Previous Page Next Page 
ఆలింగనం పేజి 70


    "బోస్ అనీ... స్పెసిమన్! వారం రోజులుగా అతనితో బ్రాంచ్ ఆఫీసులన్నీ తిరుగుతున్నాను. మొదటిరోజే ఒక స్పాట్ కి వెళ్ళాం. రంగు రంగుల పూలూ, ఎత్తునుండి పడుతున్న జలపాతాలూ... వర్ణించలేనంత బావుంది. గబగబా కెమేరా బయటికితీసి 'ఒక స్నాప్ తీసుకుంటాను' అన్నాడు.

 

    "నేను తలవూపి అక్కడున్న రెయిలింగ్ పట్టుకుని నిలబడ్డాను. ఎంతకీ తియ్యడు. స్మైల్ చేస్తూ నిలబడి, నిలబడి విసుగొచ్చి 'త్వరగా తియ్యండి... టైం అయిపోతోంది బయల్దేరాలి' అన్నాను. అతను వెంటనే 'మీరు అడ్డు తప్పుకుంటే తియ్యాలనే వుంది!' అన్నాడు. ఆ నిమిషంలో ఎంత ఒళ్ళు మండిపోయిందో తెలుసా?"

 

    లిల్లీ చెప్తుంటే నేను పెద్దగా నవ్వాను.

 

    "కార్లో మ్యూజిక్ పెడ్తూ "ఏ పాట ఇష్టం?" అని అడిగితే 'నాకు మన నేషనల్ సాంగ్ చాలా ఇష్టమైనపాట! అని చెప్పాడు. అదేదో జోక్ అనుకున్నాను. కానీ ఆ మొహంలో సీరియస్ నెస్ చూశాకా అది నిజం అని తెలిసింది."

 

    "ఏ పువ్వు ఇష్టం అని అడిగితే అరటిపువ్వు అని చెప్పుంటాడు" అన్నాను.

 

    "ఏం అడగడానికి అసలు ఎక్కువ మాట్లాడ్తేగా. బ్రాంచ్ మేనేజర్ని లెక్కలు సరిగ్గా లేవని సస్పెండ్ చేశాడు. ఎకౌంట్స్ డిపార్ట్ మెంట్ ని గడగడలాడించాడు. అందరిమీదా హెడ్ ఆఫీసుకి రెండు పేజీల నోట్ రాశాడు. వాళ్లు ఎరేంజ్ చేసిన డిన్నర్ లో నాన్ వెజ్ ఉందని బయటికిపోయి బడ్డీకొట్టులో ఒక రొట్టె ముక్క కొనుక్కుతిన్నాడు."

 

    "ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే!" లిల్లీ దగ్గరికి జరుగుతూ అన్నాను.

 

    "ఏం మాట్లాడితే కరుస్తాడో అని భయపడి చచ్చాను. ఒకరోజు సాయంత్రం ఎమ్.డి. ఫోన్ చేస్తే రూంలోలేడు. అతనికి మెస్సేజ్ ఇవ్వడానికి ఆ ట్రావెలర్స్ బంగళా మొత్తం వెదికాను. కనపడలేదు.

 

    బయటికొచ్చి చూస్తే దూరంగా చింత చెట్ల క్రింద కనిపించాడు. దారంతా గోతులు, ముళ్ళూ... పడుతూ లేస్తూ వెళ్ళి పిలిచాను. వినిపించుకోలేదు.

 

    అతని చుట్టూ చాలామంది పిల్లలున్నారు. వాళ్ళ ఒంటిమీద చొక్కాలు కూడా లేవు. వాళ్ళతో కలిసి గోటీలాడ్తున్నాడు.

 

    'సర్...' అని క్లాప్స్ కొట్టి పిలిచాను.

 

    'హే...య్...' అని ఎగిరాడు. గోటీలు గెలిచినట్లున్నాడు. అదీ సంతోషం!

 

    నేను అతడి మనస్తత్వాన్ని అంచనావేస్తూ చేతులుకట్టుకుని చూస్తూ అక్కడే నిలబడిపోయాను.

 

    షర్ట్ స్లీవ్స్ ముడిచి, ప్యాంట్ ఒకవైపు మోకాళ్ళ వరకూ మడత పెట్టి, ఎవడో పిల్లాడు చీట్ చేశాడని 'నేనొప్పుకోను...నేనొప్పుకోను...' అని దెబ్బలాడ్తున్నాడు. నాకు నవ్వొచ్చింది.

 

    ముందురోజే లయన్ లా ఆఫీసులో జనాన్ని గడగడలాడించిన వ్యక్తి ఇతనేనా అని చూస్తూ నిలబడ్డాను. ఇంతలో అతనివంతు వచ్చింది.

 

    మొహంమీదకి జుట్టు పడ్తున్నా పట్టించుకోకుండా, రెండు చేతులతో రెండు గోటీలని లూటిస్తూ... ఎదురుగా ఉన్న లక్ష్యం వైపు గురిచూసుకుంటున్నాడు.

 

    ఆ మొహంలో ఏకాగ్రత చూస్తుంటే విశ్వనాథ్ ఆనంద్, లియాండర్ పేస్ లు గుర్తొచ్చారు. అతనికోసం బ్రాంచ్ మేనేజర్ డ్రింక్ పార్టీ ఎరేంజ్ చేస్తే అతనికి ఎందుకు నచ్చలేదో అర్థమయింది.

 

    ఓ మహా రచయిత చెప్పినట్లు 'మనం ఎలా ఉండడాన్ని ఇష్టపడతామో, అలా నిస్సంకోచంగా ఎవరి దగ్గరైతే ఉండగలమో వాళ్లే మనకి స్నేహితులు!' అంది.

 

    నేను కుతూహలాన్ని అణుచుకోలేక "ఇంతకీ అతను నిన్ను అక్కడ చూసి ఎలా ఫీలయ్యాడో చెప్పనేలేదు..."

 

    లిల్లీ అది తలుచుకుని మళ్ళీ నవ్వసాగింది.

 

    "నన్ను చూసి... 'రండి...మీరూ ఆడ్తారా?" అని చాలా మామూలుగా అడిగాడు.

 

    నేను మర్యాదగా 'ఆడడానికి కాదు, మీకు ఎమ్.డీ. గారు ఫోన్ చేశారు. కబురుచేద్దామంటే బోయ్ కనిపించలేదు. నేనే వచ్చాను' అన్నాను.

 

    "సరే... తర్వాత ఆయనకి ఫోన్ చేస్తాలెండి" అని ఆటలో మునిగిపోయాడు.

 

    "ఈ బోయ్ ఏమైపోయాడో!" అని విసుక్కున్నాను.

 

    "బజారుకి పంపించాను. వీళ్ళకి బట్టలూ, స్వీట్సూ తీసుకురమ్మని".

 

    "అవన్నీ ఇప్పుడు ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాను.

 

    "నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారుగా! అన్నాడు.

 

    అతనికి కాస్త స్క్రూ లూజ్ అనుకుని వెనుతిరగబోతుంటే - 'ఆగండి. మీరూ ఆడండి' అని "ఏం ఆడిపించుకుందామా?" అని పిల్లల్ని అడిగాడు.

 

    వాళ్ళు ఉత్సాహంగా "ఓ..." అన్నారు.

 

    'రండి...' నాకు గోటీలు అందిస్తూ పిలిచాడు.

 

    నేను ఓ నిమిషం ఆలోచించాను. కాని ఎందుకో చిన్నప్పటిరోజులు గుర్తొచ్చి ఆడాలనే అనిపించింది. వానలో తడవడం, పిడతకింద పప్పు కొనుక్కుని తింటూ నడవడం, ఐస్ ఫ్రూట్ తింటూ చేతులకింద నుండి కార్తున్నది నాకడం... ఇవన్నీ పెద్దవాళ్ళం అయ్యాము కాబట్టి చేస్తే బావుండదని మానేస్తాం.

 

    కానీ ఒక్కొక్కసారి చెయ్యాలనిపిస్తుంది కదా! అందుకే నేనూ వాళ్ళతో చేరి గోటీలాడాను.

 

    నేను గెలుస్తున్నప్పుడల్లా అతని ముఖంలో మెచ్చుకోలు కనిపించింది.

 

    "చాలా ఎక్స్ పీరియన్స్ ఉంటే కానీ అలా కొట్టలేరు. చిన్నప్పుడు బాగా ఆడేవుంటారు" అన్నాడు.

 

    నేనూ హుషారుగా రెచ్చిపోయాను.

 

    అలా ఎంతసేపు ఆ పిల్లలతో కలిసి 'హే...' అని అరుస్తూ, గెంతుతూ ఆడేవాళ్లమో కాని బోయ్ వచ్చి నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తుండిపోవడంతో, ఆపెయ్యాల్సొచ్చింది. అతనికి మమ్మల్ని చూస్తే పరిస్థితిని ఎలా ఆకళింపు చేసుకోవాలో తెలియనట్లుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS