Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 69


    కేవలం రాష్ట్రాలలోనేగాక కేంద్రం స్థాయిలో సైతం చాలా ప్రముఖుడిగా జయచంద్రకున్న పరపతిని బట్టి తను వ్యక్తిగతంగా ఎలాంటి రిస్కూ తీసుకోలేని హాస్పిటల్ సూపరింటెండెంట్ అక్కడ పోలీసు బలగానికి ఇన్ ఛార్జిగా వున్న ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ని కలిసి మాట్లాడేడు.


    ఆఫీసులో కూర్చున్న ఆ స్త్రీని చూడగానే అనుమానించే ఆస్కారమేమీ కనిపించకపోయినా అతడికున్న ఆదేశాల ప్రకారం జయచంద్ర వున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి నడిచి విజిటింగ్ కార్డు చూపించాడు.


    నొసలు చిట్లించిన జయచంద్రకి స్పష్టంగా కనిపించలేదేమో అని పేరు బయటికే చదివిన ఇన్ స్పెక్టర్ గమనించలేదు. ఆయన కళ్ళలో కనిపించిన అస్పష్టమైన అలజడిని... పంపమని తెలియజేశాడు నెమ్మదిగా చేతినూపుతూ.


    ఆ స్త్రీ మరో అర నిమిషంలో గ్లాస్ డోర్స్ దాటి లోపలికి ప్రవేశించింది.


    ఇప్పుడు జయచంద్ర శరీరం సన్నగా ప్రకంపిస్తూంది.


    ఆమె రోదిస్తూంది సన్నగా...ఇద్దరి ముఖాలలోను సుమారు రెండు దశాబ్దాల ఎడబాటు కలిగించిన ఆర్ద్రత_ఆవేదన...


    "నువ్వు..." జయచంద్ర పెదవులు కదిలాయి వూహించలేని ఉద్వేగంతో.


    "బ్రతికేవున్నాను" ఆమె తల వంచుకునే అంది - "ఏనాడో మీ నుంచి విడిపోయినా, నా ఉనికి మీకు తెలియకుండా జాగ్రత్తపడినా మీ ఎదుగుదల గమనిస్తూనే వున్నాను. ఈ రోజు పేపర్లో చూశాను" ఆమె పెదవులు అదురుతున్నాయి. "జయచంద్రగారూ... నేను ఒకనాడు మీకు భార్యనైనా ఇప్పుడు వచ్చింది మీరెన్నుకున్న మార్గం సరైనది కాదా, అవునా అని తేల్చి చెప్పడానికి కాదు. అది నా అభీష్టమూ కాదు... మీ నమ్మకాలని ఆనాడు అంగీకరించలేకపోయాను కాబట్టే మీకు దూరంగా జరిగిపోయాను. అయితే ఇప్పుడొచ్చింది ఇదిగో ఇంకా నాకు గుండెలపై కుంపటిలా గుర్తుచేసే ఈ బంధంతోనే" దుఃఖం తన్నుకొస్తుంటే నిభాయించుకోవడం కష్టంగా వున్నా మెడలో తాళిని అతడికి చూపించింది... స్మృతి మెదిలిందో ఎదగని దుఃఖపు అల ఆమె గుండె కోనేటిని  రాక్షసంగా మండించిందో గొంతులో ఎగదన్నుతున్న బాధ కళ్ళకు అశ్రువులుగా మారి కలవర పెడుతుంటే నెమ్మదిగా అంది. "మన బంధం ఇలా రహస్యంగానే మిగలనివ్వండి. కాని ఒక్క కోరిక-వినీలని మాత్రం మీ మార్గంలోకి రప్పించకండి. ఏ పరిస్థితులోనూ దాన్ని ప్రోత్సహించి మీ సామ్రాజ్యాన్ని ఏలమని శాసించకండి. అది ఓ ఇంటి కోడలు కావాలి. నాకు దూరమైన దాంపత్యపు జీవితపు అదృష్టాన్ని దానికైనా దక్కనివ్వండి..."


    ఆమె వెక్కిపడుతూనే అంది. "బహుశా మళ్ళీ నేను మీకు కనిపించను. అలా అని నా ఉనికిని వినీలకి తెలియజేసే ప్రయత్నం చేయకండి. అప్పుడు మీ గతమూ దానికి తెలిసిపోతుంది. నాలాగే అదీ మీకు దూరమైపోతుంది. ఈ స్థితిలో మీరు ఆ ఒక్క బంధం కోసమైనా నా గురించి ఆలోచించడం మానేయండి. ఎక్కడున్నా నేను కోరేది మీ సుఖం..." గొంతు పూడుకు పోతుంటే వేగంగా బయటికి నడిచింది.


    జయచంద్ర వారించలేకపోయాడు... సుమారు రెండు దశాబ్దాల నుంచి అతడిని వెన్నంటుతున్న క్రీనీడల రాపిడి కలవరపరచలేదు.


    తన విశాలమైన భవంతిలోని ఓ మారుమూల గదిలో వున్న విస్కీ బాటిల్ కూడా గుర్తుకు రాలేదు.


    ఇన్నేళ్ళ తర్వాత ఇది వూహించని సన్నివేశమైనందుకు ఆశ్చర్యపోతున్నాడు.


    అంతదాకా గదిలోకి రాని ఆ డాక్టర్లకుగాని, గదికి ఆవలి వేపు వున్న జయచంద్ర మనుష్యులకిగాని తెలీదు ఆ స్త్రీ జయచంద్రకి ఏమవుతుందో...


    ఆమె ఎవరో కాదు... ఏనాడో తనవాళ్ళకి దూరమై తమకంటూ ఎవరూ లేని అనాధ పిల్లలకి ఆశ్రయమిచ్చి ఎందరికో అమ్మగా బ్రతుకుతున్న అన్నపూర్ణ.


    సరిగ్గా ఇదే సమయంలో...


    డి.జి.పి. గదిలోకి అడుగుపెట్టాడు డి.సి.పి. అవినాశ్.


    పోలీస్ కమీషనర్ తో బాటు చాలాసేపటిగా అతని కోసమే వెయిట్ చేస్తున్నాడు డి.జి.పి.


    సుమారు ఓ అరగంట క్రితమే జయచంద్ర ఇంటికి అభిముఖంగా నిర్మాణంలో వున్న ఎపార్ట్ మెంట్ లోని ఓ ఆధారంతో నేరస్థుడు సరిగ్గా అక్కడ నుంచి జయచంద్రపై హత్యా ప్రయత్నమ చేసిందీ గుర్తించగలిగాడు.


    "దిసీజ్ ది ఎలిబీ ఐ గాట్ సర్" అంటూ ఓ చేతి రుమాలుని డి.జి.పి. కి అందించాడు అవినాశ్.


    దానిపై ఓ మూల S అన్న మార్కు వుంది.


    కమీషనర్ సాలోచనగా చూస్తున్నాడు దాన్నే.


    "S అంటే...." డి.జి.పి. వాక్యం ఇంకా పూర్తి కాలేదు.


    "శశాంక" టక్కున జవాబు వినిపించింది.


    అలా శశాంక పేరు చెప్పింది అవినాశ్ కాదు_పోలీస్ కమీషనర్. వెంటనే "నో సర్" అన్నాడు అవినాశ్. "నేను థరోగా ఇన్వెస్టిగేట్ చేశాను. 'S' అంటే శశాంక కాదు. ప్రసాదు ఇంటి పేరు శరగడం 'S' ఫర్ శరగడం. నాట్ శశాంక"


    నేరస్థుడి పేరు ప్రసాదు అంటూ డి.జి.పి చెప్పగానే "నో" అంటూ అరవబోయిన సదాశివయ్య గొంతులో వెలక్కాయ అడ్డం పడ్డట్టు టక్కున ఆగిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS