"ఆ మాధవ్ చూస్తే అట్లా అని పోయాడు. ఈ చైతన్య చూస్తే ఇట్లా చేశాడు! దీనికి సంబంధం చూసి పెళ్ళి చెయ్యగలమా? అని కంటతడి పెట్టింది.
"సమయం వస్తే అవే జరుగుతాయి సౌదామినీ. బాధపడకు. దాన్ని చదువుకోనీ" అన్నాడు నాన్న.
లిల్లీ ఆఫీసునుండి వచ్చే టైందాకా ఓపిక పట్టి, అది అవగానే అమ్మకి చెప్పి బయల్దేరాను.
డోర్ బెల్ నొక్కగానే తలుపు తెరుచుకుంది.
విక్కీ నిలబడి కనిపించాడు. నన్ను చూడగానే "హాయ్...ఎక్కడికి వెళ్ళారు ఇన్నాళ్ళూ?" అన్నాడు.
"మా ఆంటీ వాళ్ళ ఊరు" అంటూ లోపలికివెళ్ళి లిల్లీకోసం చూశాను.
"లిల్లీ ఇంకా రాలేదు. కూర్చోండి" అన్నాడు.
నేను ఇబ్బందిపడ్తూనే కూర్చున్నాను.
"పల్లెటూరా?" నా ఎదురుగా సోఫాలో కూర్చుని ఆసక్తిగా అడిగాడు.
"ఔను" అన్నాను.
"పల్లెటూళ్ళు చాలా బావుంటాయటగా!" అడిగాడు.
నేను పైరుగాలినీ, పల్లెపడుచులనీ తలుచుకుంటూ "ఊ..." అన్నాను.
"ఎందుకెళ్ళారూ?" అడిగాడు.
నేను అత్తయ్య అనారోగ్యం గురించి చెప్పాను.
అతను సీరియస్ గా విన్నాడు.
లిల్లీ ఇంకా రాలేదు. నేను గడియారం వంక చూశాను.
"కాఫీ చెయ్యనా?" అడిగాడు.
"ఒద్దు..థాంక్స్" అన్నాను.
"నేను తాగాలిగా..." అని లేచి కిచెన్ లోకి వెళ్ళాడు.
లిల్లీ ఆఫీసుకి ఫోన్ చేశాను.
మీటింగ్ లో ఉందని చెప్పారు.
విక్కీ వస్తే చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా, అతను కాఫీ కప్పులతో వచ్చాడు.
ఒకటి అందుకుని థాంక్స్ చెప్పాను.
"నేను డాక్టర్ని...లిల్లీ నీకు ఆల్రెడీ చెప్పే వుంటుందనుకుంటాను" అన్నాడు.
"లేదు" అన్నాను.
"నాకు ఇండియా వచ్చాకా ఇక్కడే సెటిలైపోవాలని అనిపిస్తోంది. మాడాడీ ఒప్పుకోవడం లేదు" అన్నాడు.
"ఆయన ఎక్కడ ఉన్నారూ?" అడిగాను.
"ఆస్ట్రేలియాలో మా సిస్టర్ దగ్గర ఉన్నారు. నాకు ఇక్కడ పరిస్థితులు చూశాకా ఏదైనా మంచి పల్లెటూరు చూసి ప్రాక్టీసు పెట్టాలని కోరికగా ఉంది!" అన్నాడు.
"మంచి ఉద్దేశం" మెచ్చుకున్నాను.
"మంచి ప్లేస్ కోసం చూస్తున్నాను" అన్నాడు.
"చాలా ఊళ్ళలో మైళ్ళ కొద్దీ వెళ్తే కానీ హాస్పిటల్ ఉండదు. హాస్పిటల్ ఉన్నా అందులో సరైన వైద్య సౌకర్యాలు ఉండవు. రోగాల వల్ల కంటే నాటు వైద్యాలవల్ల ఎక్కువమంది చనిపోతుంటారు" అన్నాను.
"నాకు తెలుసు!" అన్నాడు.
ఇద్దరం సీరియస్ గా ఇండియాలోని నిరక్షరాస్యతా, దారిద్ర్యం గురించి డిస్కషన్ లో పడిపోయాం.
"హలో..." అంటూ లిల్లీ లోపలికి వచ్చింది.
"హాయ్!" అని ఆమెని ఆశ్చర్యంగా చూశాను.
ఆలీవ్ గ్రీన్ కలర్ ఫ్లైయిన్ సిల్క్ శారీ కట్టుకుంది. చెవులకి ఎన్నడూ లేనిది రింగులు పెట్టుకుంది. పోనీ టైల్ వేసి, మొహాన చిన్న నల్లబొట్టుపెట్టుకుంది. మొత్తానికి ఆడపిల్లలా అందంగా, పొందికగా వుంది!
"ఇన్ని రోజులుండి పోతే...మీ పల్లెటూరి బావని పెళ్ళాడేసే వస్తావనుకున్నాను. నిజం చెప్పు...అందుకే కదూ అంత అర్జెంటుగా పిలిపించిందీ" అంది.
"అవును బావ పెళ్ళి గురించే...కానీ నాతో కాదు" అని చిన్నగా నవ్వాను.
"అయ్యో! గోగులు పూచే...గోగులు పూచే... ఓ లచ్చా గుమ్మాడీ...అని పాడ్తూ పనీ పాటలు చేసుకునే ఛాన్సు మిస్సయిపోయావన్నమాట!" అని నవ్వింది.
నేను కూడా నవ్వేసి "నీలో ఏదో మార్పు కన్పిస్తోందే"! అన్నాను.
"చీరా?" అడిగింది.
"చీరే కాదు...నీకు తెలీకుండా కళ్ళల్లో కాంతి కూడా పెరిగింది" అన్నాను.
"కవిత్వమా?" అడిగింది.
"కాదు... అబ్జర్వేషన్!" చెప్పాను.
"నేను కాస్త బయటికెళ్ళివస్తాను. బై ముక్తా..." అని విక్కీ వెళ్ళిపోయాడు.
లిల్లీ ఖాళీ కప్పులని చూస్తూ "మీరు కాఫీ తాగేశారన్న మాట!" అంది.
"నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, నీకూ కాఫీ కలుపుతాను" అన్నాను.
"ఇప్పుడే చేంజ్ చేయాలని లేదు. ఈ చీర ఇవాళ చాలా విలువైన కాంప్లిమెంట్ కొట్టేసింది" సోఫాలో వెనక్కి జార్లగిలబడి కూర్చుంటూ అంది.
"ఓ... అర్థం అయింది. ఎవరో మా లిల్లీలోని ఆడపిల్లని బయటికి తీసిన ఆ ఘనుడు!" నవ్వి అడిగాను.
"నీ మొహం! అసలు అవసరాన్నిమించి ఒక్కమాటా కూడా మాట్లాడని మనిషి సడెన్ గా 'మీరు చీరలో చాలా బావున్నారు' అంటే ఆనందంగా ఉండదూ!" అంది.
"ఎవరబ్బా... ఆ మనిషీ!" కుతూహలంగా అడిగాను. లిల్లీ పెదవుల మీదకి మళ్ళీ నవ్వొచ్చింది.
