప్ప తనకు బదులు చెప్పని రీతిలో వాళ్ళనలా తయారుచేయడమే తన పొరపాటైందని క్షమార్పణలు చెప్పుకోవడానికే సిద్ధపడ్డారు. అయినా నేను సంతృప్తి పడలేదు శశాంకా.. అలాంటి తండ్రికి కూతురునైనందుకు జుగుప్సతో ఒంటరిగా బ్రతకడానికి సిద్ధపడ్డాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS